Thursday 4 July 2024

శ్రీ గరుడ పురాణము (225)

 


ఉన్ని, పట్టు బట్టలను వేడినీటితో వెచ్చని గోమూత్రంతో కడిగి శుద్ధిచేయాలి. యజ్ఞపాత్రలను చేతితో బాగా మర్దించి కడగాలి. కఱ్ఱతో, దుప్పికొమ్ము లేదా పంటితో నిర్మింపబడిన పాత్రలను మట్టితో తోమి నీటితోకడగాలి, స్త్రీ ముఖానికీ, బ్రహ్మచారి భిక్షా పాత్రకీ, బజారులో అమ్మదలచుకున్న అన్నాదులకి శుద్ధి అవసరంలేదు అని ఎల్లపుడూ పవిత్రాలే. మట్టి పాత్రను పవిత్రం చేయడానికి అగ్నిలో పెడితే చాలు, చండాలుడు దానిని స్పృశించకుండా చూసుకోవాలి. ఆవు వాసన చూసిన అన్నమూ; తలవెంట్రుకలూ, కీటకాలూ పడిన అన్నమూ నీటితో, భస్మంతో, మట్టితో శుద్ధి అవుతుంది. నేలను శుద్ధిచేయాలంటే తుడిచి, కడిగి, తుడవాలి. తగరం, సీసం, రాగి, గాజు పాత్రలను ఉప్పు, నిమ్మరసం దశల వారిగా నీటిలో కలిపి కడగడం ద్వారా శుద్ధి చేయాలి. కంచు, ఇనుము పాత్రలను భస్మంతో తోమి నీటితో కడగాలి. అజ్ఞాతవస్తువులు పవిత్రాలే.


అమేధ్యములచే- అనగా శరీరము నుండి పుట్టినవైన మల, వసా, శుక్ర, శ్లేష్మాదులచే - అశుద్ధములైన పాత్రలను మట్టితో బాగా తోమి నీటితో కడగడం ద్వారా శుద్ధిచేయాలి. ప్రకృతి ద్వారా భూమిపై ఏర్పాటు చేయబడి గోవుచే త్రాగబడు నీరు శుద్ధమైనదే కావున దానిని శుద్ధి కార్యక్రమానికి వాడవచ్చును.


సూర్మరశ్మి, అగ్ని, ధూళి, చెట్టు నీడ, ఆవు, గుఱ్ఱము, నేల, వాయువు, మంచు బిందువులు ఎప్పుడూ పవిత్రాలే. మనిషి స్నానం చేశాక, నీరు త్రాగాక, తుమ్మినాక, పడుకొని లేచాక, భోజనం తరువాత, నడిచి వచ్చాక, బట్టలు మార్చాక ఆచమనం చేస్తే శుద్ధి అవుతుంది.


ఆవులింత, ఉమ్ము, నిద్ర, వస్త్రధారణ, కన్నీరు - ఈ పంచకార్యాలకూ ఆచమనం చేయనక్కరలేదు. దేవుని స్మరించి కుడిచెవిని ముట్టుకుంటే చాలు. బ్రాహ్మణుని చెవిపై అగ్ని మున్నగు దేవతలు ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంటారు.


(అధ్యాయం - 97)


No comments:

Post a Comment