Friday, 30 June 2023

శ్రీదత్త పురాణము (184)

 


పూర్వకాలంలో అత్యంత మనోహరమైన మధువనం ఒకటి ఉండేది. ఆ వనంలో శాకలి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ వుండేవాడు. అధ్యయన - అధ్యాపనలతో శిష్యవత్సలుడై కాలం గడిపేవాడు. తేజస్సులో బ్రహ్మ సమానుడు. అతడి ధర్మపత్ని రేవతీదేవి. ఈ దంపతులకు నవ గ్రహాలలాగా తొమ్మండుగురు పుత్ర సంతానం కలిగారు. వారిలో ధ్రువుడు - క్షమి - మధుడు - తారుడు జ్యోతిష్మంతుడు అనే అయిదుగురూ పరమ వైష్టికులు. కర్మిష్ఠులు. - నిత్యాగ్నిహోత్రులు. గృహస్థాశ్రమాలు స్వీకరించి హాయిగా వున్నారు. తక్కిన నలుగురూ విరక్తి మార్గం ఎంచుకున్నారు. నిర్మోహుడు -జితమాయుడు - ధ్యానకాష్టుడు- గుణాతిగుడు అని పేర్లకు తగ్గట్లు వీళ్ళు గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండా సరాసరి సన్యాసాశ్రమం స్వీకరించారు. సర్వకర్మ నిస్పృహులై నిస్సంగులై నిష్పరిగ్రహులై శిఖా యజ్ఞోపవీతరహితులై అరణ్యాలలో తపస్సులు చేసుకుంటున్నారు. వీరి దృష్టిలో బంగారం ముద్దకూ, మట్టి గడ్డకూ తేడా లేదు. ఆకో అలమో మొలలకు అచ్ఛాదనగా ధరించడం, పండో ఫలమో దొరికింది తినడం - ఇదీ వీరి జీవయాత్ర. రేయింబవళ్ళు బ్రహ్మజ్ఞాన పరాయణులై కాలం గడుపుతున్నారు. జితేంద్రియులు- జితాహారులు. వాత శీత సహిష్ణువులు. ఈ చరాచర జగత్తులో అణువు అణువునా విష్ణుమూర్తిని దర్శిస్తూ మౌనంగా భూగోళమంతటా సంచరించడమే వారి జీవన విధానం. అణువంతైనా కర్మాచరణం చెయ్యని యోగులు, ధృఢ జ్ఞాన సంపన్నులు. సద్విచార విశారదులు.


వీళ్ళు నలుగురూ ఒక రోజున నీయింటికి వచ్చారు. అప్పుడు నీవు మత్స్యదేశంలో విప్రుడుగా భార్యాపుత్రాదులతో ధర్మబద్ధంగా గృహస్థ జీవితం గడుపుతున్నావు. నీకు అది ఎనిమిదవ జన్మ. వైశ్య దేవం ముగించుకొని అతిధులకోసం ఎదురుచూస్తూ నువ్వు వాకిలిలోకి వచ్చే సరికి ఈ నలుగురు నిరహులూ నీకు కనిపించారు. ఆదరంగా స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులతో అతిధి మర్యాదలు చేసి సముచితాసనాల మీద కూర్చోబెట్టావు. సాష్టాంగ నమస్కారాలు చేసి అంజలి బద్ధుడవై వినమిత శిరస్కుడవై నిలబడ్డావు.


మహానుభావులారా ! ఇప్పటికి నా జన్మ సఫలం అయ్యింది. జీవితం సమస్తమూ ధన్యమయ్యాయి. తాపత్రయాలను హరించే మీ పాదాలకు శిరస్సు చేర్చి నమస్కరించగలిగాను. విష్ణు సందర్శనతో సాటి వచ్చే మీ దర్శన మహాభాగ్యం లభించింది. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అంటూ నలుగురికీ స్వయంగా శ్రద్దగా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు భక్తితో శిరస్సున జల్లుకున్నావు. అటుపైని వారికి పాద పూజలు చేసావు. షోడశోపచారాలు చేసావు. రుచిగా శుచిగా శాక పాకాలతో విందు భోజనం పెట్టావు. ఆ యతులు నలుగురూ పరంజ్యోతియైన పరబ్రహ్మను ధ్యానిస్తూ ఆ రోజుకి నీ యింటిలోనే విశ్రాంతి తీసుకున్నారు.


Thursday, 29 June 2023

శ్రీదత్త పురాణము (183)

 


ఇంతకీ వికుండలా! నువ్వు తెలియక చేసినా మాఘస్నాన ఫలం నిన్ను ఉద్ధరిస్తోంది. నరక యాతనల నుండి తప్పించి స్వర్గ సుఖాలకు పంపుతోంది. అంతటి మహిమగలది మాఘస్నానం. సరే ప్రసక్తాను ప్రసక్తంగా చాలా విషయాలు ముచ్చటించుకున్నాం. శ్రేయోదాయకమైన మరింకేదయినా విషయాన్ని శ్రుతి స్మృతి పురాణేతిహాసాల నుంచి తెలుసుకోదలుచుకుంటే బిడియ పడకుండా అడుగు. నాకు తెలిసింది చెబుతాను. మనం ఆప్తమిత్రులం అయ్యాం కదా! - అని ముగించాడు యమదూత. వికుండలుడు కృతజ్ఞతా భావంతో నమస్కరించాడు.


మహానుభావా! పేరుకు నువ్వు యమ దూతవేకానీ ఎంత సౌమ్యుడివి. తదయాయముడివి. నీ ప్రసంగంతో నా హృదయం ప్రసన్నమయ్యింది. నీ వంటి ఉత్తమ సజ్జమలతో సాంగత్యం గంగానది లాగా వెంటనే సర్వ పాపాలను పోగొడుతుంది. ఉపకారం చెయ్యడం, ప్రియం చెప్పడం అనేవి సజ్జమలకి సహజగుణాలు. అమృత కిరణుడైన చందమామను ఒకరు చల్లబరచాలా!


దేవదూతా! నాదొక విన్నపం. కారుణ్య మూర్తివి నువ్వే ఆలోచించి దారి చూపించాలి. మా అన్నగారిని నరకం నుండి తప్పించడమెలాగ? నా పుణ్యం నుండి అవసరమైనంతా ధారపోస్తాను. నాకు ఎంత పుణ్యం ఉంది? నా పూర్వ జన్మలు ఏమిటి? వాటిలో ఏ జన్మలోనైనా ఏ పుణ్యకార్యమైనా చేసానా? ఎంత పుణ్యం ధారపాయ్యగలను? ఇవి కాస్త తెలియజెప్పి పుణ్యం కట్టుకో. నీ మేలు మరిచిపోలేను అంటూ దీనంగా చేతులు పట్టుకున్నాడు.


వికుండల పూర్వ జన్మ


దేవదూత క్షణకాలం ధ్యాన మగ్నుడు అయ్యాడు. మైత్రీ బంధం అతడికి ఒక నిర్భంధం అయ్యింది. జ్ఞాన దృష్టిని సారించాడు. విషయమంతా అవగతమయ్యింది. మెల్లగా కన్నులు తెరిచాడు. వైశ్యకులోద్భవా ! నీ పూర్వజన్మం నీ సంచిత పుణ్యం అంతా సహేతుకంగా చెబుతాను విను.


Wednesday, 28 June 2023

శ్రీదత్త పురాణము (182)

 


బాల్య, యౌవన, కౌమారాల్లో వార్ధక్యదశల్లో ఎప్పుడైనా ఒక్క ఏకాదశ్యుపవాసం ఉంటే చాలు ఇటూ అటూ పాపాలన్నీ హుష్ కాకి అయిపోతాయి. ఉపవాసం ఉండటంతో పాటు హరి వాసరాన పుణ్యతీర్ధ స్నానం చేసి హేమ -భూ-గో-వస్త్ర-తిలాది దశదానాలలో ఏ ఒక్కటి చేసినా - ఇక చెప్పేది ఏముంది స్వర్గలోక సుఖాలు ఇహలోకంలోనే అనుభవిస్తాడు అంటే ఆశ్చర్యంలేదు. ఆయువు ముగిశాక వైకుంఠ పట్టణవాసం ముమ్మాటికీ తధ్యం. ఇవి చెయ్యని వారు - అంటే ఉపవాసం ఉండలేకపోయినా పర్వదినాన కనీసం తీర్ధస్నానమూ ఏదో ఒక దానమూ కాశింతధ్యానమూ చెయ్యనివారు కచ్చితంగా ఇహపరాలకు చెడతారు. దుఃఖభాగులవుతారు.


ధర్మ మహిమ


మిత్రమా ! నరక నివారకమైన ధర్మం గురించి సంక్షిప్తంగా చెబుతాను పనిలో పనిగా వినేసేయ్. త్రికరణ శుద్ధిగా జీవించడం - అంటే మనోవాక్కాయకర్మతో ఏ ప్రాణికీ ద్రోహం చెయ్యకపోవడం, ఇంద్రియ నిగ్రహం, దాతృత్వం, హరిసేవాపరాయణత్వం, వర్ణాశ్రమ ధర్మాలను తు.చ. తప్పకుండా పాటించడం - ఇవి కచ్చితంగా నరకాన్ని తప్పిస్తాయి. ఇంకొక్క సంగతి - చేసిన తపస్సుగానీ, చేసిన దానాన్ని గానీ, చేసిన ఉపకారాన్ని గాని పదిమందికి చాటింపు వేసుకోకూడదు. వాటి మహిమ అంతటితో తగ్గిపోతుంది. కనుక స్వర్గార్ధి ఈ పని చెయ్యడు. శక్తివంచన లేకుండా యవలు - వస్త్రాలు - ఛత్రాలు - కందమూల ఫలాలు - అన్న పానీయాలు మొదలైన వాటిని పది మందికీ పంచిపెడితే కలిగే హితం అంతా ఇంతా కాదు. ఎంతటి దరిద్రుడైనా కనీసం జలదానం చెయ్యగలడు కదా! అలా ఏదో ఒకటి దానం చేస్తూ ఆయుర్దాయంలో ప్రతిరోజునూ గొడ్డుబోకుండా చూసుకోవాలి. వైశ్యపుత్రా! ఒకరికి పెట్టనిది తనకు మిగలదు - ఈ రహస్యం అందరూ గ్రహించాలి. ఇది ఇహపరాలకు వర్తించే సూత్రం. దీన్ని పాటించే దాతలు మాలోకం వైపుకి రారు. ఇహంలో దీర్ఘాయుష్మంతులై ధనాఢ్యులై సకల భోగాలు అనుభవించి సత్కీర్తి సంపన్నులై అటు పైన స్వర్గ లోకంలో ఇంద్రభోగాలు ఆస్వాదిస్తారు. ఎన్ని జన్మలైనా వీరికి ఇలాగే సాగుతాయి. నరకం గుమ్మంతొక్క వలసిన అవసరం వీరికి ఏర్పడదు. మిత్రమా! వెయ్యి మాటలెందుకు. ధర్మం సుగతికీ అధర్మం దుర్గతికి దారి తీస్తాయి. అంచేత బాల్యం నుండే ధర్మాచరణను అలవరచుకోవాలి. ఇదీ సారాంశం.


Tuesday, 27 June 2023

శ్రీదత్త పురాణము (181)

 



యోగ్యుడైన బ్రాహ్మణుడికి సాలగ్రామం దానంచేస్తే నదీ సముద్రకాననాద్రి సహితంగా సమస్త భూగోళాన్ని దానం చేసినట్లే. అంతటి పుణ్యం దక్కుతుంది. ఈ సాలగ్రామ శిలకు మూల్యం కట్టడం కానీ క్రయవిక్రయాలు జరపడం కానీ అలాంటి వాటిని ఆమోదించడం గానీ అసలైనదా నకిలీదా అని పరీక్షించడంగానీ - ఇవ్వి మహాపాపాలు. శాశ్వత నరక హేతువులు. అందుచేత ఇలాంటి పనుల్ని ఎప్పుడూ ఎన్నడూ ఎవ్వడూ చెయ్యకూడదు.


పాప భీతి ఉన్నవారు వాసుదేవుణ్ని స్మరించడం మంచిది. అది సర్వపాపహరం. ఘోరారణ్యాల్లో కఠోర నియమాలతో సంవత్సరాల పాటు తపస్సులు చెయ్యడం కన్నా త్రికరణ శుద్ధిగా గోవింద నామస్మరణ చెయ్యడం చాలా తేలిక, పుణ్య ఫలాన్ని ఇవ్వడంలో ఇవి రెండూ సమానమే కనుక ఈ మాట చెబుతున్నాను. అదనంగా ఇంకొక విశేషం ఏమిటంటే ఎన్ని పాపాలు అన్నా చెయ్యి, ఒక్కసారి ఏకాగ్రచిత్తంతో హరి నామం స్మరించు, నువ్వు మా నరకానికి వస్తే ఒట్టు. సర్వ తీర్ధ స్నాన ఫలం సర్వదేవాలయ సందర్శన ఫలం - సమస్తమూ విష్ణు నామ సంకీర్తనతో తంగేటి జున్ను అవుతుంది. వారికి యమదర్శన మహాభాగ్యం గానీ నరక నివాస మహా సౌఖ్యంగానీ ఏ మాత్రమూ దక్కవు. నాయనా? వికుండలా! నేను వైష్ణవుణ్ని పరమభాగవతోత్తముణ్ని అని ఎవరైనా అహంకరించి శివనింద చేస్తే వారికి విష్ణులోకం దక్కదు సరికదా సరాసరి ఈ నరకానికి వచ్చి మా పాల పడతారు. రాకరాక ఒక వైష్ణవుడు వచ్చాడని మా వాళ్ళు కుమ్ముకుంటారు.


ఏకాదశి మహిమ


వికుండలా! మా ప్రభువు యమధర్మరాజుల వారు చెప్పిన మరొక విశేషం నీ చెవిన వేస్తాను. గ్రహించు. ఏకాదశి అంటే పద్మనాభుడికి చాలా ఇష్టమైన రోజు. ఆనాడు తెలిసో తెలియకో కావాలని కానీ తప్పనిసరియై కానీ, ఉపవాసం ఉన్న మానవుడు మా యమలోకం దరిదాపులకు ఏనాడూ రాడట. ఇంతటి పావనమైన రోజు ముల్లోకాల్లో మరొకటి లేదని ఘంటా పధంగా చెప్పారు. ఈ పద్మనాభైకాదశి నాడు ఉపవాసం చెయ్యనంత వరకే జీవుడు ఈ పాపిష్టి, శరీరంలో బంధీగా వుండడం. ఉపవాసం చేస్తే చాలు ముక్తి లభించినట్లే. మిత్రమా! దీన్నే హరివాసరం అంటారు. వెయ్యి అశ్వమేధాలు, నూరు రాజసూయాలు ఒక్క ఏకాదశి ఉపవాసంలో పదహారోవంతుకైనా సాటి రావంటే అతిశయోక్తికాదు. ఏకాదశేయింద్రియాలతో చేసిన పాపాలన్నీ ఏకాదశ్యుపవాసంతో హరించుకుపోతాయి. అంచేత ఈ ఉపవాస వ్రతంతో సాటి వచ్చేది మరొకటి లేదంటే లేదు. కావాలని చెయ్యకపోయినా, ఏ వ్యాజంతో చేసినా ఇది పుణ్యప్రదమే. ఇది స్వర్గదాయిని, మోక్ష కారిణి. శరీరారోగ్య ప్రదాయిని. సుకళత్రదాయిని. జీవత్పుత్ర ప్రదాయిని. ఈ హరివాసరానికి గంగా, గయా, కాశీ పుష్కర కురుక్షేత్రాది పుణ్యతీర్దాలు ఏవీ సాటి రావు. ఆయాచోట్ల చేసే పుణ్య కార్యాలకన్నా అధికపుణ్య ప్రదం ఈ హరివాసరోపవాస వ్రతం, పగలంతా ఉపవశించి రాత్రి జాగరణం చేస్తే చాలు అనాయాసంగా వైకుంఠం దక్కుతుంది ఈ వ్రతంలో. అంతే కాదు ఇది చేసిన వ్యక్తి - తల్లి వైపున పది తరాలునూ తండ్రి వైపున పది తరాలనూ తన వాళ్ళు పది మందినీ ఉద్దరించిన వాడవుతాడు. తరింపజేసిన వాడవుతాడు.


అలా ఉద్దరించబడ్డ వారంతా గరుడ కేతనులై వనమాలికా భూషితులై పీతాంబర ధారులై వైకుంఠం చేరుకుంటారు.


Monday, 26 June 2023

శ్రీదత్త పురాణము (180)

 


అంగన్యాస కరన్యాసాలతో షోడశోపచారాలతో గీత వాదిత్రస్తోత్ర నృత్యాలతో సాలగ్రామ శిలాచక్రంలోని శ్రీమన్నారాయణుడికి నిత్యము పూజలు చేసే పుణ్యశాలి ఈ కలియుగంలో సైతం ధర్మపరాయణుడై వివిధ భోగభాగ్యాలను అనుభవించి అటుపైన సహస్రకోటి కల్పాలు వైకుంఠంలో శ్రీ హరి సన్నిధిలో ఆనందంగా గడుపుతాడు. కోటి లింగాలను అర్చించినందువల్ల వచ్చే పుణ్య ఫలం ఎంతటిదో ఒక్క సాలగ్రామ శిలను అర్చించడంచేత వచ్చే పుణ్యఫలం అంతటిది. సంఖ్యాది శాస్త్రాలు అవి చెప్పే నియమనిష్టలూ ఏమీ లేక పోయినా ఫర్వాలేదు. యధాలాపంగానైనా సాలగ్రామ శిలను ఒక్కసారి అర్చిస్తే చాలు అతడు ముక్తిని పొందుతాడు. శ్రీ మన్నారాయణుడు సాలగ్రామ శిలారూపియై నివశించే చోట సకల దేవతలు, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష జాతులు, చతుర్దశభువనాలు సన్నిధి చెయ్యడం తథ్యం. సాలగ్రామ శిలాసాన్నిధ్యంలో శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే, పితృదేవతలు పరిపూర్ణంగా సంతృప్తి చెందుతారు. సాలగ్రామ శిలాజలాన్ని ఒక్కసారి పుచ్చుకుంటే చాలు పంచగవ్యాన్ని వెయ్యిసార్లు ప్రాశించిన ఫలం దక్కుతుంది. కోటి సహస్ర తీర్థాలలో కోటి సహస్ర పర్యాయాలు మునిగిన పుణ్యం దక్కుతుంది. సాలగ్రామ శిలాతోయంలో చక్రాంకిత శిలాజలాన్ని సమ్మిశ్రితం చేసి శిరస్సున, దేహాన్న జల్లుకున్నా ముమ్మారు లోపలికి పుచ్చుకున్నా ఇక అతడి శరీరం చక్రాంకితమైనట్లే. ఏ మాత్రం సందేహం లేదు. అయితే పుణ్యాత్ములకు తప్ప ఈ శంఖ చక్ర ముద్రలు ఇతరులకి కనిపించవు. ఇవి పరమగుప్తాలు.


అందుచేత ఓ వైశ్య శిఖామణీ! మా ప్రభువు మమ్మల్ని వైష్ణవుల ఇళ్ళవైపు వెళ్ళవద్దని కట్టడిచేసాడు. విష్ణుపాదోదకాన్ని సేవించిన వారు కనుక విష్ణు భక్తులంటే మాకు చచ్చేంత భయం.


మిత్రమా! వాపీ కూప తటాకాదుల్లో మూడు రోజులు స్నానం చేసినందువల్ల కలిగే పుణ్యఫలాన్ని సముద్రుణ్ని చేరని ప్రవాహాలు ఒక్క స్నానంతో అందిస్తాయి. ఈ ప్రవాహాలలో పదిహేను రోజులపాటు స్నానాలు చేసినందువల్ల వచ్చే పుణ్య ఫలాన్నీ సముద్రుణ్ని చేరే నదీనదాలు ఒక్క స్నానంతో అందిస్తాయి. ఈ నదీ నదాల్లో నెల నాళ్ళు మునిగిన పుణ్యఫలాన్ని సముద్రుడు ఒక్క మునకతో అందిస్తాడు. ఆరు నెలలు సముద్రస్నానం చేసినందువల్ల దక్కే పుణ్యాన్ని గోదావరి ఒక్క స్నానంతో ఇస్తుంది. గోదావరిలో సంవత్సరం పుణ్యాన్ని గంగమ్మ ఒకే ఒక్క మునకతో ఇస్తుంది. పుష్కరం పాటు గంగా స్నానం చేసినందువల్ల లభించే పుణ్యఫలాన్ని విష్ణుపాదోదకమైన ఈ సాలగ్రామ శిలాజలం శిరస్సేచనంతో అందిస్తుంది. కనుక ఇది ఎంతో పుణ్యం చేసుకున్న వారికి తప్ప దొరకదు. సాలగ్రామ శిల ఉన్న ప్రదేశం - మూడు ఆమడల విస్తీర్ణం వరకూ పవిత్ర తీర్ధంకిందనే లెక్క. ఆ ప్రాంతంలో చేసిన చేసిన దానాలూ, హోమాలు కోటి రెట్లు అధికంగా వేగంగా ఫలితాన్ని అందిస్తాయి. సాలగ్రామ శిలాజలాన్ని ఒక్క బిందువైనా సేవించగల్గితే ఆ మనిషికి ఇంకెప్పుడూ మాతృస్తన్యం గ్రోలవలసిన పరిస్థితి రాదు. పునర్జన్మ లేనిముక్తి పొందుతాడు.


Sunday, 25 June 2023

శ్రీదత్త పురాణము (179)

 


సాలగ్రామ మహిమ


వజ్ర కోట వినిర్మితమైన సాలగ్రామ శిలాచక్రంలో ముముక్షువులు వాసుదేవుణ్ని అర్చిస్తారు. సాలగ్రామశిల విష్ణువుకి అధిష్టానం, ఇది సర్వ పాప ప్రణాశకం, సర్వ పుణ్య ప్రదం. అందరికీ ముక్తిదాయకం. ప్రతి రోజూ సాలగ్రామ శిలా చక్రంలో శ్రీ హరిని పూజించినవారు వెయ్యి రాజసూయాలు చేసిన ఫలం పొందుతారు. అక్షరమూ అచ్యుతమూ అయిన బ్రహ్మ నిర్వాణమని వేదాంతులు చెప్పేది, సాలగ్రామ శిలార్చనంతో పుణ్యాత్ములు పొందుతారు. కాష్టంలోని వహ్ని మధనంతో బయట పడినట్లు సాలగ్రామార్చనతో మనిషిలోని పుణ్యం ఆవిష్కృతమవుతుంది. ఘోరమైన దుష్కృత్యాలు చెయ్యడం వల్ల ఏ సత్కార్మాచరణకూ అధికారంలేని మహాపాపాత్ములైనా ఒక్క సారి సాలగ్రామ సమార్చన చేస్తే వారింక మా యమాలయం వైపు రారు. సాలగ్రామ శిలాచక్రంలో నివాసమంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరం. లక్ష్మీదేవితో క్రీడించడంకన్నా వైకుంఠంలో విహరించడం కన్నా ఇష్టమైన విషయం.


సాలగ్రామ శిలాచక్రంలో శ్రీ మన్నారాయణుణ్ని ఒక్కసారి అర్చిస్తే అతడు ఆహో రాత్రాలు హోమాలు చేసిన పుణ్యాన్ని చతుస్సాగర సమేతంగా భూగోళాన్ని అంతటిని దానం చేసిన ఫలాన్ని పొందుతాడు. వికుండలా! సాలగ్రామ శిలలు పన్నెండువున్నాయి. వీటిని ఒక్కసారి అర్చిస్తే వచ్చే పుణ్యం ఎంతటిదో వివరిస్తాను. విను. స్వర్ణ కమలాలతో కోటి ద్వాదశ లింగాలను పన్నెండు కల్పాల పర్యంతం అర్చిస్తే ఏ ఫలం వస్తుందో అది ఒక్క రోజున ద్వాదశ సాలగ్రామాలను అర్చిస్తే లభిస్తుంది. ఈ ఫలం పొందిన పుణ్యశీలి విష్ణులోకంలో పన్నెండు కల్పాల పర్యంతం నివసించి అటుపైని భూగోళం మీద చక్రవర్తిగా అవతరిస్తాడు. అరిషడ్ వర్గాలకు దాసుడైన నరాధముడు సైతం సాలగ్రామ శిలార్చన చేస్తే వైకుంఠ నివాసం పొందుతాడు. సదాచార సంపన్నుడై సాలగ్రామ శిలా చక్రంలో గోవిందుణ్ని అర్చించిన సజ్జనుడు మహాప్రళయం వరకూ వైకుంఠం నుండి చ్యుతిని పొందడు. తీర్ధయాత్రలు చెయ్యకపోయినా దాన ధర్మాలు చెయ్యకపోయినా యజ్ఞాలు యాగాలు చెయ్యకపోయినా సాలగ్రామ శిలార్చన చేస్తే చాలు ముక్తి లభించడం తథ్యం. సకల పాపాలకు ఇది విరుగుడు. నరక నివాసం గర్భవాస క్లేశం (పునర్జన్మ) క్రిమి కీటక, పశు పక్షి నీచ జన్మలు వగైరా తీవ్ర శిక్షల్ని త్రోసిరాజు అనగల్గినది ఈ సాలగ్రామ శిలార్చన, దీక్షా స్వీకారంతో మంత్ర పూర్వకంగా ఈ శిలా చక్రంలో చక్రిని అర్చించి బలి ప్రధానం చేసినవాడు విష్ణులోకంలో శాశ్వత నివాసం పొందుతాడు. ఇది ముమ్మాటికీ నిజం. సాలగ్రామ శిలాజలంతో కేశవుడికి అభిషేకం జేసి ఆ పావనోదకాన్ని శిరస్సున జల్లుకొన్న భక్తుడు సకల పుణ్య తీర్థాలలోనూ స్నానం చేసిన పవిత్రతనూ, సర్వ యజ్ఞాలు చేసిన పుణ్యఫలాన్ని క్షణంలో నిస్సందేహంగా పొందుతాడు. ఎందుకంటే ముక్తిదాయకాలైన గంగా గోదావరీ రేవాది నదులు సకల పుణ్య తీర్ధ సమేతాలై వచ్చి సాలగ్రామ శిలోదకంలో సన్నిధి చేస్తాయి.


Saturday, 24 June 2023

శ్రీదత్త పురాణము (178)

 


వైష్ణవ మహిమ


వికుండలా! మరొక అద్భుత రహస్యం నీకు చెబుతాను. ఇది యమధర్మరాజు సమ్మతమూ సర్వలోక అభయ ప్రదమూనూ, శ్రద్ధగా ఆలకించు. విష్ణు భక్తి పరాయణులైన పరమవైష్ణవులు మాలోకాన్ని గానీ మా ప్రభువును గానీ చూడరంటే చూడరు. ఇది ముమ్మాటికీ సత్యం. మా ప్రభువు మాకు ఎప్పుడూ హెచ్చరిక చేస్తుంటాడు వైష్ణవుల - జోలికి వెళ్ళవద్దనీ, వారు మన ముఖం చూడరనీను. బుద్ధి పూర్వకంగా కాకపోయినా ఏదో ప్రసంగవశాత్తూ నైనా కేశవుణ్ని స్మరించిన వాడు సకలాఘ విముక్తుడై విష్ణులోకం చేరుకుంటాడు. అంచేత విష్ణు భక్తుడు ఒక వేళ దురాచారుడైనా పాప కార్యాలు చేసినా మనం అతడి జోలికి పోకూడదు అని మా ప్రభువు కట్టడి చేసాడు. అంతేకాదు వైష్ణవులు - భుజించిన ఇళ్ళఛాయలకూ వైష్ణవులతో సత్సాంగత్యం నెరిపిన వారి జోలికి వెళ్ళవద్దు అన్నాడు. ఆ ఉభయులూ గత కిల్బిషులు అవుతారట. అంచేత వైష్ణవుడుగానీ వైష్ణవున్ని పూజించిన వారు కానీ వైష్ణవులతో సత్సాంగత్యం నెరిపిన వారు కానీ యధాలపంగా హరినామ స్మరణ చేసిన వారుగానీ మా రాజధానికి రారు. వారికి ఆ అవసరం లేదు. ఎంతటి పాపిష్టికైనా విష్ణు భక్తిని మించిన నరక నివారణోపాయం మరొకటి లేదని తెలుసుకో. నరకాంబుధిని హాయిగా దాటించే నావ హరినామ సంకీర్తన. ఆ మనిషి వర్ణ బాహ్యుడైనప్పటికీ విష్ణుభక్తుడైతే చాలు. ముల్లోకాలనూ పావనం చేస్తాడు. నరకంలో మ్రగ్గిపోతున్న తల్లి తండ్రుల్ని కొడుకు చేసే కేశవార్చన ఉద్ధరించి వైకుంఠానికి తీసికొని వెడుతుంది. వైష్ణవులకు సేవలు చేసే వారూ వైష్ణవభుక్త శేషాన్ని ప్రసాదంగా స్వీకరించే వారూ హరిధామం చేరుకుంటారు. అంచేత వైష్ణవాన్నాన్ని అభ్యర్థించి ఆరగించాలి. లేదంటే కనీసం వారి ఇంట, వారిచేతుల మీదుగా కాసిన్ని మంచినీళ్ళయినా పుచ్చుకోవాలి. గోవింద నామాన్ని జపిస్తూ ఎవరు ఎక్కడ అసువులు బాసినా వారి జోలికి మేముగానీ మా ప్రభువుగానీ వెళ్ళంగాక వెళ్ళం.


అంగన్యాస కరన్యాసాలతో బుషిచ్చందో దైవతంగా దీక్షా విధి పూర్వకంగా యంత్ర సహితంగా ద్వాదశాక్షర లేదా అష్టాక్షరీ మహామంత్రాన్ని నిత్యమూ జపించే విష్ణుభక్తుల్ని అల్లంత దూరం నుంచి ఒకసారి దర్శిస్తే చాలు బ్రహ్మ హత్యాపాతకుడు సైతం పరిశుద్ధుడు అయిపోతాడు.


ఓం నమో భగవతే వాసు దేవాయ అనేది ద్వాదశాక్షర మంత్రం.


ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షర మహా మంత్రము. శంఖ చక్రాంకితులైన వైష్ణవులు విష్ణురూపులై బ్రహ్మా యుగాంతకాలం వైకుంఠంలో నివసిస్తారు. హృదయంలోగానీ సూర్యబింబంలో గానీ జలరాశిలో గానీ ప్రతిమలో గాని స్థండిలం మీద గానీ (నేల) వనమాలి రూపాన్ని భావించి లేదా రూపించి ధ్యానించేవారు విష్ణుపదం చేరుకుంటారు.