Saturday, 2 December 2023

శ్రీ గరుడ పురాణము (22)

 


ధ్రువ వంశం - దక్ష సంతతి


శివాది దేవతలారా! ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు; సురుచి, సునీతి. వారిలో సురుచికి ఉత్తముడు సునీతికి ధ్రువుడు పుట్టారు. వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాధి దేవుడైన జనార్దనునారాధించి ఆయన దర్శనభాగ్యాన్ని పొందాడు. ఆ తరువాత పెద్దకాలం పాటు మహారాజుగా, మనిషిగా బాధ్యతలను నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచాడు.


ధ్రువుని కొడుకు క్లిష్టుడు. ఆ తరువాత ఆ వంశంలో పరంపరగా ప్రాచీన బర్హి, ఉదారధి, దివంజయుడు, రిపుడు, చాక్షుషుడు, రురు, అంగుడు, వేనుడు రాజ్యం చేశారు. ఈ వేనుడు నాస్తికుడు, ధర్మభ్రష్టుడు, పొగరుబోతు. మహర్షులను, పూజ్యులను దారుణంగా అవమానించేవాడు. దేశం పాడైపోతుండడంతో మరో దారిలేక మహర్షులంతా కుశాఘాతాలతో వానిని చంపివేశారు! రాజ్యం అరాచకం కాకుండానూ, విష్ణుమానస పుత్రుని కోసమూ ప్రయత్నాలు చేయసాగారు. ముందు వేనుని శరీరం కాస్త వెచ్చగా వుండగానే అతని ఊరు భాగాన్ని మంత్ర సహితంగా మంథనం చేయగా ఒక పుత్రుడు ఉదయించాడు. అతడు నల్లగా, అతిచిన్న పరిమాణంలో వుండడంతో, అతనిని 'ఇక్కడే వుండు' అనే భావంతో 'నిషేద’ అన్నారు. ఈ శబ్దం వల్ల అతని పేరు నిషాదుడుగా స్థిరపడిపోయింది. అనంతర కాలంలో అతడు కొండల మీదికి వెళ్ళిపోయాడు. తరువాత మునులంతా కలిసి తమ తపశ్శక్తిని వినియోగించి శ్రీహరిని జపిస్తూ వేనుని కుడిచేతిని మథించగా అందునుండి విష్ణువే పృథు నామంతో అవతరించాడు. ఆయన ప్రజానురంజకమైన పరిపాలనను చేయడమే కాక వారికోసం పృథ్విని పితికి సమస్త ద్రవ్యాలనూ రాబట్టి ప్రజలను ఐశ్వర్యవంతులను చేశాడు *. (* వేన చరిత్రలో మనం గమనించ వలసినదేంటంటే అప్పట్లో మేధావులు, విద్యావంతులు, తపోధనులైన మహర్షులు రాజెలాగుంటే మనకేం, దేశమేమైపోతే మనకేం అని ఊరుకోలేదు. విపరీతంగా శ్రమించి, తపశ్శక్తిని ధారవోసి విష్ణువునే క్రిందికి)

పృథువు తరువాత వంశానుగతంగా అంతర్ధానుడు, హవిర్ధానుడు, ప్రాచీన బర్హి, రాజులయ్యారు. ఈ ప్రాచీన బర్హిలవణ సముద్ర పుత్రియైన సాముద్రిని పెండ్లాడి పదిమంది పుత్రులను కన్నాడు. వారందరూ ప్రాచేతస నామంతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ణాతులై లోకంలో ధనుర్ధారులను తయారు చేశారు. ధర్మాచరణ నిరతులై ప్రజలను కాపాడారు. తరువాత పదివేల సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోరతపస్సు చేసి తత్ఫలితంగా ప్రజాపతి పదవినీ, వరప్రసాదియైన మారిషయను దివ్యస్త్రీని భార్యగానూ పొందారు. శివుని చేత శపింపబడిన దక్షుడు ఈ మారిషకే కొడుకుగా పుట్టాడు.

Friday, 1 December 2023

శ్రీ గరుడ పురాణము (21)

 


దక్షప్రజాపతికి ప్రసూతి ద్వారా ఇరవై నలుగురు కూతుళ్ళు పుట్టారు. వారిలో శ్రద్ధ, లక్ష్మీ, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, బుద్ధి, కీర్తి నామకలైన పదముగ్గురు కన్యలను దక్షిణా పుత్రుడయిన ధర్ముడు పత్నులుగా స్వీకరించాడు. తరువాత ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అను పేర్లు గల పదకొండుగురు కన్యలనూ దక్ష ప్రజాపతి క్రమంగా భృగుమహర్షి, పరమశివుడు, మరీచి, అంగిరా మహర్షి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వసిష్ఠుడు, అగ్ని, పితరుడు - అను ప్రసిద్ధులకిచ్చి వివాహం చేశాడు.


వీరిలో శ్రద్ధకు కాముడు, లక్ష్మికి దర్పుడు, ధృతికి నియముడు, తుష్టికి సంతోషి, పుష్టికి లోభుడు, మేధకు శ్రుతుడు, క్రియకు దండలయ, వినయులూ, బుద్ధికి బోధుడూ, లజ్జకు వినయుడూ, వపుకి వ్యవసాయ, శాంతికి క్షేమా, బుద్ధికి సుఖ, కీర్తికి యశ అనువారలు పుట్టారు. కామదేవునికి రతి పత్నికాగా వారికి హర్షుడుద్భవించాడు.


కొంతకాలానికి దక్ష ప్రజాపతి అశ్వమేధయాగాన్ని చేసి శివునీ, సతినీ తప్ప ఇతర బంధువుల నందరినీ ఆహ్వానించాడు. తండ్రి పిలువకపోయినా ఆ యజ్ఞానికి విచ్చేసిన సతి తన తండ్రి తిరస్కారాన్నీ తనకు జరిగిన అవమానాన్నీ తట్టుకోలేక ఆ దక్షయజ్ఞ వాటికలోనే ప్రాణ త్యాగం చేసింది. ఆ సతియే మరుసటి జన్మలో హిమవత్ పుత్రిగా పుట్టి పరమశివుని చేపట్టి గణేశునికీ దేవసేనానికీ తల్లియై లోకారాధ్య అయింది.


అక్కడ దక్షయజ్ఞంలో తన సతి బలియై పోయినందుకు క్రుద్ధుడైన భృంగీశ్వర పినాక పాణి శంకరభగవానుడు దిగివచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని మానవునిగా ధ్రువ వంశంలో పుట్టుమని శపించాడు.


(అధ్యాయం - 5)


Thursday, 30 November 2023

శ్రీ గరుడ పురాణము (20)

 


అనసూయకు అత్రి ద్వారా చంద్రుడు దుర్వాసుడు, దత్తాత్రేయుడు కలిగారు. పులస్త్యునికి ప్రీతి ద్వారా దత్తోలుడను పుత్రుడు పుట్టాడు. పులహప్రజాపతికి క్షమయను పత్ని ద్వారా కర్మశుడు, అర్థవీరుడు, సహిష్ణువు అను పుత్రులుద్భవించారు. క్రతువుకి పత్ని సుమతి ద్వారా ఆరువేలమంది వాలఖిల్య ఋషులుద్భవించారు. వీరంతా ఊర్ధ్వరేతస్కులు, బొటనవ్రేలి పరిమాణం వారు, సూర్యునంత తేజస్సంపన్నులు.


* వసిష్ఠునికి పత్ని ఊర్జాద్వారా రజుడు, గాత్రుడు, ఊర్ధ్వబాహుడు, శరణుడు, అనఘుడు, సుతపుడు, శుక్రుడు అను మహర్షులుదయించారు. వీరిని సప్తమహర్షులంటారు. (*ఈయన శ్రీరామగురువు వశిష్ఠుడు కాదు)


శివశంకరా! దక్షప్రజాపతి తన కూతురైన స్వాహాను అగ్ని దేవునికిచ్చి వివాహం చేయగా వారికి * పావక, పవమాన, శుచులను పుత్రులు పుట్టారు. వీరే త్రేతాగ్నులు. పరమ ఓజస్వులు. 

* ఈ త్రేతాగ్నులలో విద్యుత్సంబంధియైన అగ్ని పావకం. ఘర్షణ ద్వారా వచ్చేది పవమానం. సూర్యుని లోనిది శుచి. కూర్మ పురాణంలో ఇలా చెప్పబడింది. పావకః పవమానశ్చ శుచి రగ్నిశ్చ తేత్రయః |


నిర్మథ్యః పవమానః స్యాద్ వైద్యుత పావకః స్మృతః ॥

యశ్చాసౌ తపతే సూర్యః శుచిరగ్ని స్త్వ సౌ స్మృతః |


(1-12/25,26)

దక్ష కన్యయైన స్వధకు మేనా, వైతరణియను కూతుళ్ళు పుట్టారు. వారు 'బ్రహ్మవాదినులు' మేనాకు హిమవంతుని ద్వారా మైనాకుడను పుత్రుడూ, గౌరీ నామంతో ప్రసిద్ధి చెందిన పార్వతీదేవియను కన్యా జన్మించారు. ఈమెయే పూర్వజన్మలో సతీదేవి.


అప్పుడు బ్రహ్మయే స్వయంగా తనంతటి వాడైన స్వాయంభువమనువుకు జన్మనిచ్చి అతనిని ప్రజాపాలన కార్యంలో నియోగించాడు. సర్వవైభవ సంపన్నుడైన స్వాయంభువ మను మహారాజు తన అఖండ తపః ఫలంగా పరమశుద్ధతేజస్వినీ, తపస్వినీయైన శతరూపాదేవిని భార్యగా పొందాడు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కొడుకులు, ప్రసూతి, ఆకూతి, దేవహూతియను కూతుళ్ళు కలిగారు. ఆడపిల్లలు ముగ్గుర్నీ క్రమంగా రుచి ప్రజాపతికీ, దక్ష ప్రజాపతికీ, కర్దమమునికీ ఇచ్చి వివాహం జరిపించారు. రుచికి యజ్ఞుడనే కొడుకూ దక్షిణయను కూతురూ జన్మించారు. యజ్ఞునికి పన్నెండు మంది మహాబలశాలులైన పుత్రులు పుట్టారు. వారే 'యామ' అను దేవగణానికి మూలపురుషులుగా ప్రఖ్యాతి నందారు.


Wednesday, 29 November 2023

శ్రీ గరుడ పురాణము (19)

 


మానస సృష్టి వర్ణన దక్షప్రజాపతి -


సృష్టి విస్తారం


శంకరా! ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస ప్రజాసృష్టి తరువాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానసపుత్రులవైపు దృష్టి సారించాడు. ఆయన నుండియే యములు, రుద్రులు, మనువులు, సనకుడు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు.

రుచి, శ్రద్ధ, మరీచి, అత్రి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వసిష్ఠుడు, నారదుడు జనించారు. అలాగే పితృగణాలవారు ఏడుగురు అనగా బర్హిషద, అగ్నిష్వాత్త, క్రవ్యాద, ఆజ్యప, సుకాలిన, ఉపహూత, దీప్య నామకులు కూడ ఉద్భవించారు. వీరిలో మొదటి ముగ్గురూ అమూర్త రూపులు. చివరి నలుగురూ మూర్త రూపులు, అంటే కళ్ళకు కనిపిస్తారు.


కమల గర్భుడైన బ్రహ్మ దక్షిణ అంగుష్ఠం (కుడి బొటనవ్రేలు) నుండి ఐశ్వర్య సంపన్నుడైన దక్ష ప్రజాపతీ, ఎడమ బొటనవ్రేలి నుండి ఆయన భార్యా పుట్టారు. వీరికి శుభ లక్షణలైన ఎందరో కన్యలు పుట్టగా వారిని బ్రహ్మమానస పుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించాడు. సతీదేవియను పుత్రికను రుద్రునకిచ్చి పెండ్లి చేయగా వారికి పెద్ద సంఖ్యలో మహాపరాక్రమశాలురైన పుత్రులు పుట్టారు.


దక్షుడు ఒక అసాధారణ రూపవతీ, సుందర సులక్షణ లక్షిత జాతాయగు (తన) ఖ్యాతియను కూతురిని భృగుమహర్షికిచ్చి పెండ్లి చేశాడు. వారికి ధాత, విధాతలను కొడుకులూ, శ్రీయను కూతురు కలిగారు. ఈ శ్రీనే హరి వరించి శ్రీహరియైనాడు. వారికి బల, ఉన్మాదులను కొడుకులు గలిగారు.


మహాత్ముడైన మనువుకి ఆయతి నియతి అను ఇద్దరు కన్యలు పుట్టగా వారిని భృగు పుత్రులైన ధాత, విధాతలకిచ్చి పెండ్లి చేశాడు. వారికి ప్రాణుడు, మృకండుడు పుట్టారు. నియతి పుత్రుడైన మృకండుని కొడుకే మహానుభావుడు మహర్షియైన మార్కండేయుడు.


మరీచి - సంభూతిలకు పౌర్ణమాసుడను పుత్రుడు జనించాడు. ఆ మహాత్ముని పుత్రులు విరజుడు, సర్వగుడు. అంగిరామునికి దక్ష కన్య స్మృతి ద్వారా ఎందరో పుత్రులు, సినీవాలీ, కుహూ, రాకా అనుమతీ నామక కన్యలు కలిగారు.


Tuesday, 28 November 2023

శ్రీ గరుడ పురాణము (18)

 


తరువాత బ్రహ్మయొక్క సత్త్వగుణ మాత్రవల్ల ఆయన ముఖంనుండి దేవతలుద్భవించారు. తరువాత ఆయన సత్త్వగుణ యుక్తమైన శరీరాన్ని కూడా విడనాడగా దానినుండి పగలు పుట్టింది. దేవతలకు పగలు ప్రీతి పాత్రం. తరువాత బ్రహ్మయొక్క సాత్త్విక శరీరం నుండి పితృగణాలుద్భవించాయి. బ్రహ్మ ఆ సాత్త్విక శరీరాన్ని వదలిపోయినపుడు అది సంధ్యగా మారింది. ఈ సంధ్య పగటికీ రాత్రికీ మధ్య వచ్చే సమయం. తదనంతరం బ్రహ్మ యొక్క రజోమయ శరీరం నుండి మానవులు పుట్టారు. ఆయన ఆ శరీరాన్ని పరిత్యజించినపుడది జ్యోత్స్న అనగా ప్రభాత కాలంగా మారింది. అదే ఉదయ సంధ్య. ఈ రకంగా జ్యోత్స్న, పగలు, సంధ్య, రాత్రి అనేవి బ్రహ్మ శరీర సంభూతాలు.


తరువాత బ్రహ్మ రజోగుణమయ శరీరం నుండి క్షుధ, క్రోధం జనించాయి. పిమ్మట బ్రహ్మ నుండియే ఆకలి దప్పులు అతిగా కలవారు, రక్త మాంస సేవనులునగు రాక్షసులు, యక్షులు పుట్టుకొచ్చారు. ఎవరినుండి సామాన్య జీవునికి రక్షణ అవసరమో వారు రాక్షసులు. యక్షశబ్దానికి తినుటయని అర్ధము. యక్షులు ధనదేవతలు. ధనం కోసం వీరిని పూజిస్తారు. ఈ పూజలో భక్షణ కూడా ఒక భాగం. ఈ భక్షణ వల్ల వీరిని యక్షులంటారు. అటుపిమ్మట బ్రహ్మకేశాల నుండి సర్పాలు, క్రోధం నుండి భూతాలు పుట్టినవి. చురుకైన కదలికను సర్పణమంటారు. అది కలవి సర్పాలు. తరువాత బ్రహ్మలో కలిగిన క్రోధ గుణవాసనపాములకూ తగిలింది. అందుకే వాటికి క్రోధ మెక్కువ. తరువాత బ్రహ్మనుండి పాటపాడుతూ, నాట్యమాడుతూ కొన్ని ప్రాణులు నిర్గమించాయి. పాడే వారు గంధర్వులు కాగా ఆడేవారు అచ్చరలయ్యారు.


తరువాత ప్రజాపతియైన బ్రహ్మవక్షస్థలం నుండి స్వర్గము, ద్యులోకము పుట్టాయి. ఆయన ముఖము నుండి అజము (మేక), ఉదరమునుండి గోవు, పార్శ్వాలనుండి ఏనుగు, గుఱ్ఱము, మహిషము, ఒంటె, తోడేలు జాతులు పుట్టినవి. ఆయన రోమాల నుండి ఫల, పుష్ప, ఔషధ జాతి వృక్షాలుద్భవించాయి. తరువాత ఏడు రకాల జంతువులు పుట్టాయి. అవి క్రమంగా పులి వంటి హింసకాలు, పశువులు (ఇది ఒకదశ), రెండు గోళ్ళ (గిట్టల) జంతువులు, నీటిక్షీరదాలు, కోతి జాతి, పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు.


బ్రహ్మయొక్క పూర్వాది నాల్గు ముఖాలనుండి క్రమంగా ఋగ్యజుస్సామాథర్వ వేదాలు జనించాయి. ఆయన ముఖం నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులూ ఉత్పన్నులైనారు. వెంటనే బ్రహ్మవారిలో ఉత్తములైన బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్నీ, క్షత్రియులకు ఇంద్రలోకాన్ని, వైశ్యులకు వాయులోకాన్నీ శూద్రులకు గంధర్వలోకాన్నీ నివాసాలుగా నిర్ధారణ చేశాడు. ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్ని, స్వధర్మనిరతులై గృహస్థాశ్రమాన్ని నిర్వహించిన వారికి ప్రాజాపత్యలోకాన్నీ, వానప్రస్థులకు సప్తర్షిలోకాన్నీ, సన్యాసులకూ పరమతపో నిధులకూ అక్షయలోకాన్నీ ప్రాప్త్యలోకాలుగా నిర్ధారణ చేశాడు.


(అధ్యాయం - 4)


Monday, 27 November 2023

శ్రీ గరుడ పురాణము (17)

 


దేవ, అసుర, మనుష్య సహితమైన ఈ సంపూర్ణ జగత్తు ఆ అండంలోనే వుంటుంది. ఆ పరమాత్మయే స్వయం స్రష్టయగు బ్రహ్మరూపంలో ప్రపంచాన్ని సృష్టిస్తాడు, విష్ణు రూపంలో దాని ఆలనా, పాలనా చూసుకుంటాడు. కల్పాంత కాలంలో రుద్ర రూపంలో దానిని సంపూర్ణంగా లయింపజేస్తాడు. సృష్టి సమయంలో ఆ పరమాత్మయే వరాహరూపాన్ని ధరించి జలమగ్నయైన భూమిని తన కొమ్ముతో తేల్చి ఉద్ధరిస్తాడు. శంకరదేవా! ఇక దేవాదుల సృష్టి యొక్క వర్ణనను సంక్షిప్తంగా తెలియజేస్తాను.


అన్నిటికన్నముందు ఆ పరమాత్మనుండి మహత్తత్త్వం సృష్టింపబడుతుంది. రెండవ సర్గలో పంచతన్మాత్రల - అనగా - రూప, రస, గంధ, స్పర్శ, శబ్దముల - ఉత్పత్తి జరుగుతుంది. దీన్నే భూతసర్గ అంటారు. వీటి ద్వారానే పంచమహాభూతములైన నేల, నీరు, *నిప్పు (* నిప్పులో అగ్ని, తేజస్సు అంతర్భాగాలు. మండించేదీ కాంతినిచ్చేదీ కూడా నిప్పే), గాలి, నింగి సృష్టింపబడతాయి. మూడవది వైకారిక సర్గ. కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ ఈ దశలోనే పుడతాయి కాబట్టి దీనిని ఐంద్రిక సర్గయని, బుద్ధి దశ కూడా ఇదే అవుతుంది. కాబట్టి దీన్ని ప్రాకృత సర్గయని కూడా అంటారు. నాలుగవది ముఖ్య సర్గ పర్వతాలూ, వృక్షాలూ మానవ జీవనంలో ముఖ్య పాత్రను పోషించాలి. అవి సృష్టింపబడే సర్గ కాబట్టి దీనికాపేరు వచ్చింది. అయిదవది తిర్యక్ సర్గ. పశుపక్ష్యాదులు ఈ సర్గలో పుడతాయి. తరువాత ఆరవ సర్గలో దేవతలూ, ఏడవ సర్గలో మానవులూ సృష్టింపబడతారు. వీటిని క్రమముగా ఊర్ధ్వ స్రోతా, అర్వాక్ స్రోతాతా సర్గలంటారు. దేవతల కడుపులో పడిన ఆహారం పైకీ, మానవులది క్రిందికీ చరిస్తాయి. ఏడవ సర్గ మానుష సర్గ. ఎనిమిదవది అనుగ్రహ నామకమైన సర్గ. ఇది సాత్త్విక తామసిక గుణ సంయుక్తం. ఈ యెనిమిది సర్గలలో అయిదు వైకృతాలనీ, మూడు ప్రాకృత సర్గలనీ చెప్పబడుతున్నాయి. అయితే, తొమ్మిదవదైన కౌమారనామక సర్గలో ప్రాకృత, వైకృత సృష్టులు రెండూ చేయబడతాయి.


రుద్రాది దేవతలారా! దేవతల నుండి స్థావరాల వఱకూ నాలుగు ప్రకారాల సృష్టి జరుగుతుంది. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మనుండి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నులయ్యారు. తరువాత దేవ, అసుర, పితృ, మనుష్య సర్గచతుష్టయం వచ్చింది. అపుడు పరమాత్మ జలసృష్టి కార్యంలో సంలగ్నుడైనాడు. సృష్టి కర్మలో మునిగియున్న ప్రజాపతి బ్రహ్మనుండి తమోగుణం పుట్టుకొచ్చింది. కాబట్టి ఆయన జంఘలనుండి రాక్షసులు పుట్టుకొచ్చారు. శంకరా! అప్పుడాయన తమోగుణ యుక్తమైన శరీరాన్ని విడచిపెట్టగా ఆ తమోగుణపు ముద్ద రాత్రిగా మారి నిలబడిపోయింది. యక్షులకీ రాక్షసులకీ అందుకే రాత్రి అంటే చాల ప్రీతి.


Sunday, 26 November 2023

శ్రీ గరుడ పురాణము (16)

 


సృష్టి - వర్ణనం


'హే జనార్దనా! సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితములన్నిటినీ విస్తారపూర్వకంగా వర్ణించండి' అని పరమేశ్వరుడు ప్రార్థించాడు. (* సర్గయనగా సృష్టిలో నొక దశ. ఒక మెట్టు.


ఖగవాహనుడు కాలకంఠాదుల కిలా చెప్పసాగాడు :


'పరమేశ్వరా! *సర్గాదులతో బాటు సర్వపాపాలనూ నశింపజేయు సృష్టి, స్థితి, ప్రళయ స్వరూపమైన విష్ణు భగవానుని సనాతన క్రీడను కూడా వర్ణిస్తాను, వినండి.


నారాయణ రూపంలో ఉపాసింపబడుతున్న ఆ వాసుదేవుడే ప్రకాశస్వరూపుడైన, అనగా కనబడుతున్న, పరమాత్మ, పరబ్రహ్మ, దేవాధిదేవుడు. సృష్టి స్థితిలయాలకు కర్త ఆయనే. ఈ దృష్టాదృష్టమైన జగత్తంతా ఆయన వ్యక్తావ్యక్తమైన స్వరూపమే. ఆయనే కాలరూపుడు, పురుషుడు. బాలురు బొమ్మలతో క్రీడించినట్లాయన లోకంతో క్రీడిస్తాడు. ఆ లీలలను వర్ణిస్తాను వినండి. అంటే ఇవన్నీ నా లీలలే.


జగత్తుని ధరించే పురుషోత్తమునికి జగత్తుకున్న ఆద్యంతాలు లేవు. ఆయన నుండి ముందుగా అవ్యక్తమైనవి జనించగా వాటి ఆత్మ(తరువాత ఆయన నుండియే) ఉత్పత్తి అవుతుంది. అవ్యక్త ప్రకృతి నుండి బుద్ధి, బుద్ధి నుండి మనస్సు, మనస్సు నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి తేజం, తేజం నుండి జలం, జలం నుండి పృథ్వి పుట్టాయి.


పరమేశ్వరా! దీని తరువాత నొక బంగారు గుడ్డు పుట్టింది. పరమాత్మ స్వయంగా అందులో ప్రవేశించి సర్వ ప్రథమంగా తానొక శరీరాన్ని ధరిస్తాడు. ఆయనే చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ ప్రధానమైన ప్రవృత్తితో బయటికి వచ్చి ఈ చరాచర విశ్వాన్ని సృష్టిచేశాడు.