Sunday, 7 July 2024

శ్రీ గరుడ పురాణము (228)

 


శ్రాద్ధాదికారులు - దాని సంక్షిప్తవిధి మహిమ, ఫలాలు


ఋషిగణులారా! ఇప్పుడు సర్వపాపవినాశినియైన శ్రాద్ధ విధిని వినిపిస్తాను.


ఒక మనిషిపోయిన ఏడాదికి ఆ రోజే శ్రాద్ధం పెట్టాలనుకుంటారు చాలా మంది. తద్దినం లేదా ఆబ్దికం ఏడాదికొకసారి పెట్టేదే శ్రాద్దమనుకుంటారు కూడ. కాని, శ్రాద్దమనగా శ్రద్దగా పితృదేవులను తలచుకొని చేయు కర్మయని భావము. ఇది ఏడాది కొకసారే పెట్టాలని లేదు.


అమావాస్య, అష్టకం (* హేమంత, శిశిర ఋతువులుండే నెలలలో వచ్చే బహుళ అష్టమి), వృద్ధి (పుత్రజన్మమున్నగునవి) కృష్ణపక్షం, ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభదినాలు, అన్నాది లాభదినాలు, విషువత్- సంక్రాంతి ("సూర్యుడు తులారాశిలో మేషరాశిలో సంక్రమణం చేయుతిథి), మకర సంక్రాంతి, వ్యతీపాతం, గజచ్ఛాయా - యోగం, చంద్ర- సూర్యగ్రహణాలు, కర్తకి బుద్ధి పుట్టినపుడు – వీటిలో ఎప్పుడైనా శ్రాద్దం పెట్టవచ్చును.


మధ్య వయస్కుడై కూడా అన్ని వేదాలనూ అస్ఖలితంగా చెప్పడంలో దిట్ట (దీనికి పురాణ పదం అగ్ర్య), శ్రోత్రియుడు, బ్రహ్మవిదుడు, మంత్రాలతో బ్రాహ్మణములతో నున్న వేదభాగానికి తాత్పర్యం చెప్పగలిగే విద్యావేత్త, జ్యేష్ఠ సామమను పేరుగల సామవేద భాగాన్ని బాగా అధ్యయనం చేయడానికి గల విహితవ్రతాచరణలన్నీ పూర్తిచేసి దాని అధ్యేతయైన మహావైదికుడు, ఋగ్వేదంలో త్రిమధు అను పేరుగల దానిలో అలాగే అధ్యేతయైన మేధావి, త్రిసుపర్ణనామంతో విలసిల్లే ఋగ్యజుర్వేదాలలోని ఏకదేశభాగా ధ్యేత, వీరిలో నెవరైనా శ్రాద్ధ సంపత్తి' గా ఆహ్వానింపబడి పూజింపబడడానికి అర్హులౌతారు. అనగా వీరికి ఆనాడు భోజనం పెట్టి దానాలిస్తే అక్షయ ఫలాలు అబ్బుతాయి.


అలాగే కర్మనిష్ఠుడు, తపోనిష్ఠుడు, శిష్య వత్సలుడైన మహోపన్యాసకుడు, విశిష్ట ఋత్విక్కు పంచాగ్ని ('సభ్య, ఆవసథ్య, ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్నులు పంచాగ్నులు) విద్యను బాగా అధ్యయనం చేసి 'అధ్యేత' అనిపించుకున్నవాడు. బ్రహ్మచారి, మాతృపితృభక్తుడైన జ్ఞాననిష్టుడు కూడ శ్రాద్ధ సంపత్తులనబడతారు.


Saturday, 6 July 2024

శ్రీ గరుడ పురాణము (227)

 


భూమి, దీపం, అన్నం, వస్త్రాలు, నెయ్యి, వీటిని దానం చేసిన వానికి లక్ష్మి ప్రాప్తిస్తుంది. ఇల్లు, ధాన్యం, గొడుగు, మాల, వాహనం, నెయ్యి, నీరు, శయ్య, కుంకుమ, చందనాదులను దానమిచ్చినవారు స్వర్గలోకంలో ప్రతిష్ఠితులౌతారు.


సత్పాత్రునికి విద్యాదానమొనర్చిన వానికి దేవ దుర్లభమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. వేదార్థాన్నీ, యజ్ఞాల విభిన్న విధులనూ సంపాదితం చేసి, శాస్త్రాలనూ విభిన్న ధర్మశాస్త్రాలనూ తరువాతి తరం వారికోసం కొంత మూల్యాన్ని స్వీకరించియైనా సరే, వ్రాసిన వానికి బ్రహ్మలోక ప్రాప్తి ఫలంగా వస్తుంది. ఈ ప్రపంచానికి మూలం వేద, శాస్త్రాలే. అందుకే భగవంతుడు ముందుగా వాటినే సృజించాడు. కాబట్టి ఎంతగట్టి ప్రయత్నాలు చేసైనా వేదాల తాత్పర్యాన్ని తరువాతి తరాల వారి కందించాలి. ఇతిహాస పురాణాలను కూడా ఇలాగే వ్రాసివుంచిన వారికి, దానం చేసినవారికి బ్రహ్మదానానికి సమానమైన పుణ్యానికి రెండింతల పుణ్యం లభిస్తుంది.


నాస్తికుల వచనాలూ, కుతర్కాలూ ద్విజుడైన వాడు వినరాదు. ఎందుకంటే ఒకనిని అధోగతి పాలుజేయడానికా శబ్దమే చాలు.


దానం పుచ్చుకొనే అర్హత, అవకాశం వుండీ కూడా తమ వద్ద పుష్కలంగా వున్న దానిని వేరొకరికి ఇప్పించిన వారికీ, తమ వద్దలేకపోయినా ఇతరుల అవసరాన్ని గుర్తించి వారికిప్పించిన వారికీ దాతకు లభించినంత పుణ్యమే లభిస్తుంది.


కులత, పతితులు, నపుంసకులు, శత్రువులు దానమిచ్చినా స్వీకరించరాదు. పెద్దగా సచ్చరిత్రులు కానివారు కుశ, శాక, దుగ్ధ, గంధ, జలాది సామాన్య వస్తువులను అడగకుండానే ఇచ్చినా పుచ్చుకోవచ్చును. తల్లిదండ్రులను పోషించడానికై గాని దేవతలను అతిథులను పూజించుటకు గాని, తనకు ప్రాణం మీదికి వచ్చినపుడు గాని పతితులు కుత్సితులు కానివారెవరు దానమిచ్చినా స్వీకరించవచ్చును; అదీ అవసరం మేరకే.


(అధ్యాయం - 98)


Friday, 5 July 2024

శ్రీ గరుడ పురాణము (226)

 


దానధర్మమహిమ


ఋషులారా! దానధర్మం చాలా గొప్పది, అన్ని వర్ణాలలోకి అధ్యాయనాధ్యాపనల వల్ల బ్రాహ్మణ వర్గం గొప్పది, వారిలో సత్క్రియానిష్ఠుడు అనగా కర్మనిష్టగలవాడు శ్రేష్ఠుడు. వారిలో విద్య, తపస్సు గల బ్రహ్మతత్త్వ వేత్త వరిష్ఠుడు. దానమిచ్చువాడు సత్పాత్రుని కీయదలచుకున్నపుడు ఇది చూడాలి, భోజనం పెట్టడానికీ అన్నదానం చేసేటప్పుడూ, ఆకలీ, పేదరికమూ మాత్రమే కొలబద్దలు. అలా కాకుండా గృహాస్థైనవాడు గో, భూ, ధాన్య, ధన, సువర్ణాది దానాలు చేసేటపుడు సత్పాత్రునికే చేయాలి.

విద్యా, తపస్సూలేని బ్రాహ్మణుడు దానం పుచ్చుకోకూడదు. అపాత్రదానం వల్ల దాతా, ప్రతిగ్రహీతా కూడా అధోగతి పాలవుతారు. దానం అర్హులకు ప్రతిరోజూ చేయాలి. నిమిత్తకాలాల్లో - అనగా సూర్యచంద్రాదిగ్రహణాల వంటి ప్రత్యేక దినాల్లో విశిష్ట దానాలను చెయ్యాలి. యాచకులు వస్తే ఎవరికి తగిన దానాన్ని వారికి చేయాలి. విశిష్టమైన గోదానాన్ని చేసినపుడు మాత్రం దాని కొమ్ములకు బంగారు బొడిపెలనూ గిట్టలకు వెండి చుట్లనూ అలంకరించి ఒక కాంస్యపాత్రతో సహా ఇవ్వాలి. కొమ్ములకుండే బంగారం పది సౌవర్ణికాలు (నూటయెనిమిది మాశలు) గిట్టలకు పెట్టే వెండి ఏడు పళంలు వుండాలి.


గోదానాన్ని దూడతో సహా చేయాలి. ఆ దూడనీ అలంకరించాలి. ఆవు రోగరహితమై వత్స సహితమై వుండాలి. దూడ దొరకకపోతే బంగారంతో కాని పిప్పల కఱ్ఱతో గాని చేసిన కొయ్యదూడనీయవలెను. ఇలా దానం చేసిన వానికి ఆవు లేదా దూడపై ఎన్ని రోమాలున్నవో అన్నేళ్ళు స్వర్గ సుఖములు సంప్రాప్తమౌతాయి. అదే కపిల గోవైతే దాత యొక్క ఏడు తరాలు ఉద్దరింపబడతాయి.


గర్భము నుండి దూడ బయల్వెడలుతున్నప్పటి ఆవును పృథ్వీ సమానముగా పూజిస్తారు. స్వర్ణంతో గోదానం చేసే స్తోమతులేనివారు పాలిచ్చే ధేనువును గానీ గర్భముతోనున్న ధేనువును గాని దానం చేసినా స్వర్గ ప్రాప్తి వుంటుంది.


అలసిన మనిషికి ఆసనాదికములను దానమిచ్చి అలసటను దూరం చేయడం, రోగికి సేవచేయడం, దేవపూజనం, బ్రాహ్మణుని పాదాలను కడగడం, ఆయన వాడే జాగానూ, వస్తువులనూ శుభ్రం చేయడం - ఇవన్నీ గోదానాన్ని శాస్త్రోక్తంగా చేసిన దానికి సమానమైన ఫలాన్నిస్తాయి. అలాగే బ్రాహ్మణుడు మిక్కిలిగా ఇష్టపడే వస్తువులను దానం చేసిన వానికి స్వర్గ ప్రాప్తి వుంటుంది.


Thursday, 4 July 2024

శ్రీ గరుడ పురాణము (225)

 


ఉన్ని, పట్టు బట్టలను వేడినీటితో వెచ్చని గోమూత్రంతో కడిగి శుద్ధిచేయాలి. యజ్ఞపాత్రలను చేతితో బాగా మర్దించి కడగాలి. కఱ్ఱతో, దుప్పికొమ్ము లేదా పంటితో నిర్మింపబడిన పాత్రలను మట్టితో తోమి నీటితోకడగాలి, స్త్రీ ముఖానికీ, బ్రహ్మచారి భిక్షా పాత్రకీ, బజారులో అమ్మదలచుకున్న అన్నాదులకి శుద్ధి అవసరంలేదు అని ఎల్లపుడూ పవిత్రాలే. మట్టి పాత్రను పవిత్రం చేయడానికి అగ్నిలో పెడితే చాలు, చండాలుడు దానిని స్పృశించకుండా చూసుకోవాలి. ఆవు వాసన చూసిన అన్నమూ; తలవెంట్రుకలూ, కీటకాలూ పడిన అన్నమూ నీటితో, భస్మంతో, మట్టితో శుద్ధి అవుతుంది. నేలను శుద్ధిచేయాలంటే తుడిచి, కడిగి, తుడవాలి. తగరం, సీసం, రాగి, గాజు పాత్రలను ఉప్పు, నిమ్మరసం దశల వారిగా నీటిలో కలిపి కడగడం ద్వారా శుద్ధి చేయాలి. కంచు, ఇనుము పాత్రలను భస్మంతో తోమి నీటితో కడగాలి. అజ్ఞాతవస్తువులు పవిత్రాలే.


అమేధ్యములచే- అనగా శరీరము నుండి పుట్టినవైన మల, వసా, శుక్ర, శ్లేష్మాదులచే - అశుద్ధములైన పాత్రలను మట్టితో బాగా తోమి నీటితో కడగడం ద్వారా శుద్ధిచేయాలి. ప్రకృతి ద్వారా భూమిపై ఏర్పాటు చేయబడి గోవుచే త్రాగబడు నీరు శుద్ధమైనదే కావున దానిని శుద్ధి కార్యక్రమానికి వాడవచ్చును.


సూర్మరశ్మి, అగ్ని, ధూళి, చెట్టు నీడ, ఆవు, గుఱ్ఱము, నేల, వాయువు, మంచు బిందువులు ఎప్పుడూ పవిత్రాలే. మనిషి స్నానం చేశాక, నీరు త్రాగాక, తుమ్మినాక, పడుకొని లేచాక, భోజనం తరువాత, నడిచి వచ్చాక, బట్టలు మార్చాక ఆచమనం చేస్తే శుద్ధి అవుతుంది.


ఆవులింత, ఉమ్ము, నిద్ర, వస్త్రధారణ, కన్నీరు - ఈ పంచకార్యాలకూ ఆచమనం చేయనక్కరలేదు. దేవుని స్మరించి కుడిచెవిని ముట్టుకుంటే చాలు. బ్రాహ్మణుని చెవిపై అగ్ని మున్నగు దేవతలు ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంటారు.


(అధ్యాయం - 97)


Wednesday, 3 July 2024

శ్రీ గరుడ పురాణము (224)

 


పాసిపోయిన, చలి, విలువయుండిన, రంగు మారిన, కుక్క ముట్టిన, పతితునిచే చూడబడిన, రజస్వల ముట్టిన, సంఘష్ట, పర్యాయాన్న భోజనమును సర్వదా త్యజించ వలెను. 


*సంఘష్ట - భోజనం మిగిలిపోయింది. వచ్చితినేస్తారా అంటూ పెట్టే అన్నం. 

*పర్యాన్నం - ఒకరికోసం సిద్ధం చేసి వారు స్వీకరించకపోతే మనకి పెట్టునది.


శూద్రాన్నమును భుజించవచ్చును. ఐతే, ఆ శూద్రుడు కొన్ని తరాలుగా మన వృత్తిలో సహాయపడుతున్న వారి కుటుంబం వాడై వుండాలి. మనస్సు, మాట, శరీరం, కర్మ - వీటన్నింటినీ పరిశుద్ధంగా వుంచుకొని భగవదర్పణ బుద్ధితో మెలిగే వారై వుండాలి.


తిలతండులమిశ్రిత పదార్థాలనూ, అప్పాలు, పాయసం, పండివంటలు- ఇట్టి వాటిని దేవతలకో, అతిథులకో సమర్పించాకనే మనంతినాలి.


నీరుల్లి, వెల్లుల్లి వంటి ఉగ్రపదార్థాలు తిన్న వారికి చాంద్రాయణ వ్రతం చేస్తే కాని ఆ దోషంపోదు. మితంగా తింటూ, హితంగా వుంటూ, చిన్న, తెలియని దోషాలకు భగవంతుని క్షమాపణ కోరుకుంటూ, జీవితాన్ని భగవత్ప్రసాదంగా భావించి ప్రతి కర్మనీ భగవంతునికే సమర్పిస్తూ ఆయననే ప్రార్థిస్తూ జీవించేవాడు ఆయననే చేరుకుంటాడు.


(అధ్యాయం -96)


ద్రవ్యశుద్ధి


యాజ్ఞవల్క్య మహర్షి ప్రవచనమింకాకొనసాగుతోంది. 'శ్రేష్ఠమునులారా! ఇపుడు ద్రవ్య శుద్ధిని గూర్చి వినిపిస్తాను.


బంగారం, వెండి, అబ్జ (ముక్తాఫల, శుక్తి, శంఖాములు) కూరలు, త్రాళ్ళు, గొఱ్ఱే చర్మంతో చేసిన వస్తువులు, పాత్రలు, హోమంలో వేయవలసిన ధాన్యాలు, యజ్ఞ పాత్రలు లోపల మెత్తని నున్నని లేపనం లేనివై యుండి అపవిత్ర స్పర్శకులోనైతే వీటితో బాగా కడిగితే చాలు, శుద్ధములైపోతాయి. ధాన్యాదులపై కాస్త నీళ్ళు చిలకరిస్తే చాలు. యజ్ఞంలో వాడవలసిన స్రుక్, స్రువాలు (కర్రచెంచాలు) వేడి నీటితో కడిగితే శుద్ధి జరుగుతుంది. 


Tuesday, 2 July 2024

శ్రీ గరుడ పురాణము (223)

 


ఇక విద్యార్థులు, గురువులు, బ్రాహ్మణాది ద్విజులు సంఘంలో పాటించవలసిన నియమాలను చూద్దాం. దేవతామూర్తి, ఋత్విజుడు, స్నాతకుడు, ఆచార్యుల, రాజుల, పరస్త్రీల నీడలు, రక్తం, మూత్రాది విసర్జకాలు దారిలో వున్నపుడు దాటుకొనిపోరాదు. ఆగిగాని, పక్కకి తొలగిగాని వెళ్ళాలి. మంచి పేరుగల బ్రాహ్మణుని, రాజుని, సర్పాన్ని అవమానించకూడదు. అలాగే తనను తాను అవమానించుకోరాదు. విసర్జనాలను, ఇతరులు కాళ్ళుకడుక్కున్న నీళ్ళను దూరంనుండే చూసి తప్పుకోవాలి.


శ్రుతులలో, స్మృతులలో బోధింపబడిన సదాచారాన్ని పూర్తిగా పాటించాలి. ఒకరి రహస్యాన్ని బట్టబయలు చేసి వారిని బాధించరాదు. ఎవరినీ నిందించుటగాని కొట్టుటకాని దోషము. పుత్రునీ శిష్యునీ అవసరం మేరకు దండించవచ్చు. స్వధర్మాచరణ విషయంలో ఎటువంటి వెసులుబాటు కోసమూ చూడరాదు. దాన్ని తప్పనిసరిగా పూర్తిగా చేయవలసినదే. ధర్మ విరుద్ధమైన పనులను చేయరాదు. గృహస్థు తన తల్లిదండ్రులతో, అతిథితో, ధనికులతో వాదించరాదు.


నది, సెలయేరు, పుష్కరిణి, చెఱువులలో స్నానం చేయాలి. ఇతరుల సరోవరంలో స్నానంచేయడానికి ముందు అనుమతిని పొంది, అయిదు మట్టి ముద్దలను బయటికి తీసి ఒడ్డున పెట్టి వెళ్ళాలి.


ఇతరుల శయ్యపై పడుకొనరాదు. దేశం ఆపదలో నున్నపుడు మనం మాత్రం ప్రసన్నం గా భోంచెయ్యరాదు. ఏదో తినాలి కాబట్టి తినాలి.


కృపణుడు, బందీ, దొంగ, అగ్నిహోత్రం చెయ్యని బాపడు, వెదురుతో పని చేయువాడు, న్యాయస్థానంలో నేరం ఋజువైనవాడు (దోషిగా నిరూపింపబడినవాడు), వడ్డీ వ్యాపారి, వేశ్య, సామూహిక దీక్షలనిచ్చేవాడు, చికిత్సకుడు, రోగి, క్రోధి, నపుంసకుడు, నటన - నాట్యాల ద్వారా వేదికలపై పొట్టపోసుకొనే వాడు, ఉగ్రుడు, నిర్దయుడు, పతితుడు, డాబులు కొట్టేవాడు, శాస్త్రవిక్రేత, స్త్రీ వశుడు, గ్రామంలో దేవతలకు శాంతి పూజలు చేయించేవాడు, నిర్దయుడైన రాజు, అబద్ధాల కోరు, మద్యవిక్రేత, బంగారం పనివాడు, వంది వీరి యింటిభోజనమును చేయరాదు.


Monday, 1 July 2024

శ్రీ గరుడ పురాణము (222)

 


ఇక అనధ్యయన సందర్భాలను అనగా ఎట్టి సందర్భాలలో వేదాలనూ శాస్త్రాదులనూ చదువుకోకూడదో చర్చిద్దాం.


వేదం చదువుకోవడాన్ని ధర్మశాస్త్రాలు చెప్పుకోవడాన్ని శ్రవణ నక్షత్రయుక్త శ్రావణ పూర్ణిమనాడు గాని హస్త నక్షత్రయుక్త పంచమి నాడుగాని లేదా పుష్యమాసంలో రోహిణీ నక్షత్రం వున్నరోజున గానీ గ్రామానికి వెలుపల జలాశయ సమీపాన గృహ్యసూత్రాను సారం ప్రారంభించాలి. ('యాజ్ఞవల్క్యమితాక్షర, ఆచారాధ్యాయం, 146)


శిష్య, ఋత్విజ, గురు, బంధు బాంధవులలో ఎవరైనా మరణిస్తే ఆ క్షణం నుండి మూడురోజుల పాటు అనధ్యయనమే. అలాగే స్వశాఖ శ్రోత్రియ బ్రాహ్మణుడు మరణించినా మూడురోజుల పాటు చదవకూడదు. సంధ్యా సమయంలో ఉరుములు వినబడినపుడు, ఆకాశంలో మెరుపులు కనబడినపుడు, భూకంప, ఉల్కాపాత సమయాలలోనూ అధ్యయనాన్ని ఆపివేయాలి. వేద, ఆరణ్యక అధ్యయన సమాప్తి జరిగిన తరువాత పూర్తిగా ఒక పగలూ ఒక రాత్రి సెలవిచ్చెయ్యాలి.


అష్టమి, చతుర్దశి, అమావాస్య, పున్నం, చంద్ర సూర్య గ్రహణాలు, ఋతు సంధులలో పాడ్యమి, శ్రాద్ధ భోజనాలు - ఈ వేళల్లో చదువుకి సెలవు... పూర్తిగా ఒక రోజు. అయితే ఏకోద్దిష్ట శ్రాద్ధానికి భోజనం లేదా ప్రతిగ్రహ సమయాల్లో మూడురాత్రులు గడిచేదాకా అనధ్యయనాన్ని పాటించాలి.


ఉత్సవాలకీ, శక్రధ్వజందిగినపుడూ, ఏడుపులూ పెడబొబ్బలూ దగ్గర్లోనే వినబడు తున్నపుడూ, శవం లేచినపుడూ తాత్కాలిక అనధ్యయనముంటుంది. అపవిత్ర దేశంలో, అపవిత్రావస్థలో, మాటిమాటికీ నింగి మెరుస్తుంటేనూ, మధ్యాహ్నం పన్నెండు గంటలలోపల పలుమార్లు ఉరుములు వినబడినపుడూ జలమధ్యంలో, అర్ధరాత్రి వేదశాస్త్రాలను చదువరాదు. ఎవరైనా విశిష్టవ్యక్తి వచ్చినప్పుడు అధ్యయనాన్ని ఆపాలి.


పరుగెడుతూ కానీ మద్యం వాసనవస్తున్న వ్యక్తి పక్కనే వున్నపుడుగానీ, గాడిద, ఒంటె, గుఱ్ఱం, నౌక,చెట్టు, పర్వతంమున్నగు వానిపై కూర్చున్నపుడుగానీ ప్రయాణిస్తున్నపుడు గానీ, దొంగలు రాజులు గ్రామానికి ఉపద్రవాన్ని తెచ్చినపుడు గానీ వేదశాస్త్రాలను చదువరాదు.