Monday, 28 October 2024

శ్రీ గరుడ పురాణము (308)

 


చిత్రకునికి పృథు, విపృథు, సాత్త్వత నందనుడైన అంధకునికి శుచి, భజమాన పుత్రుడైన కుకురునికి ధృష్టుడు (ధృష్టకుడు) జన్మించారు. ధృష్టుని వంశంలో క్రమంగా కాపోతరోమకుడు, విలోముడు, తుంబురుడు, దుందుభి, పునర్వసు, ఆహుకుడు జన్మించారు. ఆహుకునికి ఆహుకియను కూతురూ దేవకుడు, ఉగ్రసేనుడు అను కొడుకులు జనించగా దేవకుని కూతురుగా (వరమున) శ్రీకృష్ణపరమాత్మ కన్నతల్లి దేవకి ఆవిర్భవించింది. దేవకునికి మరొక ఆరుగురు కూతుళ్ళు కూడా కలిగారు. ఆయన తన సప్త కన్యలనూ వసుదేవునికే ఇచ్చి వివాహం చేశాడు. దేవక పుత్రుడైన సహదేవునికి దేవవాన్ ఉపదేవ నామకులైన ఇద్దరు కొడుకులు.


అంధక పుత్రుడైన భజమాను నందనుడు విదూరథుని వంశంలో క్రమంగా శూర, శమి, ప్రతిక్షత్ర, స్వయంభోజ, హృదిక, కృతవర్మాదులు జనించారు.


శూరునికైదుగురు కూతుళ్ళు కూడా పుట్టారు. వారు పృథ, శ్రుతదేవి, శ్రుతకీర్తి, శ్రుతశ్రవ, రాజాధిదేవి. వీరిలో పృథను కుంతి భోజకుని పెంపకానికిచ్చేశారు. అతడామెను అల్లారుముద్దుగా పెంచి పాండురాజుని కిచ్చి వివాహం చేశాడు. ఆమె పుత్రులే భారతవీరులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. తన సవతి సహగమనం చేయడంతో ఆమె పుత్రులైన నకుల సహదేవులను కూడ పృథయే పెంచింది. ఈమె పుత్రుడే కర్ణుడు కూడ. ఈమెను 'కుంతి' అని పిలిచేవారు.


ఈ కుంతి చెల్లెలు శ్రుతదేవి కడుపున బుట్టినవాడే దంతవక్త్రుడు. శ్రుతకీర్తి కేకయ రాజుని పెండ్లాడి సతర్దనాది అయిదుగురు కొడుకులను కన్నది. రాజాధిదేవికి విందు, అనువిందులని ఇద్దరు కొడుకులు పుట్టారు. శ్రుతశ్రువ చేది రాజైన దమఘోషుని పెండ్లాడింది. ఆమె కొడుకే శిశుపాలుడు.


వసుదేవునికి పౌరవ, మదిర, దేవకి, రోహిణి, భద్రాది భార్యలలో దేవకీ నందనుడు శ్రీకృష్ణపరమాత్మ కాగా రోహిణీపుత్రుడు బలరాముడు. బలరామునికి రేవతి ద్వారా సారణ, శఠాది పుత్రులు జనించారు. దేవకి పుత్రులైన కీర్తిమాన్, సుషేణ, ఉదార్య, భద్రసేన, ఋజుదాస, భద్రదేవులను కంసుడు చంపేశాడు. శ్రీకృష్ణునికి భార్యల ద్వారా చాలమంది కొడుకులు పుట్టారు. వారిలో ప్రద్యుమ్న, చారుదేష్ణ, సాంబులు ప్రధానులు. ప్రద్యుమ్నపత్ని కకుద్మినికి మహాపరాక్రమశాలియైన అనిరుద్ధుడు పుట్టాడు. అనిరుద్ధునికి సుభద్రయను పేరు గల పత్ని ద్వారా వజ్రుడు జన్మించాడు. అతడు అతని పుత్రుడు ప్రతి బాహువు, మనుమడు చారు (దత్తుడు) రాజ్యాలనేలారు.


యయాతి పుత్రుడైన తుర్వసుని వంశంలో వహ్ని, భర్గ, భాను, కరంధమ, మరుత్తులు జనించారు.


రుద్రదేవా! ఇక ద్రుహ్యు అను వంశములను వర్ణిస్తాను వినండి.


యయాతి పుత్రుడు ద్రుహ్యుని తరువాత అతని వంశంలో వరుసగా సేతు, ఆరద్ధ, గాంధార, ధర్మ, ఘృత, దుర్గమ, ప్రచేతులు జన్మించారు.


అనువు వంశంలో వరుసగా సభానల, కాలంజయ, సృంజయ్, పురంజయ, జనమేజయ, మహాశాల, ఉశీనర, శిబి, వృషదర్భ, మహామనోజ, తితిక్షు, రూషద్రథ, సుతపులు జన్మించారు. సుతపసుతుడైన బలి మహారాజు కైదుగురు కొడుకులు. వారే అంగ, వంగ, కళింగ, ఆంధ్ర, పౌండ్రులు.

Saturday, 26 October 2024

శ్రీ గరుడ పురాణము (307)

 

నహుష చక్రవర్తికి యతి, యయాతి, సంయాతి, అయాతి, వికృతి నామకులగు మరో అయిదుగురు కుమారులున్నారు. యయాతికి దేవయాని ద్వారా యదువు తుర్వసుడు పుట్టారు. వృషపర్వపుత్రియగు శర్మిష్ఠ ద్వారా యయాతికి ద్రుహ్యు, అను, పురునామకులైన తనయులు జనించారు.


యదువుకు సహస్రజిత్తు, క్రోష్టువు, రఘువులనే కొడుకులు పుట్టారు. సహస్రజిత్తు కొడుకు శతజిత్తు కాగా అతనికి హయహైహయులు జనించారు. హయునికి అనరణ్యుడూ హైహయునికి ధర్ముడూ పుట్టారు. ధర్ముని వంశక్రమంలో ధర్మనేత్రుడు, కుంతి (కుంతుడు), సాహంజుడు, మహిష్మంతుడు, భద్రశ్రేణ్యుడు, దుర్దముడు వర్ధిల్లారు.


దుర్దముని కారుగురు కొడుకులు. వారు ధనక, కృతవీర్య, జానక, కృతాగ్ని, కృతవర్మ,కృతౌజులు. వీరంతా పరమ బలశాలులే. కృతవీర్యుని కొడుకు అర్జునుడు, అతని పుత్రుడు శూరసేనుడు. కృతవీర్యునికి అర్జునుడే కాక, ఇంకా జయధ్వజ, మధు, శూర, వృషణ నామకులైన పుత్రులు జనించారు. వీరంతా గొప్ప సువ్రతులు. జయధ్వజ పుత్రుడు తాలజంఘుడు కాగా అతని తనయుడు భరతుడు. వృషణపుత్రుడు మధువు, అతని పుత్రుడు వృష్టి, ఈ వృష్టియే వృష్టి వంశానికి మూలపురుషుడు.


క్రోష్టు వంశంలో క్రమంగా విజజ్జివాన్, ఆహి, అశంకు, చిత్రరథ, శశ బిందువులు జనించారు. ఈ శశబిందునికి లక్షమంది పత్నుల ద్వారా పృథుకీర్తి, పృథుజయ, పృథుదాన, పృథుశ్రవాది పదిలక్షలమంది శ్రేష్ఠులైన పుత్రులుదయించారు. పృథుశ్రవుని పుత్రుడు, అతని కొడుకు ఉశనుడు, అతని పుత్రుడు శితగు, అతని తనయుడు శ్రీ రుక్మకవచుడు. ఇతనికి రుక్మ, పృథురుక్మ, జ్యామఘ, హరి, పాలితులనే పుత్రులు పుట్టారు. జ్యామఘుని కొడుకు పేరు విదర్భుడు.


విదర్భునికి శైబ్య అనే భార్య ద్వారా క్రథ, కౌశిక, రోమపాదులను పుత్రులు కలిగారు. రోమపాదుని కొడుకు బభ్రువు, మనుమడు ధృతి.


కౌశికుని వంశంలో ఋచి, చేది, కుంతి, వృష్టి, నివృత్తి, దశార్హ, వ్యోమ, జీమూత, వికృతి, భీమరథ, మధురథ, శకుని, కరింభ, దేవమాన్ (దేవనత) దేవక్షత్ర, మధు, కురువంశ, అను పురుహోత్ర, అంశు, సత్త్వ శ్రుత, సాత్త్వతులు రాజులైనారు.


సాత్త్వతునికి ఏడుగురు కొడుకులు. వారు భజినుడు, భజమానుడు, అంధకుడు, మహా భోజుడు, వృష్టి, దివ్యవంతుడు, దేవవృధుడు. భజమానుని కొడుకుల పేrlu నిమి, వృష్టి, అయుతాజిత్, శతజిత్, సహస్రజిత్, బభ్రు, దేవ, బృహస్పతి.


మహాభోజుని వంశంలో భోజుడు, వృష్టి, సుమిత్రుడు జనించగా సుమిత్రుని ముగ్గురు కొడుకులైన స్వధాజిత్, అనామిత్ర, అశినులలో అనమిత్రుని ముగ్గురు కొడుకులయిన నిఘ్న, ప్రసేన, శిబిలలో శిబి కొడుకు సత్యకుడు కాగా అతని కొడుకు సాత్యకి. ఇతని వంశంలో వరుసగా సంజయుడు, కులి, యుగంధరుడు జన్మించారు. వీరిని శైబేయులంటారు.


అనమిత్రునికి వృష్టి, శ్వఫల్కుడు, చిత్రకుడు అని మరో ముగ్గురు కొడుకులున్నారు. శ్వఫల్కునికి గాందినియను పత్ని ద్వారా పరమవైష్ణవోత్తముడైన అక్రూర మహాశయుడు జన్మించాడు. ఉపమద్గుడు, దేవవంతుడు, ఉపదేవుడు అక్రూర నందనులు.

శ్రీ గరుడ పురాణము (306)

 


కుశుడు, అతిధి, నిషధుడు, నలుడు, నభస్సు (నభుడు), పుండరీకుడు, క్షేమధన్వుడు, దేవానీకుడు అహీనకుడు, రురుడు, పారియాత్రుడు, దలుడు, చలుడు, ఉక్షుడు, వజ్రనాభుడు, గణుడు, ఉషితాశ్వుడు, విశ్వసహుడు, హిరణ్యనాభుడు, పుష్పకుడు, ధ్రువసంధి, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, పద్మవర్ణుడు, శీఘ్రుడు, మరుడు, సుశ్రుతుడు, ఉదావసుడు, నందివర్ధనుడు, సుకేతువు, దేవరాతుడు, బృహదుకుడు, మహావీర్యుడు, సుధృతి, ధృష్టకేతువు, హర్యశ్వుడు, మరుడు, ప్రతీంధకుడు, కృతిరథుడు, దేవమీఢుడు, విబుధుడు, మహాధృతి, కీర్తిరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, సీరధ్వజుడు.


సీరధ్వజునికి సీత యను పేరుగల పుత్రిక, కుశధ్వజుడనే తమ్ముడు ఉన్నట్టు తెలుస్తోంది. సీరధ్వజుని పుత్రుడైన భానుమంతుని వంశంలో క్రమంగా శతద్యుమ్నుడు, శుచి, ఊర్ణుడు, సనద్వాజుడు, కులి, అనంజనుడు, కులిజిత్తు, ఆధినేమికుడు, శ్రుతాయువు సుపార్శ్వుడు, సృంజయుడు, క్షేమారి, అనేనుడు, రామరథుడు, ఉపగురువు, ఉపగుప్తుడు, స్వాగతుడు, స్వవరుడు, సువర్చుడు, సుపార్శ్వుడు, సుశ్రుతుడు, జయుడు, విజయుడు, ఋతుడు, సునయుడు, వీతిహవ్యుడు, ధృతి, బహులాశ్వుడు, కృతి, జనకుడు రాజులైనారు.


ఈ జనక మహారాజు రెండు వంశాలవాడని తెలుస్తోంది. ఆయన రాజయోగిగా యోగమార్గాన్ని అనుసరించి దానిని అభివృద్ధి చేశాడు. (అధ్యాయం -138)


చంద్రవంశ వర్ణన


శ్రీహరి: పరమశివాదులకు ఇంకా ఇలా చెప్పసాగాడు. "నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ, ఆయన నుండి అత్రి, ఆయననుండి చంద్రుడు ప్రాదుర్భవించారు.


చంద్రుని నుండి అతని వంశంలో బుధుడు, పురూరవుడు కలిగారు. చంద్రుని మనుమడైన పురూరవునికి ఊర్వశి ద్వారా ఆరుగురు పుత్రులు కలిగారు. వారు శ్రుతాత్మక, విశ్వావసు, శతాయు, ఆయు, ధీమాన్, అమావసులు.


అమావసుని వంశంలో వరుసగా భీమ, కాంచన, సుహోత్ర, జహ్ను, సుమంతు, ఉపజాపక, బలాకాశ్వ, కుశులుద్భవించారు. కుశునికి నలుగురు కొడుకులు వారు కుశాశ్వ కుశనాభ వసు అమూర్తరయులు.


కుశాశ్వుని కొడుకు గాధి. గాధి కొడుకే సుప్రసిద్ధ రాజు, రాజర్షి, కడకు బ్రహ్మర్షి, గాయత్రి మంత్ర ద్రష్టయునగు విశ్వమిత్రుడైన విశ్వామిత్రుడు. ఆయనకు దేవరాత, మధుచ్ఛందాది అనేక పుత్రులు కలిగారు. గాధి తన కూతురైన సత్యవతిని ఋచీకుడను బ్రాహ్మణోత్తమునకిచ్చి పెండ్లి చేశాడు. ఋచీక పుత్రుడు జమదగ్ని. జమదగ్ని కొడుకే పరశురాముడు.


బుధపుత్రుడైన ఆయువు కొడుకు నహుషుడు. ఇతని పుత్రులు అనేన, రాజి, క్షత్ర వృద్ధ, రంభకులు. క్షత్ర వృద్ధ (వృద్ధి) పుత్రుడు సుహోత్ర మహారాజుకు కాశ్య, కాశ, గృత్సమదులని ముగ్గురు తనయులు. గృత్సమదుని కొడుకే శౌనకుడు. కాశ్యపుత్రుడైన దీర్ఘతమునికి ధన్వంతరి జనించాడు. ఆతని వంశంలో క్రమంగా కేతుమాన్, భీమరథ, దివోదాస, ప్రతర్దను లుదయించారు. ప్రతర్దనునే శత్రుజిత్తని కూడా అంటారు.


శత్రుజిత్తుని వంశంలో వరుసగా ఋతధ్వజ, అలర్క, సన్నతి, సునీత, సత్యకేతు, విభు, సువిభు, సుకుమార, ధృష్టకేతు, వీతిహోత్ర, భర్గ, భూమికులు రాజ్యం చేశారు.


నహుష పుత్రుడైన రాజి లేదా రజికి అయిదువందలమంది కొడుకులు పుట్టారు. కానీ వారందరినీ ఇంద్రుడు సంహరించాడు. అక్కడ నహుష పుత్రుడైన క్షత్ర వృద్ధుని వంశం వర్దిల్లింది. వారి పేర్లు ప్రతిక్షత్ర, సంజయ, విజయ, కృత, వృషధన, సహదేవ, అదీన జయత్సేన, సంకృతి క్షత్ర ధర్ములు, ఇది నహషుని ఒక వంశం.

Monday, 21 October 2024

శ్రీ గరుడ పురాణము (305)

 


వీరంతా వైశాలక రాజులని పిలువబడ్డారు. వీరిలో తృణబిందువుకి అలంబుష అనే అప్సరస ద్వారా ఇలవిలాయను కూతురు కూడా కలిగింది.


వైవస్వత మనుపుత్రుడు శర్యాతికి సుకన్యయను కూతురు పుట్టింది. ఆమె చ్యవన మహర్షిని పెండ్లాడింది. శర్యాతి వంశంలో వరుసగా అనంతుడు, రేవతుడు, రైవతుడు జనించారు. రైవతుని కూతురు రేవతి.


వైవస్వత మనుపుత్రుడు ధృష్టునికి ధార్ష నామకపుత్రుడు జనించాడు. అతడు వైష్ణవుడైనాడు. మనుపుత్రుడైన నభగుని వంశంలో క్రమంగా నేదిష్ఠ, అంబరిష, విరూప, పృషదక్ష (శ్వ) రథీనరులు జనించారు. వీరంతా వాసుదేవ భక్తులు.


మనుపుత్రుడైన ఇక్ష్వాకునికి వికుక్షి, నిమి, దండకులని ముగ్గురు కొడుకులు. వికుక్షి యజ్ఞేయ శశకము(కుందేలు)ను భక్షించి శశాదనామంతో విఖ్యాతుడైనాడు. అతని కొడుకులు పురంజయుడు, కకుతుడు. ఈ రెండవవాని కొడుకు వేనుడను పేరు గల అనేనసుడు. ఆతని పుత్రుడే విష్ణువు అంశగల పృథుచక్రవర్తి. ఆ తరువాత వంశపారంపర్యంగా విశ్వరాతుడు, ఆర్ద్రుడు, యువనాశ్వుడు, శ్రీవత్సుడు, బృహదశ్వుడు, కువలాశ్వుడు, ధృఢాశ్వుడు పుట్టారు. దృఢాశ్వ చక్రవర్తి ధుంధుమారుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత ఆ వంశంలో దృఢాశ్వ కుమారులు చంద్రాశ్వుడు, కపిలాశ్వుడు, హర్యశ్వుడు అను వారలలో హర్యశ్వుని వంశంలో వరుసగా నికుంభుడు, హితాశ్వుడు, పూజాశ్వుడు, యువనాశ్వుడు, మాంధాత జన్మించారు. మాంధాతకతని పత్ని బిందుమతి ద్వారా ముచుకుందుడు, అంబరిషుడు ('రి'కి దీర్ఘం పెట్టకూడదు) పురుకుత్సుడు అను ముగ్గురు కొడుకులూ, యాభైమంది కూతుళ్ళూ పుట్టారు. మాంధాత కూతుళ్ళందరినీ సౌభరి మహాముని పెండ్లాడాడు.


అంబరిషుని కొడుకు యువనాశ్వుడు, అతని కొడుకు హరితుడు. పురుకుత్సునికి నర్మద ద్వారా త్రసదస్యువను పుత్రుడుదయించాడు. అతని వంశంలో క్రమంగా అనరణ్యుడు, హర్వశ్వుడు, వసుమనుడు, త్రిధన్వుడు, త్రయ్యారుణుడు, సత్యరతుడు (త్రిశంకువు) హరిశ్చంద్రుడు, రోహితాశ్వుడు, హరీతుడు, చంచు, విజయుడు, రురుకుడు, వృకుడు, బాహువు, సగరుడు ఉద్భవించి చక్రవర్తులైనారు.


సగరునికి సుమతి అను పత్ని ద్వారా అరవైవేలమంది పుత్రులు కలిగారు. కాని వారిలో నెవరూ మిగలలేదు. పాతాళంలో కపిల మహర్షిని దూషించి, కొట్టిన పాపానికి, వారి పాపాగ్నిలో వారే కాలి బూడిదైపోయారు.


సగరుని రెండవపత్ని కేశినికి అసమంజసుడు, అతనికి అంశుమంతుడు, అతనికి దిలీపుడు, ఆయనకు భగీరధుడు జనించారు. ఈ భగీరథుడే దివిజ గంగను భువికి తెచ్చిన మహనీయుడు. ఆయననుండి సూర్యవంశక్రమం ఇలా పరంపరగా తామర తంపరగా కొనసాగింది. భగీరథుని తరువాత వరుసగా శ్రుతుడు, నాభాగుడు, అంబరిషుడు, సింధు ద్వీపుడు, అయుతాయువు, ఋతుపర్ణుడు, సర్వకాముడు, సుదాసుడు, సౌదాసుడు (మిత్ర సహుడు) కల్మాషపాదుడు, అశ్వకుడు, మూలకుడు, దశరథుడు, ఐలబిలుడు, విశ్వసహుడు, ఖట్వాంగుడు, దీర్ఘబాహువు, అజుడు, దశరథుడు చక్రవర్తులైనారు. ఈ దశరథపుత్రులే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు.


శ్రీరామచంద్రుని పుత్రులు కుశలవులు, భరతునికి తార పుష్కరులూ, లక్ష్మణునికి చిత్రాంగద చంద్రకేతువులూ, శత్రుఘ్నునికి సుబాహు శూరసేనులూ జనించారు. కుశమహా రాజు వంశం ఈ విధంగా వర్ధిల్లింది.


* (ఎవరి పేరిటనైతే ఈ వంశాన్ని రఘువంశమని వ్యవహరిస్తారో ఆ రఘుమహారాజు పేరు కనబడకపోవడంచింత్యం) అయితే ఈ పురాణంలోనే 143వ అధ్యాయంలో అజుడు రఘుపుత్రుడని చెప్పబడింది. అంటే ఈ అధ్యాయంలో పేర్కొనబడిన దీర్ఘబాహువే రఘుమహారాజని తెలుస్తోంది. 

Sunday, 20 October 2024

శ్రీ గరుడ పురాణము (304)

 



స్వచ్ఛ హృదయులై ఉపవాససహితంగా ఒక సంవత్సర పర్యంతం యథాక్రమంగా ఏకాదశి, అష్టమి, చతుర్దశి, సప్తమి తిథుల్లో విష్ణు, దుర్గ, శివ, సూర్య పూజలను గావించిన వారికి అన్ని నిర్మల అభిలాషలూ తీరుతాయి. దేహాంతంలో దేవలోక ప్రాప్తి ఉంటుంది. వ్రత కాలంలో ఏకభుక్తంగాని, నక్తవ్రతం గాని, ఆయాచితంగాని, ఉపవాసం గాని పాటించాలి. పైన చెప్పిన దేవతలందరినీ శాకాదులతో పూజిస్తే భోగం, మోక్షం రెండూ అబ్బుతాయి.


పాడ్యమినాడు కుబేర, అగ్ని, నాసత్య, దస్ర నామక దేవతలనూ, విదియ నాడు లక్ష్మినీ, యమధర్మరాజునూ, పంచమినాడు పార్వతీదేవిని నాగగణాలనూ పూజించాలి. అలాగే షష్ఠినాడు కార్తికేయునీ సప్తమినాడు సూర్యదేవునీ, అష్టమి నాడు దుర్గనీ, నవమినాడు మాతృకలను తక్షకునీ పూజించాలి. అదేవిధంగా దశమి నాడు ఇంద్రునీ, కుబేరునీ, ఏకాదశినాడు సప్తర్షులనూ, ద్వాదశి నాడు హరినీ, త్రయోదశినాడు మన్మథునీ, చతుర్దశినాడు మహేశ్వరునీ, పున్నం నాడు బ్రహ్మనీ, అమావాస్యనాడు పితృదేవతలనూ పూజించాలి.


(అధ్యాయం -137)


సూర్యవంశవర్ణన


రుద్రదేవా! ఇక భరతఖండాన్నేలిన మహారాజ వంశాలను వర్ణిస్తాను. ముందుగా సూర్యవంశ వర్ణన గావిస్తాను.


విష్ణు భగవానుని నాభికమలం నుండి బ్రహ్మ, ఆయన అంగుష్ఠ భాగము నుండి దక్షప్రజాపతి ఉద్భవించగా దక్షపుత్రిగా దేవమాత అదితి జనించింది. అదితి నుండి వివస్వతుడను పేర సూర్యుడు, ఆయనకు వైవస్వతమనువు జనించారు. మనువునకు  తొమ్మండుగురు కొడుకులు. వారు ఇక్ష్వాకువు, శర్యాతి, నృగుడు, ధృష్ట, పృషధ్రుడు, నరిష్యంతుడు, నభగుడు, దిష్ట, శశకుడు (కరషుడు). 


మనువుకు ఇల అను కూతురూ, సుద్యుమ్నుడను కొడుకు కూడా కలిగారు. ఇలకు బుధుని వల్ల పురూరవ మహారాజూ, సుద్యుమ్నునికి అతని పత్ని ద్వారా ఉత్కళ, వినత, గయ నామకులయిన పుత్రులూ జనించారు.


గోవధ చేసిన పాపానికి మనుపుత్రుడు పృషధ్రుడు శూద్రుడైపోయాడు. కరుషుని నుండి క్షత్రియుల ఉత్పత్తి జరిగింది. వారు కారుషులుగా విఖ్యాతి నందారు. దిష్టపుత్రుడైన నాభాగుడు వైశ్యుడైనాడు. అతని కొడుకు పేరు భలందనుడు. వాని వంశమున వరుసగా వత్స ప్రీతి, అతనికి పాంశుఖ నిత్రులు, ఖనిత్రునికి భూపుడు, అతనికి క్షుపుడు, అతనికి వింశుడు, అతనికి వివింశకుడు కలిగారు.


వివింశకుని వంశములో వరుసగా ఖనినేత్రుడు, విభూతి, కరంధముడు, అవిక్షితుడు, మరుత్తు, నరిష్యంతుడు, తముడు, రాజవర్ధనుడు, సుధృతి, నరుడు, కేవలుడు, బంధుమానుడు జనించారు.


బంధుమానుని వంశంలో వరుసక్రమంలో వేగవానుడు, బుధుడు, తృణబిందువు, విశాలుడు, హేమచంద్రుడు, చంద్రకుడు, ధూమ్రాశ్వుడు, సృంజయుడు, సహదేవుడు, కృశాశ్వుడు, సోమదత్తుడు, జనమేజయుడు కలిగారు.

Saturday, 19 October 2024

శ్రీ గరుడ పురాణము (303)

 


తిథి, వార, నక్షత్రాది వ్రతాలు


చైత్ర శుద్ధ త్రయోదశిని కామదేవ త్రయోదశి అంటారు. ఈ రోజున తెల్లకమలం మున్నగు పూలతో రతి, ప్రీతియుక్తుడు, మణి విభూషితుడు, శోక విదూరకుడునగు మన్మథుని పూజించాలి. ఈ వ్రతం పేరు మదనత్రయోదశి. ఇది సుఖసంతోషాలనిస్తుంది.


ప్రతిమాసంలోనూ రెండు చతుర్దశులనాళ్ళూ రెండు అష్టమి దినాల్లోనూ ఉపవాసం చేసి పరమశివుని పూజించాలి. ఇది ముక్తిప్రదాయకం. ఈ వ్రతానికి శివాష్టమీ చతుర్దశి వ్రతమని పేరు.


ధామవ్రతం కార్తీకమాసంలో ఏవో మూడు రాత్రులపాటు ఉపవాసముండి చేసే వ్రతం. దీని చివర్లో ఒక భవనాన్ని దానంచేయాలి. ఈ వ్రతాన్ని చేసిన వారికి సూర్యలోకం ప్రాప్తిస్తుంది. వారవ్రతం లోనైతే ప్రతిరోజూ సూర్యుని పూజించి ఆయనపేరుకి ఆ వారం (దినం) పేరుని జోడించి సంకల్పం చెప్పుకోవాలి. ఈ వారం రోజులూ నక్తవ్రతాన్ని పాటించాలి. ఈ వ్రతంచేసిన వారికి సర్వఫలప్రాప్తి కలుగుతుంది.


మనమాసాల పేర్లు నక్షత్రాలననుసరించి పెట్టబడ్డాయి కదా! ఆ నక్షత్రం ఆ నెలలో పున్నంతో యోగిస్తే ఆ రోజున ఈ నక్షత్రవ్రతమును మొదలెట్టాలి. కార్తిక మాసంలో కృత్తిక నక్షత్రం పౌర్ణమినాడు పడినరోజు ఈ వ్రతానికి సర్వప్రశస్తం. ఆ రోజు కేశవుని యథాశక్తి అలవాటైన పద్దతిలో పూజించి నాలుగు నెలలపాటు వరుసగా అనగా కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ మాసాలలో నేతితో హవనాలు చేసి బియ్యం, నువ్వులు కలిపిన అన్నాన్ని (కృసరాన్న, కృశరాన్న) ఉప్మా వలె వండి నైవేద్యం పెట్టాలి.


ఆషాఢాది నాలుగునెలల్లో పాయసాన్ని నివేదించి బ్రాహ్మణులకు పాయసంతో భోజనాన్ని పెట్టాలి. పంచగవ్యాలనే ప్రాశిస్తూ జలస్నానాలు చేస్తూ క్రమం తప్పకుండా నైవేద్యాలు పెడుతూ మరో నాలుగు నెలలూ ఇలాగే చేసి సంవత్సరాంతమున భగవంతుని విశేషరూపంతో పూజించి ఇలా ప్రార్థించాలి.


నమో నమస్తే చ్యుత సంక్షయోఽ స్తు 

పాపస్య వృద్ధిం సముపైతు పుణ్యం ! 

ఐశ్వర్య విత్తాది సదా క్షయం మే 

తథాస్తు మే సంతతి రక్షయైవ ॥

యథాచ్యుత త్వం పరతః పరస్మాత్ |

స బ్రహ్మభూతః పరతః పరస్మాత్ |

తథాచ్యుతం మే కురు వంఛితం సదా 

మయా కృతం పాప హరా ప్రమేయ ॥

అచ్యుతానంత గోవింద ప్రసీద యదభీప్సితం । 

తదక్షయమమేయాత్మన్ కురుష్వ పురుషోత్తమ ॥


(ఆచార ... 137/10-12)


ఈ మాసనక్షత్ర వ్రతాన్ని ఏడేళ్ళపాటు చేయాలి. అలా చేసిన వారికి ఆయువు, లక్ష్మి, సద్గతి ప్రాప్తిస్తాయి.


Friday, 18 October 2024

శ్రీ గరుడ పురాణము (302)

 


ఆశ్వయుజ శుద్ధనవమి నాడు ఏకభుక్తముండి దేవినీ, బ్రాహ్మణునీ పూజించి ఒక లక్ష బీజమంత్ర జపాన్ని చేయాలి. దీనిని వీరనవమి వ్రతమంటారు. చైత్ర శుద్ధనవమినాడు దమనక పుష్పాలతో దేవిని పూజిస్తే ఆయురారోగ్యైశ్వర్యములతో బాటు శత్రుంజయత్వం కూడా సిద్ధిస్తుంది. దీనిని దమనక నవమివ్రత మంటారు.


ఈ మాసంలోనే శుద్ధ దశమి నాడు ఏకభుక్త వ్రతాన్ని ప్రారంభించి అలా ఒక యేడాది పాటు చేసి చివర పదిగోవులను దానమిచ్చి దిక్పాలకులకు బంగారు ఒడ్డాణమును నివేదించుకున్నవారికి బ్రహ్మాండాధిపత్యమే సిద్ధిస్తుంది. ఈ వ్రతానికి దిగ్దశమివ్రతమని పేరు.


ఈ ఏకాదశినాడు, చైత్ర ఏకాదశినాడూ ఋషులను పూజించే వ్రతాలున్నవి. అవే ఋష్యైకాదశి వ్రతాలు. దమనక పుష్పాలతోనూ, వాటితోనే కట్టబడిన దండలతోనూ మరీచి, అత్రి, అంగిర, పులస్త్య, పులహ, క్రతు, ప్రచేత, వసిష్ఠ, భృగు, నారద మహర్షులను భక్తి మీరగా పూజిస్తే 'ఇక్కడ' అన్ని భోగాలతో బాటు జ్ఞానం కూడా కలిగి దేహాంతంలో 'అక్కడ' ఋషిలోక నివాస ప్రాప్తి వుంటుంది. (అధ్యాయాలు 133 -135)


శ్రవణద్వాదశి వ్రతం


(నక్షత్రాల పేర్లనూ, తిథుల పేర్లనూ స్త్రీ లింగాలుగా భావించి సంస్కృత మర్యాద ప్రకారం చివర దీర్ఘాన్నుంచే సంప్రదాయముంది. తెలుగులో అవసరం లేదు. పెట్టినా దోషమేమీ కాదు)


ప్రాణులకు భోగమునూ మోక్షాన్నీ కూడా కలిగించే వ్రతమిది. ఏకాదశి, ద్వాదశి, శ్రవణ నక్షత్రంఈ మూడూ యోగించిన రోజును విజయతిథి అంటారు. ఈ రోజు హరిని పూజిస్తూ చేసే అన్ని కార్యాలకూ అక్షయ పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ రోజు ఏకభుక్తం, భక్తవ్రతం, అయాచితం, ఉపవాసం, భిక్షాన్నఖాదనం - ఏది చేసినా దానికి అనంత పుణ్యం వ్రతికి లభిస్తుంది. నియమమేమనగా కంచుపాత్ర, తేనె, మాంసం, లోభం, అసత్యభాషణం, వ్యాయామం, మైథునం, పగటి నిద్ర, అంజనం, రాతిపై నూరిన పదార్థాలు- వీటన్నిటినీ విసర్జించాలి. పెసర వంటి పప్పుధాన్యాలనూ విసర్జించాలి.


భాద్రపద శుక్ల ద్వాదశిశ్రవణ నక్షత్రం కలిసి ఒకేరోజు పడినపుడు అది గొప్ప మహత్తు గల దినమౌతుంది. ఆ రోజు చేసే ఉపవాసం గొప్పఫలప్రదమౌతుంది. ఈ రోజు బుధవారం పడితే నదీ సంగమంలో స్నానం చేసి జపం చేసిన వారికి మహనీయ ఫలాలబ్బుతాయి. ఈ రోజు వామన రూపియైన భగవానుని స్వర్ణమయ ప్రతిమను రత్నాలతో జలాలతో నింపిన పూర్ణకుంభంపై రెండు తెల్లటి వస్త్రాలను కప్పి దానిపై నుంచి ఛత్ర, పాదరక్ష సమన్వితం చేసి పూజించాలి.


ఈ యీ మంత్రాలతో ఎదురుగా సూచింపబడిన స్వామి వారి ఆయా అంగాలను అర్చించాలి.


ఓం నమో వాసుదేవాయ  -  శిరస్సు

ఓం శ్రీధరాయ నమః  -  ముఖమండలం

ఓం కృష్ణాయ నమః   -  కంఠం

ఓం శ్రీ పతయే నమః  -  వక్షఃస్థలం

ఓం సర్వాస్త్రధారిణే నమః - భుజాలు

ఓం వ్యాపకాయ నమః   - కుక్షి ప్రదేశం

ఓం కేశవాయ నమః    - ఉదరం

ఓం త్రైలోక్య పతయే నమః  -  గుహ్యస్థానం

ఓం సర్వభృతే నమః    -   జంఘలు

ఓం సర్వాత్మనే నమః   -   చరణాలు


నేతిని పాయసాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి. కుంభాలనూ కుడుములనూ కూడా నివేదించి రాత్రంతా భజన చేస్తూ జాగరం చెయ్యాలి. తెల్లారి స్నానం చేసి ఆచమనం చేసి మరల స్వామిని పూజించి పుష్పాంజలి సహితంగా ఆయననిలా ప్రార్ధించాలి.


నమోనమస్తే గోవింద బుధశ్రవణ సంజ్ఞక ॥

అఘోఘ సంక్షయం కృత్వా సర్వ సౌఖ్య ప్రదోభవః (ఆచార.. 1136/11,12)


అనంతరం ప్రీయతాం దేవదేవేశ అంటూ బ్రాహ్మణులకు కలశలను దానం చేయాలి. ఈ పూజకు నదీతటం ప్రశస్త స్థలం.


(అధ్యాయం -136)