Wednesday 25 August 2021

శ్రీ హనుమద్భాగవతము (22)



వైశాఖమాసమున కృష్ణపక్షంలో దశమి తిథి శనివారము నాడు పూర్వభాద్రానక్షత్రము వైధృతీయోగము గల నాటి మధ్యాహ్న సమయంలో అంజన పుత్రుని కనినది. అతడు మహా బలసంపన్నుడు, మహాసత్త్వసంపన్నుడు, విష్ణుభక్తితత్పరుడు.


శ్లో! సర్వదేవమయం వీరం బ్రహ్మవిష్ణుశివాత్మకమ్ |

వేద వేదాంగతత్త్వజ్ఞం సర్వవిద్యావిశారదమ్ ||

సర్వబ్రహ్మవిదాం శ్రేష్ఠం సర్వదర్శన సమ్మతమ్ |

మాణిక్యకుండలధరం దివ్య పట్టాంబరాన్వితమ్ ||

కనకాచలసంకాశం పింగాక్షం హేమమాలినం |

స్వర్ణ యజ్ఞోపవీతం చ మణినూపుర శోభితమ్ ||

ధ్వజవజ్రాంకుశచ్ఛత్ర-పద్మ రేఖాంఘిసంయుతం | 

ధీర్ఘ లాంగూలసహితం దీర్ఘ కాయం మహాహనుమ్ || 

కౌపీనకటిసూత్రాభ్యాం విరాజంతం మహాభుజం | 

ఆశ్చర్యభూతం లోకానాం-వజ్రసంహననం కపిమ్స ||

సర్వలక్షణసంపన్నం కీరీటకనకాంగదం | 

ప్రభయాఽమితయా విష్ణోరవతారమివావరమ్ ||


(పరాశరసంహిత 6వ పటలము) 


సకల దేవతలు తానే యైనవాడు, బ్రహ్మవిష్ణుశివ స్వరూపుడైన సృష్టిస్థితిలయాత్మకుడు, వేదవేదాంగముల తత్త్వ మెరింగినవాడు, సకలవిద్యలందు పరిపూర్ణుడు, బ్రహ్మజ్ఞానులందరిలో శ్రేష్ఠుడు, సర్వదర్శనములకు సమ్మతమైనవాడు, మాణిక్యములు పొదిగిన కుండలములను ధరించినవాడు, దివ్యములగు పీతాంబరములను ధరించినవాడు. 'మేరుపర్వతసమానుడు, పింగాక్షుడు, స్వర్ణ మాలికలను సువర్ణ యజ్ఞోపవీతమును ధరించిన వాడు, మణిసమన్వితములైన నూపురములను ధరించి శోభిల్లు వాడు, ధ్వజము వజ్రము అంకుశము ఛత్రము పద్మము రేఖలతో కూడిన పాదపద్మములు కలవాడు, పెద్దహనువు (దవడ) కలవాడు, పొడవైన వాలముగలవాడు, దీర్ఘమైన కాయము (శరీరము) కలవాడు కౌపీనమును మొలత్రాడును ధరించినవాడు, మహాబాహువులుకలవాడు, లోకములకు ఆశ్చ ర్యమును గలిగించువాడు, వజ్రదేహముకలవాడు, వానర రూపుడు, సమస్తశుభలక్షణములు కలవాడు, కిరీటమును బంగారుభుజకీర్తులను ధరించినవాడైన శ్రీ ఆంజనేయుడు అమితమైన కాంతిచే వేరొక శ్రీమన్నారాయణావతారమా అన్నట్లుగా ఉన్నాడు.


శ్లో॥ పపాత పుష్పవృష్టిశ్చ - నేదుర్దుందుభయో దివి | 

ననృతు దేవగంధర్వా-స్తుష్టు వుస్సిద్ధచారణాః |

వనౌ వాయుస్సుఖస్పర్శం నిర్మలోదకాః ||


-- పరా. సం, 6వ పటలము.


ఆ ముహూర్తములో పుష్పవర్షము కురిసింది, దీవియందు దుందుభులు మ్రోగాయి. దేవతలు గంధర్వులు నృత్యము చేసారు, సిద్ధులు చారణులు స్తోత్రములు చేసారు. వాయువు వసమున సుఖస్పర్శ కలిగిస్తూ వీస్తోంది. నదులు స్వచ్ఛనిర్మల జలములతో పరిపూర్ణములై ఉన్నాయి.


No comments:

Post a Comment