Saturday, 9 October 2021

శ్రీ హనుమద్భాగవతము (46)



స్వార్థపరుడైన నా ఈ సోదరుడు నా భార్యను, రాజ్యాన్ని పొందదలచి బిలద్వారమును బండరాతితో కప్పివేసినాడు, దానివలన నేను బయటకు రాలేక లోపలే మరణిస్తానని అతని ఊహయై ఉండవచ్చూ అనే ఆలోచన మనస్సు లోనికి వచ్చిన వెంటనే నేయి పోయగానే భగ్గుమని లేచే అగ్నివలె వాలి క్రోధోన్మత్తుడయ్యాడు.


క్రోధారుణలోచనుడైన తన అన్నను చూసినంతనే సుగ్రీవుడు అతని రాజ్యాన్ని అతనికిచ్చి వేసి, నిజం చెప్పే ప్రయత్నం చేసాడు, కాని ‘మహాక్రుద్ధుడైన వాలి సుగ్రీవునకు బద్ధశత్రువయ్యాడు. అతడు రాజ్యముతో పాటు సుగ్రీవుని భార్యయైన రుమను కూడా లాగుకొని, సుగ్రీవుని వధింపదలంచాడు. సుగ్రీవుడు ప్ర్రాణరక్షణార్థమై మంత్రులతో క్లసి పాఱిపోయాడు.


భయకంపితుడైన సుగ్రీవుడు పరుగెత్తుచున్నాడూ. వాలి అతనిని చంపదలచి వెంటబడ్డాడు. నదులను, నదములను, వనములను, పర్వతములను, సముద్రములను, నగరములను దాటుతూ సుగ్రీవుడు పరిగెడుతున్నాడు. ఎక్కడా కూడా ఒక్క రోజైన నిలబడటానికి అతనికి ధరియం లేకపోయింది. వాలి ప్రాణఘాతకుడైన శతృవు వలె వెంబడిస్తున్నాడు.

అట్లా పరుగెడుతూ సుగ్రీవుడు హిమాలయమును, మేరువును, ఉత్తరసముద్రమును సమీపించాడు. అయినా వాలి అతనిని విడువలేదు. సుగ్రీవునకు ఎవ్వరూ అభయమిచ్చేవారు కనబడకపోయారు. అప్పుడు అతని వెంట నిరంతరము నీడవలె ఉన్నవాడు జ్ఞానులలో శ్రేష్ఠుడైన హనుమంతునకు దుందుభివధను గూర్చిన ఘటన జ్ఞాపకమునకు వచ్చింది.


మహిష వేషములో ఉండే దుందుభి అనే దైత్యుడు వేయి ఏనుగుల బలముగలవాడు. తాను గొప్పశక్తివంతుడననే గర్వము అతనికి ఎక్కువగా ఉండేది. ఒకనాటివిషయము, దుందుభి సముద్రుని, హిమవంతుని తిరస్కరించి గర్జిస్తూ వీరశిరోమణియైన వాలితో యుద్ధము చేయుటకు కిష్కింధా పురపుపొలిమేరలలోనికి వచ్చి బిగ్గరగా దుందుభి ధ్వనివలె గర్జింపసాగాడు. దుందుభి తన గిట్టలతో భూమిని త్రవ్వుతూ, వృక్షములను నాశము చేస్తూ, పురద్వారమును కొమ్ములతో విరుగగొట్ట యత్నిస్తూ యుద్ధమునకు ఆహ్వానించసాగాడు.

Wednesday, 6 October 2021

శ్రీ హనుమద్భాగవతము (45)



వాలి సోదరుడైన సుగ్రీవుని పదిహేను దినముల వఱకు బిల ద్వారము దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. కాని సుగ్రీవుడు ఒక మాసము వఱకు అచట చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ద్వారము నుండి అతనికి రాక్షసుల కోలాహలము వినబడసాగినది. కాని వాలిశబ్ద మేదీ వినబడలేదు. అతడు తన అన్నను గూర్చి ఆలోచింపసాగాడు. ఇంతలో అతని ఎదుట గుహ నుండి నురుగుతో కూడిన రక్తము ప్రవహింపసాగింది. భ్రాతృస్నేహమువలన సుగ్రీవుడు వ్యాకులుడయ్యెను. అన్న విషయమై అతనికి సందేహ ముత్పన్నమయ్యింది.


ఎంత ప్రయత్నించినా అతని వాలి జాడ తెలియలేదు. ‘ఈ విశాలబిలంలో అసురులందఱూ క్లసి నా సోదరుని చంపి ఉండవచ్చు, వారు బయటకు వచ్చి నన్ను కూడా చంపవచ్చు' అని సుగ్రీవుడు తలచాడు.


మిక్కిలి దుఃఖితుడై అతడు తన రక్షణకై ఒక పెద్ద బండరాతిని బిలద్వారానికి అడ్డముగా ఉంచి, విచారవదనుడై వాలికి జలాంజలి వదలి కిష్కింధకు వెల్లాడు.


సుగ్రీవుడు తన అన్న మరణమును గుప్తముగా ఉంచాలని తలచాడు, కాని చతురులైన మంత్రులు యువ రాజైన అంగదుడు చిన్న వాడుగా ఉండుటవలన సుగ్రీవునే రాజుగా చేశారు. అప్పటినుండి అతడు నీతిపూర్వకముగా రాజ్యాధికారమును నిర్వహింపసాగాడు.


అచట వీరవరుడైన వాలి రాక్షసుల నందఱనీ సంహరించి రాజధానికి మరలాడు. సుగ్రీవుడు తనకు బదులుగా రాజ సింహాసనమును అధిష్ఠించియుండటం చూసి వాలి మిక్కిలి క్రుద్ధుడయ్యాడు.


శ్రీ హనుమద్భాగవతము (44)



వీరవరులగు వాలి సుగ్రీవుల పరస్పర ప్రేమ వృత్తాంతము అంతట ప్రసిద్ధి చెందియుండేది. వారిరువురు ఎంతో సుఖముగా జీవితమును గడుపేవారు. దైవనిర్ణయము అనుల్లంఘనీయము గదా! వారిరువురూ తమ సహజప్రేమను మరచి ఒకరినొకరు చంపుకొను స్థితికి దైవము వారిని తీసుకుని వెళ్ళింది. దాని వలన వారు పరస్పరము రక్త పిపాసులైయ్యారు.


అపుడు మయునిపుత్రుడైన 'మాయావి' యను దానవుడు గర్వముచే ఉన్మత్తుడై తనతో సాటివచ్చే వీరుని సాటివచ్చువీరుని (ప్రతిభటుని) వెదకుచు తిరుగుచుండేవాడు. ఒక నాటి విషయం. అర్థరాత్రి సమయంలో బలవంతుడైన ఆ అసురుడు కిష్కింధా పురపు పొలిమేరలలోనికి వచ్చి వాలిని సవాలు చేస్తూ భయంకరంగా గర్జిస్తున్నాడు.


పరాక్రమశాలి యైన వాలి శత్రువు పిలుపును వినినంతనె వానిని చంపుటకు ఎల్లప్పుడును సిద్ధముగానే ఉంటాడు. ఆయన గాఢనిద్రలో ఉన్నాడు. అయినా అసురుని సవాలు వినబడినంతనె ప్రక్కనుండి లేచి వెంటనే పరుగెత్తాడు. శత్రువు ఎదుటకు వెళుతున్న అన్నను చూసి సుగ్రీవుడు కూడా ఆయన వెంట వెళ్ళాడు. అలా వాలిసుగ్రీవులిరువురూ రావడం చూసి మాయావి భీతి చెంది వేగంగా పరుగెత్తాడు. సోదరులిరువురు వానిని వెంబడించారు.


చాలా దూరము వెళ్ళిన పిమ్మట గడ్డిగాదముతో గప్పబడి ఉన్న ఒక విశాలబిలాన్ని అతడు చూసీ, వెంటనే దానిలో ప్రవేశించాడు. క్రోధోన్మత్తుడైన వాలి సుగ్రీవుని ఆ బిలద్వారము దగ్గర సావధానముగా ఉండమని చెప్పి తాను లోనికి ప్రవేశించాడు.

Monday, 4 October 2021

మాసికాలు, పిండ ప్రదానాల రహస్యాలు



చనిపోయిన తరువాత జీవుడు ఏమవుతాడు? మనం పెట్టే పిండాలు వారికి ఎలా చేరుతాయి? దేవతగా ప్రేత ఎలా మారుతుంది? 


వీటికి సమాధానం ఒక ఉపనిషత్తు చెబుతోంది. 


ఆ ఉపనిషత్తు పేరు పిండోపనిషత్తు. ఇది అథర్వణ వేదశాఖకు చెందినది. ఈ వేదం ఎక్కువగా కర్మయోగానికి చెందినది. ఇందులో నిత్యనైమిత్తికకామ్య యజ్ఞాలు ఎలా చేయాలో ఎక్కువగా ఉంటుంది. దీనికి చెందిన ఈ ఉపనిషత్తులో ఈ రహస్యాలు చెప్పారు.


బ్రహ్మదేవుణ్ణి దేవతలు, మహర్షులు “మృతులకు సమర్పించిన పిండాలను వారు ఏవిధంగా స్వీకరిస్తారు?”అని అడగగా బ్రహ్మ “దేహం”, “దేహి”గురించి ఇలా చెప్పాడు.


 “మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచీ పంచభూతాలూ విడిపోతాయి.”

”ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది”

”ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచీ వెళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళిపోతాయి.”


”ముందుగా గాలి వెళిపోతుంది (ఊపిరి తీసుకోవడం). దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని తొమ్మిది రంధ్రాల నుంచీ కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచీ తప్పుకున్నాయో భూతత్త్వం అయిన ధాతువులు ఎముకలు వెంట్రుకలు గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళిపోయే విధానం.”


నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతీ ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి.


కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం  మరో శరీరం వెతుక్కుంటూ వెళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది.

యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది.


ప్రేత ముందు పదిరోజులూ తన ఇల్లూ, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది.


దీని తరువాత పదోరోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది పదిరోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళిపోతుంది.


అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకూ ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది.


సపిండికరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి తాత ముత్తాతల్లో ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని, తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతాస్థానం పొందుతుంది.


దీనికి కావలసిన క్రొత్త శరీరం మాసికాల ద్వారా చేసే ఏకోద్దిష్టశ్రాద్ధాల రూపంలో అందుతుంది. నిన్నటి బాహ్యశరీరాన్ని విడిచి కారణశరీరం, యాతనా శరీరం కోల్పోయి ప్రేతగా ఏ శరీరం లేకుండా ఉన్న మృతుడు మాసికాలలో కేవలం తనకు మాత్రమే ఉద్దేశించి వదిలే పిండాల ద్వారా క్రొత్త శరీరం సంతరించుకుంటాడు.


వీటిలో మొదటి పిండం  ద్వారా క్రొత్త శరీరానికి బీజం పడుతుంది. దీన్నే కలనం అన్నారు.

దీని తరువాత మాంసం చర్మం రెండో పిండం ద్వారా ఏర్పడతాయి.

మూడో పిండం వలన బుద్ధి కలుగుతుంది. (మెదడు)

నాలుగో పిండం వలన ఎముకలు, ఎముకల్లోని గుజ్జు ఏర్పడతాయి.

ఐదో పిండం వలన శిరస్సు, ముఖం, వేళ్ళు ఏర్పడతాయి.

ఆరో పిండం వలన హృదయం, మెడ, నోటిలోని భాగాలు  ఏర్పడతాయి.

ఆయుప్రమాణం ఏడో పిండం ద్వారా కలుగుతుంది.

ఎనిమిదో పిండం ద్వారా మాటకు చెందిన వ్యవస్థలు కలుగుతాయి.

తొమ్మిదో పిండం ద్వారా అన్ని అవయవాలకు పరిపుష్టి చేకూరి దృఢపడతాయి.

పదో పిండం వలన క్రొత్త జీవితానికి అవసరమైన శారీరక పరిపూర్ణత చేకూరుతుంది.

ఈ విధంగా మాసికాలలోని పిండదానం వలన పిండశరీరం నుంచీ సంపూర్తి శరీరం పిండాల వలన కలుగుతుంది.


నిజానికి మొత్తం 16 పిండాలు ఈ సంవత్సర కాలంలో ఇస్తారు. వీటిలో 10 పిండాల గురించి మృతుడు క్రొత్త శరీరాలు పొందడానికి దోహదం చేసే ఆహారంగా ఉపయోగిస్తాయని పిండోపనిషత్తు చెప్పింది, మిగిలిన పిండాల గురించి గరుడపురాణంతో పాటు అనేక పురాణాలు చెబుతున్నాయి.

అంతేకాక మృతుని శరీరం నుంచీ పంచభూతాలు ఏవిధంగా దూరం అవుతాయో అదే విధంగా తిరిగి వారికి భౌతిక శరీరం ఏర్పడడానికి పంచభూతాలూ కలుస్తాయి.

ముందుగా జీవికి ఆస్తిక్యం ఇవ్వడానికి కారణం అయిన ఆకాశం అతనికి స్థలం ఇస్తుంది. ఆ తరువాత అగ్ని, జలం, వాయువు, భూమి తత్త్త్వాలు అతనికి శరీరం కల్పిస్తాయని ఉపనిషత్తు చెబుతోంది. 

కనుక మృతులకు మాసికాలు అన్నీ పెట్టవలసిందే. మాసికాలకు ప్రత్యామ్నాయం లేదు.

ఏది వదిలితే, అది ఎన్నో పిండమైతే ఆ దశలో ఏర్పడాల్సినవి ఏర్పడక మృతునికి వైలక్యం కలుగుతుంది.

సపిండీకరణం చేయకపోతే పితృదేవతా రూపం రాదు.

కనుక మధ్యమ క్రియలైన మాసికాదులు చేయడం చనిపోయిన వారికి మాత్రమే కాదు, కర్తకు కూడా లాభం చేకూర్చేది. తనకు దుర్గతి రాకుండా మంచి మార్గం వేసుకోవడం వంటిది.

ఇవి మన పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్న విశేషాలు.

పిండాలు ప్రేతాలకు వెళతాయా? అని వితండవాదం చేసే వారికి సమాధానమే ఈ పిండోపనిషత్తు. 

నిజానికి ఉపనిషత్తులు అన్నీ రహస్యాల సమూహాలు. అవి పైకి ఒక అర్ధంలో కనిపించే సామాన్యపదాలుగా కనిపించినా వాటి వెనుక కేవలం మహాసాధకులకు మాత్రమే తెలిసే అనేక రహస్యాలు ఉంటాయి.*

వాటిని కేవలం సాధకులు, పరిశ్రమ చేసిన విజ్ఞులు మాత్రమే అందుకోగలుగుతారు. వీటిని వారు అందరికీ చెప్పరు. కేవలం “పిండదానాలు చేయండి”అని మాత్రమే చెబుతారు. తమ పెద్దలకు నమస్కరించుకొని స్వధానామసాధన చేసి, స్వధా స్తోత్రం, పితృస్తోత్రం పఠించుకొని ఆవుకు ఒకరోజు గ్రాసం  వేయడం వలన కూడా ఉత్తమ పుణ్యసంపదలు ఉన్న చోటు నుంచే పొందవచ్చు.

Sunday, 3 October 2021

వంశాచారాన్ని కొనసాగించడమే పితరులకు ఇచ్చే అత్యున్నతమైన గౌరవం



వంశాచారాన్ని కొనసాగించడమే పితరులకు ఇచ్చే అత్యున్నతమైన గౌరవం


అనాదిగా కుటుంబంలోని పెద్దలు పాటిస్తూ వస్తున్న ఆచారాలను ఖచ్చితంగా కొనసాగించాలి. కుటుంబ పెద్దలు కులదేవత (ఇంటిదేవుడు అని కూడా వ్యవహరిస్తారు) గా తరతరాలు ఎవరిని పూజిస్తూ వస్తున్నారో వారిని తప్పక అర్చించాలి. వారు ఆరాధించిన పద్ధతిలోనే పూజించాలి. అందులో మార్పులు చేయడం గానీ, వదిలేయ్యడం గానీ చేయగూడదు. ఒకవేళ కులదేవత తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోవాలి. ఆరాధన పద్ధతిని తర్వాతి తరాలకు అందించాలి. అలాగే గ్రామదేవత యొక్క ఆరాధన కూడా. తరతరాలుగా మన పెద్దలు కొనసాగిస్తూ వస్తున్న ఆచారాలను విడిచిపెడితే వారి కోపానికి గురికావల్సి వస్తుంది, పితృశాపం తలుగుతుంది.


మతం మారితే మొత్తం వంశాచారం నాశనమవుతుంది. అది ఒక్కటే కాదు, కొత్తగా పుట్టుకొచ్చిన గురువులు చెప్పిన మాటలు విని, ఈ ఆచారాలు ఆరాధన పద్ధతులెందుకు? ఇవన్నీ అవసరం లేదు, ధ్యానం చేస్తే చాలు, బాహ్యంలో దీపం వెలిగించుట ఎందుకు? లోపల దీపం వెలిగించాలిగానీ ... లాంటి పిచ్చి మాటలను పట్టుకుని మీ పూర్వీకులు పాటిస్తూ వస్తున్న ఆచారాలను వదిలిపెడితే ఆ వంశం నశిస్తుంది. ఇక మన ధర్మంలోనే అనేక సంప్రదాయాలు. కొందరు శివుడిని పూజించరు, కొందరు విష్ణువును పూజించరు. కొత్తగా ఆ సంప్రదాయాల్లో చేరి మీ కులదేవతను విడిచిపెడితే, మీరు ఇప్పుడు పూజించే దేవుడు కూడా మిమ్మల్ని రక్షించడు. మీ వంశాన్ని ఏ గురువులు కాపాడలేరు. అనేక కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. 


నేను చాలామందిని చూసాను. ఇలవేల్పు విష్ణువు ఉంటాడు, కానీ ఇష్టదైవం శివుడు. శివుడిని పూజించవద్దు అనలేదు గానీ ఇలవేల్పును కూడా ఆరాధించాలి. కానీ ఆరాధించరు. అదేమిటంటే శివుడే చూసుకుంటాడు అంటారు. కులదైవం శివుడుగా గలిగిన విష్ణుభక్తులు కూడా ఇలాగే అంటారు. నాకు ఇష్టంలేదు అంటారు. నారాయణుడే కాపాడతారు అంటారు. మరి కష్టాలు వచ్చినా, కులదేవతను విడిచిపెట్టినందుకు మీ ఇష్టదేవతయే కష్టం కలిగించిందని అంగీకరించే ధైర్యం మీకుందా?

బహుసా మీ వంశస్థులంతా ఆ దేవతను పూజిస్తామని మీ పూర్వీకులు ప్రమాణం చేశారేమో ! లేదా ఎప్పుడైనా ఆపదలో ఆ దేవత మీ వంశాన్ని కాపాడిందేమో లేదా కాపాడుతానని ప్రమాణం చేసిందో! 

పూర్వీకులు ఏర్పరిచిన వంశాచారాన్ని పాటించమని చెప్పేవారే, మీతో పాటింపజేసేవారే నిజమైన గురువులు. ఇవన్నీ అక్కర్లేదని చెప్పేవారు అసలు గురువులు కానేకారు.

Saturday, 2 October 2021

శ్రీ హనుమద్భాగవతము (43)



మంత్రులు తండ్రి మరణానంతరము జ్యేష్ఠుడగుట వలన వాలిని వానర రాజ్యమునకు రాజుగా జేసిరి. అతడు సర్వవానర జాతికి మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యెను. అంతేకాక తన ప్రజలను అతడు పుత్రరూపముగా ప్రేమించుచుండెవాడు. ఇట్లా వాలి విశాలమగు కిష్కింధా రాజ్యమును పాలించుచుండగా సుగ్రీవుడు శ్రద్ధాసక్తులతోను వినయవిధేయతలతోను దాసునివలె తన అన్నను సేవించుచుండెవాడు.


వానరరాజైన కేసరి అంజనా దేవి ఇరువురు తమ పుత్రుడైన హనుమానుని వైరాగ్యమును, ఏకాంత ప్రియత్వమును చూసి మిక్కిలిగా చింతిఁపసాగారు. కేసరి వానరయూథపతి, ఋక్ష రాజునకు పరమమిత్రుడై ఉన్నవాడు, అందువలన అతడు హనుమంతుని రాజనీతికోవిదునిగా చేయదలచి పంపాపురానికి పంప నిశ్చయించుకున్నారు. మాతాపితృభక్తుడైన హనుమంతుడు తల్లిదండ్రుల ఆదేశముననుసరించి వారి చరణములకు నమస్కరించి ఆశీస్సుల పొంది పంపాపురమునకు ప్రయాణ మయ్యాడు.


పవనకుమారుడు పంపానగరమునకు వచ్చుచున్నాడనే వార్త వినినంతనె సుగ్రీవుడు ఎదురేగి అతనికి స్వాగతమిచ్చాడు. దేవదుర్లభములైన అతని గుణములు తెలుసుకుని ఉండుటచే వాలి కూడా అతనిని ఎక్కువగా గౌరవించి ఆదరముతో తన దగ్గర ఉంచుకొన్నాడు. హనుమంతుడు విద్వాంసుడు, బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు, సదాచారపరాయణుడు, సరళత్వము మూర్తీభవించినవాడు, అందువలన వాలి వానిని తన కాంతరంగికునిగా చేసుకున్నాడు. కాని విద్యావారిధియైన కేసరీనందనుడు తన గురు దక్షిణ విషయము ఎప్పుడూ మరువలేదు. అందువలన ఆయన సుగ్రీవునకు అభిన్నమిత్రుడయ్యాడు. సుగ్రీవునకు కూడా ఇతనిపై అతీశయమైన ప్రేమయుండెను.


వజ్రకాయుడైన హనుమంతుడు పంపాపురమునకు వెళ్ళినప్పుడు ఆ పురమునకు నలువైపుల రాక్షసరాజ్యములు ఉన్నాయి. ఒక వైపున శక్తిశాలురైన ఖరదూషణాదుల రాజ్యము, రెండవవైపు దేవద్విజద్రోహియైన రావణుని నిష్కంటక రాజ్యము ఉండేది. వానర రాజైన వాలి సాటిలేని వీరుడు, యోధుడు. అందువలన అసురులందఱు అతనిని చూసి భయపడుచుండేవారు. వారు అతని రాజ్యమున అల్లకల్లోల సృష్టించుటకు సాహసింప లేక పోవుచున్నారు. కాని రాక్షసుల దౌష్ట్యమును ఎఱిగి ఉన్న వాడగుటచే వాలి నిశ్చింతగా దుష్టశిక్షణకై ఎక్కడికిని దూరము వెడలెడివాడు కాడు. హనుమంతుడు పంపాపురమునకు వచ్చిన పిమ్మట అతని చింత దాదాపుగా దూరమయ్యింది. అంజనా దేవి అలౌకికుడైన తన పుత్రునకు రాక్షసులను గూర్చిన కథల నెన్నింటినో చెప్పినది. అందువలన బాల్యము నుండియే హనుమంతునకు రాక్షసులన్న కోపము ఎక్కువగా ఉండేది. అతని దృష్టిలో బడిన ఏ రాక్షసుడు కూడా క్షేమముగా బ్రతికి బయటపడుట అసంభవమే. ఆయన వెదకి వెదకి రాక్షసుల ప్రాణములను తీయు చుండేవాడు. అతని పేరు చెప్పినంతనే రాక్షసులు వణకిపోవుచుండేవారు. హనుమంతుని సరళత్వమును, సాధుత్వమును, సాటిలేనివాని వీరత్వమును, ధైర్యమును, పరాక్రమమును చూసి వాలి చకితుడగుచుండేవాడు.

Friday, 1 October 2021

శ్రీ హనుమద్భాగవతము (42)



వాలి తన సోదరుడైన సుగ్రీవుని పై కత్తి గట్టి యున్నాడు. భయాక్రాంతుడైన సుగ్రీవుడు ఋష్యమూక పర్వతముపై నివసించుచున్నాడు. అందువలన నీవు ఋష్యమూక పర్వతము మీదకు వేళ్ళి సుగ్రీవునితో సఖ్యము చేసుకో. నేను ఆ ప్రక్కన నివసించే మారీచుని, సుబాహుని, తాటకిని ఉద్ధరించి కొద్ది దినములలోనే దండకారణ్యములో ఖరదూషణులు, త్రిశిరుడు, శూర్పణఖవంటి కంటక ప్రాయులను తొలగించుచు ఋష్యమూకము వైపునకు వస్తాను. అచట నీవు నాతో సుగ్రీవుని కలుపు, వానర సైన్యముల ద్వారా నా అవతార కార్యమున సహాయపడు.”


హనుమంతుడు తన ప్రభువును వీడుటకు ఇష్టపడుట లేదు, అయినను ప్రభువాజ్ఞను పాలించుటయే ముఖ్యకర్తవ్యము. ఆయన శ్రీరాముని చరణములకు ప్రణమిల్లి, కళ్యాణమయములైన ఆయన మధుర నామములను జపించుచు ఋష్యమూక పర్వతమునకు బయలు దేరాడు.


సుగ్రీవ సచివుడు


ఋక్షరాజగు వానరునకు వాలి సుగ్రీవులను ఇరువురు పుత్రులున్నారు.* 


* వానరేంద్రం మహేన్రాభమింద్రో వాలినమాత్మజమ్ 

సుగ్రీవం జనయామాస తపన స్తపతాం వరః 


దేవతలకు రాజైన ఇంద్రుడు వానర రాజైన వాలిని పుత్రరూపమున కన్నాడు, అతడు మహేంద్రపర్వతమువలె విశాలకాయుడు, బలిష్ఠుడు. తపించువారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు సుగ్రీవుని కన్నాడు (వా.రా.1-17-10) 



తండ్రి తనకుమారులిరువురిని ఒకేవిధముగా ప్రేమింస్తుండేవాడు. బాలులు ఇద్దరు గొప్ప వీరులు, ధీరులు, బలవంతులు, బుద్ధిమంతులు, సుందరులు. వారి అన్యోన్యము ప్రేమ కలిగియుంన్నారు. వాలి సుగ్రీవుని ప్రాణములతో సమానముగా ప్రేమిస్తాడు. సుగ్రీవుడు వాలిపై తండ్రివలె శ్రద్ధాభక్తులు చూపేవాడు. సోదరులిద్దరూ భోజనశయనక్రీడాదులను ఒకే విధంగా నిర్వహించుచుండేవారు. వారెప్పుడూ కలిసియే ఉండేవారు.