Friday 27 August 2021

శ్రీ హనుమద్భాగవతము (24)



సూర్య దేవుడు గూడ తన వైపు వస్తున్న ఈ అలౌకిక బాలుని చూశాడు. పవనకుమారుడు తండ్రి వేగముతో తనవైపే వచ్చుచున్నాడనీ, వానిరక్షణకై వాయు దేవుడుగూడ వెంట వచ్చుచున్నాడనీ వెంటనే తెలుసుకొన్నాడు. “ఆహా! స్వయముగా చంద్రమౌళియైన ఈశ్వరుడే హనుమానుని రూపములో నన్ను ధన్యునిగా చేయటానికి ఇటువైపు వస్తున్నాడు. ఇది నా అదృష్టం " అని సూర్యుడు భావించాడు. వెంటనే అగ్ని మయుములైన ఆతని కిరణములు చల్లబడ్డాయి. హనుమంతుడు సూర్యునిరథముపై కూర్చుండి ఆయనతో ఆడుకొనసాగాడు.


దైవికముగా ఆ దినము అమావాస్యా తిథియైనది. సింహికా పుత్రుడైన రాహువు సూర్యుని పట్టుకొనుటకు వచ్చాడు. సూర్యుని రథముపై కూర్చుంని ఉన్న ఆ బాలుడు అతని కంటబడ్డాడు. రాహువు బాలుని విషయం గురించి ఆలోచించక సూర్తుని పట్టుకొనుటకు ముందుకు వెళ్ళాడు. వెంటనే హనుమంతుడు అతనిని పట్టుకొన్నాడు. హనుమానుని వజ్రపు పిడికిలిలో బంధితుడై రాహువు గిలగిలా తన్నుకో సాగాడు. చివరకు ఎలాగో అతడు బయటపడి పరుగెత్తాడు. అతడు సరాసరి దేవేంద్రుని దగ్గరకు చేరి కనుబొమలను ముడివేసి క్రోధితుడై ఇలా పలికాడు. ‘సురేశ్వరా! నా ఆకలి తీరుటకై నాకు నీవు సూర్యచంద్రులను సమర్పించితివి, కాని ఇప్పుడు నీవీ అధికారమును మఱియొకని ఎందుకు ఇచ్చావు?”


ఆశ్చర్యాన్ని కలగజేస్తున్న రాహువు మాట విని ఇంద్రుడు అతని ముఖాన్ని చూడసాగాడు. అంతట రాహువు ఇలా పలికాడు. ‘నేడు పర్వ సమయం అవ్వటం చేత నేను సూర్యుని గ్రసించుటకు అతని కడకు వెళ్ళాను. ఇంతకుమునుపే అక్కడున్న మఱియొక రాహువు నన్ను పట్టుకొన్నాడు. నేనెట్లాగో ప్రాణాలను కాపాడుకొని ఇక్కడకు వచ్చాను”.


కనులవెంట నీరు కార్స్తున్న రాహువు మాట విని ఇంద్రుడు ఎంతో చింతితుడయ్యాడు. అతడు తన సింహాసనము నుండి లేచి, ఐరావతాన్ని అధిరోహించి పై సంఘటన జరిగిన ప్రదేశమునకు వెళ్ళాడు. రాహువు కూడా అతని వెంట వెళ్ళాడు. శచీపతీ ఆశ్చర్యచకితుడై రాహువును ఖూడా భయమును కలిగించినవాడు సూర్యుని దగ్గరున్న ఆ పరాక్రమవంతుడెవడై ఉంటాడోనని ఆలోచిస్తున్నాడు.

No comments:

Post a Comment