Sunday, 7 November 2021

శ్రీ హనుమద్భాగవతము (69)



ఇట్లా యువరాజైన అంగదునకు ధైర్యము చెప్పిన తర్వాత మహాపరాక్రమశాలీ, రామదూత అయిన హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు మొదలైన వానరులతో కలిసి సీతా దేవిని అన్వేషిస్తూ మెల్లమెల్లగా దక్షిణ సముద్ర తటముపై గల మహేంద్రపర్వతము యొక్క లోయలోనికి చేరుకొన్నాడు. అచట ఎదురుగా అగాథమైన హద్దులేని మహాసాగరంలో భయంకరమైన అలలను చూసి వానరులు భల్లూకములు భయపడిపోయారు. సీతాన్వేషణార్థమై సుగ్రీవుడు ఇచ్చిన ఒక మాసము గడువు కూడా పూర్తి అయ్యింది. ఎదుట మహాసముద్రము. వీరులైన వానర భల్లూకముల బుద్ధి పనిచేయడం ఆగిపోయింది. అందువలన వానరరాజైన సుగ్రీవుని కఠోర దండనమును గురించి ఆలోచించి వారు ఇలా పలికారు.


"రాజైన సుగ్రీవుడు. దుర్దండుడు. ఆయన తప్పక మనలను చంపగలడు. సుగ్రీవుని చేతిలో మరణించుట కంటే ప్రాయోపవేశనమునందే (అన్నమును, నీటిని వదలి మరణించుటయందే) మనకు శ్రేయస్సు ఉన్నది" అని నిర్ణయించుకొని వారందఱు దర్భలను పఱచుకొని మరణింపదలచి అక్కడే కూర్చున్నారు.


వానరుల కోలాహలమును విని గృధ్రరాజయైన సంపాతి వింధ్యగిరికందరము నుండి బయటకు వచ్చి అన్న పానీయములను వదలి మరణించుటకు నిశ్చయించి కుశాసనములపై కూర్చుని ఉ వానర భల్లూకములను చూసి హర్షాతిరేకముతో ఇలా పలికాడు :


విధిః కిల నరం లోకే విధానేనానువర్తతే | 

యధాయం విహితో భక్ష్యశ్చిరాన్మహ్యముపాగతః ||

పరంపరాణాం భక్షిష్యే వానరాణాం మృతం మృతమ్ |


(వా. రా. 4-56-4-5) 


లోకంలో పూర్వజన్మకర్మఅను అనుసరించి మానవునకు తాను చేసుకొన్న ఫలము లభించినట్లు నేడు దీర్ఘ కాలానంతరము ఈ భోజనము నాకు దానియంతటదే లభించినది. ఇది నేను చేసుకొన్న కర్మఫలమై ఉండవచ్చు. ఈ వానరులలో ఎవరెవరు చనిపోతారో వారిని నేను క్రమంగా భక్షిస్తాను.


Saturday, 6 November 2021

శ్రీ హనుమద్భాగవతము (68)



మనము అమరావతీపురము (స్వర్ఘము) లోని సుఖసామగ్రులతో కూడి ఉన్న ఈ గుహలోనే సుఖంగా ఉండగలము.

వానరులు మెల్లగా చెప్పిన మాటలు విని పరమనీతిజ్ఞుడైన పవననందనుడు యువరాజునకు ధైర్యము చెబుతూ ఎంతో ప్రేమతో ఇలా పలికాడు : 'యువరాజా ! నీవు వ్యర్థముగా ఎందుకు చింతిస్తున్నావు? నీవు మహారాణియైన తారకు ప్రాణప్రియ పుత్రుడవగుటవలన సుగ్రీవునకు కూడా సహజముగానే ఇష్టుడవై ఉన్నావు. నీయందు శ్రీ రాఘవేంద్రునకు ప్రేమ ప్రతి దినము లక్ష్మణుని పై కంటెను అధికమవుతున్నది. వానరులు నిన్నీ గుహలో నిష్కంటకముగా ఉండమని పలికారు. కాని అదివ్యర్థము. ఎందుకనగా ముల్లోకములలో ఏ లక్ష్యము కూడా శ్రీరాముని బాణములచే అభేద్యముకాదు. భార్యాపుత్రులను ఎప్పుడును ఎడబాయని ఈ వానరులు నీకు తగిన సలహా ఇవ్వడం లేదు”.


పవనపుత్రుడు ఎంతో ప్రేమతో అంగదునకు నచ్చ చెబుతూ ఇంకా ఇలా పలికాడు :- "కుమారా ! ఇంతేకాదు నేను నీకొకరహస్యాన్ని చెబుతున్నాను. శ్రద్ధగా వినుము. శ్రీరామచంద్రుడు సామాన్యమానవుడు కాడు. ఆయన సాక్షాత్తుగా నిర్వికారుడైన శ్రీనారాయణుడు. సీతా దేవి జగన్మోహినియైన మాయ. లక్ష్మణుడు త్రిభువనధారుడైన సాక్షాత్తు ఆది శేషువే. వారందఱు 'బ్రహ్మదేవుని ప్రార్థనను అనుసరించి రాక్షస వినాశమునకై మాయామానవరూపమున జన్మించారు. ఒక్కొక్కరు ముల్లోకములను రక్షింపసమర్థులు. 


అన్యద్గుహ్యతమం వశేష్యే రహస్యం శ్రుణు మే సుత| 

రామో న మానుషో దేవః సాక్షాన్నారాయణేఽవ్యయః || 

సీతా భగవతీ మాయా జనసమ్మోహకారిణీ | 

లక్ష్మణో భువనాధారః సాక్షాచ్ఛేషః ఫణీశ్వరః ||

బ్రాహ్మణా ప్రార్థితాస్సర్వే రహోగణవినాశనే | 

మాయామానుషభావేన జాతా లోకైకరక్షకాః ||


(వా. రా. 4–7–16-18) 


మనము పరమప్రభువు లీలా కార్యంలో కారణంగా ఉండటమే అదృష్టం.


Friday, 5 November 2021

శ్రీ హనుమద్భాగవతము (67)



సంపాతిద్వారా సీతాదేవి జాడను తెలుసుకొనుట


వాసరభల్లూక వీరులు మరల సీతాన్వేషణార్థమై బయలు దేరారు. అధికశ్రమతో వెతికినా రావణుని జాడగాని, సీతా దేవి జాడగాని తెలియరాలేదు. అలసిన వానరభల్లూక వీరులు కూర్చుని 'ఇక ఏమి చేయాలని పరస్పరం ఆలోచించ సాగారు. అపుడు మరల దుఃఖతుడై అంగదుడు ఇట్లా పలికాడు - ఈ గుహలో తిరుగుట మొదలై దాదాపు ఒక మాసము గడచినది. సుగ్రీవుడు చెప్పిన గడువు గడచిపోయినది. సీతాదేవి జాడ తెలియరాలేదు. ఇక ఇపుడు కిష్కంధకు తిరిగి వెళితే మనకు చావు తప్పదు. నన్ను ఆయన విడువడు, నేను ఆయన శత్రువునకు పుత్రుడను గదా ! అందువలన తప్పక చంపగలడు. నన్ను ధర్మాత్ముడు, వీరవరుడైన శ్రీరాముడు కాపాడినాడు. ఇపుడు ప్రభువుకార్యము నెరవేర్చలేదనే నెపముతో ఆయన నన్ను ప్రాణములతో విడువడు. అందువలన నేను తిరిగి వెళ్ళను. ఏదో ఒక విధముగా ఇచట ప్రాణములను విడుస్తాను.”


ఇట్లా అశ్రునయనములతో యువరాజైన అంగదుడు విలపించుట చూసు వానరులు చాలా బాధపడ్డారు. సానుభూతితో వారు అంగదునితో ఇలా పలికారు - “నీవు చింతింపవలదు. మేము మా ప్రాణములను ఇచ్చి అయినా సరే నీ ప్రాణములను కాపాడుతాము.

Thursday, 4 November 2021

శ్రీ హనుమద్భాగవతము (66)



తపః పూతయైన ఆ యోగిని హనుమంతునితో ఇట్లా పలికింది - 'నేను చాలా ధన్యురాలను. తపస్సు ఫలించినది, నా ఆనందమునకు అవధులు లేవు. పూర్తిగా శంకారాహితులై మీరు మొదట యథేచ్ఛగా మధురఫలములను భుజించండి. అమృతమయమైన జలమును త్రాగండి, తృప్తులై నా సమీపమున కూర్చుని విశ్రాంతి తీసుకోండి. అప్పుడు మీకు నా వృత్తాంతమును చెబుతాను.


హనుమంతుడు వానరులతో కలిసి మధుర ఫలముల భక్షించి, శీతలజలమును త్రాగి తృప్తులు ప్రసన్నులయ్యారు. తర్వాత వారు యోగిని దగ్గఱకు వెళ్ళి చాలా వినయముగా  కూర్చున్నారు. 


భక్తురాలైన ఆ యోగిని వానరసహితుడైన హనుమంతునితో ఇలా చెప్పసాగింది- 'పూర్వకాలమునాటి విషయము, విశ్వకర్మకు హేమ అనే ఒక లావణ్యవతి యైన పుత్రిక ఉండింది. ఆమె అద్భుత నృత్యమునకు సంతుష్టుడై శివుడు దివ్యము, విశాలము అయిన ఈ నగరం ఆమెకు నివసించుటకై ఇచ్చాడు. ఇచట ఆమె వేలకొలది సంవత్సరములు నివసించింది. ఆమె నాకు ప్రాణసఖి, బ్రహ్మలోకమునకు వెళుతూ ఆమె నన్ను నిజమైన ముముక్షురాలనీ, క్షీరాబ్ధి శాయి మహావిష్ణువును ఉపాసించు దానిని అని తెలుసుకుని ప్రేమ పూర్వకముగా నాతో నీవీ ఏకాంతము శాంతమైన స్థానంలో ఉండి తపస్సు చేసుకో. త్రేతాయుగంలో స్వయముగా నారాయణుడు భూభారహరణార్థమై అయోధ్యాధిపతి యైన దశరథునకు ఆయన ధర్మపత్నియైన కౌసల్యకు పుత్రరూపమున జన్మిస్తాడు. ఆయన ధర్మసంస్థాపనమునకు, దుష్టవినాశమునకు వనంలో సంచరిస్తాడు. ఆయన యొక్క భార్యను అన్వేషిస్తూ కొందఱు వానరులు ఈ గుహలో నున్న నీ దగ్గరకు వస్తారు. నీవు భక్ష్య భోజ్యములతోను, మధుర ఫలములతోను వారికి స్వాగతమిచ్చి పరమప్రభువైన ఆ శ్రీ రాముని దగ్గరకు వెళ్ళు. ఆయనను దర్శించి, ప్రేమపూర్వకముగ ప్రార్థించు. ఆయన దయచే యోగులకు దుర్లభమైన విష్నుధామానికి వెళ్ళగలవు."


కృతజ్ఞతాపూర్వకముగా హనుమంతుని చుస్తూ ఆమె మఱల ఇలా పలికినది- “నేను దివ్యుడనే గంధర్వుని పుత్రికను. నా పేరు స్వయంప్రభ. నేడి ఇచట మీ పవిత్రచరణములు సోకటంతో నా భాగ్య భానుడు ఉదయించినాడు. ఇపుడు నేను భగవానుడైన శ్రీరాముని దర్శనమునకై తహతహలాడుతున్నాను. మీరు మీమీ నేత్రములను మూసుకొనండి, వెంటనే ఈ గుహ నుండి బయటకు వెళ్ళగలరు. సీతా దేవిని దర్శించగలరు. నిరాశ చెందవలదు. ”


స్వయం ప్రభ ఆదేశమును అనుసరించి భల్లూక వానరులందఱు నేత్రములను మూసుకొనగా వెంటనే వారు గుహకు బయటగల అరణ్యములోనికి వెళ్ళారు.

Wednesday, 3 November 2021

శ్రీ హనుమద్భాగవతము (65)



కొద్దిదూరము వఱకు గాఢాంధకారము వ్యాపించి ఉండింది, కాని ముందుకు వెళ్ళగానే వారికి నిర్మలమైన జలముతో నిండిన సరోవరము సాల తాల తమాల, నాగ కేసర, అశోక, చంపక, నాగవృక్షములు, పుష్పములతోను, మధురమైన ఫలములతోను కూడియున్న వృక్షములు కనబడ్డాయి. ఇంతేకాక అక్కడ వారు అద్భుతమైన వస్త్రాలంకారములతో కూడి ఎంతో సుందరమైన ఒక భవనమును కూడా చూశారు. ఆ భవనమున దివ్యములైన భక్ష్యభోజ్యాది సామగ్రులన్నీ అమర్చబడి ఉన్నాయి. అక్కడ స్వర్ణ సింహాసనముపై , లావణ్యమయి అయిన ఒక రమణి (స్త్రీ) కూర్చుని ఉంది. ఆమె వల్కలములను, కృష్ణమృగచర్మమును ధరించి ధ్యానమగ్నమై ఉంది. ఆమెను చూసి ఆవానరులు ఒకరి ముఖము ఒకరు చూసుకొనసాగారు. ధ్యానమగ్నురాలైన ఆ యోగిని శరీరము నుండి తేజస్సు ప్రసరితమవుతోంది. భయాక్రాంతులైన వానరులు ఎంతో శ్రద్ధతో ఆమె చరణములకు ప్రణమిల్లారు.


తనకు నమస్కరించిన ఆ వానరులను చూసి యా యోగిని శాంతచిత్తముతో మధుర వాక్కులతో ఇట్లా అడిగింది -'మీ రెచటినుండి వచ్చారు? మీరెవరు? ఏ ఉదేశ్యముతో దుర్గమములైన ఈ ప్రదేశములలో విహరిస్తున్నారు? నా ఈప్రదేశాన్ని మీరెందుకు పాడుజేస్తున్నారు?'


విశాలకాయుడైన హనుమానుడు వినయముతో ఆమెకు ఇట్లా ప్రత్యుత్తరమిచ్చాడు - ఆదరణీయురాలైన ఓ దేవి! అయోధ్యాధిపతి అయిన దశరథుని పుత్రుడైన శ్రీరాముడు తన తండ్రి ఆజ్ఞననుసరించి ధర్మపత్ని అయిన జానకీ దేవితోనూ, సోదరుడైన లక్ష్మణునితోనూ కలిసి వనవాసమునకు బయలుదేరాడు. అక్కడ పరమసాధ్వియైన సీతను లంకాధిపతియైన రావణుడు హరించినాడు. శ్రీరామునితో స్నేహము చేసి యుండుటవలన సుగ్రీవుడు మమ్మల్ని జానకీ దేవిని వెదకుటకై పంపినాడు. ఆ శుభ కార్యమునకై మేము ఇటువచ్చాము. ఆకలిదప్పికలచే కలత జెందిన మేమీ పవిత్రమైన గుహలోనికి ప్రవేశించాము - ' దేవీ ! నీవెవరు ? దయయుంచి ఈ విషయమును మాకు చెప్పూ అని అడిగాడు.

Tuesday, 2 November 2021

దీపావళి - దివిటీలు - పితృ ఆరాధన




దీపావళి అమావాస్యలో లక్ష్మీపూజ ఎంత ముఖ్యమో పితృదేవతా స్మరణ కూడా అంతే ముఖ్యం. అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించిన తిథి. సంక్రాంతికి కూడా పితృదేవతలతో సంబంధం వుంది. అందునా ఇది దక్షిణాయనం, అంటే పితృదేవతల కాలం. 


పితృ ఆరాధన అంటే అశుభం అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం. పితృదేవతల అనుగ్రహం లేకుండా కుటుంబంలో శుభకార్యాలు జరగవు. కనుక ప్రతి శుభకార్యానికి ముందు వారిని స్మరించాలి. పెళ్ళిలో కూడా ముందుగా నాందీ శ్రాద్ధం అని క్రతువు ఉంటుంది. అందులో పెళ్ళికి పితరులను ఆహ్వానిస్తారు. కనుక పితృకర్మలు అశుభం అనే అపోహను హిందువులు వీడాలి.


దీపావళి నాడు పితృదేవతలకు తర్పణాలు తప్పకుండా వదలాలి. 

తర్పణాలు ఎవరైనా వదలవచ్చా అని అడుగుతున్నారు. తర్పణాలు కేవలం తల్లిదండ్రులు లేనివారు మాత్రమే వదలాలి. మిగితవారు పితృదేవతలను మనఃస్ఫూర్తిగా స్మరించాలి.

దీపావళి సాయంకాలం పితృదేవతల ప్రీత్యర్ధమై దివిటీలను వెలిగించి చూపించే ఆచారముంది. దీన్ని దివిటీలి కొట్టడమంటారు. కొన్ని ప్రాంతాల్లో కర్రలకు, కొన్ని చోట్ల గోంగూర కాడలకు వస్త్రం చుట్టి నూనెతో వెలిగించి వెలిగించి చూపించాలి. ఇది పితృదేవతలకు ప్రీతిని కలిగిస్తుంది. కాకరపువ్వొత్తులు కాల్చామా, చిచ్చుబుడ్డీలు కాల్చామా అన్నది ప్రధానం కాదు, దీపావళి నాడు దివిటీలు వెలిగించామా లేదా అన్నది ప్రధానం. ఈ దివిటీలను కూడా పురుషులే కొట్టాలని, స్త్రీలు పక్కన నిల్చుని చూడాలని నండూరి శ్రీనివాస్ గారి విడియోలో చూశాను.


అలాగే దీపావళి పండుగ రోజు సూర్యోదయవేళ కూడా దీపాలు వెలిగించి ఇంటి ముంగిట పెట్టాలి. మా చిన్నప్పుడు మా పెద్దలు ఇంట్లో ఇలా చేయడం మేము చూసాము. కార్తీకమాసంలో కూడా ఇప్పుడు అందరూ సాయంకాల వెళ మాత్రమే కార్తీకదీపాలు వెలిగిస్తున్నారు గానీ ఈ నరకచతుర్దశి మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రతి రోజు ఉదయం వేకువఝామునే దీపాలను వెలిగించి ఇంటి గడపల వద్ద, తులసిచెట్టు వద్ద పెట్టాలి.


నరకచతుర్దశి సాయంకాల వేళ కాళీమాతను, దీపావళి అమావాస్య సాయంకాలం వేళ మహాలక్ష్మీని పూజించాలి. 


వీటి గురించి అనేక విషయాలను తెలుసుకొనుటకు శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, చాగంటి కోటేశ్వర రావు గారు, నండూరి శ్రీనివాస్ గార్ల ప్రవచనాలను వినవచ్చు.

Monday, 1 November 2021

శ్రీ హనుమద్భాగవతము (64)



ఇట్లు పవనకుమారుని గుణములను కీర్తిస్తూ సర్వ వానరులను సీతాన్వేషణార్థమై ఆదేశించి సుగ్రీవుడు శ్రీ రాముని సమీపమున కూర్చున్నాడు. వీరులైన వానరులు, భల్లూకములు కమలనయనుడైన శ్రీరాముని చరణములకు ప్రణమిల్లి పయనమయ్యాడు. చివరకు హనుమానుడు ప్రభువు సమీపమునకు చేరాడు. అప్పుడు శ్రీరాముడు వానితో ఇట్లు పలికాడు – 'వీరవరుడా! నీ ప్రయత్నము, ధైర్యము, పరాక్రమము సుగ్రీవుని సందేశము అనే విషయములను బట్టి నీ వలన నా పని తప్పక నెఱవేరునని నాకు తోచుచున్నది, నీవు నా ఈ ఉంగరమును తీసుకో. దీనిపై నా నామాక్షరములు చెక్కబడియున్నవి. దీనిని నా గుర్తుగా ఏకాంతమున సీతా దేవికి ఇవ్వు. కపిశ్రేష్ఠా ! ఈ కార్యమునకు నీవే తగిన వాడవు. నీ బుద్ధిబలము గూర్చి నాకు చక్కగా తెలుసు. మంచిది, వెళ్ళు, నీకు శుభము కలుగుగాక !


(అభిజ్ఞానార్థ మేతన్మే అంగులీయకముత్తమమ్ | 

మన్నామాక్షరసంయుక్తం సీతాయై దీయతాం రహః || 

అస్మిన్ కార్యే ప్రమాణం హి త్వమేవ కపిసత్తమ | 

జానామి సత్త్వం సర్వం గచ్ఛ పంథాః శుభ స్తవ || (వా. రా. 4-6-28,29)


పవనకుమారుడు ఎంతో ఆదరముతో రాముని ముద్రికను తీసుకుని, ఆయన చరణకమలములకు నమస్కరించాడు. భక్తవత్సలుడైన శ్రీ రాముని కరకమలము స్వయముగా హనుమానుని శిరముపైకి వెళ్ళినాయి. అతికష్టముతో హనుమానుడు లేచాడు. పవిత్రమైన ప్రభువు చరణధూళిని అతడు తన శిరమున ఉంచుకొని, ఆయన దివ్యమూర్తిని తన హృదయములో నిలుపుకొని అతడు ఉత్సాహముతో బయలుదేరాడు. అతడు నిరంతరము శ్రీరామ నామమును జపించుచుండేవాడు.


హనుమానుడు స్వయంప్రభను గలిసికొనుట


ఆంజనేయుడు వానరసమూహముతో కలిసి సీతా దేవిని వెదకుతూ గహనమైన వింధ్యారణ్యమునకు వెళ్ళాడు. దట్టమైన ఆ అరణ్యమున ముళ్ళతో కూడి ఎండిపోయిన చెట్లు తప్ప నీరనునది ఎక్కడ కూడా కనబడలేదు. వానర భల్లూక సమూహము ఇటునటు తిరుగుట చేత ఎంతో దప్పికను పొందాయి. వారికి నీరెక్కడ కనిపింపలేదు. దప్పిక చేత వారికంఠములు ఎండిపోతున్నాయి. కాని జ్ఞానులలో శ్రేష్ఠుడు, సంకట మోచనుడైన ఆంజనేయుడు వారి వెంట ఉన్నాడు. ఆయన ధైర్యముతో నలువైపుల చూశాడు. కొద్ది దూరములో ఆయనకు తృణగుల్మలతాదులచే కప్పబడిన ఒక విశాలమైన గుహ కనిపించింది. ఆయన దాని నుండి హంసలు, క్రౌంచపక్షులు, బెగ్గురు పక్షులు, చక్రవాకములు మొదలైన పక్షులు బయటకు రావటం చూశాడు. ఆ పక్షుల రెక్కలు తడిసియున్నాయి. దానివలన అక్కడ నీరున్నట్లు ఆయనకు అనుమానము కలిగింది. వెంటనే అందఱు అక్కడికి వెళ్ళవలసిందని ఆయన వారితో చెప్పాడు, దుర్గమములైన అరణ్యముల విషయము తెలిసిన ఆ హనుమంతునితో కలిసి వానర భల్లూక వీరులు ఒకరి చేతినొ ఒకరు పట్టుకొని మెల్లమెల్లగా గుహలోనికి ప్రవేశించారు.