Monday 27 November 2023

శ్రీ గరుడ పురాణము (17)

 


దేవ, అసుర, మనుష్య సహితమైన ఈ సంపూర్ణ జగత్తు ఆ అండంలోనే వుంటుంది. ఆ పరమాత్మయే స్వయం స్రష్టయగు బ్రహ్మరూపంలో ప్రపంచాన్ని సృష్టిస్తాడు, విష్ణు రూపంలో దాని ఆలనా, పాలనా చూసుకుంటాడు. కల్పాంత కాలంలో రుద్ర రూపంలో దానిని సంపూర్ణంగా లయింపజేస్తాడు. సృష్టి సమయంలో ఆ పరమాత్మయే వరాహరూపాన్ని ధరించి జలమగ్నయైన భూమిని తన కొమ్ముతో తేల్చి ఉద్ధరిస్తాడు. శంకరదేవా! ఇక దేవాదుల సృష్టి యొక్క వర్ణనను సంక్షిప్తంగా తెలియజేస్తాను.


అన్నిటికన్నముందు ఆ పరమాత్మనుండి మహత్తత్త్వం సృష్టింపబడుతుంది. రెండవ సర్గలో పంచతన్మాత్రల - అనగా - రూప, రస, గంధ, స్పర్శ, శబ్దముల - ఉత్పత్తి జరుగుతుంది. దీన్నే భూతసర్గ అంటారు. వీటి ద్వారానే పంచమహాభూతములైన నేల, నీరు, *నిప్పు (* నిప్పులో అగ్ని, తేజస్సు అంతర్భాగాలు. మండించేదీ కాంతినిచ్చేదీ కూడా నిప్పే), గాలి, నింగి సృష్టింపబడతాయి. మూడవది వైకారిక సర్గ. కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ ఈ దశలోనే పుడతాయి కాబట్టి దీనిని ఐంద్రిక సర్గయని, బుద్ధి దశ కూడా ఇదే అవుతుంది. కాబట్టి దీన్ని ప్రాకృత సర్గయని కూడా అంటారు. నాలుగవది ముఖ్య సర్గ పర్వతాలూ, వృక్షాలూ మానవ జీవనంలో ముఖ్య పాత్రను పోషించాలి. అవి సృష్టింపబడే సర్గ కాబట్టి దీనికాపేరు వచ్చింది. అయిదవది తిర్యక్ సర్గ. పశుపక్ష్యాదులు ఈ సర్గలో పుడతాయి. తరువాత ఆరవ సర్గలో దేవతలూ, ఏడవ సర్గలో మానవులూ సృష్టింపబడతారు. వీటిని క్రమముగా ఊర్ధ్వ స్రోతా, అర్వాక్ స్రోతాతా సర్గలంటారు. దేవతల కడుపులో పడిన ఆహారం పైకీ, మానవులది క్రిందికీ చరిస్తాయి. ఏడవ సర్గ మానుష సర్గ. ఎనిమిదవది అనుగ్రహ నామకమైన సర్గ. ఇది సాత్త్విక తామసిక గుణ సంయుక్తం. ఈ యెనిమిది సర్గలలో అయిదు వైకృతాలనీ, మూడు ప్రాకృత సర్గలనీ చెప్పబడుతున్నాయి. అయితే, తొమ్మిదవదైన కౌమారనామక సర్గలో ప్రాకృత, వైకృత సృష్టులు రెండూ చేయబడతాయి.


రుద్రాది దేవతలారా! దేవతల నుండి స్థావరాల వఱకూ నాలుగు ప్రకారాల సృష్టి జరుగుతుంది. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మనుండి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నులయ్యారు. తరువాత దేవ, అసుర, పితృ, మనుష్య సర్గచతుష్టయం వచ్చింది. అపుడు పరమాత్మ జలసృష్టి కార్యంలో సంలగ్నుడైనాడు. సృష్టి కర్మలో మునిగియున్న ప్రజాపతి బ్రహ్మనుండి తమోగుణం పుట్టుకొచ్చింది. కాబట్టి ఆయన జంఘలనుండి రాక్షసులు పుట్టుకొచ్చారు. శంకరా! అప్పుడాయన తమోగుణ యుక్తమైన శరీరాన్ని విడచిపెట్టగా ఆ తమోగుణపు ముద్ద రాత్రిగా మారి నిలబడిపోయింది. యక్షులకీ రాక్షసులకీ అందుకే రాత్రి అంటే చాల ప్రీతి.


No comments:

Post a Comment