Showing posts with label ఊర్ధ్వలోకాలు. Show all posts
Showing posts with label ఊర్ధ్వలోకాలు. Show all posts

Sunday, 24 September 2017

హిందూ ధర్మం - 252 (14 లోకాలు)



ఇప్పుడు మనం వివరించుకున్న ఈ (Dimensional theory) పరిమాణ సిద్దాంతాల ఆధారంగా ధర్మంలో చెప్పినవి అర్దం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

దేవతలు ప్రత్యక్షం అయ్యారు, అదృశ్యమయ్యారు అంటాము. ప్రత్యక్షం అంటే కళ్ళకు కనిపించడం, అంటే దాని ఉనికి ఇంతకముందు కూడా ఉండి ఉండవచ్చు, కానీ అది ఇప్పుడు కళ్ళకు కనిపించేలా 'వ్యక్తమైంది' అన్నమాట. దృశ్యం అంటే చూసేది, అదృశ్యం అంటే చూడలేనిది. కళ్ళకు కనిపించిన ఆ దేవతా స్వరూపం తిరిగి కనిపించకుండా పోవటం అదృశ్యమవటం. ఇది కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే అన్యమతగ్రంథాలు దేవతలు ప్రత్యక్షమవుతారని ఎక్కడా చెప్పలేదు. ప్రవక్తను నమ్మటం వరకే వారికి చెప్పబడింది. కాబట్టి దేవుడెందుకు కనిపించడు అని ఒక హిందువు అడిగితే దానికి ఈ సమాధనం చెప్పచ్చు. అదే ఒక అన్యమతస్థుడు అడిగితే, వాళ్ళ దేవుడు ఈ సృష్టికి దూరంగా, ఎక్కడో ఉంటాడు కనుక కనిపించడు అని చెప్పాలి. 

ఇప్పుడు మనకు తలెత్తె ఒక సందేహానికి ఈ సిద్ధాంతం సమాధానమిస్తుంది. కార్యకారణాలతో కూడిన ఈ జగత్తులో (A world of cause and effect) మనం నివసిస్తున్నాము కనుక, అన్నీఇక్కడ జరిగినట్లే ఇతర లోకాల్లో జరుగుతాయని భావిస్తాము. కార్యం అంటే పని, లేదా కర్మకు ప్రతిఫలం, ఒక సంఘటన (Effect). కారణం అంటే దానికి కారణమైన విషయం (Cause). కారణం లేకుండా కార్యం ఉండదని చెబుతుంది సనాతన ధర్మం. 'విశ్వం పశ్యతి కార్యకారణతయా సస్వామి సంబంధతః' అంటూ దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఈ సిద్ధాంతాన్ని మనకు గుర్తు చేశారు ఆదిశంకరులు. నిజానికి ఈ కార్యకారణ సిద్ధాంతమే హేతువాదం. హేతువు అంటే కారణం. ఏదీ కూడా అకారణంగా, కాకతాళీయంగా, ఏదో అలా జరగదు (without any cause) అని చెప్పడం హేతువాదం. సనాతనధర్మం కూడా ప్రతి విషయంలో అలానే చెబుతుంది.. కానీ హేతువాదులమని చెప్పుకునే కొన్ని తింగరి మూకలకు ఈ విషయం అర్దంకాదు. ప్రతిదాన్ని ఊరికే, లోతైన అవగాహన లేకుండా ప్రశ్నించడమే హేతువాదం అనుకుంటారు. వారికి ధర్మం మీద ద్వేషం తప్ప, సత్యం మీద ప్రేమ లేదు. కొందరు సైంటిష్టులు కూడా కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరిగాయని చెబుతారు.... అన్నిటికి కారణముంటుందన్న వారే కొన్నిసార్లు అలా సమర్ధించుకుంటారు. కొన్నిసార్లు తమకు తెలియని వాటిని X-factor అంటారు....

కార్యకారణ సిద్ధాంతానికి కర్మ సిద్ధాంతానికి సంబంధం ఉంది. భూత (past) కాలంలో చేసిన పనులకు వర్తమాన (present), భవిష్య (future) కాలాల్లో జరిగే వాటితో సంబంధం ఉంటుందన్నది ఈ కర్మసిద్ధాంతం చెబుతుంది. సనాతనధర్మానికి పునాది అయిన పునర్జన్మ సిద్ధాంతం కూడా దీని మీదే ఆధారపడి ఉంది.  అయితే ఈ కార్యకారణ సిద్ధాంతం అనేది 3-D  దాటితే భిన్నంగా మారిపోతుంది. 3-D World దాటినప్పుడు, (10-D లో) అసలు అక్కడ దేశకాలాల ప్రసక్తి లేదు. ఇంతకముందు ఉన్నది, ఇప్పుడున్నది, ఇంక ఉండబోయేది అనే మాటే లేదు. ఎందుకంటే నాకు ముందు ఏముంది అనే ప్రశ్నలో కాలం (time) ఉంది. కాలమే లేనప్పుడు ఇక దైవానికి ముందు ఏముంది? అనే ప్రశ్న ఎలా ఉదయిస్తుంది. అక్కడ ఉన్నది ఉనికి (existence) మాత్రమే. అదే సత్. అది కేవలం ఉనికి కాదు, చైతన్యంతో కూడిన ఉనికి, అందుకే అది చిత్. ఆ చైతన్యం ఆనందమయమైనది, కనుక అది ఆనందం. అదే సచ్చిదానందం, ఉపనిషత్తుల్లో భగవంతునిగా చెప్పబడిన తత్త్వం. సచ్చిదానందరూపిణీ అనేది లలితా సహస్రనామల్లో ఒక నామం. మనం 3-D నుంచి కాక, కాలాతీతంగా ఆలోచిస్తే, ఈ సందేహం తొలగిపోతుంది. నిజానికి ఆ సచ్చిదానందమైన ఉనికియే నీలో ఉన్న ఆత్మ కూడా. నీవు దాన్నుంచి వేరు కాదు. కాలంలో కొట్టుకుపోయే శరీరమే నీవనుకోవడం అసలు సమస్యకు మూలకారణం. ఇది వేదాంతం చెబుతుంది. క్వాంటం ఫిజిక్స్‌లో 4-D కి వెళ్ళినప్పుడు, జగత్తు అశాశ్వతమైన బోధపడుతుంది. (ఇది కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే అన్యమతాలకు క్వాంటం సిద్ధాంతం వ్యతిరేకమవుతుంది.)

ఇక భూలోకంలో పుట్టిన జీవులకు కర్మాధికారం ఉంది అని చెప్పడంలో ఆంతర్యం కూడా ఇక్కడే ఉంది. కార్యకారణం సిద్ధాంతం, దేశకాలాలు అనేవి ఈ 3-D జగత్తులో ఉన్నట్లుగా ఇంకెక్కడా ఉండవు. అక్కడి భౌతికశాస్త్ర ధర్మాలు (physical laws) వేరు..... అందుకే దేవతలకు కర్మాధికారం ఉండదు. పైగా వారి లోకనియమాలు వేరు కనుక, వారి ధర్మాలు కూడా వేరు. అవి తెలియకుండా ఏదో నాలుగు పురాణాలు చదివి, దేవతలను అపహాస్యం చేయడం మూర్ఖత్వం తప్ప మరేదీ అనిపించుకోదు.

ఇక్కడ వివరించడానికి ఇంకా చాలా అంశాలున్నా, ఈ అంశాన్ని మనం వేదాంగమైన జ్యోతిష్యాన్ని వివరించడంలో భాగంగా చెప్పుకున్నాం కనుక అది ఇక్కడకు ఆపివేస్తాను. ఇప్పుడు మనకు బయట కనిపించే చాలామంది చేసేది వ్యక్తిగత జాతకాల పరిశీలన. కానీ వేదాంగమైన జ్యోతిష్యంలో చెప్పబడింది ఇది కాదు. అన్నిలోకాల్లో జరిగే మార్పులను గమనిస్తూ, జరగబోయే సంఘటనలను దర్శించి, ఏ కాలంలో, ఏ ముహూర్తాన యజ్ఞయాగాది కర్మలు చేస్తే సమస్త లోకాలకు మేలు కలుగుతుందో, కీడు తొలగుతుందో పరిశీలించి ముహూర్తం నిర్ణయించడం దీనిపని. ఇది అందరికి తెలియని విద్య. ఇలాంటి వేదాంగ జ్యోతిష్యం తెలిసిన ఒక మహాపురుషుడిని (ఋషిని) నేను చూశాను.  

Scientific గా మన ధర్మంలోని అంశాలను చెప్పుకుంటున్నా, ఋషులు, భగవంతుడు అందుకు భిన్నంగా అనుకుంటున్నారు. హిందువులు ఈ అంశాలను కేవలం మనస్సు పని అయిన Logical thinking తో కాకుండా, అనుభవజ్ఞానంతో, హృదయంతో (beyond mind and intellect) తెలుసుకోవాలని, విశ్వాసంతో వీటిని దర్శించే స్థాయిని పొందాలని ఋషులు ఆశిస్తున్నారు. మనకు ఆ potential ఉందని కూడా ఋషులు గుర్తు చేస్తున్నారు.

To be continued.......

Sunday, 10 September 2017

హిందూ ధర్మం- 251 (14 లోకాలు- Scientific analysis)


మనుష్యలోకంలో ఉన్న మనం ఈ 3-D జగత్తుకు చెందినవారము. ఇతరలోక జీవులు ఇతర Dimensions కు చెందినవారు. ఒక Dimension లో ఉన్నవారు ఇతర Dimensions లోకి వెళ్ళే ప్రక్రియను శాస్త్రపరిభాషలో teleportation అంటారు. Quantum teleportation అనే ప్రక్రియ కూడా ఉంది. దీని ప్రకారం ఒక వస్తువు భౌతికంగా ప్రయాణించకుండా, ఒక చోటు నుంచి వెరొక చోటుకు వెళ్ళగలదు. చాలామంది శాస్త్రవేత్తల నమ్మకం ప్రకారం మానవులు వంటి స్థూల ప్రపంచానికి చెందిన వస్తువులను teleportation చేయడం సాధ్యం కాదు... కానీ సూక్ష్మ ప్రపంచంలో teleportation  ప్రక్రియ ఉంది. క్వాంటం మెకానిక్స్, క్వాంటం ఎలక్ట్రోడైనమిక్స్‌లలో మూడు రకాల teleportations గురించి చెప్తారు. క్వాంటం సిద్ధాంతంలో వీటి గురించి చాలా పెద్ద వివరణ ఉంటుంది. చైనా ఈ teleportation  అనే ప్రక్రియను ఉపయోగించేందుకు ఒక టెలిస్కోప్‌ను తయారు చేసి, దాని మీద పరిశోధనలు చేస్తోందని, అది విజయవంతమైతే యుద్ధంలో కూడా ఈ teleportation ని ఉపయోగించి, ప్రపంచ దేశాలను మట్టి కరిపిస్తుందని  జనవరి 2017 భారతీయ సైన్స్ కాంగ్రెస్ సభలలో ప్రస్తావన వచ్చింది.


క్వాంటం సిద్ధాంతాన్ని అనుసరించి, ఒక రెండు వస్తువుల మధ్య సమాచార మార్పిడికి, వాటి మధ్య ఒక్కసారి క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ జరిగితే, ఇక ఆ తర్వాత ఏ ఇతర మాధ్యమం అక్కర్లేదు. కాంతి కంటే వేగంగా 'క్వాంటం సమాచారం' వాటి మధ్య మార్పిడి జరుగుతూ ఉంటుంది. అవి ఒక్కసారి అనుసంధానమైతే చాలు, ఇక ఆ తర్వాత అవి ఎంత దూరంలో ఉన్నాయనేది పట్టించుకోవలసిన పనిలేదు. అయితే ఇలా మనుష్యులు కూడా teleportation అవ్వాలంటే, వారి భౌతిక శరీరాన్ని కోల్పోవాలి. ఒక్కసారి అలా కోల్పోతే, మళ్ళీ వారికి యథారూపం ఇచ్చే Technology ప్రస్తుతానికి మానవుల దగ్గరలేదు. మన సనాతనధర్మానికి చెందిన అనేక వ్యవస్థల్లో, ఆచారాల్లో ఈ quantum entanglement ప్రక్రియనే ఉపయోగిస్తారు. విగ్రహారాధన, ఆశీర్వచనం, యజ్ఞం, వేదపఠనం, మంత్రజపం మొదలైనవి కొన్ని ఉదాహరణలు. కాకపోతే, మనకు ఆ విషయం తెలియదు, దాన్ని పసిగట్టే conscious state లో మనంలేము.

శాస్త్రవేత్తలు teleportation అని చెప్పినట్లుగానే మన సనాతన ధర్మంలో ఇలాంటి ప్రక్రియలకు 'సిద్ధి' అనే పదాన్ని వాడతాము. సిద్ధులు కలిగినవారు ఒక లోకం నుంచి వేరొకలోకానికి ప్రయాణం చేయగలరు. ఈ సిద్ధులు సిద్ధించటానికి సాధనలు చేస్తారు. అయితే సిద్ధులు పొందడం గొప్ప అని ధర్మం చెప్పలేదు. సిద్ధులన్నీ మనసుకు సంబంధించినవని, మనసును దాటితేనే మోక్షమని ఋషుల వచనం. అయినప్పటికీ లోకకల్యాణం కోసం కొందరు జీవన్ముక్తులు సిద్ధులను ఉపయోగిస్తున్నారు......నారదుడు మొదలైన దేవర్షులు, మానవలోకంలో పుట్టి ఉన్నతస్థాయికి ఎదిగిన ఇంకా అనేకమంది మహర్షులకు ఈ సిద్ధులు ఉన్నాయి. నారదుడు సమస్త లోకాలకు సంచరించగలడు. ఆయన అంత శక్తిమంతుడు.....వాల్మీకి రామాయణంలో త్రిశంఖువు సశరీరంతో స్వర్గానికి వెళతాను అన్నప్పుడు, అది ధర్మవిరుద్ధమని, అలా వెళ్ళడం కుదరదని వశిష్టుడు హితోపదేశం చేస్తారు. దీన్ని ఆధునిక విజ్ఞానంతో సమన్వయం చేసుకున్నప్పుడు కూడా ఇదే స్పష్టమవుతుంది. భౌతికజగత్తులో ఉన్న వ్యక్తి, శరీరంతో ఇతర Dimensions లోకి వెళ్ళడం అసాధ్యం..... కానీ మళ్ళీ మన ధర్మమే దీనికి మార్గం చూపింది. అదే సాధన, తపస్సు.... మనస్సును పరిశుభ్రంగా పెట్టుకోవడం. మనసును శుద్ధంగా ఉంచుకుంటే అది సూక్ష్మవిషయాలను గ్రహించే స్థాయికి చేరుతుంది. అప్పుడు క్రమక్రమంగా అది ఊర్ధ్వలోకాలను చూసే స్థాయిని పొందుతుంది. అయినప్పటికి స్వార్ధలక్ష్యంతో సిద్ధుల కోసం ప్రయత్నించేవారిని ప్రక్కదారి పట్టించడానికి, అణిచివేయడానికి ఆయా భూమికల్లో అనేమంది అధిదేవతలు సిద్ధంగా ఉంటారు. 

ఇప్పుడు మనమంతా గ్రహాంతర ప్రయాణం గురించే మాట్లాడుతున్నాము, కానీ ధర్మంలో లోకాంతర ప్రయాణం చెప్పబడింది. వేదవ్యాస మహర్షి శ్రీ మద్భాగవతం 9 స్కంధం, 3వ అధ్యాయం, 27-36 శ్లోకాల వరకు లోకాంతర ప్రయాణం చేసిన రేవతి, కకుడ్మి (రైవతుడు అని కూడా పిలుస్తారు) మహారాజుల గురించి చెప్పారు. వివాహ వయసుకు వచ్చిన తన కుమార్తెకు ఎంత వెతికినా సరైన వరుడు దొరకకపోవడంతో, ఆయన తన కుమార్తెను తీసుకుని బ్రహ్మలోకానికి వెళతారు. ఆయన వెళ్ళేసరికి బ్రహ్మదేవుడు గంధర్వ గానం వింటూ ఉండటంతో వారు కాసేపు వేచి ఉంటారు. ఆ తర్వాత ఆయన తన కూతురికి మంచి వరుడిని చూపమని బ్రహ్మదేవుడిని అడుగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు గట్టిగా నవ్వి "బ్రహ్మలోకంలో మీరున్న సమయంలో భూలోకంలో 27 చతుర్-యుగాలు గడిచిపోయాయి, నీ మనస్సులో ఉన్న రాకుమారులు, రాజవంశాలు, రాజ్యాలు.... మొదలైనవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు మీరు వారి పేర్లను కూడా వినలేరు" అని సమాధానం ఇస్తాడు. ఒక చతుర్-యుగం అంటే 43,20,000 సంవత్సరాలు. అలాంటివి 27 గడిచిపోయినాయట. ఆ తర్వాత ఆ రేవతి దేవియే ఆదిశేషుని అంశ, శ్రీ కృష్ణునికి అన్నగారైన బలరాముడిని వివాహం చేసుకుంది. నిజానికి కకుడ్మి బ్రహ్మలోకంలో ఉన్నది దరిదాపుగా 3,456 సెకన్లు.

దీన్నే ఆధునిక సైన్స్ time dilation అంటుంది. అంటే ఒక వ్యక్తి విశ్వాంతరాళంలో కాంతి వేగంతో ప్రయాణిస్తే, అతడితో కలిసి జన్మించిన అతని కవల సోదరుడు భూమి మీద ఉంటే, ఇద్దరి వయసు ఒకేలా ఉండదు. మెల్లిగా తిరుగుతున్న భూమి మీద కాలం కంటే వేగంగా వెళుతున్న రాకెట్ లో కాలం నెమ్మదిగా నడుస్తుంది. దీన్ని ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాతంలో వివరించారు.

మనకు ఎన్నో సందేహాలు వస్తాయి.... అసలు పాలసముద్రం వుందా? మంథర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు కలిసి ఎక్కడ చిలికారు? అసలు అలా చిలకడం సాధ్యమేనా? యమలోకం గరుడపురాణంలో చెప్పినట్లుగా అంత భయంకరంగా ఉండటం సాధ్యమేనా?... ఇలా ఎన్నో..... ఇవన్నీ ఈ 3-D ప్రపంచంలో సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇతర పరిమాణాల (Dimensions ) కు చేరినప్పుడు బోధపడుతుంది. అలానే త్రిపురాసురునితో శివుని యుద్ధం మొదలుకుని దేవదానవ యుద్ధాలు అనేకం ఇలాంటి ఇతర Dimensions లోనే జరిగి ఉండవచ్చు.

To be continued ..........

Sunday, 20 August 2017

హిందూ ధర్మం- 250 (14 లోకాలు- Scientific analysis)




7-D A Plane of All Possible Worlds With the different Start Conditions; విభిన్నమైన లోకాలు అన్నీ ఒకే సమతలంలో వివిధ సమయాలలో ప్రారంభం అవ్వడం ఈ పరిమాణం నుంచి వీక్షించవచ్చు.

5 మరియు 6 పరిమాణాల్లో ఒక సమయంలో ప్రారంభమైన లోకాల ఉనికి, వాటి స్థానాన్ని పోల్చుకునే అవకాశం ఉండగా, ఈ 7-D కి చేరగానే, ఒక సమతంలో ఉన్న విభిన్నమైన లోకాలు, వేర్వేరు సమయాల్లో ప్రారంభమై, అనేక విధాలుగా పరిణామం చెందడం ఈ Dimension లో ఉన్న వారు చూసేందుకు సాధ్యపడుతుంది.  నిజానికి ఇన్ని లోకాలను, వాటిలో జరిగే విభిన్నమైన మార్పులను చూడగల సామర్ధ్యం బ్రహ్మదేవునకు ఉంది. కాబట్టి ఇక్కడే బ్రహ్మలోకం ఉండవచ్చు.  మిగితా Dimensions లాగానే ఇక్కడి నుంచి కూడా తన క్రింద ఉన్న అన్నిDimensions ని చూసే అవకాశం ఇక్కడ ఉన్నవారికి ఉంటుంది.

8-D A Plane of All Possible Worlds, Each With Different Start Conditions, Each Branching Out Infinitely; విభిన్నమైన లోకాలు అన్నీ ఒకే సమతలంలో వివిధ సమయాలలో ప్రారంభం అయ్యి, వివిధ ఆకృతులలో  నిరవధికంగా పెరగడం.

అంటే పాలకడలిలో శేషతల్పంపై శ్రీ మన్నారాయణుడు ఉండే Dimension ఇది. సముద్రంలో ఏర్పడే కెరటాల మీదనున్న నురగలో నిరంతర ఎన్నో బుడగలు ఉద్భవించి, లయిస్తుంటాయి. అలానే దైవసృష్టిలో అనేక బ్రహ్మాండాలు నిత్యం ఉద్భవించి, లయిస్తూ ఉంటాయని శ్రీ మద్భాగవతం మొదలైన గ్రంథాలు చెబుతున్నాయి. ఆయన నుంచి అనేకమంది బ్రహ్మలు ఉద్భవించి, లయిస్తూ ఉంటారు, ప్రతి బ్రహ్మ- ఒక బ్రహ్మాండాన్ని సృష్టి చేస్తుంటాడు. బ్రహ్మాండంలో లోకాలు ఉంటాయి. ఇవన్నీ నిత్యం గమనిస్తూ ఉంటాడు శ్రీ మన్నారాయణుడు. ఇక్కడి నుంచి చూసినప్పుడు, ఎన్నో బ్రహ్మాండాలు ఉద్భవించి, అనంతంగా వ్యాపిస్తూనే ఉంటాయి. దాన్ని ఊహించడం కూడా అసాధ్యం.

మళ్ళీ మనం ఆదినారాయణుడని అంటాము. ఆదినారాయణుడంటే పరతత్త్వము, ఆది నుంచి ఉన్నవాడు. ఆయన నిరాకారుడని చెప్తారు.


9-D All Possible Worlds, Starting With All Possible Start Conditions and Laws of Physics; విభిన్నమైన బ్రహ్మాండాలు అన్నీ అన్ని సమతలాలలో వివిధ సమయాలలో, వివిధ సాధ్యమైన ఆకృతులలో ప్రారంభం అయ్యి నిరవధికంగా పెరగడం, ఇక్కడి భౌతిక సూత్రాలు వేరుగా ఉంటాయి. దానికి ఈ 3-D ప్రపంచంలో అంటే మనుష్యలోకంలో ఉన్న భౌతిక సూత్రాలకు సంబంధం లేదు.

అంటే ఒకనాడు మహాశివలింగం ఇక్కడే, ఈ పరిమాణంలోనే ఆవిర్భవించి ఉండవచ్చు. అదే ఈ లోకంగా మారిందని లింగపురాణం మొదలైనవి చెబుతున్నాయి. ఈ పరిమాణంలో ఉండి, తన క్రిందనున్న ఇతర పరిమాణాల్లో ఉన్న లోకాలు, బ్రహ్మాండాల చరిత్రను చూడవచ్చు, పోల్చవచ్చు, నమోదు చేయవచ్చు. అంటే వేదవ్యాస మహర్షి ఈ పరిమాణానికి చేరుకుని అక్కడి నుంచి పురాణ రచన చేశారు. పురాణాల్లో చెప్పబడిన లోకాలు అసలు ఉంటాయా? అవి సాధ్యమా? మేము నమ్మాలా? అంటారు కదా, ఈ 9-Dimension కి వెళితే, అప్పుడు అర్దమవుతుంది.

మన పురాణాల్లో చెప్పబడిన అనేక అంశాలు, ఈ 3-D ప్రపంచంలోనే జరిగినవి కావు, అవి అనేక ఇతర Dimensions లో వేర్వేరు సమయాల్లో జరిగాయి. ఆ Dimensions లో ఉన్న ధర్మాలు వేరు. అక్కడి జీవుల జీవనశైలి భిన్నమైనది. వారిది మనలాంటి రక్తమాంసాలతో కూడిన దేహం కాదు. వారు ఎంతో పరిణతి చెందిన జీవులు. పురాణాల మీద విమర్శ చేసే ముందు మనకు క్వాంటం ఫిజిక్స్ అర్దమైతే బాగుంటుందేమో?! ఈ విషయం బోధపడితే, మనం ఋషులను ఏనాడు నిందించము, కనీసం ప్రశ్నించము కూడా.


10-D Infinite Possibilities – లెక్కలేనన్ని ప్రపంచాలు , ఒక నిర్దుష్టమైన ప్రణాళిక లేకుండా పెరిగి పెద్దవ్వడం.
ఇక్కడ అసాధ్యమన్నది ఏదీ లేదు. ఇక్కడకు చేరిన జీవుడు, భగవంతుని అద్భుత సృష్టిని చూసి ఆశ్చర్యపోవటం తప్ప, దాన్ని విశ్లేషించలేడు. లెక్కలేనన్ని విశ్వాలు, లెక్కలేకుండా ఉద్భవించి, వ్యాప్తి చెంది, లయించడం, అది కూడా ఒక క్రమంలో కాదు, గందరగోళంగా జరగటం చూడవచ్చు. ఇది జీవులకు మాత్రమే గందరగోళం కానీ, పరబ్రహ్మానికి కాదు.  

11D M-థియరీ ప్రకారం ఒక నిర్దుష్ట ప్రణాళిక ద్వారా లయం కూడా అవ్వడం. వాటి పూర్తి అవగాహన ఉండడం. ఇది పరబ్రహ్మం స్థాయి. జీవుడు ఇక్కడికే చేరుకుని, పరబ్రహ్మంలో లయమవుతాడు. ఇక్కడ ఎంత గురుత్వాకర్షణ శక్తి ఉంటుందంటే, ఇక్కడ ఉన్న పరబ్రహ్మ మిగితా  లో ఉన్న లోకాలను, తనలోకి లాక్కునే ప్రయత్నం చేస్తాడు. వేర్వేరు వేగాలతో, వేర్వేరు కాలాల్లో ఉద్భవించి, లయించే అనేక సృష్టిలు, తెలిసో తెలియకో, దానిలోకే వెళ్ళిపోతున్నాయి. అందుకే సనాతన ధర్మంలో "ఎవరు ఏమి చేసినా, చేయకున్నా, అందరు ఒకనాడు ఆయనవద్దకు చేరుకునేవారే........ అన్నిటి యొక్క గమ్యం ఆ బ్రహ్మమే..... ప్రతి కర్మ భగవంతునిదే...... ప్రతి క్షణం భగవంతునికి చెందినదే...... మంచి వారు, చెడ్డవారు... అందరూ ఆయనలోనే కలిసిపోతారు..... రాక్షసులు, దేవతలు, ఆయన దిశగానె పయనిస్తున్నారు........" అని బోధిస్తుంది.

To be continued ..........
(వివరణ ఇంకా పూర్తి కాలేదు)

Sunday, 13 August 2017

హిందూ ధర్మం - 249 (14 లోకాలు- Scientific analysis)



మనకు ఈ లోకం ఒక్కటే కనిపిస్తోంది. కానీ అనేక లోకాలు ఉన్నాయని శ్రీ మద్భాగవతం మొదలైన గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. పురాణాల్లో ఋషులు అనేక లోకాలకు ప్రయాణం చేశారని ఉంది. అంటే అది లోకాంతరప్రయాణం. ఇప్పటి శాస్త్రవేత్తలు చేస్తున్న గ్రహాంతర ప్రయాణం మాత్రమే..... మరి మనకు ఆ లోకాలు కనిపించవెందుకు? ఆ లోకవాసులు మనకు ఎందుకు కనిపించరు? ఆ లోకాలు ఉన్న చోటకు రాకెట్‌లు వెళ్ళలేవా? ..... ఆ లోకాలు మామూలు నేత్రాలకు, సాధరణ బుద్ధికి అందే స్థాయిలో లేవని, వాటిని చూడటానికి అతీయింద్రియ దృష్టి కావాలని ధర్మం చెబుతుంది..... కళ్ళకు కనిపించవు కనుక ఇదంతా అసత్యమని, ఏదో కల్పించి చెబుతున్నారని, ఇదంతా సైన్స్‌కు విరుద్ధమని, కళ్ళకు కనిపించేదే నమ్మమని మనదేశంలో ఉన్న కొందరు హేతువాదులు (ఆ ముసుగు వేసుకున్న హైందవద్వేషులు) వాదిస్తారు. కానీ వారికి, హిందువులకు సమాధానం క్వాంటం ఫిజిక్స్‌లో ఉంది.

ధర్మాన్ని అనుసరించి విశ్వం బహు మితీయంగా (Multi dimensional) అయినది. అందులో ప్రతి లోకం, ఒకదానితో ఒకటి మరియు పరమాత్మతోనూ పరస్పరం అల్లుకుని (Interwoven) ఉంటాయి. ఇదే సిద్ధాంతాన్ని క్వాంటం ఫిజిక్స్ ప్రతిపాదిస్తుంది. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం కూడా ఈ విశ్వంలో అనేక ప్రపంచాలు, లోకాలు ఉన్నాయి. అవి కళ్ళకు కనిపించనప్పటికీ, వాటికి అస్థిత్వం ఉందని క్వాంటం ఫిజిక్స్ శాస్త్రవేత్తలు నమ్ముతారు. నిజానికి క్వాంటం ఫిజిక్స్ అధ్యాపకులు వేదాంతాన్ని, సనాతన ధర్మాన్ని చాలా బాగా మెచ్చుకుంటారు. విద్యార్ధులకు క్వాంటం ఫిజిక్స్ పాఠాలు భోదిస్తుంటే, అద్వైతం భోదించినట్లుగానే ఉంటుందని హాన్స్ పీటర్ డర్ గారు చెప్పిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది.

క్వాంటం ఫిజిక్స్ సిద్ధాంతాన్ని అనుసరించి - మొత్తం ఈ విశ్వంలో 10 పరిమాణాలు (Dimensions) ఉన్నాయని అనుకుంటున్నారు, పరిశోధనలు అవి పెరగవచ్చు కూడా. వాటికి సంబంధించిన ఎన్నో ప్రతిపాదనలు ఉన్నాయి. అందులో సూపర్ స్ట్రింగ్” సిద్ధాంతం ప్రాచుర్యం పొందింది. యజుర్వేదంలోని రుద్రం 11 పరిమాణాల (11 Dimensions) గురించి చెబుతుంది.

1-Dimension  పొడవు (length)
2-D ఎత్తు (height )
3-D లోతు (depth )

మనం ప్రస్తుతం ఉన్న ప్రపంచం, చూస్తున్న జగత్తు, నక్షత్రాలు, గోళాలు, ఉల్కలు, అంతరిక్షం ...... దృశ్యమానమైన ఈ జగత్తంతా 3D. అయినా మనం 3-D సినిమా చూడాలంటే, ప్రత్యేకమైన కళ్ళజోడు పెట్టుకోనిదే కుదరదు.

4-D time, ఒక వస్తువు ఎంత సేపు ఒక స్థానం లో ఉండగలిగిందో చెప్పే పరిణామం ఇది. 3 పరిణామాలతో పాటు, కాలంలో ఒక వస్తువుకు స్థానం ఎక్కడో తెలుసుకుంటేనే, బ్రహ్మాండంలో దాని స్థానాన్ని గుర్తించవచ్చు. ఇక్కడ Space ఉండదు. ఉన్నదంతా కాలమే (Only time).

చనిపోయిన తర్వాతా చాలా వరకు జీవులు 4-D లోకే వెళతారు. అందుకే వారు మనకు కనిపించరు. అంటే మరణం తర్వాత ఆత్మ, ఈ పాంచభౌతికమైన, దేశకాలాల (Time and Space) కు లోబడిన పరిమాణం (Dimension) నుంచి భిన్నమైన పరిమాణంలోకి ప్రయాణిస్తుంది. కానీ ఈ క్షేత్రంలో ఉన్నవారు, క్రింది Dimension  లో ఉన్నవారిని చూడగలరు, వారి మాటలు వినగలరు. అందుకే జీవుడు (ఆత్మ) మరణానంతరం ఈ 4-D లోకి ప్రవేశించినా, అది ఎరుగక, తన వారి కోసం ఏడుస్తుంది. వారికి ఏదేదో చెబుతుంది. కానీ వినేవారు ఉండరు. ఆ తర్వాత క్రమంగా ఇది పాపపుణ్యాలను బట్టి నరకానికి లేదా స్వర్గానికి ప్రయాణిస్తుంది. సనాతన హిందూ ధర్మంలో మరణం తర్వాత చేసే అపరకర్మలన్నీ ఈ Dimension లో ఉన్న జీవుడిని ఉద్దేశించి చేసేవే. కానీ ఇంతకముందు చెప్పుకున్నట్లు, విశ్వంలో అన్నీ పరస్పరం అల్లుకుని ఉన్న కారణం చేత, ఇక్కడ (3-D) చదివే వేదమంత్రాల శక్తి వలన ఆ జీవుడికి మార్గం దొరికి అది ఉన్నత లోకాలకు పయనిస్తుంది.

5-D Possible Worlds: మనకన్నా కొంత విభిన్నమైన ప్రపంచం. ఈ 5-D నుంచి చూసినప్పుడు, మనకంటే భిన్నమైన లోకాలను చూసే అవకాశం ఉంటుంది. వాటికి మనలోకానికి మధ్య ఉండే సామ్యాలను, వ్యత్యాసాలను గుర్తించే అవకాశం కలుగుతుంది. అక్కడి కాలం ఇక్కడి కాలానికి భిన్నంగా నడుస్తూ ఉండవచ్చు. అక్కడి కాలగతి (కాలం యొక్క వేగం) దీనికంటే తక్కువ ఉండవచ్చు. వారు మనకంటే ముందు నుంచి జీవిస్తూ ఉండవచ్చని క్వాంటం సిద్ధాంతం చెబుతుంది. అంటే యమలోకం, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు మొదలైన ఊర్ధ్వలోకవాసుల నివాసాలు ఇక్కడే ఉండి ఉండవచ్చు. అందుకే పితృదేవతల కాలానికి, దేవతల కాలానికి, మనుష్యుల కాలానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే మానవ లోకంలో 30 రోజులు పితృదేవతలకు ఒక రోజుతో సమానం. మానవుల 1 సంవత్సరం దేవతలకు 1 రోజుతో సమానం. (వీటి గురించి గతభాగాల్లో చెప్పడం జరిగింది).

6-D A Plane of All Possible Worlds With the Same Start Conditions; విభిన్నమైన విశ్వాలు (లోకాలు) అన్నీ ఒకే సమతలం (Plane) లో ఒకే సమయానికి ప్రారంభం అవ్వడం (బిగ్ బాంగ్ లాంటిది) ఇక్కడి నుంచి చూడవచ్చు. ఎవరైతే ఈ 5-D మరియు 6-D మీద పట్టు సాధిస్తారో, వారు కాలంలో ముందుకు, లేదా వెనక్కు వెళ్ళగలరు. కాలంలో వెనక్కు ప్రయాణించి గతంలోకి వెళ్ళగరు, అలాగే ముందుకు ప్రయాణించి, భవిష్యత్తును దర్శించగలరు.

దేవలోకం అనగా స్వర్గం మొదలైనవి ఇతర లోకాల స్థానం ఇదే కావచ్చు. అందుకే దేవతలు తమ దివ్యదృష్టితో గతాన్ని, భవిష్యత్తును దర్శించగలరని ధర్మం చెబుతుంది. మానవలోకంలో నివసిస్తూనే, మన మధ్య ఉంటూనే, సాధన ద్వారా సిద్ధి పొందిన యోగులు ఈ పరిణామాన్ని చూడగలరు. అందుకే వారు కూడా పితృదేవతలను, దేవతలను చూడగలరు. వ్యక్తిని చూసి, అతడి గత జన్మ, రాబోవు జన్మలు చెప్పగలరు. అంటే సనాతనధర్మంలో చెప్పబడిన ఆధ్యాత్మిక సాధన వ్యక్తిని భౌతికమైన 3-D ప్రపంచం నుంచి ఇంకా పై స్థాయికి తీసుకువెళుతునందని స్పష్టమవుతోంది.

(వివరణ ఇంకా పూర్తికాలేదు)
To be continued ...............

Sunday, 6 August 2017

హిందూ ధర్మం - 248 (14 లోకాలు)

ఇంతకి ఈ 14 లోకాలు ఎక్కడ ఉన్నాయి? వాటి లోకవాసులు ఎలా ఉంటారు? వారు సాధారణ మనుష్యులేనా? లేక దివ్యలోకాలకు చెందినవారా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతుంటాయి. ఈ ప్రశ్నలకు నాస్తిక కోణం నుంచి సమాధానాలు వెతికితే, అది అర్ధ సమాచారంతో ముగుస్తుంది, అవగాహనారాహిత్యన్ని బయటపెడుతుంది. మనకు 3 ప్రమాణాలు ఉన్నాయి. ఒకటి శాస్త్రప్రమాణం, రెండవది ఆప్తప్రమాణం, మూడవది ఆత్మప్రమాణం. శాస్త్రమనగా వేదాది శాస్త్రాలు, ఆప్తులు అంటే ధర్మం మేలు కోరేవారు; భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్య, త్రైలింగ స్వామి మొదలైనవారు; ఆత్మప్రమాణం అంటే వ్యక్తి యొక్క అనూభూతి/ దివ్యానుభవం. ఆత్మప్రమాణాన్ని ఆప్తప్రమాణం, శాస్త్రప్రమాణంతో పోల్చి చూసి, అప్పుడే నిర్ధారణకు రావాలి. శాస్త్రకారుల దృష్టి, జ్ఞానం, అనుభవం మనకు లేకపోవచ్చు, కనుక మలిన, సంకుచిత బుద్ధితో వీటికి అర్దాలను చెప్పి అసలు విషయాన్ని పక్కదారి పట్టించకూడదు.



దేవ- అనే పదం ద్యు లేదా ద్యౌ అనే అక్షరం నుంచి వచ్చింది. ద్యౌ అంటే కాంతిగల లోకం. దేవతలు అంటే కాంతి శరీరం కలిగినవారు. వారివి మనలాంటి పాంచభౌతిక దేహాలు కాదు, రక్తమాంసాలతో నిండిన దేహాలు కావు, అవి దివ్యశరీరాలు. వారు కాంతి శరీరులు. అందుకే దేవతలు ప్రత్యక్షం అయ్యారని అంటాము, అంటే కళ్ళముందు కనిపించడం; అదృశ్యం అయ్యారు అంటాము- దృశ్యం అంటే కనిపించేది, కనిపించకుండా పోవటం అదృశ్యం. అంటే తమను వ్యక్తం చేసుకున్న దేవతలు తిరిగి అవ్యక్తమవ్వడం అన్నమాట. అలాగే పితృదేవతలు - మరణించిన మన కుటుంబాలకు చెందినవారు. వీరు కూడా భౌతిక దేహాన్ని కోల్పోయి, పితృలోకానికి చెందిన శరీరాన్ని పొందినవారే. దేవత అంటే ఇచ్చుటకు శక్తి కలిగి ఉన్నది అని అర్దం. పితరులు ఆశీస్సులు నిత్యజీవితంలో ఎంతో అవసరం. అలాగే ఇంద్రాది దేవతలవి కూడా. వారు మనకు ఎన్నో విధాలుగా సాయం చేస్తారు. వరాలను ఇస్తారు. అందుకే దేవతలు అన్నారు. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం పిల్లల వృద్ధికి కారణమవుతుంది కనుక వారిని దేవతలుగా భావించమని వేదం చెప్పింది. ఇంద్రుడు, అగ్ని, ఆదిత్యుడు, యక్షులు, గంధర్వులకు పునర్జన్మ ఉంది. అయితే పరంబ్రహ్మ/ పరమాత్మ- ఈ దేవతలకంటే పైస్థాయివాడు. మనం పూజించే శివ, శక్తి, విష్ణు, గణేశ మొదలైన స్వరూపాలు ఈ పరబ్రహ్మం యొక్క ప్రతిబింబాలు.

ఇప్పుడు ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నిజదేవుడిని పూజించండి, మా ఏసు మాత్రమే నిజదేవుడు, అల్లాహ్ నే అసలు దేవుడు, హిందూ దేవీదేవతలు సైతాన్లు అంటూ మతమార్పిడి మూకలు ప్రచారం చేస్తున్నాయి. దేవత (తెలుగులో దేవుడు) అనేది సంస్కృతపదం. అది ఎవరికి వాడాలో కూడా శాస్త్రమే చెప్పింది. ఈ అన్యమతస్తులు చెప్పిన దేవుడికి రూపంలేదు, అది కాంతిశరీరం కలదని, దివ్యశరీరం కలదని వాళ్ళ గ్రంథాలు చెప్పలేదు. ఉంటే అలా ఎక్కడుందో reference చూపించమని అడగాలి. అసలు శరీరం ఉందని చెప్పడమే నింద అని చెప్పాయి. కానీ వాళ్ళేమో నిజదేవుడంటారు- ఈ దేవుడు అనే పదం వాళ్ళు వాడటం ఆయా గ్రంథాలను అపహాస్యం చేయడం, వాళ్ళ గాడ్‌ (God) కు ఈ పదాన్ని హిందువులు ఉపయోగించటం సనాతనధర్మాన్ని అవమానించటమే అవుతుంది. ఇది మనం గమనించాలి. వారు వాడకూడదని తెలియజేయాలి. 

అలాగే యక్ష, కిన్నెర, కింపురుష మొదలైన ఇతర లోకవాసుల గురించి, సూర్యమండలం, చంద్రమండల వాసుల గురించి పురాణాలు చెబుతున్నాయి. వీరి ఎక్కడ ఉన్నట్లు? వీరిని మానవులుగా, కొండజాతి వారిగా భావించకూడదు. యక్షులు, గంధరువులు మొదలైన వారితో సంభాషించిన మహాత్ములు, సిద్ధులు ఈ భూమి మీద తిరిగారు. వారి చరిత్రలు మనలో పేరుకుపోయిన ఎన్నో సందేహాలను, అపార్ధాలను తొలగిస్తాయి. యక్షులు, గంధర్వులు మొదలైనవారు కామరూపధారులు. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు. వీరు చెడ్డవారు అనే అభిప్రాయం చాలామంది చెప్తారు. కానీ వాస్తవంలో చక్కని జ్ఞానం, లోకహితం కోరే యక్షులు అనేకమంది ఉన్నారు. భగవంతుడు వీరిని కొన్ని అరణ్యాలకు రాజులుగా నియమించాడు. ఆయుర్వేద మూలికలపై వీరి ఆధిపత్యం ఉంటుంది. సంపదల కోసం లోకులంతా పూజించే కుబేరుడు యక్షరాజు. కొన్ని పురాతన ఆలయాలను నిర్మించినప్పుడు, ఆ ఆగమంలో భాగంగా ఆ ఆలయసంపదలకు రక్షకులుగా యక్షులను నియమించడం కనిపిస్తుంది. ఆలయ గోడలపై రకరకాల రూపాలు చెక్కి ఉండటం మనం చూస్తుంటాము. అందులో కొన్ని యక్షులవి ఉంటాయి. వారు ఆ ఆలయానికి రక్షకులుగా ఉంటారు. 

ఆలయ సంపదను, హుండీ డబ్బును ప్రభుత్వం తీసుకుని ప్రజల కోసం ఉపయోగించాలి. దేవాలయంలో స్వామికి అర్పించిన బంగారాన్ని ప్రభుత్వం కరిగించి తాకట్టు పెట్టాలి; ఇలాంటి మాటలు అప్పుడప్పుడూ వింటూ ఉంటాము. గుప్తనిధుల కోసం దేవాలయంలో తవ్వకాలు జరపడం చూస్తుంటాము... ఇలాంటి మాటలు మాట్లాడేవారిని, నిధుల కోసం ఎగబడేవారిని యక్షులు శిక్షిస్తారు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకుండా, పనులు చేయకుండా జాగ్రత్తపడండి. యక్షులకు దైవభక్తి ఉంటుంది. మనం వృక్షాల చుట్టూ ప్రదక్షిణం చేస్తాం. అప్పుడు మనకు తగిన ఫలితం ఇచ్చేది ఎవరు?.... యక్షిణీదేవతయే ఆ చెట్టు మీద ఉండి, మన ప్రదక్షిణకు తగిన ఫలితం ఇస్తుందని తంత్రగ్రంథాల్లో శివపార్వతుల సంవాదంలో కనిపిస్తుంది. అనగా వీరు దివ్యశరీరం కలవారని స్పష్టమవుతోంది.  దేవలోక గాయకులు గంధర్వులు. వీరు కూడా దివ్యశరీరులు. వీరికి దైవభక్తి అధికం, పరమాత్మను ఉద్దేశించి వీరు చేసే గానాలకు గంధర్వవేదం అనే ప్రత్యేక వేదం కలిగి ఉన్నారు. అహోబిలంలో ఛత్రవట నృసింహస్వామి వారి సన్నిధిలో హాహా, హూహూ అనే పేరుగల గంధర్వులు గానం చేశారు. అప్పుడు స్వామి వారి గానానికి మైమరిచి, తాళం వేశారు. అహోబిలంలో ఛత్రవట నృసింహస్వామి వారి మూలవిరాట్టు స్వయంభూః. అక్కడ స్వామి రూపం కూడా తాళం వేస్తున్నట్లుగానే ఉంటుంది. 

అహోబిలం, మాల్యాద్రి, అరుణాచలం, శేషాచలం (తిరుమల), శ్రీశైలం, పశ్చిమ కనుమూల్లో కొన్ని ప్రదేశాలు.... ఇలా అనేక పవిత్ర స్థలాల్లో యక్షులు, సిద్ధులు, గంధర్వులు మొదలైన ఇతరలోక జీవులు ఈనాటికీ తపస్సు చేసుకుంటున్నారు. అలాగే కొందరు ఋషుల జీవిత చరిత్రలను గమనించినప్పుడు, వారు తపస్సు చేసుకోవడం కోసం, దేవకార్యం కోసం భూలోకనికి వచ్చారాని చెప్పబడి ఉంటుంది. ఆ కార్యం పూర్తవ్వగానే తిరిగి దివ్యలోకాలకు వెళ్ళిపోయారని కనిపిస్తుంది. అంటే మనకు కనిపించే ఈ లోకం కాక మరెన్నో లోకాలు ఉన్నాయని ఆప్తుల ద్వారా, గురువుల ద్వారా స్పష్టమవుతోంది.

(వివరణ ఇంకా పూర్తికాలేదు)
To be continued ........

Sunday, 4 June 2017

హిందూ ధర్మం - 245 (14 లోకాలు - 14 చక్రాలు)

ఈ 14 లోకాలు వివిధ పరిధుల్లో ఈ సృష్టిలో ఉన్నాయి. విశ్వంలో ఈ 14 లోకాలు ఉండడమే కాదు, భూలోకంలో కూడా వివిధ దేశాలను వీటికి అన్వయించి చెప్పే విధానం ఉంది, అలాగే ఈ శరీరంలోనే ఈ 14 లోకాలను పదునాలుగు భిన్న చైతన్య స్థితులకు సూచనగా చెప్పే సంప్రదాయం కూడా ఉంది. మన శరీరంలో మూలాధారం నుంచి పైకి, క్రమంగా స్వాధిష్టాన, మణిపూరక, అనహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలనే 6 చక్రాలు ఉన్నాయి. వాటికి పైన ఉన్నది సహస్రారం/ సహస్రపద్మం. ఇవన్నీ కలిపి 7. అలగే మూలాధారానికి దిగువన కూడా 7 చక్రాలున్నాయని కొన్ని ఆగమాల్లో కనిపిస్తుంది. ఈ మొత్తం అన్నీ కలిపి 14. వ్యక్తి యొక్క చైతన్యం ఉన్న స్థాయిని అనుసరించి, అతడి మానసిక స్థాయి ఏ లోకంలో ఉందో తెలుసుకోవచ్చు. కైలాసనాథ పరంపర నందినాథ సంప్రదాయానికి చెందిన గురువు, శైవాగమ పండితులు, జగదాచార్యులు శ్రీ శ్రీ శ్రీ సద్గురు శివాయ శుభ్రమునియ స్వామి వారు చెప్పిన ఆ విశేషాలు తెలుసుకోండి.

1. మూలాధారం - వెన్నుపూస అంత్యభాగంలో ఉంటుంది. ధారణశక్తి కి కేంద్రస్థానం. మహాగణపతి అధిదేవత. ఇదే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగడానికి తొలిమెట్టు.
2. స్వాధిష్టానం - బొడ్డు క్రింద, జనేనెంద్రియాల వద్ద ఉంటుంది. వివేకము దీని లక్షణం.
3. మణిపూరం - నాభిలో ఉంటుంది. సంకల్పశక్తికి కేంద్రస్థానం.
4. అనాహతం - హృదయం దగ్గర ఉంటుంది. అపరోక్ష జ్ఞానానికి స్థానం.
5. విశుద్ధం - కంఠంలో ఉంటుంది. దివ్యప్రేమ/ దైవం పట్ల ప్రేమకు స్థానం.
6. ఆజ్ఞ - కనుబొమ్మల మధ్యన ఉంటుంది. దీన్నే మూడవ నేత్రం అంటారు. దివ్య దృష్టికి కేంద్రస్థానం.
7. సహస్రారం - తలమీద ఉంటుంది. ఆత్మజ్ఞానానికి, దైవానికి స్థానం.

నరకాలు, పాతాళ లోకాల గురించి చూద్దాము.

1. అతలం - అగాధ ప్రాంతానికి చెందిన చక్రమిది. తుంటి భాగంలో ఉంటుంది. భయం, కామము దీని లక్షణాలు.
2. వితలం - నిరసించడం లక్షణంగా కలిగిన చక్రమిది. ఇక్కడ సుఖం ఉండదు, విపరీతమైన కోపం ఉంటుంది. తొడల భాగంలో ఈ చక్రం ఉంటుంది.
3. సుతలం - బాగా లోతైన అనే అర్దంలో చెప్పే చక్రం ఇది. అసూయ దీని లక్షణం.
4. తలాతలం - అంధకారం, తామసికం దీని లక్షణం. పిక్కల్లో ఉంటుంది. క్రింది స్థాయి చక్రం ఇది. గందరగోళం, అస్పష్టమైన ఆలోచనలకు, అమితమైన మొండితనానికి ఇది స్థానం.
5. రసాతలం - కాలిచీలమండల ప్రాంతంలో ఉండే చక్రం. స్వార్ధపరత్వం, ఆధిపత్య ధోరణి, కేవలం తన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండడం దీని లక్షణాలు.
6. మహాతలం - అవివేకము దీని లక్షణము. పాదాల్లో ఉంటుంది.
అవివేకం అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనేవి తెలుసుకోలేక అసత్యమైన వాటి వెంటపడే లక్షణం. నరక లోకం యొక్క తీవ్రత ఇక్కడి నుంచే మొదలవుతుంది.7.
7. పాతాళం - కాకోలం అనే నల్లని విషం ఉండే ప్రాంతం. పతనమైన, లేదా పాపిష్టి పనులకు మూలం ఇది. దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం. అరికాలులో ఉంటుంది. ఇక్కడుండే జీవులు వినాశనం కోసం వినాశనం చేస్తారు, హింసించటం కోసం హింసిస్తారు, చంపడం కోసం చంపుతారు.

కాబట్టి దీన్ని అర్దం చేసుకుని మనలో ఆ క్రింద చక్రాల్లో ఏ ఏ లక్షణాలు ఉన్నాయో, అవన్నీ వదులుకుంటే, కాస్తంతైన ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది.

To be continued .........