Tuesday, 31 August 2021

శ్రీ హనుమద్భాగవతము (28)



ఋషులు శాపము


బాలుడైన హనుమంతుడు మిక్కిలి చంచలుడు, అల్లరివాడు, పైగా ప్రళయంకరుడైన శంకరుని అవతారము, కపిశాబకము, అదీగాక ఎంతోమంది దేవతలచే అమోఘమైన వరాలను పొన్దినవాడు. ఇతని అల్లరికి తల్లిదండ్రులు ఎంతో ప్రసన్నులవుతున్నారు. సింహము తోకను ప్ట్టుకొని దానిని నలువైపుల త్రిప్పుట, ఏనుగును పరీక్షించుట అనే పనులు తఱుచుగా అతని నిత్యక్రీడలైనాయి. ఒక్కొక్కప్పుడతడు పెద్ద పెద్ద చెట్లను సమూలముగ పెఱికి వేసేవాడు, ఇతనికి తెలియని, ఎక్కని పర్వత శిఖరం ఏదీ లేదు. దుర్గమములైన వనములను, పర్వతములను సంపూర్ణముగా ఇతడు చూసి ఉన్నాడు.


వన్యప్రాణులకి ఇతడంటే భయము, కాని అవి మనస్సులో అతనిని ప్రేమించుచుండేవి. ఇతడు సర్వప్రాణులకు -- మిత్రుడు, రక్షకుడై ఉన్నాడు. బలవంతుడు ఎవ్వడైనా బలహీనుని బాధిస్తే బాలుడైన హనుమంతుడు ఊరకునేవాడు కాదు. ఇతడొక చెట్టు నుండి మఱియొక చెట్టు పైకి దూకుతు కొన్ని ఆమడల దూరము వెళ్ళేవాడు. తన బరువుచే ఏ చెట్టు కొమ్మయైన విరుగుతుందని సందేహము గలిగితే వెంటనే అతడు తేలికగా మారేవాడు.


వరముల వలన గలిగిన శక్తితో హనుమానుడు ఋషుల ఆశ్రమములలోనికి వెళ్ళేవాడు. అచట వారికి కష్టమును కలిగించే పనుల చేస్తుండేవడు. ఒక ఋషి ఆసనమును మఱియొక ఋషి సమీపమున ఉంచేవాడు. ఒకని మృగచర్మాన్ని కప్పుకొని చెట్టుపైకి ఎగిరేవాడు, లేదా దానిని అక్కడే వ్రేలాడ వేసేవాడు. ఒకరి క్మండలములోని నీరును పారబోసేవాడు, మఱియొకరి కమండలం పగులగొట్టేవాడులేదా నీటిలో పారబోసేవాడు.  


హనుమంతుడు జపము చేసుకుని మునుల ఒడులలో కూర్చున్నవాడు. అహింసాపరాయణులైన ముని ధ్యానస్థుడై 'జపం చేసుకొనుచుండగా ఇతడు ఆయన గడ్డమును లాగి పారిపోయేవాడు. ఒకరి కోపీనాన్ని, మఱియొకరి పారాయణ గ్రంథమును పండ్లతోను, చేతులతోను పట్టుకొని అటు ఇటు విసరి వేసేవాడు. స్రుక్సువాదులను విఱుగగొట్టును, మహాత్ముల యజ్ఞపాత్రలను పగులగొట్టేవాడు. కష్టముతో సంపాదించుకొన్న నారచీరలను చింపిపార వేసేవాడు. బ్రహ్మాది దేవతలు వరములిచ్చి ఉండటంతో ఋషులు బాలహనుమానుని ఏమీ అనలేక మిన్నకున్నారు, కాని అతని బాధలను మాత్రము తట్టుకొన లేకపోయేవారు. తమ మూఢాచారాలను ఖండించటం కోసం ఆంజనేయుడట్లొనఱిన్చినాడని ఋషులు తెలుసుకొన లేకపోయారు. 

Monday, 30 August 2021

శ్రీ హనుమద్భాగవతము (26)



అక్కడే ఉన్న సూర్య దేవుడు 'నేను ఇతనికినా తేజస్సులోని శతాంశము(వందవ అంశను) ఇస్తాను, దానితో పాటు తగిన సమయమున విద్యను బోధించి ఇతనిని శాస్త్రమర్మజ్ఞునిగా చేస్తాను, ఇతడు సాటి లేని విద్వాంసుడు, వక్త అవుతాడూ అని పలికాడు. 


“నా పాశము చేత, జలము చేత ఇతడెప్పుడు ఖూడా సురక్షితంగానే ఉంటుందాని వరుణుడు పలికాడు.


“ఇతడు రోగరహితుడుగా ఉంటాడు... నా దండము వలన ఇతనికెప్పుడూ మరణము సంభవించ”దని యముడు పలికాడు.


పింగళవర్ణుడు, యక్షులకు రాజైన కుబేరుడిట్లా పలికాడు. “యుద్ధంలో ఇతనికెప్పుడూ విషాదము కలుగదు, నా గద నుండి ఇతనికి రక్షణ కలుగుతుంది. నా పరివారమైన యక్ష రాక్షసులచే ఇతడెప్పుడూ పరాజితుడు కాడు.”


“ఇతడు నా చేతగాని, నా ఆయుధముల చేతగాని ఎప్పుడూ వధ్యుడు కాడు” అని శంకరుడు వరమిచ్చాడు...


విశ్వకర్మ ఇలా పలికాడు -'ఈ బాలుడు నాచే నిర్మితములైన శస్త్రాస్త్రములచే ఎల్లప్పుడూ సురక్షితుడై ఉండగలడు'.


ఇట్లా దేవతలందఱూ అమోఘములైన వరాలను ఇచ్చిన పిమ్మట బ్రహ్మ దేవుడు ఎంతో ప్రసన్నుడై ఇతడు దీర్ఘాయుమ్మంతుడు, మహాత్ముడు, సర్వివిధములైన బ్రహ్మదండములచే అవధ్యుడై ఉన్డగలడూ అని పలికెను


ప్రసన్నుడైన చతురాననుడు వాయు దేవునితో మఱల ఇలా పలికాడు. వాయు దేవా! నీ ఈ పుత్రుడు శత్రువులకు భయండు ఇచ్ఛానుసారముగా రూపమును ధరించి తలంచిన చోటికి వెడలగలడు. వీని గమనము అవ్యాహతము. ఇతడు మహాయశస్వి అవుతాడు. అద్భుతములు, రోమాంచ కారకములైన కార్యముల చేస్తాడు.'


ఇలా వరములనిచ్చి బ్రహ్మాది దేవతలు, మహర్షులు తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు.


Sunday, 29 August 2021

శ్రీ హనుమద్భాగవతము (26)



ఎదుట నిలచియున్న బ్రహ్మదేవుని చూడగానే వాయుదేవుడు పుత్రుని ఒడిలోనికి తీసుకుని నిలబడ్డాడు. అప్పుడు హనుమానుని చేవులకు అలౌకికమైన కుండలాలు వ్రేలాడుచున్నాయి, శిరస్సున కిరీటము, కంఠమున హారములు, దివ్యమైన అవయవాలపై స్వర్ణాభూషణములు శోభిల్లుతున్నాయి. వాయుదేవుడు బ్రహ్మ దేవునిచరణముల పైబడ్డాడు. 


చతురాననుడు వాయుదేవుని లేవనెత్తి ఎంతో ప్రేమతో అతడు కుమారుని అవయవములను తన కరకమలములతో నిమిరాను, బ్రహ్మకరస్పర్శచేత పవనపుత్రుడు మూర్ఛ నుండి తేరుకొని, లేచి కూర్చున్నాడు. తన పుత్రుడిట్లా జీవితుడవటం చూసి జగత్తునకు ప్రాణస్వరూపుడైన వాయు దేవుడు వెనుకటివలె వీచసాగాడు. దానివలన మూడులోకాలకు మరల ప్ర్రాణములు వచ్చినట్లు అనిపించాయి.


బ్రహ్మ సంతుష్టుడై హనుమంతునకు వరములను ఇస్తూ “ఈ బాలునకు బ్రహ్మశాపము తగులదు, వీని అవయవములను ఏ శస్త్రాస్త్రములు కూడా ఎప్పుడును ఛేదింపజాలవు " అని పలికాడు. మరల ఆయన దేవతలనుద్దేశించి ‘దేవతలారా! అసాధారణుడైన ఈ బాలుడు భవిష్యత్తులో మీ అందరికి పరమ హితమును చేకూర్చే వాడవుతాడు. అందువల్ల మీరు ఇతనికి వరములను ఇవ్వండి' అని పలికాడు.


దేవేంద్రుడు వెంటనే ప్రసన్నుడై హనుమానుని కంఠాన్ని వాడని కమలమాలతో అలంకరించి ఇలా పలికాడు - ' నేను ప్రయోగించిన వజ్రాయుధము చేత ఈ బాలుని దవడ విరిగిపోయినది, అందువలన ఈ కపిశ్రేష్ఠుడు నేటి నుండి హనుమంతుడను పేరుతో పిలువబడుతాడు*. 


మత్కరోత్సృష్టవజ్రేణ హనురస్యయథా హతః |


నామ్నా పై కపిశార్దూలో భవితా హనుమానితి ||


(వా. రా. 7-88-11)


ఇంతేకాక ఈ బాలునిపై నా వజ్రం ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు, ఇతని శరీరం నా వజ్రముకంటెను ఎంతో కఠినముగా ఉండగలదు.”


Saturday, 28 August 2021

శ్రీ హనుమద్భాగవతము (25)

 


రాహువు ఎంతో వేగంతో సూర్యుని వైపు పరుగిడెతున్నాడు. అతనిని చూసిన వెంటనే హనుమానునకు ఆకలి గుర్తుకువచ్చింది. అతడు రాహువును సుందరమైన భక్ష్యముగా భావించి అతనిపై బడ్డాను.

 

సురేశ్వరా! రక్షించు రక్షించూ అని అరుస్తూ రాహువు ఇంద్రుని దగ్గరకు పరుగెత్తాడు.

 

సురాధిపతి రాహువును రక్షించుటకు పరిగెత్తాడు. రాహువు తప్పించుకొనిపోయిన తర్వాత హనుమంతుడు ఐరావతాన్ని చూశాడు. మధురఫలముగా భావించి దాని పైకి దూకాడు. అపుడు హనుమానుని స్వరూపము ప్రజ్వలించు అగ్నివలె ప్రకాశిస్తూ భయంకరంగా ఉంది. ఇంద్రుడు భయపడ్డాడు, తనను కాపాడుకొనుటకు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది హనుమానుని ఎడమ దవడకు తగిలింది, దవడ విరిగింది. వెంటనే అతడు గిలగిల తన్నుకొనుచు పర్వతశిఖరము పైబడి మూర్ఛితుడయ్యాడు.

 

అట్లా తన ప్రియపుత్రుడు వజ్రాఘాతముతో గిలగిల తన్నుకొంటూ క్రిందపడుట చూసిన వాయు దేవుడు ఇంద్రునిపై కోపగించాడు. శక్తిశాలి యైన వాయు దేవుడు తన గతిని నిరోధించి, పుత్రుని తీసుకునొ పర్వతగుహలోనికి ప్రవేశించాడు.

 

త్రిలోకాలలో ఉన్న సర్వప్రాణు లశ్వాసలు నిలచి పోయాయి. వారి అవయవముల సంధులు విడివడటం ఆరంభించాయి. అందఱు ఎండిన కట్టెల వలె అవసన్నులయ్యారు. వారి సర్వధార్మిక కృత్యములు నిలచిపోయాయి.

 

ప్ర్రాణసంకటముతో భయబడిన ఇంద్రుడు, దేవతలు, గంధర్వులు, అసురులు, నాగులు, గుహ్యకులు మొదలైఅన వారు ప్ర్రాణరక్షణకై బ్రహ్మ దగగ్రకు పరుగెత్తారు. బ్రహ్మ అందరిని వెంట పెట్టుకుని పర్వతగుహలోనికి వెళ్ళాడు. అక్కడ వాయు దేవుడు తన పుత్రుని ఒడిలో ఉన్చుకొని, హృదయానికి హత్తుకొని దుఃఖాతిరేకంతో కన్నీటిని విడిస్తున్నాడు. మూర్ఛితుడైన హనుమానుని శరీరకాంతి సూర్యాగ్నుల వలెను, సువర్ణము వలెను ఉండటం చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయారు. 

Friday, 27 August 2021

శ్రీ హనుమద్భాగవతము (24)



సూర్య దేవుడు గూడ తన వైపు వస్తున్న ఈ అలౌకిక బాలుని చూశాడు. పవనకుమారుడు తండ్రి వేగముతో తనవైపే వచ్చుచున్నాడనీ, వానిరక్షణకై వాయు దేవుడుగూడ వెంట వచ్చుచున్నాడనీ వెంటనే తెలుసుకొన్నాడు. “ఆహా! స్వయముగా చంద్రమౌళియైన ఈశ్వరుడే హనుమానుని రూపములో నన్ను ధన్యునిగా చేయటానికి ఇటువైపు వస్తున్నాడు. ఇది నా అదృష్టం " అని సూర్యుడు భావించాడు. వెంటనే అగ్ని మయుములైన ఆతని కిరణములు చల్లబడ్డాయి. హనుమంతుడు సూర్యునిరథముపై కూర్చుండి ఆయనతో ఆడుకొనసాగాడు.


దైవికముగా ఆ దినము అమావాస్యా తిథియైనది. సింహికా పుత్రుడైన రాహువు సూర్యుని పట్టుకొనుటకు వచ్చాడు. సూర్యుని రథముపై కూర్చుంని ఉన్న ఆ బాలుడు అతని కంటబడ్డాడు. రాహువు బాలుని విషయం గురించి ఆలోచించక సూర్తుని పట్టుకొనుటకు ముందుకు వెళ్ళాడు. వెంటనే హనుమంతుడు అతనిని పట్టుకొన్నాడు. హనుమానుని వజ్రపు పిడికిలిలో బంధితుడై రాహువు గిలగిలా తన్నుకో సాగాడు. చివరకు ఎలాగో అతడు బయటపడి పరుగెత్తాడు. అతడు సరాసరి దేవేంద్రుని దగ్గరకు చేరి కనుబొమలను ముడివేసి క్రోధితుడై ఇలా పలికాడు. ‘సురేశ్వరా! నా ఆకలి తీరుటకై నాకు నీవు సూర్యచంద్రులను సమర్పించితివి, కాని ఇప్పుడు నీవీ అధికారమును మఱియొకని ఎందుకు ఇచ్చావు?”


ఆశ్చర్యాన్ని కలగజేస్తున్న రాహువు మాట విని ఇంద్రుడు అతని ముఖాన్ని చూడసాగాడు. అంతట రాహువు ఇలా పలికాడు. ‘నేడు పర్వ సమయం అవ్వటం చేత నేను సూర్యుని గ్రసించుటకు అతని కడకు వెళ్ళాను. ఇంతకుమునుపే అక్కడున్న మఱియొక రాహువు నన్ను పట్టుకొన్నాడు. నేనెట్లాగో ప్రాణాలను కాపాడుకొని ఇక్కడకు వచ్చాను”.


కనులవెంట నీరు కార్స్తున్న రాహువు మాట విని ఇంద్రుడు ఎంతో చింతితుడయ్యాడు. అతడు తన సింహాసనము నుండి లేచి, ఐరావతాన్ని అధిరోహించి పై సంఘటన జరిగిన ప్రదేశమునకు వెళ్ళాడు. రాహువు కూడా అతని వెంట వెళ్ళాడు. శచీపతీ ఆశ్చర్యచకితుడై రాహువును ఖూడా భయమును కలిగించినవాడు సూర్యుని దగ్గరున్న ఆ పరాక్రమవంతుడెవడై ఉంటాడోనని ఆలోచిస్తున్నాడు.

Thursday, 26 August 2021

శ్రీ హనుమద్భాగవతము (23)



బాల్యకాలము 


అంజనా దేవి తన ప్రియపుత్రుడైన హనుమంతుని మిగుల శ్రద్ధతోను ప్రేమతోను పెంచుతున్నది. కేసరి కూడా కుమారునిపై ఎంతగానో ప్రేమ చూపుతుండేవాడు. హనుమానుడు సంతోషముతో కిలకిలయనిధ్వని చేయుచుండ అంజనా కేసరులు ఆనంద మగ్నులయ్యేవారు. అతని బాల్య క్రీడలు ఎంతో ఆకర్షకములుగానూ, సుఖకరములుగానూ, అద్భుతములుగానూ ఉండేవి. ఒకనాటిమాట. కేసరి ఎక్కడికో వెళ్ళాడు. అంజన ఖూడా బాలుని ఉయ్యాలలో పరుండబెట్టి ఫలపుష్పముల తెచ్చుటకై వనమునకు వెళ్ళింది. బాలునకు ఆకలేసింది. తల్లి సమీపంలో లేదు. అతడు కాలుచేతుల ఆడిస్తూ ఏడ్వసాగాడు. వెంటనే అతని దృష్టి తూర్పుదిక్కుపై పడింది. అప్పుడే అరుణోదయమవుతోంది. అతడు సూర్యుని అరుణబింబాన్ని ఎఱ్ఱనిపండని తలచాడు.*


(క) ఖ ఆధ్యాత్మరామాయణము 4-9-18, 19.

అసౌ హి జాతమాత్రోఽపి బాలార్క ఇవ మూర్తిమాన్ | 

గ్రహీతుమో బాలార్కపుప్లావాంబరమధ్యతః ॥ 

(స్కంద పు. అవంతీ ఖండము, చతురశీతిలింగమాహాత్మ్యము 78-21)


తేజస్సునకు పరాక్రమమునకు వయస్సుతో నిమిత్తము లేదు. ఇక్కడ హనుమంతుని రూపములో అంజనా దేవి ఒడిలో ప్రళయంకరుడగు శంకరుడు ఏకాదశరుద్రాంశతో ఆడుతున్నాడు. వాయు దేవుడు మొదటనే బాలునకు ఏగిరే శక్తిని ఇచ్చాడు. దానివలన హనుమంతుడు వెంటనే వాయు వేగముతో ఆకాశంలోకి వెళుతుండేవాడు. అతని ఆ వేగమును చూసి దేవదానవయక్షాదులు విస్మితులై ఇట్లా పలుకసాగారు. 'ఈ వాయుపుత్రుని వేగముతో సమానమైన వేగము స్వయముగా వాయువునకు గాని, గరుడునకుగాని, మనస్సునకుగాని లేదు. ఇంత చిన్నవయస్సులోనే ఇతనికి ఇంతటి వేగము, పరాక్రమము ఉంటే యౌవనకాలంలో ఇంకా ఎంత శక్తి ఉంటుందో గదా!'



తనపుత్రుడు సూర్యునివైపు వెళుతుండటం చూసిన వాయు దేవుడు “సూర్యుని తీక్ష్ణకిరణములు నా యీ బాలునకు ఎట్టి బాధను కలుగజేయు కుండుగాక' యని భావించి మంచు వలె శీతలుడై అతని వెంటపోసాగాడు.

Wednesday, 25 August 2021

శ్రీ హనుమద్భాగవతము (22)



వైశాఖమాసమున కృష్ణపక్షంలో దశమి తిథి శనివారము నాడు పూర్వభాద్రానక్షత్రము వైధృతీయోగము గల నాటి మధ్యాహ్న సమయంలో అంజన పుత్రుని కనినది. అతడు మహా బలసంపన్నుడు, మహాసత్త్వసంపన్నుడు, విష్ణుభక్తితత్పరుడు.


శ్లో! సర్వదేవమయం వీరం బ్రహ్మవిష్ణుశివాత్మకమ్ |

వేద వేదాంగతత్త్వజ్ఞం సర్వవిద్యావిశారదమ్ ||

సర్వబ్రహ్మవిదాం శ్రేష్ఠం సర్వదర్శన సమ్మతమ్ |

మాణిక్యకుండలధరం దివ్య పట్టాంబరాన్వితమ్ ||

కనకాచలసంకాశం పింగాక్షం హేమమాలినం |

స్వర్ణ యజ్ఞోపవీతం చ మణినూపుర శోభితమ్ ||

ధ్వజవజ్రాంకుశచ్ఛత్ర-పద్మ రేఖాంఘిసంయుతం | 

ధీర్ఘ లాంగూలసహితం దీర్ఘ కాయం మహాహనుమ్ || 

కౌపీనకటిసూత్రాభ్యాం విరాజంతం మహాభుజం | 

ఆశ్చర్యభూతం లోకానాం-వజ్రసంహననం కపిమ్స ||

సర్వలక్షణసంపన్నం కీరీటకనకాంగదం | 

ప్రభయాఽమితయా విష్ణోరవతారమివావరమ్ ||


(పరాశరసంహిత 6వ పటలము) 


సకల దేవతలు తానే యైనవాడు, బ్రహ్మవిష్ణుశివ స్వరూపుడైన సృష్టిస్థితిలయాత్మకుడు, వేదవేదాంగముల తత్త్వ మెరింగినవాడు, సకలవిద్యలందు పరిపూర్ణుడు, బ్రహ్మజ్ఞానులందరిలో శ్రేష్ఠుడు, సర్వదర్శనములకు సమ్మతమైనవాడు, మాణిక్యములు పొదిగిన కుండలములను ధరించినవాడు, దివ్యములగు పీతాంబరములను ధరించినవాడు. 'మేరుపర్వతసమానుడు, పింగాక్షుడు, స్వర్ణ మాలికలను సువర్ణ యజ్ఞోపవీతమును ధరించిన వాడు, మణిసమన్వితములైన నూపురములను ధరించి శోభిల్లు వాడు, ధ్వజము వజ్రము అంకుశము ఛత్రము పద్మము రేఖలతో కూడిన పాదపద్మములు కలవాడు, పెద్దహనువు (దవడ) కలవాడు, పొడవైన వాలముగలవాడు, దీర్ఘమైన కాయము (శరీరము) కలవాడు కౌపీనమును మొలత్రాడును ధరించినవాడు, మహాబాహువులుకలవాడు, లోకములకు ఆశ్చ ర్యమును గలిగించువాడు, వజ్రదేహముకలవాడు, వానర రూపుడు, సమస్తశుభలక్షణములు కలవాడు, కిరీటమును బంగారుభుజకీర్తులను ధరించినవాడైన శ్రీ ఆంజనేయుడు అమితమైన కాంతిచే వేరొక శ్రీమన్నారాయణావతారమా అన్నట్లుగా ఉన్నాడు.


శ్లో॥ పపాత పుష్పవృష్టిశ్చ - నేదుర్దుందుభయో దివి | 

ననృతు దేవగంధర్వా-స్తుష్టు వుస్సిద్ధచారణాః |

వనౌ వాయుస్సుఖస్పర్శం నిర్మలోదకాః ||


-- పరా. సం, 6వ పటలము.


ఆ ముహూర్తములో పుష్పవర్షము కురిసింది, దీవియందు దుందుభులు మ్రోగాయి. దేవతలు గంధర్వులు నృత్యము చేసారు, సిద్ధులు చారణులు స్తోత్రములు చేసారు. వాయువు వసమున సుఖస్పర్శ కలిగిస్తూ వీస్తోంది. నదులు స్వచ్ఛనిర్మల జలములతో పరిపూర్ణములై ఉన్నాయి.