Showing posts with label శ్రీ రాముడు. Show all posts
Showing posts with label శ్రీ రాముడు. Show all posts

Friday, 15 October 2021

దుర్గామాతను పూజించిన శ్రీ రాముడు.



ఈ కథ కలకత్తా వైపు ప్రాచుర్యంలో వుంది. దీన్ని అకాల బోధన్ అంటారు. అకాల అంటే కాలం గాని కాలంలో. బోధన్ అంటే పూజించడం/ ఆవాహన చేయటం. సాధారణంగా అమ్మవారిని వసంత ఋతువులో పూజిస్తారు. అయితే రాముడు కాలం కాని కాలంలో పూజించినందు వలన ఈ పేరు వచ్చిందట.


రావణుని మీద యుద్ధం ప్రకటించే ముందు శ్రీ రాముడు దుర్గామాత అనుగ్రహం పొందాలనుకున్నాడు. అమ్మవారిని 108 నీలి పద్మాలతో పూజిస్తే ప్రసన్నమవుతుందని తెలుసుకుని పద్మాలు సేకరించాడు. పూజ ముగిసే సమయానికి అందులో ఒక పుష్పం తగ్గిందని తెలుసుకుని, తన నేత్రాలు నీలిపద్మాల వలె ఉంటాయని అందరూ అంటారు కనుక తన కళ్ళనే అర్పిద్దామని బాణాన్ని కంటి దగ్గర పెట్టగానే దుర్గమ్మ ప్రత్యక్షమైంది. రావణుడు మట్టి కరుస్తాడని చెప్పి, అభయమిచ్చింది. ఆ తర్వాత రావణ వధ జరగడం, సీతమ్మతో కలిసి అయోధ్య చేరడం మనకు తెలిసినదే. అలా శ్రీ రామచంద్రుడు దుర్గామాతను ఆరాధించాడు.


శ్రీ రాముని చేత పూజలందుకున్న వినాయకుడు తమిళనాడులోని ఉప్పూర్‌లో, రామ ప్రతిష్టితమైన నవగ్రహాలు రామేశ్వరం దగ్గరలో నవపాషాణంలో ఉన్నారు. ముందుగా విఘ్ననివారణ కోసం శ్రీ మహగణపతిని పూజించి, ఆ తర్వాత కార్యసిద్ధి కోసం నవగ్రహాలను కూడా పూజించాడు. అలాగే రావణ వధానంతరం రామేశ్వరంలో సీతమ్మ ఇసుకతో లింగం చేయగా రాముడు పూజించాడు. అది ఇప్పటికీ రామేశ్వరంలో ఉంది. 


అందుకే మనమంతా ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణపతిని పూజించి, నవగ్రహాలను స్మరించి, మిగితా దేవతలను ఆరాధించి అప్పుడు ప్రారంభిస్తాము. 


శ్రేష్ఠులైన వారు ఏది ఆచరిస్తే లోకులు అది పాటిస్తారు. మనందరికి సరైన మార్గం చెప్పుటకు శ్రీరాముడు ఈ విధంగా అర్చించాడు. మనం కూడా భగవదారాధనలో శ్రీ రాముని మార్గంలో నడవాలి. అహంభావనను విడిచి సర్వదేవతలను సమభావంతో ఆరాధించాలి.

 

జయ శ్రీ రామ

Wednesday, 5 April 2017

Friday, 15 April 2016

తోబుట్టువుల విలువ చెప్పిన రాముడు

ఈనాడు మానవసంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలుగా మారిపోతున్నాయి. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు చిన్న చిన్న కారణాలతో, అహంకారంతో, మనస్పర్ధలతో విడిపోతున్నారు. ఇటువంటి సమయంలో రామాయణం మొత్తం మానవాళికి ఒక ఆశాజ్యోతి. రాముడు తోబుట్టువుల గొప్పతనం గురించి రామాయణంలో చెప్పిన మాట అందరూ గుర్తించుకోదగినది.

ఇంద్రజిత్తు (మేఘనాధుడు) తో యుద్ధం చేసిన లక్ష్మణుడు అతడు చేసిన అస్త్రప్రయోగంతో మూర్ఛపోతాడు. రక్తపుమడుగులో ఉన్న తమ్ముడిని చూసిన రాముడికి ఎక్కడలేని దుఃఖం వచ్చి సుశేషునితో ఈ విధంగా అంటాడు.

నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణుని ఈ స్థితిలో చూసి నా శక్తి క్షీణించిపోతోంది. ఒకవేళ లక్ష్మణుడు మరణిస్తే, నా జీవితానికి, సంతోషానికి అర్దమేముంది? నా వీరత్వం సిగ్గుపడుతోంది. చేతి నుంచి ధనుస్సు పడిపోయినట్టుంది. బాణాలు జారిపోతున్నాయి. కన్నీరుతో కళ్ళు నిండి దృష్టి కూడా కనిపించడంలేదు. నేను మరణించాలనుకుంటున్నాను అని రాముడు ఎంతో ఏడుస్తాడు.

ఓ శూరుడా! లక్ష్మణా! విజయం కూడా నన్ను తృప్తి పరచలేదు. దృష్టి కోల్పోయిన వ్యక్తికి జాబిల్లి (చంద్రుడు) ఏ విధంగా సంతోషాన్ని ఇవ్వగలడు. ఇప్పుడు నేను పోరాడి సాధించేది ఏంటి? లక్ష్మణుడు మరణించి ఉంటే, నేను యుద్ధం చేసి లాభం ఏంటి? నువ్వు నన్ను ఏ విధంగా వనవాసానికి ముందు అనుసరించావో, అలాగే ఇప్పుడు నేను నిన్ను మృత్యువులో అనుసరిస్తాను. యముని వద్దకు నీ వెంట వస్తాను.

దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః |
తం తు దేశం న పశ్యామి యత్ర భ్రాతః సహోదరః ||

భార్యలు ఏ దేశంలోనైన దొరుకుతారు, బంధువులు కూడా అంతే. కానీ ఏ దేశానికి వెళ్ళిన తోబుట్టువులు మాత్రం దొరకరు. వారిని కోల్పోకూడదు అంటాడు శ్రీ రాముడు.

నేను ఇక్కడే, ఈ యుద్ధభూమిలోనే మరణిస్తాను, తిరిగి అయోధ్యకు వెళ్ళను, నాకు నీ కంటే ఎవరు ఎక్కువ కాదు అంటూ లక్ష్మణుని చూస్తూ రాముడు రోదిస్తాడు.

ఇది వాల్మీకి రామాయణం యుద్ధకాండ 101 సర్గలో ఉంది.

తోడబుట్టిన వారి విలువ ఎంత చక్కగా చెప్పాడు శ్రీ రాముడు. అహంకారాలాకు పోయి వారిని దూరం చేసుకుంటారా? కొత్తగా పెళ్ళై వచ్చిన జీవిత భాగస్వామి కోసం వారిని విడిచిపెడతారా? శ్రీ రాముడు మనకు ఆదర్శం కావాలి. బంధువులు, బంధుత్వాలు ఎన్నైనా కలుపుకోవచ్చు. కానీ తోబుట్టువులను తీసుకురాలేరు. వారితో కూడా కాలం గడపాలి, ప్రేమను పంచుకోవాలి. రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులులాగా అప్యాయతతో జీవించాలి.

శ్రీ నామ రామాయణం


శ్రీ నామ రామాయణంగా ప్రసిద్ధమైన ఈ సంకీర్తనలో కేవలం 108 నామాల్లోనే మొత్తం రామాయణమంతా ఇమిడి ఉంది.

బాల కాండము:

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్
కాలాత్మక పరమేశ్వర రామ్
శేషతల్ప సుఖ నిద్రిత రామ్
బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్
చండకిరణకుల మండన రామ్
శ్రీ మద్దశరథ నందన రామ్
కౌసల్యా సుఖవర్ధన రామ్
విశ్వామిత్ర ప్రియ ధన రామ్
ఘోర తాటకా ఘాతక రామ్
మారీచాది నిపాతక రామ్
కౌశిక మఖ సంరక్షక రామ్
శ్రీమదహల్యోద్ధారక రామ్
గౌతమముని సంపూజిత రామ్
సుర మునివర గణ సంస్తుత రామ్
నావిక ధావిత మృదు పద రామ్
మిథిలా పురజన మోహక రామ్
విదేహ మానస రంజక రామ్
త్ర్యమ్బక కార్ముక భంజక రామ్
సీతార్పిత వర మాలిక రామ్
కృత వైవాహిక కౌతుక రామ్
భార్గవ దర్ప వినాశక రామ్
శ్రీమదయోధ్యా పాలక రామ్
రామ రామ జయ రాజా రామ్

రామ రామ జయ సీతారామ్

అయోధ్య కాండము:

అగణిత గుణగణ భాషిత రామ్
అవనీ తనయా కామిత రామ్
రాకా చంద్ర సమానన రామ్
పితృ వాక్యాశ్రిత కానన రామ్
ప్రియ గుహ వినివేదిత పద రామ్
తత్ క్షాలిత నిజ మృదుపద రామ్
భరద్వాజ ముఖానందక రామ్
చిత్ర కూటాద్రి నికేతన రామ్
దశరథ సంతత చింతిత రామ్
కైకేయీ తనయార్థిత రామ్
విరచిత నిజ పితృ కర్మక రామ్
భరతార్పిత నిజ పాదుక రామ్
రామ రామ జయ రాజా రామ్

రామ రామ జయ సీతా రామ్

అరణ్య కాండము

దండకావనజన పావన రామ్
దుష్ట విరాధ వినాశన రామ్
శరభంగ సుతీక్షార్చిత రామ్
అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్
గృధ్రాధిప సంసేవిత రామ్
పంచవటీ తట సుస్థిత రామ్
శూర్పణఖార్తి విధాయక రామ్
ఖర దూషణ ముఖ సూదక రామ్
సీతా ప్రియ హరిణానుగ రామ్
మారీచార్తి కృదాశుగ రామ్
వినష్ట సీతాన్వేషక రామ్
గృధ్రాధిప గతి దాయక రామ్
శబరీ దత్త ఫలాశన రామ్
కబంధ బాహుచ్ఛేదన రామ్
రామ రామ జయ రాజా రామ్

రామ రామ జయ సీతా రామ్

కిష్కింధా కాండము

హనుమత్సేవిత నిజపద రామ్
నత సుగ్రీవాభీష్టద రామ్
గర్విత వాలి సంహారక రామ్
వానరదూత ప్రేషక రామ్
హితకర లక్ష్మణ సంయుత రామ్
సుందరా కాండము

కపివర సంతత సంస్మృత రామ్
తద్గతి విధ్వ ధ్వంసక రామ్
సీతా ప్రాణాధారక రామ్
దుష్ట దశానన దూషిత రామ్
శిష్ట హనూమద్భూషిత రామ్
సీతా వేదిత కాకావన రామ్
కృత చూడామణి దర్శన రామ్
కపివర వచనాశ్వాసిత రామ్
రామ రామ జయ రాజా రామ్

రామ రామ జయ సీతా రామ్

యుద్ధ కాండము:

రావణ నిధన ప్రస్థిత రామ్
వానరసైన్య సమావృత రామ్
శోషిత సరిదీశార్థిత రామ్
విభీషణాభయ దాయక రామ్
పర్వతసేతు నిబంధక రామ్
కుంభకర్ణ శిరచ్ఛేదక రామ్
రాక్షససంఘ విమర్దక రామ్
అహి మహి రావణ చారణ రామ్
సంహృత దశముఖ రావణ రామ్
విధి భవ ముఖ సుర సంస్తుత రామ్
ఖస్థిత దశరథ వీక్షిత రామ్
సీతాదర్శన మోదిత రామ్
అభిషిక్త విభీషణ నత రామ్
పుష్పక యానారోహణ రామ్
భరద్వాజాభినిషేవణ రామ్
భరత ప్రాణ ప్రియకర రామ్
సాకేత పురీ భూషణ రామ్
సకల స్వీయ సమానత రామ్
రత్నలసత్పీఠాస్థిత రామ్
పట్టాభిషేకాలంకృత రామ్
పార్థివకుల సమ్మానిత రామ్
విభీషణార్పిత రంగక రామ్
కీశకులానుగ్రహకర రామ్
సకలజీవ సంరక్షక రామ్
సమస్త లోకాధారక రామ్
ఉత్తరా కాండము:

ఆగత మునిగణ సంస్తుత రామ్
విశ్రుత దశకంఠోద్భవ రామ్
సీతాలింగన నిర్వృత రామ్
నీతి సురక్షిత జనపద రామ్
విపిన త్యాజిత జనకజ రామ్
కారిత లవణాసురవద రామ్
స్వర్గత శంభుక సంస్తుత రామ్
స్వతనయ కుశలవ నందిత రామ్
అశ్వమేధ క్రతు దీక్షిత రామ్
కాలావేదిత సురపద రామ్
అయోధ్యక జన ముక్తిద రామ్
విధిముఖ విభుధానందక రామ్
తేజోమయ నిజరూపక రామ్
సంసృతి బంధ విమోచక రామ్
ధర్మస్థాపన తత్పర రామ్
భక్తిపరాయణ ముక్తిద రామ్
సర్వచరాచర పాలక రామ్
సర్వభయామయ వారక రామ్
వైకుంఠాలయ సంస్థిత రామ్
నిత్యానంద పదస్థిత రామ్
రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతా రామ్

Telugu wikisource (https://goo.gl/iblBCf) సౌజన్యంతో

Saturday, 28 March 2015

రామాయణం మన రక్తంలో ఉంది.

రామాయణం మన రక్తంలో ఉంది.

రాముడు మనలాంటి మాములు మనిషే. రామాయణంలో రాముడు ఎక్కడా మహిమలు చూపలేదు. ఒక మాములు వ్యక్తిగా పుట్టిన వ్యక్తి దాదాపు 10,00,000 నుంచి 18,00,000 సమవత్సరాలు గడిచిపోయినా, ఇంకా అదే వైభవంతో వెలగడానికి కారణం రాముడి సత్యనిష్ట, ధర్మ నిబద్ధత.

రాముడు తన బాణాలతో 18,000 మంది కరదూషణాదులను చంపాడు కానీ తనకు అమోఘమైన శక్తి ఉన్నదని గర్వించలేదు. వాలి ప్రపంచంలో ఉన్న వానరసైన్యాన్ని ఏక తాటిపైకి తీసుకువచ్చి, సమన్వయ పరిచాడు. వాలి ఎంత శక్తివంతుడంటే, వాలికి రావణాసురుడు కూడా భయపడ్డాడు. అటువంటి వాలితో స్నేహం చేస్తే, సీతమ్మను క్షణంలో లంక నుంచి తీసుకురావచ్చని తెలిసినా, వాలి తన ధర్మం తప్పాడని అతని సాయం కోరలేదు. వాలిని చూసి భయపడుతున్న సుగ్రీవునికి అండగా నిలబడ్డడు. వాలిని చంపి, రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పజెప్పాడు కానీ తాను రాజ్యంలో కొద్ది భాగం కూడా తీసుకోలేదు.

శత్రువు తమ్ముడైనా, తనను శరణు వేడుకున్నాడని విభీషణుడికి గౌరవం ఇచ్చాడు, స్నేహం కుదిరిని వెంటనే విభీషణునికి లంకాధిపతిగా సముద్రజలాలతో పట్టాభిషేకం చేశాడు శ్రీ రాముడు. అప్పుడు అక్కడున్న వారికి ఒక ప్రశ్న తలెత్తింది. విభీషణుడు శరణుజొచ్చాడని అతనికి పట్టాభిషేకం చేశావు, మరి రేపు రావణుడు శరణు వేడితే ఏం చేస్తావు రామా?! అని అడిగారు అక్కడున్న వారు. నేను ఆడినమాట తప్పను, అదే జరిగితే, విభీషణుడిని అయోధ్యకు రాజును చేస్తాను అన్నాడు. ఇంత ధైర్యంగా ఈ మాటను ఎవరు చెప్పగలరు ఒక్క మన రాముడు తప్ప!

రామరావణ యుద్ధం అప్పట్లో ఒక ప్రపంచ యుద్ధంగా చెప్పచ్చు. రావణుడు సమస్తప్రపంచాన్ని హడలుగొట్టిన వీరుడు. అటువంటి రావణుడితో యువకుడైన రాముడు  పోరాటం చేయడానికి పూనుకోవడం, అది కూడా వైరంతో కాదు, తన భార్య కోసం ............... ఒక చారిత్రాత్మిక సంఘటన. రాముడు అందగాడు, రాకుమారుడు, ఆజానుబాహుడు, తను కోరుకుంటే ప్రపంచంలో ఉన్నా సుందరీమణులందరూ రాముడిని వివాహం చేసుకోవాడానికి సిద్ధపడతారు. అయినా, కట్టుకున్న భార్యను కాపాడటం భర్త విధి. ధర్మార్ధకామాలలో నేను నీ చేయి విడిచి పెట్టను అని వివాహసమయంలో చేసిన ప్రమాణాన్ని గట్టిగా పాటించి, లోకానీకి మార్గం చూపినవాడు శ్రీ రాముడు.

తన భార్య కోసం రావణుడితో భీకరయుద్ధానికి సిద్ధమయ్యాడు. అది మాములు యుద్ధం కాదు, అందులో అణ్వస్త్రాలు (న్యూక్లియర్ వెపన్లు), మిస్సైల్స్, రాడర్లకు అంతుచిక్కని విధంగా తయారు చేయబడిన యుద్ధ విమానాలు మొదలైనవి రావణుడి చెంత ఉన్నా, వాటికి బెదరలేదు శ్రీరాముడు. ఎదురించి, యుద్ధం చేసి గెలిచాడు, రావణుడి చెంత బంధీలుగా ఉన్నా ఎందరో స్త్రీలను విడిపించాడు, సీతమ్మను గ్రహించాడు. ఇంత చేసినా, లంక నుంచి రూపాయి తీసుకోలేదు, రాజ్యంలో వాటా అడగలేదు. లంకలో ధర్మస్థాపన చేసి, విభీషణుడిని లంకాధిపతిని చేశాడు.

అప్పటికి రాముడికి రాజ్యం మీద ఆసక్తిలేదు. భరతుడి మనసు మారిందేమో, భరతుడు రాజ్యపరిపాలన చేయాలనుకుంటున్నాడేమో, ఒక వేల అదే నిజమైతే, తాను తన జీవితాన్ని అడవిలోనే గడపాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ పరిస్థితి చూసి రమ్మని హనుమను పంపారు, భరతుడు రాముడి రాక ఆలస్యమైందని ఆత్మాహుతికి సిద్ధం అవుతున్నాడని తెలుసుకుని, తన తమ్ముడి ప్రాణం కోసమే రాముడు అయోధ్య చేరాడు.

ఒక్కసరి చరిత్ర గమనిస్తే మన దేశం మీద ఎందరో దాడి చేశారు, సంపదను దోపిడి చేశారు, సంస్కృతిని నాశనం చేశారు, చరిత్ర మొత్తం క్రైస్తవ, మహమ్మదీయ అకృత్యాలే కనిపిస్తాయి. కానీ చరిత్రలో ఎప్పుడైనా హిందుస్థాన్(భారత్) ఏ దేశం మీదనైనా దందయాత్ర చేసిందా? ఏ దేశసంపదనైనా దోచుకుందా? రాముడి డి.ఎన్.ఏ మనది. అందుకే దోచుకోవడం, దోపిడి చేయడం, దండయాత్ర చేయడం మన హిందూ చరిత్రలో లేదు. ఇతర దేశాల్లో వారి ధర్మస్థాపన కోసం కలగజేసుకోవాలి. వారి దేశసంస్కృతిని మనం కాపాడాలి, అది నేపాల్ అయినా, టిబెట్ అయినా, లేక మరే ఇతరదేశమైనా. అంతవరకే మన కర్తవ్యం. అదే మనకు రాముడు నేర్పాడు. రాముడు, రామాయణం మన రక్తంలో ఉన్నాయి.

Originally posted: 0-April-2014
1st Edit: 28-March-2015

Friday, 27 March 2015

శ్రీ రామ నవమి

* శ్రీ రామ నవమి*
************************
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు  భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.


ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. మద్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో శ్రీ రాముడి కల్యాణం జరుగుతుంది. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు.

సేకరణ: Sahana Meenakshi​ గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో

*ఆయుర్వేద రహస్యం *
*******************************
ఈ రోజు బెల్లం, మిరియాలు కలిపి చేసిన పానకం, వడపప్పు (నానపెట్టిన పెసరపప్పు) నివేదన చేయాలి. దీనికి ఆయుర్వేదంలో ప్రాశస్య్తం ఉంది. రామనవమి వసంత నవరాత్రుల్లో చివరి రోజున చేస్తారు. ఈ నవరాత్రి ఉత్సవాలు శిస్రఋతువు ముగుసి వసంతఋతువు ప్రారంభంలో వస్తాయి. ఋతువుమార్పు వలన ప్రజల్లో రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది. పానకంలో వేసే మిరియాలు ఈ కాలంలో వచ్చే దగ్గు, జలుబులను నివారిస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కాని మిరియాలకు వేడిని కలిగించే లక్షణం ఉంది, దానికి విరుగుడుగా బెల్లం నీళ్ళు, వడపప్పు పెడతారు. ఇవి చలువ చేస్తాయి. పెరుగుతున్న ఎండల నుంచి తట్టుకోవాలంటే చలువ చేసే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. అందుకోసమే వడపప్పు, పానకం నివేదన. కనుక శ్రీరామనవమి రోజు తప్పకుండా వడపప్పు, మిరియాలతో చేసిన బెల్లం పానకం తీసుకోవడం వలన రామనుగ్రహంతో పాటు ఆరోగ్యం రక్షించబడుతుంది.

అందరికి శ్రీ రామనవమి శుభాకాంక్షలు 

Wednesday, 25 March 2015

రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు ఆదర్శం కావాలి.

ఓం శ్రీ రామాయ నమః

అన్నదమ్ముల అనురాగబంధం అంటే ఏలా ఉండాలో రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు బాల్యంలోనే మనకు చూపించారు. నలుగురు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు.

లక్ష్మణుడు పక్కన లేకపోతే రాముడు నిద్రపోయేవాడు కాదు. రాముడు లేకుండా లక్ష్మణుడు తినేవాడు కాదు. తల్లి కౌసల్య వద్దకు రాముడు వచ్చి 'అమ్మా! ఈ రోజు ఆటలో తమ్ముడు భరతుడు గెలిచినందుకు ఆనందంగా ఉంది ' అని చెప్పేవాడు. అలాగే భరతుడు, కౌసల్యతో 'అమ్మా! అన్నయ్య నన్ను గెలిపించడం కోసం తాను ఓడిపోయాడు. అందుకు నాకు బాధగా ఉంది ' అనేవాడు. ఒకరి ఆనందం కోసం మరొకరు పడిన ఆరాటాన్నీ, అన్నదమ్ముల ప్రేమను చూసి కౌసల్య ఉప్పొంగిపోయేది.

అన్నయ్య అభ్యుదయాన్ని చూసి తమ్ముడు అసూయ చెందకుండా, తమ్ముడి ప్రగతిని చూసి అన్నయ్య ఈర్ష్య చెందకుండా, ప్రేమానురాగాలతో జీవించాలంటే నాలుగు వేదాల లాంటి ఈ నలుగురు అన్నదమ్ములు మనకు ఆదర్శం కావాలి.

సేకరణ : శ్రీ రామకృష్ణ ప్రభ

ఓం శ్రీ రామాయ నమః

Originally posted: April 2013
1st Edit: 04-April-2014
2nd Edit: 25-March-2015