Showing posts with label దత్తజయంతి. Show all posts
Showing posts with label దత్తజయంతి. Show all posts

Tuesday, 14 February 2023

శ్రీదత్త పురాణము (50)

 

నాయనా దీపకా వింటున్నావా అని వేద ధర్ముడు హెచ్చరించాడు. దీపకుడు ఆనందంతో తలవూపాడు. సుమతి తన తండ్రికి చెప్పిన కధ యిది. అనసూయ అత్రి మహర్షులు పుత్రవాంఛతో మదనాగ్నిని ప్రజ్వలింప చేసుకున్నారు. హోమగుండంలో పడబోతున్న హవిస్సును వాయుదేవుడు చెదరగొట్టాడు. ఒక అంశం వచ్చి మహర్షి కుడి కంటిలో పడింది. తక్కిన రెండు భాగాలు క్షణకాలం వ్యవధిలో అనసూయాదేవి గర్భకోశాన ప్రవేశించాయి. అత్రిముని కంటిలోపడిన భాగాన్ని ఆశ్రయించి బ్రహ్మచంద్రుడుగా ఉదయించాడు. అనసూయాసాధ్వి గర్భంలోకి ప్రవేశించిన ద్వితీయాంశను ఆశ్రయించి పురుషోత్తముడు దత్తాత్రేయుడిగా ఆవిర్భవించాడు. తృతీయాంశం రూపాన్ని ధరిస్తూ ఉండగా హైహయుడు అనే రాజు అడ్డగించాడు. ఇది గ్రహించిన రుద్రుడూ ఆ భాగాన్ని ఆశ్రయించి ఏడు రోజులు గర్భవాసం చేసి తమోగుణ ప్రధానుడై దూర్వాసుడుగా జన్మించాడు.


బ్రహ్మాంశ సంభవుడయిన చంద్రుడు రజోగుణ ప్రధానుడై లోకాలకు వెన్నెలను ప్రసాదిస్తున్నాడు. ప్రజాపతి పదవిని పొందాడు. కళలకు, ఔషధాలకు పోషకుడయ్యాడు. శివాంశ సంభవుడయిన దూర్వాసుడు రౌద్రగుణ ప్రధానుడై శాపాయుధుడై ఉన్మత్త వ్రత దీక్షతో వెలుగొందుతున్నాడు. కేశవాంశ సంభవుడయిన దత్తుడు యోగవిద్యా పారంగతుడై సత్వగుణ ప్రధానుడై తపోదీక్షతో తరచూ ఏకాంత వాసాలతో కాలం గడుపుతూ ఉన్నాడు. ముని పుత్రులు చాలామంది ఆయనకు శిష్యులు అనుచరులు అయ్యారు. అందువల్ల ఆయన ఏకాంతానికి నిష్ఠకు భంగం కల్గుతోంది. వారిని పరీక్షించాలని కూడా దత్తుడు భావించి వెళ్ళి వెళ్ళి ఒక సరస్సులో మునిగిపోయాడు. ఎంతకాలానికి సరస్సు నుంచి బయటకు రాలేదు. అయినా శిష్యవర్గం విడిచిపెట్టలేదు. గట్టున నిలబడి నిరీక్షిస్తున్నారు. ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు అని ఎదురు చూస్తూ ఉండగానే నూరు సంవత్సరాలు గడిచి పోయాయి. అప్పుడు లేచివచ్చాడు. అఖండ తేజోమూర్తి సూర్యకాంతిలాంటి తేజస్సుతో, చంద్రబింబంలా సరస్సునుండి బయటకు వచ్చాడు. శిష్యులంతా కరతాళధ్వనులతో జయజయ నాదాలతో జయగురుదత్తా! శ్రీ గురుదత్తా అంటూ ఆనంద తాండవం చేసారు. కొందరైతే బుంగమూతులు పెట్టి గోముగా నిష్ఠురాలు పలికారు. అందరినీ సముదాయించి దత్తాత్రేయుడు చిరునవ్వులు పంచి పెడుతూ ఆశ్రమం వైపు నడక సాగించారు. శిష్యులంతా కోలాహలంగా ఆయన్ను అనుసరించారు.


దత్తగురు, ఇంకెప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకు. మమ్మల్ని ఏకాకుల్ని చేయకు. నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేము. నీ విరహాన్ని మేము భరించలేము అన్నారు. శిష్యులు మిత్రులు ఇలా అడుగుతూ ఉంటే దత్తుడు చిరునవ్వులు చిందిస్తూ వారితో కొంతకాలం గడిపేడు. వారితో బంధం యోగసాధనకు ఆటంకమవుతోంది. అదీగాక వీళ్ళందరూ నిజంగా తన పట్ల గురుభావంతోనే ఉన్నారా? ఉంటే దాని లోతు ఎంత? వీరు ఎరిగిన విలువలకు భిన్నంగా నేను ప్రవర్తిస్తే ఎంతమంది సహిస్తారు. ఎంతమంది అసహ్యిస్తారు, పరీక్షిద్దామను కున్నాడు.


Tuesday, 10 January 2023

శ్రీదత్త పురాణము (15)



శ్రీమన్నారాయణుడు కళ్ళల్లో ఆనంద భాష్పాలు తిరిగాయి. నాయనా గురుస్వరూపమే బ్రహ్మపదాన్ని అందిస్తుంది. ఉదరపోషణకు అవసరమయిన లౌకిక విద్యలు నేర్పిన వాడు సాధారణ గురువు. ధర్మాధర్మ వివేకాన్ని కలిగించేవాడు అతనికంటే ఘనుడు. వేదశాస్త్రాలను బోధించేవాడు అతనికంటే ఘనుడు. వేదార్ధ బోధకుడు అధికుడు. బ్రహ్మవిద్యోపదేష్ట అందరికన్నా గొప్పవాడు. అతడు నాకు అభిన్నుడే. అరిషడ్వర్గాలలో చిక్కుకొని అల్లకల్లోలమవుతున్న శిష్యుని మనస్సుకు పురాణేతి శాస్త్రాల ప్రబోధంతో ఊరడింపు కలిగించి ధర్మపథంలో నడిపించే గురువే ప్రత్యక్షదైవం. అతన్ని మనోవాక్కాయ కర్మలతో సేవించడానికి మించిన పురుషార్ధం లేదు. అదియే భుక్తి, ముక్తి ప్రదం. ఈ తత్వం నీవు తెలుసుకొని గురుసేవలో ఉన్నావు. అందువల్లనే దర్శనం ఇచ్చాను. సద్గురువులను సేవించే సచ్చిష్యులంటే మా త్రిమూర్తులకు చాలా ఇష్టం. నీకు సకలశుభాలు కలుగుగాక! అని ఆశీర్వదించి నారాయణుడు అదృశ్యమయ్యాడు.


కుటీరంలోని వేదధర్మునకు మెలుకువ వచ్చింది. దీపకున్ని పిలిచి నాయనా దీపకా ఎవరు వచ్చింది, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. దీపకుడు వేదధర్మునికి నమస్కరించి పరమానందంతో జరిగిన వృత్తాంతం చెప్పాడు. వేదధర్ముడు ముఖంలో ఆనందం, కన్నుల్లో వాత్సల్యం తళుక్కున మెరిశాయి.


ధృడ చిత్తంతో, స్థిరసంకల్పంతో దీపకుడు సేవలు జేస్తు ఉండగా 21 సంవత్సరాలు గడిచిపోయాయి. వేదధర్ముని పాపాలు నశించాయి. కుష్టురోగము, అంధత్వము అన్నీ ఎవరో తీసివేసినట్టుగా తొలగిపోయాయి. శరీరం మీద ఆనవాలుగా ఒక మచ్చ కూడా లేదు. బూడిద నుండి వెలువడిన అగ్నికణంలా ప్రకాశిస్తున్నాడు. దీపకుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. గురుదేవా అంటూ వేదధర్ముడు పాదాలమీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు.


నాయనా దీపకా నీ సేవలు ఫలించాయి. పూర్వజన్మ సంచితాలయిన నా పాపకర్మలు వదిలిపోయాయి. ఈ పుణ్యమంతా నీదే, నీ గురుభక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నవనిధులు నీకు పరిచారకులు అవుతాయి. అష్టసిద్ధులు సంప్రాప్తమవుతాయి. ఇకనుంచి గురుశుశ్రూష విషయంలో ముందు నిన్నే చెప్పుకుంటుంది లోకం. కాశీ విశ్వనాధుని దయవల్ల ప్రారబ్ధకర్మేకాదు మొత్తం భవసాగరాన్నే దాటాము.


Friday, 25 December 2015

తేనేటీగా నా గురువు - దత్తుడు

తేనెటీగ నా గురువు. తేనెటీగ తాను ప్రపంచమంతా తిరుగుతూ మకరందాన్ని సేకరిస్తుంది. తాను ఏ పువ్వు మీద వాలినా, ఆ పువ్వుకు ఎటువంటి హాని చేయకుండా, తన పని ఎంటో అదే తాను చేసుకుంటుంది. అలాగే ముక్తిని కోరే సాధకుడు కూడా అన్ని ఆధ్యాత్మిక గ్రంధాలను చదివినా, తన సాధనకు ఏది అవసరమో, ఎంత వరకు అవసరమో అంతవరకే గ్రహించాలని, అనవసరమైనవి, ఆధ్యాత్మిక సాధనను భంగం చేసే వాటిని విసర్జించాలని నేను తేనెటీగ ద్వారా గ్రహించాను.

తేనెటీగ ఆ పువ్వు, ఈ పువ్వు అని చూడదు. మకరందం ఎక్కడ దొరుకుతుందా అని మాత్రమే చూస్తుంది. అలాగే సాధకుడు కూడా మొహమాటానికి వెళ్ళకుండా, ఎక్కడ జ్ఞానం ఉన్నా, దాన్ని గ్రహించడానికి సదా సిద్ధంగా ఉండాలని తెలుసుకున్నాను.

శ్రీ గురు దత్తాత్రేయ


Thursday, 24 December 2015

గొంగళిపురుగు నా గురువు - దత్తుడు

నా గురువులలో గొంగళిపురుగు ఒకటి. కందీరిగ తన గొంగళి పురుగును తీసుకెళ్ళి తన గూట్లో పెట్టి, జుంకారం చేస్తూ దాని చుట్టు తిరుగుతుంది. అది చూసిన గొంగళిపురుగు, భయంతో మరే ఇతర ఆలోచన లేక తదేకంగా తన తల్లైన కందిరీగనే గమనిస్తుంది. మనసులో కందిరీగ తప్ప మరే ఇతర ఆలోచనా ఉండదు. దాన్నే తీక్షణంగా గమనిస్తుంది. ఆ కందిరీగ మీద తదేక ధ్యానం చేత, గొంగళిపురుగు క్రమంగా రెక్కలు వచ్చి, రూపాంతరం చెంది కందిరీగగా మారి, ఎగిరిపోతుంది. అదే విధంగా సాధకుడు కూడా తన మనసును తదేకంగా దేని యందు లగ్నం చేస్తాడో, అతడు ఆ స్వరూపాన్నే పొందుతాడని దాని ద్వారా నేను తెలుసుకున్నాను.

నిరంతరం మనసు దేనిని మననం చేస్తుందో, అది స్వరూపాన్నే సంతరించుకుంటుంది. కనుక ముక్తిని కోరే వ్యక్తి సదా ఆత్మ యందు ధ్యానం నిలిపితే, అతడు ఆత్మ స్థితి యందే స్థిరపడిపోతాడు.

శ్రీ గురు దత్తాత్రేయ స్వామి 

Thursday, 27 December 2012

దత్తజయంతి


ఓం శ్రీ దత్తశరణం మమ

ఒకసారి నారదుడు సరస్వతి,లక్ష్మీ,పార్వతులు కలిసి ఉండగావచ్చి మీకంటే గొప్ప పతివ్రత ఉంది ఈ లోకంలో, ఆమె అత్రి మహర్షి భార్య అనసూయ దేవి అన్నాడు. వారు ఆమె పాతివ్రత్యాన్ని లోకానికి తెలియపరచాలనుకున్నారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు ఆమెను పరిక్షించడానికి, ఆమె పతిభక్తిని లోకాలకు తెలియజేయడానికి సన్యాసుల రూపంలో ఆమె ఇంటికి బిక్షకు వెళ్తారు. అప్పుడు అత్రి మహార్షి ఆశ్రమంలో ఉండరు. అనసూయదేవి వారిని లోపలికి ఆహ్వానించి భోజనానికి ఏర్పాట్లు చేస్తుంది. వడ్డించే సమయానికి వారు ఆమెను వివస్త్రగా ఆహారం పెట్టమని కోరుతారు. ఆమె ఒక్క క్షణం ఆలోచించి, చేతిలో నీరు తీసుకుని, తన భర్తను స్మరించి, మంత్రం జపించి వారి మీద చల్లుతుంది. వేంటనే త్రిమూర్తులు పసిపిల్లలుగా మారిపోతారు. వారు కోరినట్టుగానే అనసూయదేవి త్రిమూర్తులకు పాలు ఇస్తుంది. అత్రిమహర్షి ఆశ్రమానికి తిరిగివచ్చాకా ఆ ముగ్గురు పసిపిల్లలను తన హృదయానికి హత్తుకుని 3 తలలు, 6 చేతులు ఉన్న ఒక పిల్లవానిగా మార్చివేస్తారు. తమ భర్తలు ఎంతసేపటికి రాకపోవడంతో సరస్వతి, లక్ష్మీ, పార్వతులు అత్రి-అనసూయ దంపతులతో తమ భర్తలకు నిజరూపాలు ఇవ్వమని వేడుకుంటారు. అందుకు అనసూయ దేవి అంగీకరించి వారి మీద తిరిగి మంత్రించిన జలం చల్లుతుంది. వారి వారి సాధారణ రూపాలను పొందిన త్రిమూర్తులు అత్రి-అనసూయలకు తమ అంశయైన దత్తాత్రేయ స్వామిని కూమారునిగా ప్రసాదిస్తారు. దత్తాత్రేయ స్వామి అవతారం మార్గశిర పౌర్ణమి నాడు జరిగింది.

ఈయనను పూజిస్తే భూతప్రేతపిశాచాల బాధించవు, గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి. విద్యార్ధులకు దత్తాత్రేయ స్వామి విద్యాప్రదాత. మేడి చెట్టు (ఔదుంబర వృక్షం) కింద ఉంటాడు. ఈయన వద్ద నాలుగు కుక్కలు ఉంటాయి. అవి నాలుగు వేదాలకు ప్రతీకలు.

ఓం దత్తాత్రేయాయ నమః
ఓం శ్రీ దత్త శరణం మమ
ఓం శాంతిః శాంతిః శాంతిః