Sunday 7 July 2024

శ్రీ గరుడ పురాణము (228)

 


శ్రాద్ధాదికారులు - దాని సంక్షిప్తవిధి మహిమ, ఫలాలు


ఋషిగణులారా! ఇప్పుడు సర్వపాపవినాశినియైన శ్రాద్ధ విధిని వినిపిస్తాను.


ఒక మనిషిపోయిన ఏడాదికి ఆ రోజే శ్రాద్ధం పెట్టాలనుకుంటారు చాలా మంది. తద్దినం లేదా ఆబ్దికం ఏడాదికొకసారి పెట్టేదే శ్రాద్దమనుకుంటారు కూడ. కాని, శ్రాద్దమనగా శ్రద్దగా పితృదేవులను తలచుకొని చేయు కర్మయని భావము. ఇది ఏడాది కొకసారే పెట్టాలని లేదు.


అమావాస్య, అష్టకం (* హేమంత, శిశిర ఋతువులుండే నెలలలో వచ్చే బహుళ అష్టమి), వృద్ధి (పుత్రజన్మమున్నగునవి) కృష్ణపక్షం, ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభదినాలు, అన్నాది లాభదినాలు, విషువత్- సంక్రాంతి ("సూర్యుడు తులారాశిలో మేషరాశిలో సంక్రమణం చేయుతిథి), మకర సంక్రాంతి, వ్యతీపాతం, గజచ్ఛాయా - యోగం, చంద్ర- సూర్యగ్రహణాలు, కర్తకి బుద్ధి పుట్టినపుడు – వీటిలో ఎప్పుడైనా శ్రాద్దం పెట్టవచ్చును.


మధ్య వయస్కుడై కూడా అన్ని వేదాలనూ అస్ఖలితంగా చెప్పడంలో దిట్ట (దీనికి పురాణ పదం అగ్ర్య), శ్రోత్రియుడు, బ్రహ్మవిదుడు, మంత్రాలతో బ్రాహ్మణములతో నున్న వేదభాగానికి తాత్పర్యం చెప్పగలిగే విద్యావేత్త, జ్యేష్ఠ సామమను పేరుగల సామవేద భాగాన్ని బాగా అధ్యయనం చేయడానికి గల విహితవ్రతాచరణలన్నీ పూర్తిచేసి దాని అధ్యేతయైన మహావైదికుడు, ఋగ్వేదంలో త్రిమధు అను పేరుగల దానిలో అలాగే అధ్యేతయైన మేధావి, త్రిసుపర్ణనామంతో విలసిల్లే ఋగ్యజుర్వేదాలలోని ఏకదేశభాగా ధ్యేత, వీరిలో నెవరైనా శ్రాద్ధ సంపత్తి' గా ఆహ్వానింపబడి పూజింపబడడానికి అర్హులౌతారు. అనగా వీరికి ఆనాడు భోజనం పెట్టి దానాలిస్తే అక్షయ ఫలాలు అబ్బుతాయి.


అలాగే కర్మనిష్ఠుడు, తపోనిష్ఠుడు, శిష్య వత్సలుడైన మహోపన్యాసకుడు, విశిష్ట ఋత్విక్కు పంచాగ్ని ('సభ్య, ఆవసథ్య, ఆహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్నులు పంచాగ్నులు) విద్యను బాగా అధ్యయనం చేసి 'అధ్యేత' అనిపించుకున్నవాడు. బ్రహ్మచారి, మాతృపితృభక్తుడైన జ్ఞాననిష్టుడు కూడ శ్రాద్ధ సంపత్తులనబడతారు.


No comments:

Post a Comment