Monday, 21 October 2024

శ్రీ గరుడ పురాణము (305)

 


వీరంతా వైశాలక రాజులని పిలువబడ్డారు. వీరిలో తృణబిందువుకి అలంబుష అనే అప్సరస ద్వారా ఇలవిలాయను కూతురు కూడా కలిగింది.


వైవస్వత మనుపుత్రుడు శర్యాతికి సుకన్యయను కూతురు పుట్టింది. ఆమె చ్యవన మహర్షిని పెండ్లాడింది. శర్యాతి వంశంలో వరుసగా అనంతుడు, రేవతుడు, రైవతుడు జనించారు. రైవతుని కూతురు రేవతి.


వైవస్వత మనుపుత్రుడు ధృష్టునికి ధార్ష నామకపుత్రుడు జనించాడు. అతడు వైష్ణవుడైనాడు. మనుపుత్రుడైన నభగుని వంశంలో క్రమంగా నేదిష్ఠ, అంబరిష, విరూప, పృషదక్ష (శ్వ) రథీనరులు జనించారు. వీరంతా వాసుదేవ భక్తులు.


మనుపుత్రుడైన ఇక్ష్వాకునికి వికుక్షి, నిమి, దండకులని ముగ్గురు కొడుకులు. వికుక్షి యజ్ఞేయ శశకము(కుందేలు)ను భక్షించి శశాదనామంతో విఖ్యాతుడైనాడు. అతని కొడుకులు పురంజయుడు, కకుతుడు. ఈ రెండవవాని కొడుకు వేనుడను పేరు గల అనేనసుడు. ఆతని పుత్రుడే విష్ణువు అంశగల పృథుచక్రవర్తి. ఆ తరువాత వంశపారంపర్యంగా విశ్వరాతుడు, ఆర్ద్రుడు, యువనాశ్వుడు, శ్రీవత్సుడు, బృహదశ్వుడు, కువలాశ్వుడు, ధృఢాశ్వుడు పుట్టారు. దృఢాశ్వ చక్రవర్తి ధుంధుమారుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత ఆ వంశంలో దృఢాశ్వ కుమారులు చంద్రాశ్వుడు, కపిలాశ్వుడు, హర్యశ్వుడు అను వారలలో హర్యశ్వుని వంశంలో వరుసగా నికుంభుడు, హితాశ్వుడు, పూజాశ్వుడు, యువనాశ్వుడు, మాంధాత జన్మించారు. మాంధాతకతని పత్ని బిందుమతి ద్వారా ముచుకుందుడు, అంబరిషుడు ('రి'కి దీర్ఘం పెట్టకూడదు) పురుకుత్సుడు అను ముగ్గురు కొడుకులూ, యాభైమంది కూతుళ్ళూ పుట్టారు. మాంధాత కూతుళ్ళందరినీ సౌభరి మహాముని పెండ్లాడాడు.


అంబరిషుని కొడుకు యువనాశ్వుడు, అతని కొడుకు హరితుడు. పురుకుత్సునికి నర్మద ద్వారా త్రసదస్యువను పుత్రుడుదయించాడు. అతని వంశంలో క్రమంగా అనరణ్యుడు, హర్వశ్వుడు, వసుమనుడు, త్రిధన్వుడు, త్రయ్యారుణుడు, సత్యరతుడు (త్రిశంకువు) హరిశ్చంద్రుడు, రోహితాశ్వుడు, హరీతుడు, చంచు, విజయుడు, రురుకుడు, వృకుడు, బాహువు, సగరుడు ఉద్భవించి చక్రవర్తులైనారు.


సగరునికి సుమతి అను పత్ని ద్వారా అరవైవేలమంది పుత్రులు కలిగారు. కాని వారిలో నెవరూ మిగలలేదు. పాతాళంలో కపిల మహర్షిని దూషించి, కొట్టిన పాపానికి, వారి పాపాగ్నిలో వారే కాలి బూడిదైపోయారు.


సగరుని రెండవపత్ని కేశినికి అసమంజసుడు, అతనికి అంశుమంతుడు, అతనికి దిలీపుడు, ఆయనకు భగీరధుడు జనించారు. ఈ భగీరథుడే దివిజ గంగను భువికి తెచ్చిన మహనీయుడు. ఆయననుండి సూర్యవంశక్రమం ఇలా పరంపరగా తామర తంపరగా కొనసాగింది. భగీరథుని తరువాత వరుసగా శ్రుతుడు, నాభాగుడు, అంబరిషుడు, సింధు ద్వీపుడు, అయుతాయువు, ఋతుపర్ణుడు, సర్వకాముడు, సుదాసుడు, సౌదాసుడు (మిత్ర సహుడు) కల్మాషపాదుడు, అశ్వకుడు, మూలకుడు, దశరథుడు, ఐలబిలుడు, విశ్వసహుడు, ఖట్వాంగుడు, దీర్ఘబాహువు, అజుడు, దశరథుడు చక్రవర్తులైనారు. ఈ దశరథపుత్రులే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు.


శ్రీరామచంద్రుని పుత్రులు కుశలవులు, భరతునికి తార పుష్కరులూ, లక్ష్మణునికి చిత్రాంగద చంద్రకేతువులూ, శత్రుఘ్నునికి సుబాహు శూరసేనులూ జనించారు. కుశమహా రాజు వంశం ఈ విధంగా వర్ధిల్లింది.


* (ఎవరి పేరిటనైతే ఈ వంశాన్ని రఘువంశమని వ్యవహరిస్తారో ఆ రఘుమహారాజు పేరు కనబడకపోవడంచింత్యం) అయితే ఈ పురాణంలోనే 143వ అధ్యాయంలో అజుడు రఘుపుత్రుడని చెప్పబడింది. అంటే ఈ అధ్యాయంలో పేర్కొనబడిన దీర్ఘబాహువే రఘుమహారాజని తెలుస్తోంది. 

Sunday, 20 October 2024

శ్రీ గరుడ పురాణము (304)

 



స్వచ్ఛ హృదయులై ఉపవాససహితంగా ఒక సంవత్సర పర్యంతం యథాక్రమంగా ఏకాదశి, అష్టమి, చతుర్దశి, సప్తమి తిథుల్లో విష్ణు, దుర్గ, శివ, సూర్య పూజలను గావించిన వారికి అన్ని నిర్మల అభిలాషలూ తీరుతాయి. దేహాంతంలో దేవలోక ప్రాప్తి ఉంటుంది. వ్రత కాలంలో ఏకభుక్తంగాని, నక్తవ్రతం గాని, ఆయాచితంగాని, ఉపవాసం గాని పాటించాలి. పైన చెప్పిన దేవతలందరినీ శాకాదులతో పూజిస్తే భోగం, మోక్షం రెండూ అబ్బుతాయి.


పాడ్యమినాడు కుబేర, అగ్ని, నాసత్య, దస్ర నామక దేవతలనూ, విదియ నాడు లక్ష్మినీ, యమధర్మరాజునూ, పంచమినాడు పార్వతీదేవిని నాగగణాలనూ పూజించాలి. అలాగే షష్ఠినాడు కార్తికేయునీ సప్తమినాడు సూర్యదేవునీ, అష్టమి నాడు దుర్గనీ, నవమినాడు మాతృకలను తక్షకునీ పూజించాలి. అదేవిధంగా దశమి నాడు ఇంద్రునీ, కుబేరునీ, ఏకాదశినాడు సప్తర్షులనూ, ద్వాదశి నాడు హరినీ, త్రయోదశినాడు మన్మథునీ, చతుర్దశినాడు మహేశ్వరునీ, పున్నం నాడు బ్రహ్మనీ, అమావాస్యనాడు పితృదేవతలనూ పూజించాలి.


(అధ్యాయం -137)


సూర్యవంశవర్ణన


రుద్రదేవా! ఇక భరతఖండాన్నేలిన మహారాజ వంశాలను వర్ణిస్తాను. ముందుగా సూర్యవంశ వర్ణన గావిస్తాను.


విష్ణు భగవానుని నాభికమలం నుండి బ్రహ్మ, ఆయన అంగుష్ఠ భాగము నుండి దక్షప్రజాపతి ఉద్భవించగా దక్షపుత్రిగా దేవమాత అదితి జనించింది. అదితి నుండి వివస్వతుడను పేర సూర్యుడు, ఆయనకు వైవస్వతమనువు జనించారు. మనువునకు  తొమ్మండుగురు కొడుకులు. వారు ఇక్ష్వాకువు, శర్యాతి, నృగుడు, ధృష్ట, పృషధ్రుడు, నరిష్యంతుడు, నభగుడు, దిష్ట, శశకుడు (కరషుడు). 


మనువుకు ఇల అను కూతురూ, సుద్యుమ్నుడను కొడుకు కూడా కలిగారు. ఇలకు బుధుని వల్ల పురూరవ మహారాజూ, సుద్యుమ్నునికి అతని పత్ని ద్వారా ఉత్కళ, వినత, గయ నామకులయిన పుత్రులూ జనించారు.


గోవధ చేసిన పాపానికి మనుపుత్రుడు పృషధ్రుడు శూద్రుడైపోయాడు. కరుషుని నుండి క్షత్రియుల ఉత్పత్తి జరిగింది. వారు కారుషులుగా విఖ్యాతి నందారు. దిష్టపుత్రుడైన నాభాగుడు వైశ్యుడైనాడు. అతని కొడుకు పేరు భలందనుడు. వాని వంశమున వరుసగా వత్స ప్రీతి, అతనికి పాంశుఖ నిత్రులు, ఖనిత్రునికి భూపుడు, అతనికి క్షుపుడు, అతనికి వింశుడు, అతనికి వివింశకుడు కలిగారు.


వివింశకుని వంశములో వరుసగా ఖనినేత్రుడు, విభూతి, కరంధముడు, అవిక్షితుడు, మరుత్తు, నరిష్యంతుడు, తముడు, రాజవర్ధనుడు, సుధృతి, నరుడు, కేవలుడు, బంధుమానుడు జనించారు.


బంధుమానుని వంశంలో వరుసక్రమంలో వేగవానుడు, బుధుడు, తృణబిందువు, విశాలుడు, హేమచంద్రుడు, చంద్రకుడు, ధూమ్రాశ్వుడు, సృంజయుడు, సహదేవుడు, కృశాశ్వుడు, సోమదత్తుడు, జనమేజయుడు కలిగారు.

Saturday, 19 October 2024

శ్రీ గరుడ పురాణము (303)

 


తిథి, వార, నక్షత్రాది వ్రతాలు


చైత్ర శుద్ధ త్రయోదశిని కామదేవ త్రయోదశి అంటారు. ఈ రోజున తెల్లకమలం మున్నగు పూలతో రతి, ప్రీతియుక్తుడు, మణి విభూషితుడు, శోక విదూరకుడునగు మన్మథుని పూజించాలి. ఈ వ్రతం పేరు మదనత్రయోదశి. ఇది సుఖసంతోషాలనిస్తుంది.


ప్రతిమాసంలోనూ రెండు చతుర్దశులనాళ్ళూ రెండు అష్టమి దినాల్లోనూ ఉపవాసం చేసి పరమశివుని పూజించాలి. ఇది ముక్తిప్రదాయకం. ఈ వ్రతానికి శివాష్టమీ చతుర్దశి వ్రతమని పేరు.


ధామవ్రతం కార్తీకమాసంలో ఏవో మూడు రాత్రులపాటు ఉపవాసముండి చేసే వ్రతం. దీని చివర్లో ఒక భవనాన్ని దానంచేయాలి. ఈ వ్రతాన్ని చేసిన వారికి సూర్యలోకం ప్రాప్తిస్తుంది. వారవ్రతం లోనైతే ప్రతిరోజూ సూర్యుని పూజించి ఆయనపేరుకి ఆ వారం (దినం) పేరుని జోడించి సంకల్పం చెప్పుకోవాలి. ఈ వారం రోజులూ నక్తవ్రతాన్ని పాటించాలి. ఈ వ్రతంచేసిన వారికి సర్వఫలప్రాప్తి కలుగుతుంది.


మనమాసాల పేర్లు నక్షత్రాలననుసరించి పెట్టబడ్డాయి కదా! ఆ నక్షత్రం ఆ నెలలో పున్నంతో యోగిస్తే ఆ రోజున ఈ నక్షత్రవ్రతమును మొదలెట్టాలి. కార్తిక మాసంలో కృత్తిక నక్షత్రం పౌర్ణమినాడు పడినరోజు ఈ వ్రతానికి సర్వప్రశస్తం. ఆ రోజు కేశవుని యథాశక్తి అలవాటైన పద్దతిలో పూజించి నాలుగు నెలలపాటు వరుసగా అనగా కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ మాసాలలో నేతితో హవనాలు చేసి బియ్యం, నువ్వులు కలిపిన అన్నాన్ని (కృసరాన్న, కృశరాన్న) ఉప్మా వలె వండి నైవేద్యం పెట్టాలి.


ఆషాఢాది నాలుగునెలల్లో పాయసాన్ని నివేదించి బ్రాహ్మణులకు పాయసంతో భోజనాన్ని పెట్టాలి. పంచగవ్యాలనే ప్రాశిస్తూ జలస్నానాలు చేస్తూ క్రమం తప్పకుండా నైవేద్యాలు పెడుతూ మరో నాలుగు నెలలూ ఇలాగే చేసి సంవత్సరాంతమున భగవంతుని విశేషరూపంతో పూజించి ఇలా ప్రార్థించాలి.


నమో నమస్తే చ్యుత సంక్షయోఽ స్తు 

పాపస్య వృద్ధిం సముపైతు పుణ్యం ! 

ఐశ్వర్య విత్తాది సదా క్షయం మే 

తథాస్తు మే సంతతి రక్షయైవ ॥

యథాచ్యుత త్వం పరతః పరస్మాత్ |

స బ్రహ్మభూతః పరతః పరస్మాత్ |

తథాచ్యుతం మే కురు వంఛితం సదా 

మయా కృతం పాప హరా ప్రమేయ ॥

అచ్యుతానంత గోవింద ప్రసీద యదభీప్సితం । 

తదక్షయమమేయాత్మన్ కురుష్వ పురుషోత్తమ ॥


(ఆచార ... 137/10-12)


ఈ మాసనక్షత్ర వ్రతాన్ని ఏడేళ్ళపాటు చేయాలి. అలా చేసిన వారికి ఆయువు, లక్ష్మి, సద్గతి ప్రాప్తిస్తాయి.


Friday, 18 October 2024

శ్రీ గరుడ పురాణము (302)

 


ఆశ్వయుజ శుద్ధనవమి నాడు ఏకభుక్తముండి దేవినీ, బ్రాహ్మణునీ పూజించి ఒక లక్ష బీజమంత్ర జపాన్ని చేయాలి. దీనిని వీరనవమి వ్రతమంటారు. చైత్ర శుద్ధనవమినాడు దమనక పుష్పాలతో దేవిని పూజిస్తే ఆయురారోగ్యైశ్వర్యములతో బాటు శత్రుంజయత్వం కూడా సిద్ధిస్తుంది. దీనిని దమనక నవమివ్రత మంటారు.


ఈ మాసంలోనే శుద్ధ దశమి నాడు ఏకభుక్త వ్రతాన్ని ప్రారంభించి అలా ఒక యేడాది పాటు చేసి చివర పదిగోవులను దానమిచ్చి దిక్పాలకులకు బంగారు ఒడ్డాణమును నివేదించుకున్నవారికి బ్రహ్మాండాధిపత్యమే సిద్ధిస్తుంది. ఈ వ్రతానికి దిగ్దశమివ్రతమని పేరు.


ఈ ఏకాదశినాడు, చైత్ర ఏకాదశినాడూ ఋషులను పూజించే వ్రతాలున్నవి. అవే ఋష్యైకాదశి వ్రతాలు. దమనక పుష్పాలతోనూ, వాటితోనే కట్టబడిన దండలతోనూ మరీచి, అత్రి, అంగిర, పులస్త్య, పులహ, క్రతు, ప్రచేత, వసిష్ఠ, భృగు, నారద మహర్షులను భక్తి మీరగా పూజిస్తే 'ఇక్కడ' అన్ని భోగాలతో బాటు జ్ఞానం కూడా కలిగి దేహాంతంలో 'అక్కడ' ఋషిలోక నివాస ప్రాప్తి వుంటుంది. (అధ్యాయాలు 133 -135)


శ్రవణద్వాదశి వ్రతం


(నక్షత్రాల పేర్లనూ, తిథుల పేర్లనూ స్త్రీ లింగాలుగా భావించి సంస్కృత మర్యాద ప్రకారం చివర దీర్ఘాన్నుంచే సంప్రదాయముంది. తెలుగులో అవసరం లేదు. పెట్టినా దోషమేమీ కాదు)


ప్రాణులకు భోగమునూ మోక్షాన్నీ కూడా కలిగించే వ్రతమిది. ఏకాదశి, ద్వాదశి, శ్రవణ నక్షత్రంఈ మూడూ యోగించిన రోజును విజయతిథి అంటారు. ఈ రోజు హరిని పూజిస్తూ చేసే అన్ని కార్యాలకూ అక్షయ పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ రోజు ఏకభుక్తం, భక్తవ్రతం, అయాచితం, ఉపవాసం, భిక్షాన్నఖాదనం - ఏది చేసినా దానికి అనంత పుణ్యం వ్రతికి లభిస్తుంది. నియమమేమనగా కంచుపాత్ర, తేనె, మాంసం, లోభం, అసత్యభాషణం, వ్యాయామం, మైథునం, పగటి నిద్ర, అంజనం, రాతిపై నూరిన పదార్థాలు- వీటన్నిటినీ విసర్జించాలి. పెసర వంటి పప్పుధాన్యాలనూ విసర్జించాలి.


భాద్రపద శుక్ల ద్వాదశిశ్రవణ నక్షత్రం కలిసి ఒకేరోజు పడినపుడు అది గొప్ప మహత్తు గల దినమౌతుంది. ఆ రోజు చేసే ఉపవాసం గొప్పఫలప్రదమౌతుంది. ఈ రోజు బుధవారం పడితే నదీ సంగమంలో స్నానం చేసి జపం చేసిన వారికి మహనీయ ఫలాలబ్బుతాయి. ఈ రోజు వామన రూపియైన భగవానుని స్వర్ణమయ ప్రతిమను రత్నాలతో జలాలతో నింపిన పూర్ణకుంభంపై రెండు తెల్లటి వస్త్రాలను కప్పి దానిపై నుంచి ఛత్ర, పాదరక్ష సమన్వితం చేసి పూజించాలి.


ఈ యీ మంత్రాలతో ఎదురుగా సూచింపబడిన స్వామి వారి ఆయా అంగాలను అర్చించాలి.


ఓం నమో వాసుదేవాయ  -  శిరస్సు

ఓం శ్రీధరాయ నమః  -  ముఖమండలం

ఓం కృష్ణాయ నమః   -  కంఠం

ఓం శ్రీ పతయే నమః  -  వక్షఃస్థలం

ఓం సర్వాస్త్రధారిణే నమః - భుజాలు

ఓం వ్యాపకాయ నమః   - కుక్షి ప్రదేశం

ఓం కేశవాయ నమః    - ఉదరం

ఓం త్రైలోక్య పతయే నమః  -  గుహ్యస్థానం

ఓం సర్వభృతే నమః    -   జంఘలు

ఓం సర్వాత్మనే నమః   -   చరణాలు


నేతిని పాయసాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి. కుంభాలనూ కుడుములనూ కూడా నివేదించి రాత్రంతా భజన చేస్తూ జాగరం చెయ్యాలి. తెల్లారి స్నానం చేసి ఆచమనం చేసి మరల స్వామిని పూజించి పుష్పాంజలి సహితంగా ఆయననిలా ప్రార్ధించాలి.


నమోనమస్తే గోవింద బుధశ్రవణ సంజ్ఞక ॥

అఘోఘ సంక్షయం కృత్వా సర్వ సౌఖ్య ప్రదోభవః (ఆచార.. 1136/11,12)


అనంతరం ప్రీయతాం దేవదేవేశ అంటూ బ్రాహ్మణులకు కలశలను దానం చేయాలి. ఈ పూజకు నదీతటం ప్రశస్త స్థలం.


(అధ్యాయం -136)

Thursday, 17 October 2024

శ్రీ గరుడ పురాణము (301)

 


కొన్ని నవమి వ్రతాలు - ఋష్యేకాదశి


చైత్రమాసంలో పునర్వసు నక్షత్రయుక్త శుద్ధ అష్టమిని అశోకాష్టమి అంటారు. ఈ రోజు ఎనిమిది అశోకమంజరి మొగ్గలను కషాయం తీసి త్రాగాలి. అలా త్రాగుతున్నపుడీ శ్లోకం ద్వారా శివప్రియమైన ఆ దేవతను ప్రతి శోక విముక్తికై ప్రార్దించాలి.


త్వామ శోక హరాభీష్ట మధుమాస సముద్భవ |

పిబామి శోక సంతప్తో మామశోకం సదాకురు ॥


(ఆచార .. 133/2)


మంత్రయుక్తమైనదేదైనా గొప్పగా పనిచేస్తుంది.


మహానవమి : ఆశ్వయుజ శుద్ధంలో ఉత్తరాషాఢ నక్షత్రమూ, అష్టమీ కలిసిన నవమిని మహానవమి అంటారు. ఈ తిథిలో చేయు స్నానదానాదులకు అక్షయ ఫలాలుంటాయి. కేవల నవమి వున్నా (ఆశ్వయుజ శుద్ధంలో దుర్గాపూజ చేయాలి. భగవంతుడైన శివుడే ఇతర దేవతలతో బాటు ఈ వ్రతాన్ని చేశాడు. ఇది అత్యంత, అత్యధిక, పుణ్యప్రదమైన మహావ్రతము. శత్రువులపై విజయాన్ని కోరుకునే రాజు నుండి జీవన సమరంలో, ఆకలిపోరాటంలో గెలుపు కావాలనే సామాన్యుడి దాకా ఈ వ్రతాన్ని చేస్తారు;


చెయ్యాలి. జప - హోమాల తరువాత కుమారీలకు భోజనం పెట్టాలి. ఈ వ్రతంలో దేవీ పూజనాది కృత్యాలలో ప్రయుక్తం కావలసిన మూల మంత్రం ఇది.


ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహా


ఈ వ్రతాన్ని చేయువారు ముందుగా అష్టమినాడే కఱ్ఱలతో దేవికి తొమ్మిదిగాని ఒకటిగాని మండపాలను నిర్మించాలి. అందులో దేవి యొక్క బంగారు లేదా వెండి మూర్తిని స్థాపించాలి. దేవి మూర్తిని పుస్తకం, శూలం, ఖడ్గం లేదా పట్టు వస్త్రంలతో పూజించాలి. వాటిని చుట్టూ వుంచాలి. ఆమె యొక్క పదునెనిమిది చేతులలోనూ ఎడమవైపున్న వాటిలో కపాలం, వేటకొడవలి, గంట, అద్దం, విల్లు, ధ్వజం, డమరుకం, పాశం వుండాలి. ఒక చేయి చూపుడు వేలు మనవైపు కాకుండా పైకి చూపుతూ వుండాలి. కుడివైపున్న హస్తాలలో శక్తి, ముద్గరం, శూలం, వజ్రాయుధం, కత్తి, అంకుశం, బాణం, చక్రం, శలాకాయుధం అమర్చబడాలి. ఇతర దేవీ విగ్రహాలకు పదహారు చేతులే వుంటాయి. డమరుకం వుండదు.


మహానవమి నాడు ఉగ్ర చండాదేవికి ప్రాధాన్యమెక్కువ. రుద్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, అతి చండిక లను ఎనమండుగురు దేవీమతల్లుల మధ్య అగ్ని ప్రభలతో వెలిగిపోతూ నిలచి వుంటుంది. ఉగ్రచండాదేవి మిగతా దేవీ మణుల వర్ణాలు క్రమంగా రోచన, అరుణ, కృష్ణ, నీల, ధూమ్ర, శుక్ల, పీత, పాండురములు కాగా ఉగ్రచండాదేవి నాలుకలు చాస్తున్న అగ్నిజ్వాలల రంగులో వుంటుంది. ఆమె సింహంపై స్థితమై వుండగా ఆమె కెదురుగా కత్తి పట్టుకొని మహిషాసురుడుంటాడు. దేవి తన యొక్క ఒక చేతిలో వాని జుట్టు పట్టుకుని వుంటుంది. ఇదీ అమ్మ ఆకారం.


ఈ భగవతి చండిని మూల మంత్రంతో జపించేవానికే బాధలూ వుండవు. పైగా పండితుడు కూడా కాగలడు. ఎందుకంటే అది విద్యామంత్రం కూడ. దేవి విగ్రహంలోని ఖడ్గం త్రిశూలం పదిహేనేసి అంగుళాలుండాలి. గర్భగుడి (లేదా మండపం) నాలుగు కోణాల్లో నైరృత్యాదిగా ఆ మహాదేవి యొక్క ఉగ్రశక్తులైన పూతన (* ఈ పూతన శ్రీ కృష్ణావతారంలో కనిపించే పూతన కాదు. ఈమె ద్వాపర యుగానికి ముందే వున్న మహాశక్తి), పాపరాక్షసి, చరకి, విదారికల ప్రతిమలను పెట్టి వారిని కూడా పూజించాలి.


రాజులు శత్రు సంహారాన్ని గాని ఇతర విజయాలను గాని సంకల్పించినపుడు మహానిష్ఠగా ఈ మహానవమి పూజలను చేస్తుంటారు. వారు దీనితోబాటు చేయవలసిన 


విశేషపూజనమొకటున్నది. అదేమనగా బ్రహ్మాణీ, మహేశీ, కౌమారీ, వైష్ణవి, వారాహ్యాది మాతృకలకు పాలతో స్నానాదులను చేయించి మహాదేవికి రథయాత్రను జరిపించుట. వారి కోరికలన్నీ ఫలిస్తాయి.

Tuesday, 15 October 2024

శ్రీ గరుడ పురాణము (300)

 


బుధాష్టమి - వ్రతం, కథ


బుధవారం, అష్టమి కలిసిన నాడు ఈ వ్రతాన్ని చేస్తారు. జలాశయంలో నిలబడి పంచోపచార విధితో బుధగ్రహాన్ని పూజించాలి. తరువాత గుమ్మడికాయనూ, బియ్యాన్నీ దానమిచ్చి యథాశక్తి దక్షిణనివ్వాలి. బుధదేవుని యొక్క పూజలోవాడే బీజమంత్రం ఓం బుం బుధాయనమః. ఈ దేవ పూజానంతరం కమల గట్టాది ఆహుతులను ఈయడానికి ఓం బుం బుధాయస్వాహా అనే మంత్రాన్ని ప్రయోగించాలి. జలాశయ మధ్యాన్నే పూర్ణమండలంగా భావించుకొని అక్కడే పూజా మండలాన్ని కల్పించుకొని దాని మధ్యలో పద్మదళాన్నీ దానిపై శ్యామవర్ణుడూ ధనుర్బాణయుక్తుడూనగు బుధునీ కల్పించుకొని ఆయన అంగాలను పూజించాలి. అప్పుడు పరమపుణ్యదాయినియైన ఈ వ్రతకథను జలాశయ తీరంలో కూడా పూజచేసి కూర్చుని వినాలి.


ప్రాచీన కాలంలో పాటలీపుత్రంలో 'వీరుడు' అను పేరు గల శ్రేష్ఠ బ్రాహ్మణుడొ కాయన వుండేవాడు. ఆయన భార్య పేరు రంభ, కొడుకు పేరు కౌశికుడు, కూతురిపేరు విజయ. ఆతనికొక ఎద్దు కూడా వుండేది. దానికి ధనపాలుడని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటుండేవాడు. గ్రీష్మఋతువులో నొకనాడు కౌశికుడు ఎద్దుతో సహా గంగా స్నానానికి పోయి నదిలో నుండగా కొందరు దొంగలైన గోపాలకులు వచ్చి ఎద్దుని ధనపాలుని బలవంతంగా పట్టి బంధించి పట్టుకొనిపోయారు. కౌశికుడు దుఃఖితుడు, అన్వేషకుడునై అత్తీర ప్రాంతకాంతారంలో తిరుగసాగాడు. దైవవశాన వీరుని పత్నీ కూతురూ కూడా గంగాజలం కోసం వెళుతూ అక్కడికే చేరుకున్నారు. ఈలోగా కౌశికుడు ఆకలిదప్పులకు లోనై వనం నుండి బయటికి వచ్చి కలువకాడలు తినే ఉద్దేశ్యంతో ఒక కోనేటి వద్దకు రాగా అతని సోదరి కనిపించింది. ఇద్దరూ కాస్తముందుకి వెళ్ళేసరికి అక్కడ కొందరు దివ్య స్త్రీలు ఏదో పూజ చేసుకుంటూ దర్శనమిచ్చారు. కౌశికుడు ఆశ్చర్యపోతూనే వారి వద్దకు పోయి తనకూ తన సోదరికీ ఆహారాన్ని అర్థించాడు. వారీ బ్రాహ్మణ బాలకుని చూసి ప్రసన్నులై ఈ పదార్థాలన్నీ వ్రతానికుద్దేశింపబడినవి. మీరు కూడా మాతో పాటు ఈ బుధదేవుని వ్రతం చేయండి. మీ కోరికలు తీరుతాయి అన్నారు.


ఆ విధంగానే చేసి ప్రసాదం స్వీకరిస్తూ కౌశికుడు తన ఎద్దునీ విజయకి మంచి భర్తనీ కోరుకుని వెనుకకు మరలగా ఎద్దు ఎక్కడినుండో వచ్చి కౌశికుని ఎదుట నిలబడింది. దివ్య స్త్రీలు వారిని దీవిస్తూ అంతర్ధానం చెందారు.


వీరునికి మొదటినుండీ తన కూతుర్ని పరమ ధర్మపరుడైన వానికి, యమధర్మ రాజంత వానికి, ఇచ్చి పెళ్ళి చెయ్యాలని వుండేది. పాపమతడా కోరిక తీరకుండానే మరణించాడు. తరువాత కౌశికుడు విద్యలోనూ వీరత్వంలోనూ సర్వసమర్థుడై రాజ్య ప్రాప్తి కోసం మరల బుధాష్టమి వ్రతాన్ని గావించాడు. దైవమనుకూలించడంతో అచిరకాలంలోనే అయోధ్య సామ్రాజ్యంలో గల విశాల రాజ్యానికి రాజయ్యాడు.


తన తండ్రి కోరికనే తానూ కోరికొని మరల బుధాష్టమి వ్రతాన్ని చేశాడు. వ్రత ప్రభావం వల్ల యమధర్మరాజే స్వయంగా దిగివచ్చి విజయను వివాహం చేసుకొని ఆమెతో 'దేవీ నీవు నా గృహస్వామినివై నన్ననుగ్రహించు' అని ఆహ్వానించాడు. అద్భుతమైన ఆయన గృహంలో ఒక గదికి మాత్రం ఎప్పుడూ తాళం వేసి వుంటుంది. ఆ గది జోలికి పోవద్దని ఆయన చెప్పాడు కూడ. అయినా ఒకనాడేమీ తోచక స్త్రీ సహజమైన చాపల్యంతో విజయ ఆ గది తాళాలను తీసి తలుపు తెరిచి లోనికి చూచింది. వెంటనే ఆ లోపలి దృశ్యం కనబడి ఆమెకు తట్టుకోలేనంత దుఃఖం వచ్చింది. ఆ గదిలో ఆమె తల్లి యమపాశబద్ధురాలై నానాహింసలనూ అనుభవిస్తూ గోచరించింది. ఆమెకు కౌశికుడు తనకు బోధించిన ముక్తి ప్రదాయకమైన బుధాష్టమి వ్రతం గుర్తుకొచ్చింది. వెంటనే ఆమె అనితర సాధ్యమైన భక్తి శ్రద్ధలతో బుధాష్టమి వ్రతాన్ని చేసింది. ఆ వ్రతఫలం వల్ల ఆమె తల్లి పాశమునుండి విడివడి దేవలోకం వైపు సాగిపోయింది.


అష్టమి తిథినాడు పగలు వ్రతం చేసి రాత్రి నక్తవ్రత నియమం పాటించి భోంచేస్తూ ఇలా ఒక యేడాది పాటు అన్ని అష్టమి దినాలలోనూ వ్రతం చేసి చివర గోదానం చేస్తే ఆ వ్రతి ఇంద్రపదానికర్హుడౌతాడు. ఈ వ్రతానికి సద్గతి వ్రతమని పేరు. పుష్య శుక్లాష్టమి నాడు చేసే వ్రతానికి మహారుద్రవ్రతమని పేరు.


ఒక నెలలో రెండు అష్టములూ బుధవారాలనాడే పడితే ఆ వ్రతికిక ఎదురేలేదు. అతని సంపత్తి ఏనాటికీ తగ్గదు. ముక్తిని కోరేవారు ఈ వ్రతం చేస్తూ పిడికిలి బిగించి రెండు వేళ్ళను విడదీసి, మిగిలిన పిడికిలితో ఎనిమిది మార్లుబియ్యాన్ని తీసి గిన్నెలో వేసి ఆ ద్రవ్యంతోనే సొజ్జి లేదా జావను వండుకొని తినాలి. వ్రతసమాప్తి సమయంలో దానితో పాటు చింతపండునూ, కరేలువను ఆకు కూరను మామిడాకుల దోనెలో పెట్టుకొని తిని వ్రత కథను శ్రద్దగా విన్నవారి కన్ని కోరికలూ తీరతాయి. (అధ్యాయం -132)

Monday, 14 October 2024

శ్రీ గరుడ పురాణము (299)

 


తరువాత మహాలక్ష్మికీ, వసుదేవునికీ, నందబలరామ యశోదలకూ అర్ఘ్యమివ్వాలి. అనంతరం శ్రీకృష్ణ పరమాత్మను ఇలా ప్రార్థించాలి.


అనంతం వామనం శౌరిం వైకుంఠం పురుషోత్తమం ॥

వాసుదేవం హృషీకేశం మాధవం మధుసూదనం |


వరాహంపుండరీకాక్షం నృసింహం దైత్య సూదనం ॥

దామోదరం పద్మనాభం కేశవం గరుడధ్వజం |


గోవింద మచ్యుతం దేవమనంతమప రాజితం ॥

అధోక్షజం జగద్బీజం సర్గస్థిత్యంత కారణం |


అనాది నిధనం విష్ణుం త్రిలోకేశంత్రివిక్రమం ॥

నారాయణం చతుర్భాహుం శంఖ చక్ర గదాధరం |


పీతాంబర ధరం దివ్యం వనమాలావిభూషితం ॥

శ్రీ వత్సాంకం జగద్ధామం శ్రీ పతిం శ్రీధరం హరిం | 


యేదేవం దేవకీ దేవీ వసుదేవాదజీ జనత్ ॥

భౌమస్య బ్రాహ్మణో గుప్త్య తస్మై బ్రహ్మాత్మనే నమః॥ (131/10-16)


ఈ ప్రకారంగా శ్రీకృష్ణభగవానుని అనేక నామ సంకీర్తన చేసి మరల సద్గతికై ఇలా ప్రార్ధించాలి.


త్రాహిమాం దేవ దేవేశ హరే సంసార సాగరాత్ | 

త్రాహి మాం సర్వపాపఘ్న దుఃఖశోకార్ణవాత్ ప్రభో ॥


దేవకీ నందన శ్రీశ హరే సంసార సాగరాత్ | 

దుర్వృత్తాం స్త్రాయసే విష్ణో యే స్మరంతి సకృత్సకృత్ ॥


సోఽహం దేవాతి దుర్వృత్త స్త్రాహి మాం శోక సాగరాత్ ।

పుష్కరాక్ష నిమగ్నో హం మహత్యజ్ఞాన సాగరే ॥ 


త్రాహి మాం దేవ దేవేశ త్వామృతేఽన్యో న రక్షితా |

స్వ జన్మవాసుదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ ॥


జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయనమో నమః । 

శాంతి రస్తు శివంచాస్తు ధన విఖ్యాతి రాజ్య భాక్॥ (ఆచార.. 131/17-21)


ఈ ప్రార్థనలో వేడుకొన్నవన్నీ అనగా, అశాంతినుండి రక్షణ, దురాచారం నుండి విడుదల, అజ్ఞాన నాశనం, శాంతి, శుభం, ధనం, విఖ్యాతి, అధికారం ఇవన్నీ ఈ వ్రతం చేసినవారికి లభిస్తాయి.

(అధ్యాయం -131)