Thursday 30 November 2023

శ్రీ గరుడ పురాణము (20)

 


అనసూయకు అత్రి ద్వారా చంద్రుడు దుర్వాసుడు, దత్తాత్రేయుడు కలిగారు. పులస్త్యునికి ప్రీతి ద్వారా దత్తోలుడను పుత్రుడు పుట్టాడు. పులహప్రజాపతికి క్షమయను పత్ని ద్వారా కర్మశుడు, అర్థవీరుడు, సహిష్ణువు అను పుత్రులుద్భవించారు. క్రతువుకి పత్ని సుమతి ద్వారా ఆరువేలమంది వాలఖిల్య ఋషులుద్భవించారు. వీరంతా ఊర్ధ్వరేతస్కులు, బొటనవ్రేలి పరిమాణం వారు, సూర్యునంత తేజస్సంపన్నులు.


* వసిష్ఠునికి పత్ని ఊర్జాద్వారా రజుడు, గాత్రుడు, ఊర్ధ్వబాహుడు, శరణుడు, అనఘుడు, సుతపుడు, శుక్రుడు అను మహర్షులుదయించారు. వీరిని సప్తమహర్షులంటారు. (*ఈయన శ్రీరామగురువు వశిష్ఠుడు కాదు)


శివశంకరా! దక్షప్రజాపతి తన కూతురైన స్వాహాను అగ్ని దేవునికిచ్చి వివాహం చేయగా వారికి * పావక, పవమాన, శుచులను పుత్రులు పుట్టారు. వీరే త్రేతాగ్నులు. పరమ ఓజస్వులు. 

* ఈ త్రేతాగ్నులలో విద్యుత్సంబంధియైన అగ్ని పావకం. ఘర్షణ ద్వారా వచ్చేది పవమానం. సూర్యుని లోనిది శుచి. కూర్మ పురాణంలో ఇలా చెప్పబడింది. పావకః పవమానశ్చ శుచి రగ్నిశ్చ తేత్రయః |


నిర్మథ్యః పవమానః స్యాద్ వైద్యుత పావకః స్మృతః ॥

యశ్చాసౌ తపతే సూర్యః శుచిరగ్ని స్త్వ సౌ స్మృతః |


(1-12/25,26)

దక్ష కన్యయైన స్వధకు మేనా, వైతరణియను కూతుళ్ళు పుట్టారు. వారు 'బ్రహ్మవాదినులు' మేనాకు హిమవంతుని ద్వారా మైనాకుడను పుత్రుడూ, గౌరీ నామంతో ప్రసిద్ధి చెందిన పార్వతీదేవియను కన్యా జన్మించారు. ఈమెయే పూర్వజన్మలో సతీదేవి.


అప్పుడు బ్రహ్మయే స్వయంగా తనంతటి వాడైన స్వాయంభువమనువుకు జన్మనిచ్చి అతనిని ప్రజాపాలన కార్యంలో నియోగించాడు. సర్వవైభవ సంపన్నుడైన స్వాయంభువ మను మహారాజు తన అఖండ తపః ఫలంగా పరమశుద్ధతేజస్వినీ, తపస్వినీయైన శతరూపాదేవిని భార్యగా పొందాడు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కొడుకులు, ప్రసూతి, ఆకూతి, దేవహూతియను కూతుళ్ళు కలిగారు. ఆడపిల్లలు ముగ్గుర్నీ క్రమంగా రుచి ప్రజాపతికీ, దక్ష ప్రజాపతికీ, కర్దమమునికీ ఇచ్చి వివాహం జరిపించారు. రుచికి యజ్ఞుడనే కొడుకూ దక్షిణయను కూతురూ జన్మించారు. యజ్ఞునికి పన్నెండు మంది మహాబలశాలులైన పుత్రులు పుట్టారు. వారే 'యామ' అను దేవగణానికి మూలపురుషులుగా ప్రఖ్యాతి నందారు.


No comments:

Post a Comment