Sunday, 7 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (194)

 

కేవలం నాస్తికులు మినహా నూటికి 99 మంది భగవంతుని పట్ల ప్రేమ కలవారే. అట్టి ప్రేమ, నిష్పలం కాదు. ఈ రాగభక్తి అన్ని దేశాలలో అన్ని కాలాలలో మంచి ఫలితాన్ని ఈయకపోదు. కాని అది ఇచ్చే ఫలం కొద్దిగానే ఉంటుంది. మనం పెట్టిన పెట్టుబడి తక్కువగా ఉన్నపుడు రాబడి కూడా దానికి తగ్గట్లే అంతంతమాత్రమే ఉంటుంది.


కాని పూజా నియమాలు, మంత్రాలు, స్తోత్రాలు, కర్మకాండ, శారీరక పవిత్రత, ఆచారాలు మొదలైనవి అన్నీ భగవంతుని పట్ల ప్రేమ ఉన్నా లేకపోయినా పనిచేస్తాయి. ఇట్లా నియమాలను పాటించడం వల్ల ఈశ్వరుని పట్ల అనురాగం వృద్ధి పొందుతోంది.


ప్రాపంచిక, ఆధ్యాత్మిక సౌభాగ్యం వృద్ధి పొందాలంటే మనస్థితి గతులను బట్టి భగవత్ ప్రేమను చూపించాలి. తీవ్రమైన అనురాగ భక్తి కలవారి పట్ల అతడు దయ చూపిస్తాడు. మిగిలిన వారు అనురాగాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. స్తోత్ర, మంత్ర పఠనాదులను ఎల్లా చేయాలో అట్టి నియమాలనూ పూర్వులందించారు.


ఇక వైధీభక్తిలో కొన్ని నియమాలు, పద్ధతులు భిన్న భిన్న దేశాలలో రకరకాలుగా ఉన్నాయి. అవి వారి మతానుసారంగా ఉంటాయి. వేదమంత్రాలను, దానిననుసరించి ఆగమ పూజకు అధిక శక్తి యుంటుందని భగవత్ నిర్దేశముంది. మంత్ర పఠనాదుల ద్వారా క్రియా కలాపానికి భారతభూమి చాలా అనుకూలమని, మంచి ఫలితం ఉంటుందని భగవానుని అభిప్రాయము. ఎట్లా ఎందుకుందని అంటే ఏమీ చెప్పలేము. స్విట్జర్లాండును చక్కని వాతావరణంతో నింపి సహారా ఎడారిని భగభగా మండేటట్లు ఎందుకు చేసాడంటే ఏం చెప్పగలం? సమాధానం చెప్పలేకపోయినా ఉన్న పరిస్థితిని అంగీకరించక తప్పదు.


ఈ భూమి కర్మభూమిగా ప్రసిద్ధం. కర్మ అంటే శాస్త్ర కర్మమని, అందువల్ల మంత్రాలుంటాయని అర్థం. అందువల్లనే ఆత్మలింగం గాని; రంగనాథ విగ్రహం కాని భారతదేశంలోనే ఉండాలని వినాయకుడు తలిచాడు. లంకకే కాదు, అన్ని దేశాలకూ ఈ దేశంలో పూజించడం వల్ల లాభమని భావించాడు. అట్టి లీలలు చూపాడు. 


ఉభయ కావేరుల మధ్యలో ముఖ్యమైన విష్ణు క్షేత్రాలున్నాయి. ప్రసిద్ధమైన శివ, విష్ణు ఆలయాలు కావేరీ తీరంలో చోళప్రాంతంలో ఉన్నాయి.

Saturday, 6 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (193)



పూజలో ఒక క్రమపద్ధతి - భక్తితో పూజ


రెండు రకాల భక్తిలున్నాయి. ఒకటి వైధీభక్తి. రెండవది రాగభక్తి. శాస్త్రప్రకారం నియమ నిష్ఠలను పాటిస్తూ సాగేది వైధీభక్తి, రాగభక్తిలో భక్తుడు తన ఇష్టం వచ్చినట్లు భక్తితో కీర్తిస్తాడు.


దీనినే అనురాగ భక్తియని అంటారు. ఈనాడెట్టి నియమాలను పాటించరు కనుక తమకు రాగభక్తి ఉందని భావిస్తారు. ఇట్టిది రాగభక్తి కాదు. భగవంతుని గురించి ఊట మాదిరిగా పెల్లుబికే భక్తి కావాలి. భగవంతునకు సంపూర్ణ శరణాగతిని చూపించాలి. అన్ని బంధాలను త్రెంచుకొని, భగవంతుని పట్లనే కాదు, సమస్త జీవులపట్ల ప్రేమను చూపించగలగాలి.


శాస్త్ర ప్రకారం వైధీభక్తి కూడా ప్రేమతో కూడినదే. ఏదో యాంత్రికంగా సాగేది కాదు. కాని శాస్త్ర నియమాలను పాటించాలి. అందు ప్రధానంగా ప్రేమ ఉండాలి. ముందు ఆత్మ పూజ చేసుకుని తర్వాత విగ్రహాన్ని పూజించాలి. ఆత్మపూజ అంటే ఏమిటి? పూజ చేసేవాని శరీరమే దేవాలయం, పూజ చేసేవాడు పూజించే భగవంతుడు వాడిన పుష్పాలను తీసివేసి కొత్త పుష్పాలతో పూజ చేయునట్లుగా అజ్ఞానమనే నిర్మల్యాన్ని తీసివేయాలి. అట్లాగే తాను పూజచేసేవాడినని పూజింపబడే వేరని అనే భేదభావనను తీసి వేయగలగాలి. పైవాడే నేను అనే సో హం భావనతో సాగాలి: 


దేహోదేవాలయః ప్రోక్తో జీవో దేవః సనాతనః

త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సో హంభావేన పూజయేత్


అతడే మనమౌతూ ఉండగా అతనిపట్ల ప్రేమరహితంగా ఉండగలమా? చాలామందితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటాం. అట్లాగే మనకు మనమే దగ్గరగా ఉండమా?

ఈ శ్లోకం చదువుతూ ఉన్నపుడు ఆ తక్కువ సమయంలో అతని పట్ల ప్రేమ కలిగి యుంటాం. అతడు మనమనే భావన కొంతకాలమే ఉంటుంది. మేమట్లా ఉండిపోగలమని ఎవరైనా బీరాలు పలికితే అవి వట్టి మాటలని భావించండి. ఇక నియమాలకు కట్టుబడనిది రాగభక్తిగా చెలామణి అవుతుంది.


Friday, 5 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (192)



భారతదేశ ప్రత్యేకత


పరమేశ్వర మూర్తులు ఈ దేశాన్ని విడిచి పెట్టకుండా ఎందుకు అడ్డుకున్నాడు గణపతి?


చెట్టుకి నీళ్ళు పోయాలంటే దాని మొదట్లో పోస్తాం గాని, ఆకులపై కొమ్మలపై నీళ్ళు చల్లుతామా? కనుక దైవత్వానికి సంబంధించిన దాంట్లో ప్రపంచం, ఒక పెద్ద వృక్షమైతే దాని వేళ్ళు భారతదేశంలోనే ఉన్నాయి. వీటిని తడిపితే చెట్టు కలకలలాడుతుంది. అట్లా అన్ని దేశాలూ సుఖ సంపదలతో ఉంటాయి. అట్లా భారతదేశంలో కర్మానుష్టానం పూజలు, సక్రమంగా జరిగితే మిగతా దేశాలూ శక్తిని పుంజుకుంటాయి. ప్రపంచ క్షేమానికి ఇక్కడ ఆరాధన సక్రమంగా జరగాలి.


భగవంతుడేమని భావించాడు? ఒక ప్రాంతంలో మంచి వాతావరణం ఉండాలి, పంటలు, పచ్చదనం కొన్ని దేశాలలో ఉండాలి. వజ్రాలు, బంగారం విలువైన ఖనిజ సంపద మరొక దేశంలో ఉండాలి. కొన్ని దేశాలలో అధిక ఉష్ణోగ్రత, మరొక దేశంలో అతిశీతలత్వం. కొన్ని దేశాలు ఖాగ్యవంతంగా ఉండి మిగిలిన దేశాలకు అనేక రూపాలలో ఆ సంపద, రవాణా కావాలి. ఇక దైవసంబంధ విషయాలలో భారతదేశం ఒక పవర్ హౌస్ వంటిది.  అన్ని దేశాలకు విద్యుత్ కేంద్రం వంటిది. గుండె, అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తున్నట్లు ఆధ్యాత్మిక శక్తిని మిగతా దేశాలకు అందీయగలదు. ఇది ధర్మ భూమిగా, కర్మభూమిగా ఉండాలని అతని సంకల్పం. అంతమాత్రంచే ఇతర దేశాలలో ఆరాధనలుండకూడదని కాదు. శరీరంలో ఒక భాగానికి రోగం వస్తే కొన్ని మందులను పైపైన పూస్తాం కదా! అట్లాగే మిగతా దేశాలలోనూ పూజలు సాగవలసిందే! అయితే గుండె సరిగా ఉన్నపుడు ఏ రోగం శరీరానికి వచ్చినా కుదర్చడానికి వీలు పడుతుంది. అందువల్ల ఆరాధనా విధానాలలో అనేక నియమాలు, నిష్ఠలూ ఇక్కడున్నాయి. గుండె వంటి భారతదేశం రోగరహితంగా ఉంటే మిగతా అవయవాల వంటి మిగతా దేశాలూ బాగుంటాయి.


Thursday, 4 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (191)



కమండులువును త్రోయడం, కావేరీ నది ప్రవహించడం జరిగింది సహ్యాద్రి తీరంలో. అక్కడ ఒక ఉసిరిక చెట్టుంది. ఆ చెట్టు ఏమిటో కాదు అది మహావిష్ణువే. అది విష్ణుమాయవల్ల లోపాముద్రగా మారి అగస్త్యుని భార్య అయింది. అగస్త్యుని కమండులువులోని నీరుగా మారిందట.


ఇట్లా కావేరి, భగవానుని పాదం నుండి ప్రవహించగా గంగ నా పాదం నుండి ప్రవహిస్తోంది. కాని గంగ కంటే నామీద నాకధిక ప్రీతి యుందని, మొత్తం నా శరీర స్పర్శ నీకు కల్గుగాక అని అనుగ్రహించాడు విష్ణువు. నీవు నదిగా ప్రవహిస్తున్నప్పుడు రెండుగా చీలుతావు, ఒక ద్వీపం దగ్గర రెండు పాయలూ కలిసి నపుడు నీవు నన్ను రెండు చేతులతో ఆలింగనం చేసుకొంటావని కావేరీతో విష్ణువన్నాడట.


మరొక సందర్భంలో శైవ వైష్ణవాలు కలిసాయి. విభీషణుడు రాముడి నుండి రంగనాథుని విగ్రహం పొందినట్లు, రావణుడు పరమేశ్వరుని నుండి ఆత్మలింగాన్ని పొందాడు. దానిని నేలమీద పెట్టకూడదని షరతు పెట్టాడు. లంకకు వెళ్ళేవరకూ చేతిలోనే ఉండాలి సుమా! అన్నాడు. అదీ భారత భూమిని దాటకూడదని పన్నాగం పన్నినట్లున్న కథ మీకు తెలిసిందే. ఆ లింగం స్థాపించబడిన చోటు గోకర్ణం. అది కర్ణాటకలో పశ్చిమ తీరంలో ఉంది. ద్వారక, రామేశ్వరం మాదిరిగా ఇదీ ఒక ద్వీపంలా ఉంటుంది. అక్కడున్న స్వామికి మహాబలేశ్వరుడని పేరు. అక్కడ పెట్టి పెట్టగానే రావణుడు పెకలించబోయాడు. వీలుపడలేదు కనుక స్వామి పేరు తగ్గట్లుగానే ఉంది రావణున్ని ఎట్లా వినాయకుడడ్డుకున్నాడో, విభీషణునికీ విఘ్నం కలిగించాడు. ఇట్లా ఇతని లీలలు అనంతం. ఇతనివల్ల గోకర్ణ, శ్రీరంగ క్షేత్రాలు ప్రసిద్ధిని పొందాయి.


Wednesday, 3 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (190)


వినాయకుని లీలలలోని ఔచిత్యం


శ్రీరంగం యొక్క స్థల పురాణం సరిగా నాకు గుర్తులేదు. ఇది వైష్ణవ క్షేత్రం కనుక వినాయకుని పేరు, అతని లీలలను వారు వర్ణించి యుండకపోవచ్చు. ధర్మవర్మ అనే చోళరాజు, రామునకు సమకాలికుడు. ఇక్కడ మూలస్థానానికి ముందున్న వసారా ధర్మవర్మ పేరుతో ఉంది. ఇక్ష్వాకు రాజుల కుల దైవాన్ని ఇక్కడ ప్రతిష్టించాలని ఘోర తపస్సు చేశాడు. అతని తపః ఫలంగా విశ్రాంతికై విభీషణుడు దీని నిక్కడ ఉంచగా అది స్థిరంగా ఉండిపోయిందని విన్నట్లు గుర్తు. కానీ విఘ్నేశ్వరుడే ఈ లీలను ప్రదర్శించాడని లోకంలో ప్రచారంలో ఉంది. ఇట్లా శైవ వైష్ణవ శాఖల సంగమంగా ఉంది కథను, ఇంకా వింటే నిజమనిపిస్తుంది.


విభీషణుడు బెదిరిస్తూ ఉంటే వినాయకుడు ఱాతికోట నెక్కాడని విన్నాం కదా! విభీషణుడు తనని తరిమి తరిమి నెత్తిపై దెబ్బ కొట్టాడు కదా! దీనికి దృష్టాంతంగా ఆ కొండపై నున్న విఘ్నేశ్వర మూర్తి తలపై దెబ్బ తగిలినట్లుంది. ఇట్లా కొండపై విఘ్నేశ్వరుడుండదం అఱుదు. ఇందులో ఒక తత్త్వం దాగియుంది. మూలాధారం, సహస్రారంతో చేరిందనే యోగపరమైన అర్ధమూ వస్తుంది.  


రంగనాథునకు, గణపతికి ఇంకొక సంబంధం ఉంది. అగస్త్యుని కమండులువును కాకి రూపమెత్తి తిరగబడినట్లు చేసాడని విన్నాం. అగస్త్యుడు ఈ కాకిని తరుముతూ పరుగెత్తాడట. అప్పుడా కాకి, బ్రహ్మచారి రూపం ధరించింది. విభీషణుని కథలోనూ బ్రహ్మచారియే. అగస్త్యుడూ ఒక దెబ్బ కొట్టాలని పరుగెత్తాడు. కొట్టబోయేముందు బ్రహ్మచారి రూపంలో ప్రత్యక్షమయ్యాడు గణపతి. నీ తలమీద దెబ్బ కొడదామని అనుకున్నాను. ఓహో! నువ్వా అన్నాడు. అపుడు తన తలమీదే కొట్టుకున్నాడట. ఈ కథ జరిగిన తరువాత వినాయక భక్తులు తమ తలమీద కొద్దిగా కొట్టుకునే ఆచారం వచ్చింది. ఇది పూజలో ఒక అంగమైంది.

Tuesday, 2 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (189)



దక్షిణాన్ని చూసే ముగ్గురు దేవతలు


దక్షిణామూర్తి రూపంలో, నటరాజు రూపంలో పరమేశ్వరుడు, దక్షిణవైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు గణపతి, విష్ణువును ఆవైపు చూస్తున్నట్లు ప్రతిష్ఠించాడు. దక్షిణామూర్తి ధ్యానమూర్తిగా, అచంచలంగా ఉన్నట్లు కన్పిస్తాడు. నటరాజు, నిరంతరం నృత్యం చేస్తున్నట్లుగా జగత్తును ఆనంద డోలికలలో ఊపుతున్నట్లుగా ఉంటాడు. మహావిష్ణువు పడుకొన్న రూపంలో, ఒరిగిన రూపంలో సమాధి స్థితిలో ఉన్నట్లుంటాడు. యోగనిద్రలో ఉన్నట్లుంటాడు. దీనిని సమాధి స్థితి అని నొక్కి చెప్పకుండా యోగ నిద్ర అని ఎందుకు చెప్పినట్లు? విష్ణువు, అనేక ఇంద్ర జాలాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. అవి మనకర్ధం కావు. అతని సమాధి స్థితిలో సృష్టికార్యం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఇది ఎట్లా సాధ్యం? మనం కలలో ఎందరినో వ్యక్తులను సృష్టిస్తూ వినోదిస్తూ ఉంటాం. అందువల్ల ఈ ప్రపంచం అతని కలవంటిదన్నారు. నిద్రలోనే కలలు వస్తాయి. అందువల్ల సమాధిని కూడా నిద్రకాని నిద్రయని అన్నారు. మరొకటి, సమాధిలో నిటారుగా యోగి కూర్చొని యుంటాడు. ఇతడు ఇక్కడ వంగి విశ్రాంతి తీసుకొన్న రూపంలో సాక్షాత్కరిస్తాడు. అయితే మన నిద్రకు, అతని నిద్రకు తేడాను చూపించడం కోసం అతనిది యోగనిద్రయని అన్నారు.


విఘ్నేశ్వరుని చేతి మహిమ వల్ల, అతని గొప్ప ఆలోచనల వల్ల శివునకు దేనిని అన్వయిస్తున్నామో విష్ణువునకూ అదే. అందుకే అతడు రంగరాజు. వైష్ణవ క్షేత్రాలలో ఇది ప్రముఖమైంది, ప్రధానమైంది. ప్రతిష్ఠ జరిగినచోటు శ్రీరంగం.

కొంచెం భిన్నంగా చెప్పానేమో! రంగరాజు ఉండడం వల్ల అది శ్రీరంగంగా పిలువబడలేదు. ఆ ప్రదేశం రంగం అవడం వల్ల దానినతడు పరిపాలించడం వల్ల అతడు రంగరాజయ్యాడు. ఇక్ష్వాకుల కాలంలో అతని పేరు నారాయణుడే, లేక విష్ణువే! లేదా అనంతశాయి కావాలి. వినాయకుడు అతనికై రంగాన్ని సృష్టించాడు కనుక అతనికి రంగరాజని పేరు వచ్చింది, ఇది కావేరీ తీరంలోనే.

రంగం అంటే నాటకాలు ప్రదర్శించే స్థలం. దానిని ప్రజలు చూస్తారు. రంగస్థలిలో, ఆ గొప్ప నటుడు, ప్రపంచమనే నాటకాన్ని నడుపుతున్నాడు. ఆ నాటకాన్ని ఎక్కడ ప్రదర్శించాలి, రంగంలోనే. నటరాజు చూపించే నృత్యం, చిదంబరంలోనే. దానిని సభయని అంటారు. చిత్ సభ, మామూలు జనులు దీనిని కనకసభయని పిలుస్తారు. అక్కడ సభ ఎట్లాగో ఇక్కడ రంగం అట్టిది.

నా తండ్రికి ఒక సభయుండగా యోగనిద్రలోనున్న నా మేనమామ యైన విష్ణువకు సభ యుండవద్దాయని వినాయకుడు భావించాడు. ఇతడు యోగనిద్రలో ఉండే నాటకాన్ని నడుపగలడు. ఇద్దరు చేసే పనులు ఒకటియైనా పేర్లతో కొంత తేడా ఉంటే రమ్యంగా ఉంటుందని రంగమని, విష్ణు సన్నిధికి పేరు పెట్టాడు. అందుకే అక్కడ ప్రతిష్ట.

Monday, 1 March 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (188)



స్వామియే భక్తునికి లొంగాలని భావించినపుడు మాత్రమే లొంగుతాడు యశోద, కృష్ణుణ్ణి త్రాళ్ళతో బంధించినపుడు జరిగింది కదా!


(త్రాటితో యశోద, కృష్ణుణ్ణి కట్టాలని ప్రయత్నించగా రెండు అంగుళాల త్రాడు తక్కువ వచ్చిందని, కట్టలేకపోయిందనే కథ, ఖాగవతంలో ఉంది కదా, రెండంగుళాలు తక్కువ అవడమేమిటి? మహత్తు, అహంకారం, తన్మాత్రలని ప్రకృతి, పరాప్రకృతిగా ఉంటుంది. పంచ భూతాలతో కూడినది, అపరాప్రకృతి. ఈ రెంటి ప్రకృతులకు స్వామి అందడని సూచిస్తోంది ఆ కథ. కనుక తనంతట తాను లొంగిపోయాడు కన్నయ్య. - అనువక్త) 


విభీషణుడు, వినాయకుని తలపై ఒక దెబ్బ కొట్టాడు. అపుడు నిజరూపాన్ని చూపించాడు గణపయ్య. అట్టి దర్శనం వల్ల ఇతనిలో కోపం, బాధ మటుమాయ మయ్యాయి. "లంకకు స్వామిని తీసుకొని వెళ్ళలేకపోయానని బాధపడకు, నేనెట్లా విగ్రహాన్ని ఉంచానో గమనించావా? ఇది లంకను చూస్తున్నట్లుగానే ఉంటుంది. లంకపై నిరంతరం ఈ స్వామి అనుగ్రహాన్ని వర్షిస్తూనే ఉంటాడులే. సాధారణంగా దక్షిణవైపు చూస్తున్నట్లు విగ్రహాల్ని ప్రతిష్ఠించరు. నీకోసం అట్లా చేసాను, దిగులు చెందకు” అని గణపయ్య ఊరడించాడు.