Saturday, 27 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (187)

ఈ రెంటినీ తీసుకొని వెళ్ళి కావేరీ తీరాన్ని సమీపించాడు విభీషణుడు. మన గణపయ్య దీనిని గమనించాడు, ఇట్టి సంపద, లంకకు తరలిపోవడాన్ని ఇష్టపడలేదు. ఇది తమిళనాడును, భారతదేశాన్ని దాటకూడదని భావించాడు. ఇక్కడొక లీలను ప్రదర్శించాడు ఏమది?


విగ్రహాన్ని, విమానాన్ని క్రింద పెట్టకూడదని షరతు. ఎక్కడైనా పొరపాటున పెడితే అది అక్కడే ప్రతిష్ఠితమైపోతుందని హెచ్చరిక.


అప్పుడు కావేరీ నది వరదలతో నిండియుంది. కావేరిలో ఒక మాటు స్నానం చేస్తే మంచిదనే భావనను కలిగించాడు గణపతి. ఒక బ్రహ్మచారి వేషంలో విభీషణుని ముందు నిలబడ్డాడు, వీటిని నీ చేతిలో పెట్టి, జాగ్రత్తగా ఉంచగలవా అని విభీషణుడన్నాడు.


దానికేమి? అయితే నేను చాలా సేపు ఈ బరువును మోయలేకపోతే ఏం చేయాలి? నేను మూడు సార్లు పిలుస్తాను. సకాలంలో నీవు రాకపోతే తప్పనిసరై నేను నేలమీద పెట్టవలసి వస్తుంది. అంగీకరిస్తావా అని గణపతి యన్నాదు. అతడు నదిలో ఈత కొడుతూ ఉండగా మూడుసార్లు పిలిచాడు. విభీషణుడు సకాలంలో రాలేకపోయాడు, ఇదిగో పిలిచాను, నా తప్పేమీ లేదు, నేనిక్కడ ఉంచేస్తున్నానని బిగ్గరగా అన్నాడు గణపతి, ఇంకేముంది? అక్కడే ప్రతిష్టితమై పోయింది.


ఈ కథ వల్ల విమానం, విగ్రహం చేతిలో ఇమిడినట్లుగా మొదట ఉన్నాయని, ప్రతిష్ఠ జరిగిన తరువాత అవి రెండూ పెద్దవయ్యాయని ఊహించవచ్చు.


నదినుండి బైటకు వచ్చి కోప్పడి, విభీషణుడు విగ్రహాన్ని కదలింపబోయాడు. బ్రహ్మచారి నెత్తిపై ఒక దెబ్బ వేయాలనుకున్నాడు. గణపతి, పరుగు లంకించుకొని కొండనెక్కాడు. విభీషణుని పట్ల దయలో లొంగిపోయాడు.


Friday, 26 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (186)



ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాలు - వినాయకుని లీలలు


కావేరీ నదీ తీరంలో శైవక్షేత్రాలంత విరివిగా వైష్ణవ క్షేత్రాలు లేకపోయినా శ్రీరంగంలోని రంగనాథాలయం ప్రసిద్ధిని పొందింది. అసలు కావేరీ నదికి దాని ఉపనదియైన 'కొల్లిడం'కు మధ్య శ్రీరంగనాథుడు వెలిసాడు. అతడు కావేరీ రంగడు, రంగరాజు.


పూర్వకాలంలో రంగనాథుణ్ణి అయోధ్య నేలిన ఇక్ష్వాకురాజులు కులదైవంగా ఆరాధించేవారట. అట్టి స్వామి, శ్రీరంగంలో ఎట్లా ప్రతిష్ఠితు డయ్యాడో అనే విషయం, రామాయాణానికి చెందింది. దానికి వినాయకునకూ సంబంధం ఉంది. శ్రీరాముని పట్టాభిషేకం పూర్తియైన తర్వాత వచ్చినవారు అయోధ్యను విచిడి పెట్టే సందర్భంలో రాముడనేకమైన కాన్కలను వారికందించాడు. వారందరూ యుద్ధంలో సాయపడ్డారు. కాబట్టి విభీషణునకు విశేషమైన కానుకలను ఈయాలనుకున్నాడు రాముడు. తన భార్యను, రాజ్యాన్ని తిరిగి పొందడానికి సుగ్రీవుడు, రాముని చెంత చేరితే ఏమీ ఆపేక్షించకుండా కేవలం శరణాగతిని పొందినవాడు విభీషణుడు. ఇదీ వారికున్న తేడా. అతణ్ణి చేరదీస్తూ ఇట్టి ప్రతిజ్ఞను చేసాడు రాముడు.


సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే 

అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ ప్రతం మమ


అట్టి త్యాగియైన విభీషణునకు తగ్గట్లుగా గొప్ప కానుకులను ఇవ్వాలి. అందుకోసం కులదైవమైన రంగనాథ విగ్రహాన్ని దానితో బాటు ప్రణవాకార విమానాన్ని లంకకు తీసుకొని వెళ్ళవలసినదిగా అన్నాడు రాముడు.


Thursday, 25 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (185)



తమిళనాడుకు విఘ్నేశ్వరుని సాహాయ్యం


ప్రత్యక్షంగా తమిళనాడుకు గణపతి ఎంతో సాయం చేసాడు. కొడగునుండి కావేరీ జలాన్ని తమిళనాడులో ప్రవహింప చేసినవాడని లోగడ చదువుకున్నాం.


మనం, నదీ పరీవాహక సంస్కృతిని గురించి మాట్లాడుతూ ఉంటాం. నదీతీరంలో ఉన్న జనులకు తిండికి, నీటికి కొరత ఉండదు, ఎప్పుడైతే భౌతికమైన తృప్తి ఏర్పడిందో గొప్ప గొప్ప పనులు చేసి నాగరికతా వృద్ధి కోసమై ప్రజలు పాటు పడుతూ ఉంటారు. అట్టి గొప్ప నాగరికత, ఈ ప్రాంతంలో ఏర్పడడానికి కావేరీ నదియే కారణం. దీనికి కారకుడు గణపతియే.


గొప్ప సంస్కృతి అంటే చిత్రకళ, సంగీతం, సాహిత్యం, నృత్యం అని అనుకుంటూ ఉంటాం. అంతేకాదు, ఇది ఆత్మోన్నతినీ సూచిస్తుంది. ఇక్కడ ఉన్న దేవాలయాల చుట్టూ ఆ కళలు పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇందున్న ఆలయ సంపద, ఏ ప్రాంతంలోనూ ఇంత విస్తారంగా కనబడదు. తమిళనాడు లోనే చోళ ప్రాంతం ఉంది. కావేరీ నదీ ప్రాంతంలో లెక్కకు మిక్కిలి ఆలయాలు వెలిసాయి.


ఆ పవిత్రాలయాలలో శైవ భక్తులైన అప్పర్, జ్ఞాన సంబంధర్, సుందర్ భగవానుని కీర్తిస్తూ వందలకొద్దీ పాటలు వ్రాసారు. అట్టి అలయాలు 274 ఇందు 194 వరకూ కావేరికి ఉత్తర దక్షిణ తీరాలలో ఉన్నవే. వైష్ణవ ఆళ్వార్లు కీర్తించినవి 108 దివ్యక్షేత్రాలు, ఇందులో చాలా భాగం చోళ ప్రాంతంలోనే ఉన్నాయి. సుమారు 40 వరకూ కావేరీ నదీ తీరంలోనే ఉన్నాయి.


Wednesday, 24 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (184)

 


వినాయకుడు - తమిళం


ఒక దేవత, భారతదేశంలో అన్నిచోట్లా పూజలందుకొంటున్నా, ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంత వాసులు ఒక దేవతతో మమైకమై పూజిస్తూ ఉంటారు అట్లా తమిళ ప్రజలు, సుబ్రహ్మణ్యునితో ఐక్యమయ్యారు. ఈ స్వామియే తమిళ దైవమని. వారి భాషకు అధిదేవతయని భావిస్తారు. కాని వినాయకునకు అట్టి స్థానం ఇవ్వడంలో ఔచిత్యముందంటాను. సోదరులిద్దర్నీ విడదీయకుండా కలిపే పూజించాలంటాను.


రాజకీయాలలో ఉన్న ద్వేషానికి తోడు కొంతమంది బుద్ధిమంతులు, పరిశోధకులు, రెండు తప్పుడు తీర్మానాలను చేస్తున్నారు. తమిళనాడులో వినాయకపూజ, కంచి పల్లవులు, వాతాపి చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధకాలంలో ప్రవేశపెట్టబడిందని అన్నారు. పల్లవ సైన్యానికి అధిపతియైన నరసింహ వర్మ, పరంజోతిగా పిలువబడ్డాడు. అతడు వాతాపినుండి వినాయకుణ్ణి తీసుకొని వచ్చాడని అన్నారు. ఆ పరంజోతి, తరువాతి కాలంలో శైవసాధువయ్యాడు. మరొక అభిప్రాయం ఏమంటే కార్తికేయుడు, అసలు తమిళ దైవమే అని, ఇట్టి దేవుణ్ణి ఉత్తర దేశస్థులు స్వీకరించి అతనిపై ఎన్నో కథలల్లి అనేక పురాణాలను వ్రాసారని, ఆగమాలను సృష్టించారని వీరి వాదం. నిజం చెప్పాలంటే ఇద్దరూ సమస్త భారతీయులకు ఆరాధ్య దైవాలే.

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (183)



పెద్దన్నగారితో రోజును మొదలుపెడతాం


వినాయకుడనగానే శివ-శక్తి తనయుడని చటుక్కున గుర్తుకు వస్తుంది. షోడశనామాలను స్కంద పూర్వజనామంతో పూర్తిచేసినపుడు వారి మరియొక తనయుని స్మరించగా మొత్తం వారి కుటుంబాన్ని స్మరించినట్లౌతుంది కదా. కనుక చివరి నామం అట్లా పలికి మంగళాంతంగా ముగిస్తున్నాం.


మన మందరమూ పార్వతీ సంతానమే. మన కందరికీ అన్న, వినాయకుడే. అతని తమ్ముడైన స్కందమూర్తిని స్మరించడం వల్ల అందరూ ఆ కుటుంబానికి చెందిన వారయ్యారు. కనుక లేచీ లేవగానే షోడశనామాలను కీర్తిస్తే రోజువారీ కృత్యాలు నిరాటంకంగా సాగుతాయి. అన్నిటిలోనూ నిర్విఘ్నత కల్గుతుంది. 


సర్వకార్యేషు విఘ్న:తస్య నజాయతే


ఇట్లా రోజూ నామాలు చివర ఫలశ్రుతిని చదివి చూడండి. లాభమే.

Tuesday, 23 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (182)



స్కందనామ మహిమ


స్కందుడనగా శత్రువులను శోషింపచేయువాడని; దేవస్త్రీ దర్శనం వల్ల వదలిన ఈశ్వర రేతస్సు వల్ల పుట్టినవాడని నిర్వచనం. పరమేశ్వరుని జ్యోతిస్సువల్ల ఆవిర్భవించినాడు. ఇతనికి సుబ్రహ్మణ్య, కార్తికేయ, కుమార, శరవణభవ మొదలైన అనేక పదాలున్నా ఇతనికి సంబంధించిన పురాణం పేరు స్కంద పురాణమే. ఇతని నుద్దేశించి చేయబడు వ్రతము స్కంద షష్టియే. పరమేశ్వరుడు, అమ్మవారితో కుమారస్వామితో అతని పేరు సోమ స్కందుడే. 

ఏదైనా విషయం వేదమంత్రాలలో కన్పిస్తే దానికి గొప్పదనం, గౌరవం కల్గుతుంది. స్కంద పదానికి అట్టి విలువ వచ్చింది. వల్లికి గురువు నారదుడని స్కంద పురాణంలో రాగా, ఛాందోగ్యోపనిషత్తులో సుబ్రహ్మణ్యుని పూర్వావతారమైన సనత్కుమారుడు, నారదునకు ఉపదేశించినట్లుంది. సనత్ అని బ్రహ్మకు ఒక పేరు. సృష్టికి పూర్వం బ్రహ్మ యొక్క సంకల్పానికి అనుగుణంగా సనత్యునారుడు ప్రత్యక్షమయ్యాడు. ఇతడు సనక, సనందన, సనాతన, సనత్కుమారులలో ఒకడు. ఈ నల్గురు బ్రహ్మజ్ఞానులు. పుట్టుకనుండీ నివృత్తి మార్గంలో ఉన్నవారు. జ్ఞానులకు మార్గదర్శకులు. వీరు నిత్య యౌవనులు. కామవాసన అణుమాత్రం లేనివారు. ఛాందోగ్యంలో సనత్కుమారుడు సుబ్రహ్మణ్యునిగా వచ్చినట్లుంది. ఇట్లా వచ్చినట్లు స్కంద పదం రెండుమార్లు ఉచ్చరింపబడింది. 


స్కందుడు, ప్రపంచ వ్యాప్తమైన దేవత. కొందరు స్కూల్ ని ఇ స్కూల్ అన్నట్లు స్కంద పదాన్ని ఇ స్కంద గా విదేశాలలో ఉచ్చరిస్తారు. సెమెటిక్ భాషలలో AL అనేది ఇంగ్లీషులోని The వంటి Definite Article. (A. An, The) అది ఒక వస్తువును నిర్దిష్టంగానే చెప్పేది. స్పష్టంగా AL పదం, ఒక పదానికి ముందు చేరిస్తే ఇస్కందర్, అల్ ఇస్కందర్ అవుతుంది. ఇది గ్రీసుదేశం వెళ్ళి అలెగ్జాండర్ గా అయింది. 


సికిందర్ అనేమాట కూడా స్కందర్ పదం నుండే వచ్చింది. ఇటీవల సికింద్రాబాద్ లో స్కందగిరి ఆలయం వచ్చింది. అసలు సికింద్రాబాద్ యే సిక్కందరాబాద్.


స్కాండినేవియా, అనేక దేశాలతో అనగా స్వీడన్, నార్వే, డెన్మార్కులతో కూడింది. అది స్కాండియా ప్రాంతం. హిందూ - ఇండియా మాదిరిగా స్కంద - స్కాండియాగా మారింది.


Monday, 22 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (181)



సంగ్రామే: కుమారస్వామి యుద్ధరంగంలో అవక్ర పరాక్రమం చూపించాడు. దేవగణాలకు సేనాధిపతి అయ్యాడు. ఈ సంగ్రామానికి ముందు విఘ్నేశ్వరుకే పూజ చేసియుంటాడని ఊహించవచ్చు. ఎందుకంటే తండ్రి, త్రిపురాసుర సంహారానికి వెళ్ళేముందు, తల్లి భండాసుర సంహారానికి వెళ్ళేముందు ఇతడిని పూజించకపోవడం వల్ల వారికి ఆటంకాలెదురయ్యాయని పురాణాలలో చదివాం కదా! అందువల్ల జాగరూకతతో పూజ చేసియుంటాడని ఊహింపవచ్చు.


సర్వకార్యేషు: అన్నగారితో పోటీపడి భువన ప్రదక్షిణ సమయంలో విజయం సాధించలేకపోయాడు. ఇక సన్న్యాసియైన తరువాత అన్నగారికి నమస్కరించకపోవడం వల్ల జీవితాంతం సన్న్యాసిగా ఉండలేకపోయాడు. యుద్ధాలకు వెళ్ళే ముందు నమస్కరించి యుండవచ్చుగాని, వల్లి దగ్గరకు వెళ్ళేటపుడు మరిచియుంటాడు. అతనిని మోహపెట్టి ఎట్టి తిప్పులను పెట్టిందో చూసారా? అనేక ఆటంకాలు వచ్చాయి. అన్నగారికి నమస్కరించిన తరువాత వివాహ విషయంలో విజయం సాధించాడు. ఆపైన అన్ని విషయాలలోనూ పూజించి యుంటాడు గనుక ఇక అపజయం మాటయే అతని చరిత్రలో వినబడదు.


ఇట్లా నామాలు చదవడం వల్ల ఎట్టి ఫలాలు వస్తాయో అన్ని ఫలాలు స్కందునకు లభించాయని, స్కంద పూర్వనామంతో ఈ వివరణ పూర్తి అయింది.


Sunday, 21 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (180)



నిర్గమే: ఏదో విడిచి వెళ్ళిపోవడం నిర్గమం. వల్లితో వివాహమైన వెనుక తన శాశ్వతమైన స్కందలోకానికి వెళ్ళాడు. భార్యలతో వెళ్ళాడు. వల్లికి ముందు దేవసేనను వివాహం చేసుకున్నాడు కదా.


ఈ లోకంలో అవతరించడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి శూరపద్ముని సంహరించుట, రెండవది తన మేనమామ పిల్లలను వివాహం చేసుకొనుట. ఒక కూతురు దేవరాజు కూతురుగా, మరొక కూతురు భిల్లరాజు కూతురుగా పెరిగారు.


తిరుచెందూర్ దాటి సముద్రంలో అసుర సంహారం చేసాడు. తరువాత దేవసేనతో వివాహం తిరప్పరన్ కున్రంలో జరిగింది. అక్కడ ఉండగా నారదుడు వచ్చి చిత్తూర్ లో వల్లి, విరహవేదన పడుతూ ఉందని వివరించాడు. అందువల్ల తిరుప్పీరన్ కున్రంలో వల్లీ దేవసేనలతో కూడి కలిసిన మూర్తి ఉండదు. కాని ఒక ప్రక్కదేవసేన ఒక ప్రక్కనారదుడూ ఉన్న విగ్రహం ఉంటుంది. పరమాత్మ యొక్క దయను జీవాత్మునిపై ప్రసరింపజేయు గురు స్వరూపునిగా ఉన్నవాడూ నారదుడే. సుబ్రహ్మణ్యుడు వల్లిపై మరులు గొనునట్లుగా చేసినవాడూ నారదుడే. అందువల్ల ఇతడు స్వామి యొక్క మూర్తి ప్రక్కన ఉంటాడు.


వల్లీ వివాహమైన వెనుక ఇద్దరు భార్యలతో తిరుత్తనిలో సాక్షాత్కరిస్తాడు. స్కంద లోకానికి వెళ్ళడం, నిర్గమనం. వల్లీ వివాహం ఇట్లా దోహదం చేసింది. ఇట్లా అవతార ప్రయోజనం నెరవేరింది.


వల్లితో వివాహానికి కారకుడైన విఘ్నేశ్వరుడు, స్కంద లోకానికి ఇతడు నిర్గమించడానికి కారకుడయ్యాడు.

Saturday, 20 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (179)

స్వామివారిట్లా ప్రసంగం కొనసాగించారు. అసలు ఈశ్వరునకు ప్రణవార్థం తెలియదా? లోకానికి చెప్పడం కోసం గురుశిష్య సంబంధం ఉండాలని హితోపదేశం చేయడం కోసం కొడుకు నుండే ఉపదేశం పొందినట్లు కనబడ్డాడు. దానిని విని సుబ్రహ్మణ్యుడు కూడా గణపతి నుండే ఉపదేశాన్ని పొందాడు. తండ్రే శిష్యుడైనపుడు, అతడు కుమారునకు ఉపదేశం ఇస్తాడా? ఇక తల్లి కూడా భర్తలో సగమైనపుడు ఆమె కూడా ఈయదు. అందువల్ల అన్నగారైన గణపతి నుండే ఉపదేశం పొందాడు. ఇతని సన్న్యసానికి గణపతి పరోక్ష కారకుడయ్యాడని లోగడ వివరించాను. కానీ తిన్నగా కుమారస్వామికే గురవవడం వల్ల కుమార గురువనే పదం వహించాడు.


వివాహే: వల్లితో వివాహం చేయించాడు కదా! మనమా కథ విన్నాం.


ఇట్లా తమ్ముని వివాహానికి, సన్న్యాసానికి ప్రధాన సూత్రధారి అయ్యాడు చిన్నపుడు ఇతనిలో వైరాగ్య భావం కల్గించాడు. పెద్దయిన తరువాత గృహస్థు చేసాడు. చిన్నతనంలోనే అవ్వైయార్ ని ముసలిదానిగా మార్చాడు. వివాహం కావలసిన వయస్సులో ముసలిరూపా! ఇట్లా ఎన్నో లీలలు.


ప్రవేశే: పవిత్ర మూర్తియైన కుమారస్వామిని ప్రపంచంలోనికి అడుగుబెట్టునట్లు చేసాడు. విఘ్నేశ్వరుడు శూర పద్ముణ్ణి చంపగలిగియుండి చంపలేదు. ఆ ఫలం సోదరునికే దక్కాలని. అట్లా యుద్ధ ప్రవేశాన్ని సోదరునకు పరోక్షంగా అందించాడు.


Thursday, 18 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (178)



తరువాత తల్లిదండ్రులు కుమారస్వామిని శాంత పరిచారు. ఇదంతా ఒక నాటకం కాదా? కాషాయం కట్టుకున్న వాడు వెంటనే దేవ సైన్యాధిపతి అయ్యాడు. ఏ త్యాగాన్ని చేసి ఇంద్రియాలను జయించాడో, దేనివల్ల జ్ఞానాన్ని శాంతిని పొందాడో, అట్టివాడే అమితమైన శక్తితో సైన్యాధిపతిగా మారాదు. కనుక ఇట్లా సుబ్రహ్మణ్య జననానికి; దేవ సైన్యాధిపత్యానికి; వల్లితో ఒక ఇంటివాణ్ణి చేయడానికి; విరక్తితో మారడానికి, అన్నిటికీ గణపతి ప్రత్యక్షం గానో, పరోక్షంగానో కారకుడయ్యాడు. కనుక ఇతణ్ణి స్మందపూర్వజుడని కీర్తిస్తున్నాము. ఏదో ఫలానా వారికి అన్నగారనే మామూలు అర్ధంలో కాదు. ఇంత కథ ఉంది. షోడశనామాలలో ఈ మాట చేరడానికి ఇంత నేపథ్యం ఉంది.


పూర్వజుడనగా ముందు పుట్టినవాడు. ఆది యందని అర్థం. కాని ఈ మాట ఎక్కడ వచ్చింది? షోడశనామాలలో చివర వచ్చింది. సంపూర్ణమైనది ఆదిలోనూ, అంతంలోనూ యుంటుంది. అదీ చమత్కారం.


కుమారస్వామి - ఫలశ్రుతిలోని లాభాలు


ఒక చక్కని విషయం గుర్తుకు వస్తోంది. విద్యారంభే... జాయతే అనే శ్లోకం ఫలశ్రుతిలో వస్తుంది. అనగా 16 నామాలు ఎవరైతే స్మరిస్తారో వారు ఇట్టి ఫలాలను పొందుతారని కదా! వీటికీ, కుమార స్వామి కథకూ సంబంధం ఉన్నట్లనిపిస్తోంది.


విద్యారంభే: పరేమేశ్వరుని జ్ఞాననేత్రం నుండి కుమారస్వామి పుట్టాడు కనుక మామూలు అక్షరాభ్యాసం ఇతనికి ముందు అక్కర లేదు. అతడే ప్రణవ స్వరూపుడు. ఇతడే తండ్రికి ప్రణవోపదేశం చేసాడు. ఇక తనకి విద్యారంభం సన్న్యాసాన్ని స్వీకరించడం బ్రహ్మవిద్యానుభవం పొందడమే. ఈ సన్న్యాసం తీసుకోవడం దానికి కారణం, విఘ్నేశ్వరుడు పందెంలో జయించడం, ఫలాన్ని పొందడం వల్లనే!


(కంచి మహాస్వామివారు, విఫ్నేశ్వరునకు కుమారగురు అనే పదం ఉందని, ఒక సందర్భంలో కార్తికేయునకు విద్యారంభం చేసినట్లు చెప్పారు. దూర్వా యుగ్మాలను అర్పించేటపుడు 21 నామాలలో ఈ కుమారగురు పదం వస్తుంది - ఆంగ్లానువాదకుడు)


కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (177)



సోదరుని సన్న్యాసంలో ఇతని పాత్ర


స్కందుని కథలో ఒక సందర్భంలో ఆతడు సన్న్యాసం తీసుకున్నట్లుంది. చిత్రమేమిటంటే, వివాహానికి ముందే స్వీకరించడం. సన్న్యాసియైనపుడు ఇతడు దండాయుధపాణి, పళని క్షేత్రం గురంచి వినని వారుండరు. అది సుబ్రహ్మణ్య స్వామి యొక్క పవిత్ర స్థలం. దండాయుధమనగా శత్రువులను దండించే దండం కాదు సుమా! వట్టి దండమే. మేము ధరించే దండమే. అది వెదురు కఱ్ఱయే. సైన్యాధిపతికి దండాయుధం ఉంటుంది. లలితాంబ, దండిని. దండాయుధపాణి యైన స్వామి, పళని కొండలపై శాంతికి చిహ్నమైన దండాన్ని పట్టుకొని యుంటాడు. ఇక్కడి దండం, మనస్సును నిగ్రహించాడనే దానికి గుర్తుగా ఉంటుంది. మనస్సును నియమించడమే ఒక గొప్ప యుద్ధం వంటిది కదా! అట్టి దండాన్ని మనస్సును నియమించడానికి వాడుతున్నాం. కాని అతనికి దండం, ఒక అలంకార వస్తువు. అట్టి మూర్తి, మనవంటి వారికి గుణపాఠంగా ఉంటుంది.


ఇట్టి సన్న్యాసరూపం, ఇక ఏ దేవతకూ ఉండదు. చిన్నవయసులో తల గొరిగించుకొని, కాషాయ బట్టలు కట్టుకొని దండాన్ని ధరిస్తూ ఏ అవతార మూర్తియైనా ఉంటుందా? అందంలో, శక్తిలో, అధికారంలో ఇతణ్ణి మించినవారెవరైనా ఉన్నారా? దేవసేనాధిపతిగా ఉన్నాడు. పుట్టిన ఆరు రోజులకే అన్నిటినీ త్యాగం చేసి శాంతి స్వరూపుడై యున్నాడు. ఇట్లా మారడానికి ఎవరు కారణం? విఘ్నేశ్వరుడే. ఇతనికి ఇతని అన్నగారికి జరిగిన పందెంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేస్తే భువనాలన్నీ చుట్టిన ఫలం వస్తుందని తల్లిదండ్రులకే ప్రదక్షిణం చేసి పండును వినాయకుడు పొందాడు. ఆ అపజయం వల్ల విరక్తి కలిగి సన్న్యాస రూపం ఎత్తిన వాడు కుమారస్వామి. జ్ఞాన రూపునిగా శాంతి రూపునిగా తీర్చి దిద్దినవాడు వినాయకుడే కదా!

Wednesday, 17 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (176)

 


సోదరుని వివాహంలో ఇతని పాత్ర


ఇక వల్లీ సుబ్రహ్మణ్యుని వివాహంలో ఇతని పాత్ర ఉంది. ఇట్టి వివాహం అనేక కథలకు, నాటకాలకు ఊపిరి పోసింది.


చాలామందికి ఈ కథ తెలుసు. వినాయకుడు ఏనుగు రూపమెత్తడం, వల్లిని తరమడం, చివరకు ఆమె సుబ్రహ్మణ్యుని చెంత చేరడం జరిగింది. వల్లి, తన దగ్గరకు రాకపోతే ఏం చేయాలో కుమారస్వామికి తెలియలేదు. అన్నగారిని మనసారా ప్రార్థించడం వల్ల ఆ ఆటంకం తొలగిపోయింది. ప్రార్థనను ఆలకించాడు గణపయ్య. వెంటనే ఏనుగు రూపాన్ని, ధరించాడు వల్లిని తరిమాడు, సోదరుని దగ్గరకు చేర్చాడు. ఇట్లా వల్లీ సుబ్రహ్మణ్యుల కలయిక, తిరుప్పుగళ్, ఇతణ్ణి చిన్నస్వామియని పేర్కొంది. అప్పుడతడు యువకుడే. అంతకుముందే అసురులను సంహరించి యున్నాడు. భగవద్గీతలో సేనానులలో నేనని అనగా స్కందుడనని భగవానుడనలేదా? అట్టి సేనాని కూడా ఒక భిల్లవనితయైన వల్లిని లొంగదీసుకోలేకపోయాడు. అన్నగారిని ప్రార్ధించడం వల్ల అటంకం తొలగింది. ఇట్టి సందర్భంలో యువకుడైన కుమారస్వామిని చిన్న మురుగన్ అని అరుణగిరి నాథుడు అన్నాడు. వయస్సును గురించి ఎత్తుకొనలేదు.


కనుక వల్లీ సుబ్రహ్మణ్యుల వివాహంలో గణపతికి ప్రత్యక్ష పరిచయముంది.

Tuesday, 16 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (175)



లలితాంబ, భండాసురుణ్ణి ఎదుర్కొనగా అతడు విఘ్నయంత్రాన్ని సృష్టించగా, అపుడామె పరమ శివుని ముఖం చూడగా గణపతి పుట్టినట్లు ఒక కథ.


అన్ని కథలలోనూ విఘ్నేశ్వరుని పుట్టుకకు అమ్మవారితో సంబంధం ఉంది. అందువల్ల శూర పద్ముడు, స్త్రీ పురుష సంబంధం లేకుండా అనే మెలిక పెట్టాడు. శివుని నేత్రాలనుండి కొన్ని నిప్పురవ్వలు రాగా అమ్మవారితో సంబంధం లేకుండానే మన స్వామి పుట్టాడు.


ఇట్టి సంఘటనకు వినాయకుడు అవకాశం ఈయడం వల్లనే కుమార సంభవం కుదిరింది. వినాయకునకు అసురులను సంహరించే శక్తియున్నా శంకరుడిచ్చిన వరాన్ని గౌరవించాలని యుద్ధానికి వెళ్ళలేదు. ఇతడు యుద్ధరంగానికి వెళ్ళకుండా కుమారస్వామి వెళ్ళుటకు అవకాశం ఇచ్చినవాడయ్యాడు. అనగా కుమారస్వామి అవతారానికి ఒక విధంగా దోహదం చేసాడు. 


అతడు తలుచుకుంటే తండ్రి శరీరంలో ప్రవేశించి, అమ్మతో సంబంధం లేకుండా శివుని నుండే అవతరించి యుందేవాడు. అతడే దేవగణాలకూ అధిపతియై యుండేవాడు. అసురులను చంపడం ఒక లెక్కా? అట్టి పనులు చేయకుండా ఉండడం వల్లనే సుబ్రహ్మణ్యుడనే ఆరాధ్యమూర్తి లోకానికి వచ్చింది. 


కుమార సంభవానికి, గణపతికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా శక్తి ప్రదర్శనను సోదరునిచే చేయించి ఆ కీర్తిని సోదరునికే చెందునట్లుగా చేయడం మాటలా? అట్టి కీర్తిని తమ్మునికి ప్రసాదించి పెట్టాడు కదా.


Monday, 15 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (174)



అయితే ఇక్కడ విఘ్నేశ్వరుని పాత్ర ఏమిటి? శివుని కొడుకు శివుడైతే ఇక విఘ్నేశ్వరుడు శివుని కొడుకు కాదా? దేవతలు కుమారస్వామికై తపస్సు చేస్తున్నారని చెప్పినపుడు అప్పటికి విఘ్నేశ్వరుడు పుట్టి యుండలేదా? అందువల్ల ఈ విషయం తేటతెల్లం కావడం కోసం స్కంద పూర్వజుడని ఇతనికి నామం ఏర్పడింది.


సరే బాగానే ఉంది. ఇక కుమారస్వామికి ముందే విఘ్నేశ్వరుడు పుట్టియుండగా మరొక శివపుత్రుని కోసం తపస్సు చేయాలా? గణపతి శివునితో సమానుడు కాదా? ఇతని ఘనత ఏనాడో వెల్లడైంది. త్రిపురాసురులపై శివుడు దండెత్తినపుడు విఘ్నం వస్తే శివుడే వినాయకుణ్ణి పూజించాడు కదా. ఇతని కీర్తిని దేవతలు విన్నా శివునకు మరొక సంతానం కావాలని ఎందుకు కోరుకున్నారు?


శూర పద్ముడు పొందిన వరంలో ఒక మెలిక దాగియుంది. అట్లా తెలివిగా వారు అడుగుతూ ఉంటారు కూడా. శివునితో సమానుడైనవాడు, స్త్రీ పురుషుల కలయిక లేకుండా పుట్టాలని, అట్టివాడే మమ్మల్ని చంపగలడని అన్నారు. అట్టిది కుదురుతుందా ? 


విఘ్నేశ్వరుడు పెక్కువిధాలుగా పెక్కు రూపాలు ధరించాడు. అందొక రూపం, అమ్మవారు ఒంటికి రాసుకున్న పసుపు నుండే. ఇంకా అనేక కథలున్నాయి. కైలాసంలోని విలాస భవనంలో ప్రణవాక్షరం చాలా అందంగా గీయబడి యుంది. దానిని శివపార్వతులు రెప్పలార్పకుండా ఒక్కసారే ఇద్దరూ చూసారు. వెంటనే వినాయకుడు పుట్టినట్లు కథ. రెండు ఏనుగులకు పుట్టినట్లుంది. అమ్మవారు ఆడ ఏనుగు కాగా, అయ్యవారు మగ ఏనుగయ్యాడట. ఈ కథను తేవారంలో జ్ఞాన సంబంధులు పేర్కొన్నారు.


Sunday, 14 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (173)



కుమారస్వామి జననం - అన్నగారి పాత్ర


విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు కుమార స్వామి కథను చెప్పాడు. వాల్మీకి రామాయణంలో ఈ కథను చెప్పేటప్పుడు కుమార సంభవమని అన్నాడు. కాళిదాసు ఈ మాటలను గ్రహించి ఆ పేరుతో కావ్యమే వ్రాసేడు.


పుట్టుకలో ప్రత్యేకత ఏమిటి? ఎవరైనా పుట్టిన తరువాత, పెరిగినప్పుడు, విద్యాభ్యాసం తరువాత కీర్తిని గడిస్తారు. ఇక కుమార సంభవానికి ముందే దేవసేనాధిపత్యం అనే బాధ్యత తారసపడింది. దానిని నిర్వహించడానికి కుమారస్వామి పుట్టి తీరాలి. పుట్టుకతోనే దేవగణాలకు సైన్యాధిపతి కావలసి వచ్చింది. అసురుల చేతిలో దేవతలు నానా ఇబ్బందులూ పడుతూ ఉండగా పోగొట్టేవాడెపుడు అవతరిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు.


శూరపద్ముడు, తారకా సురుడు మొదలైనవారు శివునినుండి, తమను సంహరించడానికి శివునితో సమానుడైన వాడే అర్హుడని నియమం పెట్టారు. ఇక శివునకు సాటి ఎవరు? శివునకు సాటి శివుడే కదా! అయితే వరాన్ని ఇచ్చినవాడే చంపుతాడా? అందువల్ల తెలివిగా శివుడెట్లాగూ చంపలేడని, ఇక శత్రుబాధ ఉండదని దేవతలను హింసించడం మొదలు పెట్టారు.


దేవతలొక మార్గాన్ని అన్వేషించారు. వేదం, ఆత్మావైపుత్ర నామాసి అని చెప్పింది. తండ్రియే పుత్రునిగా పుడుతున్నాడని అర్థం. అందువల్ల పరమేశ్వరుణ్ణి సంతానం కనవలసిందని, అతడు మా నాయకుడవుతాడని తపస్సు చేసారు. అదే సమయంలో శివుడు, దక్షిణామూర్తి రూపంలో ఉండి తపస్సు చేస్తున్నాడు. అమ్మవారు, స్వామికి పరిచర్య రూపంలో తపస్సు చేస్తూ ఉంది. ఇట్టి పవిత్ర వాతావరణంలో కుమారుడు పుట్టాడు.


పిల్లవానిగా ఉన్నపుడు ఆరు రోజులు కొన్ని లీలలను ప్రదర్శించాడు. ఇతనికి, ఆరు సంఖ్యకూ దగ్గర సంబంధం ఉంది. ఇతనికి ఆరు ముఖాలు. ఇతని మంత్రంలోనూ ఆరు అక్షరాలే. పుట్టిన రోజు కూడా షష్టియే. ఇతనికి పాలనిచ్చినవారు ఆర్గురే. వారే కృత్తికలు. అతని పేరు కుమారుడవడం వల్ల ఆరు రోజులతని లీలలు. తరువాత సైన్యాధిపత్యం వహించాడు. అసురులను చంపాడు. దేవతలను రక్షించాడు.



Saturday, 13 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (172)



స్కంద పూర్వజుడు


చివరి నామం దగ్గరకు వచ్చాం. స్కందునకు అన్న గారని అర్థం. ఇతణ్ణి అగ్రజుడని పేర్కొన్నాం.


సహోదర పదం వాడబడినప్పుడు అన్నగారూ కావచ్చు, తమ్మడూ రావచ్చు. పూర్వజుడని చెప్పడం వల్ల ముందు పుట్టినవాడని స్పష్టంగా తెలుస్తోంది. తమ్ముణ్ణి అనుజుడని అంటాం. రామానుజుడు అనగా రాముని తరువాత పుట్టినవాడు. అమర కోశంలో సుబ్రహ్మణ్యస్వామికి గజముఖానుజుడని నామం.


కుమారస్వామికి అన్న గారవడం వల్ల గొప్పదనాన్ని సూచిస్తుంది


షోడశనామాల నుచ్చరిస్తూ ఉన్నపుడు శివుని కొడుకని గాని అమ్మవారి కొడుకని గాని లేదు. ఎవరి పతి యని కూడా లేదు. బ్రహ్మచారిగా అనేక రూపాలలో ఉన్నవానికి భార్యతో కలిసి యుండగా అనేక నామాలతో కీర్తింపబడ్డాడు. వల్లభితో ఉన్నపుడు వల్లభ గణపతి. సిద్ధి, బుద్ధి కూడా ఇతని భార్యలు. ఫలానా వారికి ఇతడు తండ్రియని సూచించే పదాలు లేవు. షోడశనామాలలో మాత్రం చివరి నామం, స్కందునికి అన్నగారనే ఉంది. ఎందుకిట్లా?


ఇక్కడ చిన్నవాని పేరు చెప్పి అతని అన్నగారైన వినాయకుడని చెప్పడం జరిగింది. ఎందుకిట్లా చెప్పారు?


వినాయకుడు, కుమారస్వామితో సంబంధం పెట్టుకొని యున్నాడు కనుక. సోదరుని జీవితంలో మూడు దశలలో అనగా పుట్టుక, వివాహం, సన్న్యాసంలో అన్నగారి పాత్ర ఉంది.


Friday, 12 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (171)



ఎక్కడా జరగనివి, గణపతి విషయంలోనే జరిగే సంఘటనలను, శంకరులు తమ ప్రతిభతో పేర్కొన్నారు. మొదటగా కొండంత విఘ్నాలను గణపతి పిండి చేస్తాడని అంటూ అతడేనుగు ముఖం కలవాడైనా సింహం చేత పూజలందుకొంటున్నాడని వ్రాసేరు. మొట్టమొదటిగా పంచాస్య మంటే సింహమని భావిస్తాం. కానీ ఇక్కడ సింహం కాదు. పరమశివుడే. త్రిపురా సుర సంహార విషయంలో విఘ్నేశ్వరుణ్ణి శివుడు పూజించలేదా! అతని రథపుటిరుసు విరిగినపుడు పూజించాడని విన్నాం కదా. 


ఐదు ముఖాలున్నవానికి సింహం వాహనంగా


అతడు పంచాస్య మాన్యుడే కాదు అతడే ఐదు ముఖాలున్న హేరంబ రూపంలో ఉంటాడు. అప్పుడు అతనికి ఐదు ఏనుగు ముఖాలు, పదిచేతులు, సింహం వాహనంగా ఉంటుంది. ఇక్కడ ఏనుగు సింహాన్ని చూసి భయపడడం లేదు. సింహం పైనే ఎక్కి స్వారీ చేస్తుంది. ఐదు ముఖాలు కలిగి తండ్రిని తలపింప చేస్తున్నాడు, సింహం వాహనంగా కలిగి తల్లిని గుర్తు చేస్తున్నాడు. అమ్మవారికి, సింహ వాహిని అని పేరుంది కదా. ఇక మహాగణపతి మూర్తికి పది చేతులున్నా ఐదు ముఖాలూ ఉండవు. సింహం, వాహనం గానూ ఉండదు. ఒక్క హేరంబ రూపంలోనే అట్టి రూపాన్ని చూడగలం. నాగ పట్టణంలో ఉన్న నీలాయతాక్షి ఆలయంలో ఇతడు రాగిరూప విగ్రహంగా ఉంటాడు. నాల్గు ముఖాలు నాల్గు దిక్కులను చూస్తూ ఉంటాయి. ఐదవ ముఖం కిరీటంగా ఉంటుంది. ఇట్లా ఐదు ఏనుగు ముఖాలతో కనువిందు చేస్తుంది ఆ మూర్తి.


Thursday, 11 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (170)



ఏనుగును పూజించిన సింహం


హేరంబ గణపతి రూపం ప్రత్యేకంగా ఉంటుంది. ఇతనికి ఐదు ముఖాలు అన్నీ గజ ముఖాలే. 'పంచమాతంగ ముఖ' అనే పాట కూడా ఉంది. తిరువారూర్ లో ఇట్టి గణపతిని చూసి ముత్తుస్వామి దీక్షితులు పాడియుంటారు.


పరమశివునకు ఐదు ముఖాలు. శివపంచాక్షరి ధ్యానంలో అలా ఉంటుంది. శంకరులిక్కడే శ్లేషను ప్రయోగించారు.


బదు ముఖాలుంటాయి. కనుక ఈశ్వరునకు పంచాస్యుడని పేరు. సింహానికీ పంచాస్యమని పేరు. ఇక్కడ పంచయనగా విస్తరించినదని (పెద్ద ముఖం కలది) అర్థం. ప్రపంచం అనినపుడు విస్తరించినది యనే అర్థంలో వాడుతున్నారు. ఈ సందర్భంలో పంచ్ అనగా ఐదని, ఐదు భూతాలతో ప్రపంచముంటుందని అర్థం చేసుకోవచ్చు కదా. సింహం అంటే భయపడుతుంది ఏనుగు. సింహాన్ని స్వప్నంలో చూసినా భయపడి చనిపోతుందని అంటారు. సింహ స్వప్నం అనే మాట ఉంది. ఏనుగును చూస్తే ఉన్న బలాన్ని అంతా పుంజుకుని మీద పడడానికి సిద్ధమౌతుంది సింహం. దాని కుంభస్థలం బ్రద్దలు కొడుతుంది. అట్టి సింహం ఏనుగునకు పూజ చేస్తే ఆశ్చర్యం. అందుకే శంకరులు మహాదంతి వక్రాపి పంచాస్యమాన్యా అని తిరుచెందూర్ లోని సుబ్రహ్మణ్యుని భుజంగ స్తోత్రంలో నుతించినపుడు, వినాయక స్తుతిగా ఈ మొదటి శ్లోకాన్ని వ్రాసేరు.


సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రీ


మహాదంతి వక్రాపి పంచాస్య మాన్యా


విఘ్నేశ్వరుడెపుడూ బాలరూపంలో ఉంటాడు. సదా బాలరూపాపి. అపి అంటే అయినా, కొండల వంటి విఘ్నాలను పిండి చేస్తున్నాడు.


దాని తరువాత అతడేనుగైనా సింహం చేత పూజింపబడ్డాడు. 'మహాదంతి వక్రాపి పంచాస్య మాన్యా'.


Wednesday, 10 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (169)



వనవాసానికి ముందు పాండవులు ఇంద్రప్రస్థంలో రాజసూయ యోగం చేయాలనుకున్నారు. ధర్మరాజు, సోదరులను నలువైపులా పంపించాడు. అప్పుడు సహదేవుడు దక్షిణ వైపునకు వచ్చాడు. ఆ ప్రాంతాలను జయించాడు. భారతంలో హేరంబం అనే రాజ్యాన్ని జయించినట్లుంది. ఇదే కాలక్రమంలో మైసూరుగా రూపొందిందేమో! మహిషుని ఊరు, మైసూరు. మహిషం అంటే దున్నపోతే కదా! మహిషానికి, హేరంబ పదానికి దగ్గర సంబంధం ఉంది. సహదేవుని చేతిలో ఓడిపోయినా తాము గొప్ప వారమనే అహంకారంతోనే అక్కడవారు యుండి యుంటారు. ఎవడు తన గొప్పను తాను చెప్పుకుంటూ ఉంటే వాటిని హేరంబుడని పిలిచి యుంటారు. ఇట్టి ప్రాంతంలో వినాయకుడు కొలవ బడడం చేత ఇతడు హేరంబ గణపతి అయ్యాడు.


ఇది ఊహ మాత్రమే. నాకేమని తట్టుతోందంటే అర్థం కోసం ప్రాకులాడకుండయ్యా. హేరంబపదం వీనులవిందుగా లేదా? నామాదిరిగా ఆజ్ఞా సూచకంగా లేదా? నేనీ పేరుతో పిలువబడడం సబబే కదా, నా పేరుతో పిలవండి. నిఘంటువుల నెందుకు చూస్తారు? అని చెబుతున్నాడేమో! 


అతడు హేరంబ రాజ్యానికి చెందినవాడైనా కాకపోయినా పదం ప్రసిద్ధి పొందింది. షోడశనామాలలో ఇదీ ఉంది.


(హేరంబ పదం అమరంలో, హేరుద్ర సమీపే రంబతే తిష్ట తీతి హేరంబ రుద్రుని యొద్దనుండువాడు, ఋగతా హేరతే వర్ధయతి భక్తానితివా భక్తులవృద్ధి బొందించువాడు. హే వృద్ధా - అమరం - గురుబాల ప్రబోధిక-అనువక్త)


Tuesday, 9 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (168)



హేరంబుడు


నాకు తెలిసినంతవరకూ ఎవ్వరూ ఈ ధాతువునకు అర్థం ఈయలేదు లేదా నేను సరిగా అర్థం చేసుకొని యుండకపోవచ్చు, భాస్కర రాయలనే మంత్ర శాస్త్రవేత్త ఉండేవాడు. లలితా సహస్ర నామాలపై వారి వ్యాఖ్య చాలా ప్రసిద్ధిని పొందింది. ఆయన గణేశ సహస్రనామాలపై వ్యాఖ్య వ్రాసేడు. ఈ పదానికి అతడెట్టి వ్యాఖ్యానం చేసాడా అని చదివినాను. వ్యాఖ్యననుసరించి శైవాగమాన్ని స్థాపించినవాడని; బాగా శార్యం కలవాడని వ్రాసేడు. ఆ వ్యాఖ్యాత, గొప్పవాడే, ఆ పదానికి ఆ అర్థం ఎట్లా వస్తుందో నాకైతే అర్థం కాలేదు. ఇది నా లోపం కావచ్చు. తమిళ పదమైన ఎరుమై (Erumai) అనగా దున్నపోతు, హేరంబునిగా మారిందని కొంతమంది పరిశోధకులంటున్నారు.


సంస్కృత పదాలకు అర్థం చెప్పేటప్పుడు వాటి ధాతువులను బట్టి నిర్ణయిస్తారు. ఈ నియమానికి కొన్ని మినహాయింపులు లేకపోలేదు. ఆయా ధాతువును బట్టి ఆయా అర్థం వస్తుందని చెప్పడం వల్ల యౌగికార్థం వస్తుంది. యౌగికమనగా వ్యుత్పత్తి కలది. వ్యుత్పత్త్యర్ధము కలది.


(దీనికి విరుద్ధంగా అవయవ శక్తిని ఆపేక్షించకుండా కొత్త అర్థంలో ప్రసిద్ధమైన దానిని రూఢియని అంటారు. ఉదా: లావణ్యం. లవణము యొక్క భావం లావణ్యం. కాని తళతళలాడే వస్తువు, లావణ్యంతో ఉందని అంటాం. ఉదా: లావణ్యవతి. లవణమనగా ఉప్పు. అది తళతళలాడుతుంది. కాని మిగిలిన సందర్భాలలోనే ఈ లావణ్య పదాన్ని వాడతారు. అంటే వాడుకలోనున్న అర్థము. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రకృతి ప్రత్యయముల అపేక్ష లేకుండా బోధపడే అర్ధం, యౌగికము కాని అర్ధం - అనువక్త) ఇట్లా హేరంబపదం రూఢికెక్కింది.


Monday, 8 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (167)



శూర్పకర్ణుడు


అనగా చేటల వంటి చెవులు కలవాడు. ఇంతకుముందే గజకర్ణకుడని చెప్పడం వల్ల అట్టిదే శూర్ప కర్ణుడు చెప్పడంలో ఔచిత్యం ఉందా? ఉంది. 


గజకర్ణకుడని చెప్పినపుడు, పెద్ద చెవులుంటాయని, వాటి ద్వారా మన ప్రార్థనలను వింటాడని తెలుసుకున్నాం. మన ప్రార్థనలొక్కటే వింటాడా? మనం మాట్లాడేవన్నీ, అందునా వ్యర్థ ప్రసంగాలనూ వింటాడు. ఇక మన ప్రార్ధనలు కూడా వెఱ్ఱి మొఱ్ఱిగా ఉంటాయి. వ్యర్థమైన మన మాటలను చెవినొడ్డి ఎట్లా వినగలడు? అందువల్ల అతడన్నిటినీ వింటున్నా దేనిని మనస్సులో ఉంచుకోవాలో దానిని అట్టే పెట్టుకుని మిగిలిన వాటిని గెంటి వేస్తూ ఉంటాడు. అందువల్ల అతడు శూర్పకర్ణుడయ్యాడు, శూర్పమనగా చేట. చేట గింజల నుంచుకొని పొట్టును చెరిగి వేస్తుంది. అంటే చెత్తా చెదారాన్ని గెంటి వేస్తుందన్నమాట. 


ఇట్టి రూపం ఏమని సందేశమిస్తోంది! మిగతా జంతువులకు లేని పెద్ద పెద్ద చెవులు దీనికి ఉన్నాయి కనుక అన్నీ వినే శక్తి కలవాడు. అందువల్ల మనము సరియైన ప్రార్థనలే అతని ముందు చేయాలని హితోపదేశం చేస్తోంది. ఏది సరియైనదో కాదో ఆయన తూకం వేసి చూస్తాడు. సరియైన ప్రార్ధనకే ఐదులిస్తాడని భావించాలి. అందుకే ఈ నామం.


Sunday, 7 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (166)



వక్రతుండుడు


ముఖాన్ని సూచించే పదాలలో తుండం ఒకటి. సాధారణంగా తుండం అంటే ముఖమని ఉన్నా పంది, ఏనుగులకు ముక్కును బట్టే వాటికి ప్రాధాన్యం. తుండమనగా ఆ రెండింటికే 'ముక్కు' అని చెప్పాలి. పంది యొక్క ముక్కుకు ప్రాధాన్యం ఏమిటి? గుఱ్ఱం మొదలగు జంతువుల ముక్కు క్రమంగా తగ్గుబాటుతో ముఖంవైపు సారించినపుడున్నట్లు ఉండగా, పంది ముక్కు వృద్ధి పొందుతూ ఉంటుంది. ఏనుగుకు ముక్కు ప్రేలాడుతూ ఉంటుంది. చెట్టుబోదెలా ఉండేదే తుండం. పక్షులకు ముక్కు పొడవుగా ఉండి పోను పోను కోసుగా ఉంటుంది. దీనినీ సంస్కృతంలో తుండం అంటారు.


శరీరంలో తలకెంత ప్రాధాన్యమో తలలో ముక్కునకు అంత ప్రాధాన్యం ఉంది. అది చేసే పనివల్లనే కాదు, దాని ఆకారానికి ప్రాధాన్యం ఉంది, ఒకని ముక్కును బట్టి అతని ఆకారం చెబుతాం. (గ్రద్ద ముక్కున్నవాడు మొదలైన వ్యవహారంలో ఉన్నాయి).


వక్రమనగా వంకర. ఎవడైనా తప్పుపని చేస్తే వాటిని వక్రుడని అంటాం. అంటే వాడిది వక్రగుణం, ఋజుప్రవర్తన ఉన్నవాడికి తిన్నని గీతలా మనః ప్రవృత్తి ఉంటుంది. ఇట్టి దానిని సంస్కృతంలో ఆర్జవమంటారు. తిన్నగా అని అర్థం. ఋజు = ఆర్జవం.


ఇక వక్రతుండం అనినపుడు చెడ్డ అనే అర్థంలో వాడం. కేవలం వంకరనే. ఇతని తుండం, వంకరగా తిరిగియుండుటవల్ల ఇతడు వక్రతుండుడు.


మరొక చిత్రం. ఏనుగు, మొత్తం తుండాన్ని కదపకుండా దాని అగ్రభాగాన్ని వంచగలదు, అటూ ఇటూ సాధారణంగా ఎడమవైపునకు త్రిప్పుతుంది. ఎప్పుడైనా కుడివైపునకు కూడా.


ముత్తుస్వామి దీక్షితులు వక్రతుండ మహాకాయ అని స్వామిని కీర్తించారు. దాని అగ్రభాగాన్ని కుడివైపునకు త్రిప్పినపుడు (వలంపురి) అతడు ప్రణవ స్వరూపునిగా కనబడతాడని లోగడ చెప్పాను.


వెన్నను దొంగిలించే కృష్ణుణ్ణి భావిస్తే మనలో చారగుణం పోతుంది. అతని రాసలీలలను స్మరిస్తే మనలో కామం పోతుంది. అట్లాగే వక్రతుండుని స్మరిస్తే మనలో వక్రలక్షణాలు పోతాయి. గణపతి గాయత్రిలో వక్రతుండ పదమే ఉంది. ఈ మంత్రం యొక్క లక్ష్యం మనలను సన్మార్గంలో పెట్టుమనే.

Saturday, 6 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (165)



ముఖం - నోరు


గజాననంలో ఆననం ఉంది. అనగా ముఖం. ముఖానికి అమర కోశంలో చాలా పర్యాయ పదాలున్నాయి. వక్త్రాస్యం, వదనం, తుండం, ఆననం లపనం, ముఖం ఇవన్నీ ముఖాన్నే సూచిస్తాయి. 


ఇక సంస్కృతంలో నోటికి ప్రత్యేక పదం లేదని, ముఖానికి ఉన్న పదమే నోటికీ ఉందని లోగడ చెప్పాను. వాక్, వచనం మొదలైనవి మాటకు సంబంధించినవి. మాట్లాడతాడు కనుక, వక్త. మాట్లాడదగినది వక్తవ్యం. కనుక వక్త్రం అనే మాట నోటికే చెందుతుంది. వదనం అనేమాట కూడా మాటకాధారమైన అంగం, ముఖ్యంగా నోటినే చెబుతుంది. వద అనగా మాట్లాడు. ధాతువును చూస్తే లపనం కూడా మాటకే చెందింది. లప్ అనగా మాట్లాడుట. దాని నుండే ఆలాపం, సల్లాపం, ఆలాపన అనే మాటలు వచ్చాయి. కనుక ముఖాన్ని సూచించే పదాలు నోటినీ సూచిస్తాయనడం సబబు కాదు. ఆపైన వక్ర్తం, వదనం అని నోటిని సూచించే పదాలు ముఖాన్ని సూచిస్తాయి. మాట్లాడేశక్తి మానవునకే ఉంది కనుక నోటికి ప్రాధాన్యం ఉంది. నోరు, అన్ని అవయవాలలో ముఖ్యమైన ముఖంలో ఉంది. చూసే కళ్ళు గాని, వినే చెవులు గాని, వాసన చూసే ముక్కు గాని, స్పృశించడానికి అందంగా ఉండే చెక్కిళ్ళు గాని అన్నీ ముఖంలోనే ఉన్నాయి. మానవులలో ప్రత్యేకత, మాట్లాడే లక్షణం కనుక, నోరే మాట్లాడుతుంది. కనుక నోటిని, ముఖాన్ని సూచించే పదం ఉంచారు. నోటికే రెండు లక్షణాలున్నాయి. కన్ను చెవులనే జ్ఞానేంద్రియలతో బాటు ఇదీ జ్ఞానేంద్రియమే. మాట్లాడగలదు, రుచి కూడా చూడగలదు. ఇట్లా రెంటి పనులూ చేసి ప్రముఖ స్థానాన్ని పొందింది.  


అందువల్ల ముఖాన్ని, నోటిని సూచించు పై పదాలున్నాయి. గజానుడన్నా, విఘ్నేశ్వరుడన్నా ఏనుగు ముఖమే గుర్తుకు వస్తుంది.


శరీరంలో తలకు ప్రాధాన్యం. ఒకడు అందంగా ఉన్నాడా లేదా అని చెప్పేది ముఖాన్ని బట్టే కదా! అట్టి ముఖం ఉన్నవాడు గణపతి. ఇందన్ని అవయవాలూ చూడముచ్చటగా ఉంటాయి.


(ఇక అమరకోశంలో - వఅక్త్రం దీనిచే పలుకబడును; ఆస్యం = దీని యందు భక్ష్య వస్తువులు వేయబడును; వదనం=దీనిచే పలుకుదురు; తుండం=భక్ష్య వస్తువు దీనిచే పీడింపబడును, ఆననం=దీనిచేత బ్రతుకుదురు; లపనం దీనిచే పలుకుదురు; ముఖం=దీనిచే భక్ష్యము పీడింపబడును. ఇందు చాలా పదాలు నోటికే ప్రాధాన్యాన్ని సూచిస్తున్నాయని సారాంశం -అనువక్త)


Friday, 5 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (164)



దేవతలకు ఎన్నో ఆహార పదార్థాలను నివేదిస్తాం. వాటిని ప్రత్యక్షంగా తింటారా? వాసన చూస్తారట. మానవులే వండిన ఆహారాన్ని తింటారు. విఘ్నేశ్వరునకు రెండుసార్లు ఉడికిన మోదకాలంటే మక్కువ. ముందు బియ్యపు పిండిని ఉడక పెడతాం. అందు పూర్ణం పెట్టి మరల ఉడకపెడతాం. ఇంకా పవిత్రత కోసం వాటిని నేతిలో కూడా వేయిస్తారు. గణపతి హోమంలో వాటినే హోమం చేస్తారు. అతడు మోదకహస్తుడు. అంటే తీపిగానున్న మోదకాలను చేతిలో ఉంచుకొనే స్వామి ఇతడొక్కడే. కృష్ణుని చేతిలో వెన్నముద్ద యుంటుంది. వెన్నకుండను ఆలింగనం చేసుకున్నట్లుగా బొమ్మలుంటాయి. అయితే వెన్నను ఉడకబెట్టరు కదా! తేనెగాని, పిండిని గాని సుబ్రహ్మణ్యునకు అర్పిస్తాం. అవీ ఉడక బెట్టినవి కావు. అన్నపూర్ణేశ్వరికి చేతిలో పాయసముంటుంది. అది ఆమె కోసం కాకుండా మనకీయడానికే అన్నట్లుంటుంది. ఒక్క గణపతి మాత్రమే వండినవి తింటాడు, వండినవి ఇస్తాడు.


అందువల్ల తనలో దేవాంశ, భూతాంశ, మానవ లక్షణాలను వినాయకుడు ప్రకటిస్తున్నాడు. కేవలం దేవతగా కేవలం మానవునిగా కేవలం భూతంగా ఉన్నాడా? అన్నీ కలబోసిన మూర్తిగా ఉన్నాడు.


అయితే ఏనుగు ఆకారంలోనే ఎందుకుండాలని ప్రశ్న. దానికి మిగిలిన జంతువులకంటె గొప్ప గుణాలున్నాయి కనుక. మరొక్క విషయం. ఏనుగు తలనే ఎందుకు ధరించాడు? పరమాత్మ తానన్నిటికీ మూలమని సూచించడానికి, అట్టి రూపాన్ని అందరూ భజించాలని తెలుపడానికి అట్టిరూపాన్ని ఎంచుకున్నాడు. అసలు సృష్టికి మూలం ఏమిటి? అన్నిటికీ మూలం ప్రణవం. అన్ని జంతువులలోనూ దేనికీ లేని ప్రత్యేకత ఏనుగు ముఖానికి ఉంది. దాని ముఖం, కుడివైపున తిరిగిన తుండం, ప్రణవాకారంగానే ఉంటాయి. అందువల్ల గజానన రూపంలో సాక్షాత్కరించాడు.


Thursday, 4 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (163)



గోపూజలో దానిని పూజించడంతోనే సరి. గజ పూజలో దానిని పూజించడమే కాకుండా అదీ పూజ చేస్తుంది.


అన్ని పెద్ద ఆలయాలలోనూ ఏనుగులుంటాయి. కేరళలో త్రిచూర్లో భగవంతుని కంటే ఏనుగులకే ప్రాముఖ్యం ఉన్నట్లు కన్పిస్తుంది. అట్లా ఏనుగులకు దైవానికి సంబంధం ఉంది. ఏనుగు మొఱ పెడితే వైకుంఠం నుండి విష్ణువు రాలేదా? గజేంద్ర మోక్షకథ తెలుసుకదా. అన్ని జంతువులలో పెద్ద శరీరం కలది, దొడ్డ గుణాలున్నది ఏనుగు ఒక్కటే. పరమాత్మ అందరి శరీరాలలోనూ ఉన్నా అతని విభూతి ఇందు వ్యక్తీకరింపబడుతుంది.


అన్ని ప్రాణులూ వినాయకునిలో ఉన్నాయి. అతణ్ణి ముందుగా అర్చిస్తారు కనుక దేవగణాలకు చెందినవాడు. దేవుడని చెప్పడానికి గుర్తేమిటంటే సేవించిన వారికి ఆశీస్సులనందించే శక్తి కలిగి యుండడడమే. గణపతికి ఆ శక్తి యుంది.


అతడు భూతగణాలకు చెందినవాడు. ఆ పెద్ద బొజ్జ, పొట్టికాళ్ళు మొదలైన లక్షణాలు సూచిస్తున్నాయి కదా.

Wednesday, 3 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (162)



దాని ముఖమే విలువైనదని, మిగతా దానికి విలువ లేదని భావించకండి. దాని తోకకూ విలువుంది. అందలి వెంట్రుకలు, దుష్ట శక్తులను తరుముతాయి. ఐశ్వర్య ప్రదం అని ఉంగరంలో బంధిస్తారు. ఇది ఆభరణము, రక్షించే శక్తి కలదు కూడా. సాధారణంగా వెంట్రుకలను, గోళ్ళను దోషంతో కూడియుంటాయని దూరంగా పారవేస్తారు. తాంత్రిక శక్తులను కలిగినవారే వీటిని వాడతారు. వెంట్రుకలు, గోళ్ళు శరీరం మీద ఉన్నంతవరకూ వాటికి దోషం లేదు. కత్తిరిస్తే మాత్రం దూరంగా పారవేస్తాం. కాని ఏనుగు వెంట్రుకలకు, దుష్టశక్తులను తరిమే లక్షణముంది. పెద్దపులి గోరునకూ ఇది ఉంది. కృష్ణుని బొమ్మలో పులిగోరు పతకంతో ఉన్నట్లుంటాడు కదా!


జంతువులు - దేవతా సంబంధం


మన మఠంలో రోజూ జంతువులకు పూజ యుంటుంది. ఒకటి గోపూజ, రెండవది గజపూజ. ఆవును జంతువుగా చూడం. తల్లిలా చూస్తాం. గజ పూజ చేస్తాం. మిగిలిన జంతువులకు పూజ యుండదు. ప్రాతః కాలంలో గోపూజ, సాయం సమయంలో గజ పూజ యుంటుంది, గజపూజలో పండ్లను పెడతాం. గౌరవంతో శంకరుల పాద పద్మాలకు చామరం దానిచే వీచునట్లు చేస్తాం. రోజువారీ ఖర్చును పాదపద్మాలకు నివేదిస్తాం. మేము నమస్కరించిన తరువాత ఏనుగు తుండం ఎత్తి అదీ జయఘోష చేస్తుంది.

Tuesday, 2 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (161)



అంతకంటే ఈ ఏనుగు నడుస్తూ ఉంటే అందమూ ఉంది, ఆజ్ఞాపించే లక్షణమూ ఉంది. దాని నడకను గజగతి యంటారు. ఇది స్త్రీ పురుషుల  ఇద్దరి నడకనూ సూచిస్తుంది. ఆజ్ఞాపూర్వకమైన చూపు, నడక ఉంటే పురుషుణ్ణి గజగమనంతో పోలుస్తారు. ఉత్తమ జాతి స్త్రీలను గజగామినులని అంటారు.


అంతేకాదు, దీనిపై కూర్చున్నవానికే ఈ లక్షణాలు సంక్రమిస్తాయి. అట్లా రాముణ్ణి ఊరేగింపులో ఏనుగుపై నెక్కినవానిగా చూడాలని ప్రజలు దశరథునితో అన్నారు. గజేన మహతాయాంతం - (అయోధ్య కాండ సర్గ 2 శ్లో 22) రాముని నెత్తిపై రాజచ్ఛత్రం ఉండాలన్నారు. ఛత్రవృతాననం. వినాయకుని ప్రతిమపై గొడుగు పెడతాం.


విభూతిగాని, వైష్ణవ నామాలు గాని ఏనుగు యొక్క నల్లని ముఖంపై పెట్టినపుడు, ఎంత అదంగా ఉంటుందో వేరే చెప్పాలా? ఏ జంతువుకైనా నగలు పెట్టవచ్చు. కాని ఈ నామాలుంటాయా?


ముత్యపు చిప్పనుంచి ముత్యాలు వస్తాయని అందరికీ తెలుసు. కాని అవి మిగతా చోట్ల నుండి కూడా లభిస్తాయి. అరుదుగా వెదురునుండి, ఏనుగు ఫాలభాగం నుండి వస్తాయట. ఏనుగు నుండి వచ్చినవి చాలా విలువైనవట.


మరొక గొప్పదనం, దివ్యత్వం. దీని ముఖమే లక్ష్మీనిలయంగా ఉంటుంది. పద్మంలో, పాలకాంతిలో, మారేడు వెనుక తట్టున, స్త్రీల సీమంతంలో ఆవు వెనుక తట్టున ఏనుగు కుంభస్థలంలో - ఇట్లా ఐదు స్థలాలు లక్ష్మీనిలయాలని ప్రమాణముంది.


Monday, 1 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (160)



దీనికి ద్విపం అని పేరు. అనగా రెండు సార్లు త్రాగుట, రెండుసార్లు తినుట అని మామూలుగా అర్థం. ద్విపం ఎట్లా అయింది? ముందుగా తుండంతో నీటిని గాని ఆహారాన్ని గాని తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది. మిగతా జంతువులు నోటితోనే ఆహారాన్ని స్వీకరిస్తాయి. మనిషి మాదిరిగా ఏనుగు ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఘనమైన దానిని విడువాలంటే నోటి ద్వారానే విడుస్తుంది. అందువల్ల ఇది ద్విపం. నీరైతే తుండం ద్వారా విడిచిపెడుతుంది. జలయంత్రం నుండి నీరు చిమ్మినట్లుగా ఉంటుంది. ఇందులో ఒక తాత్త్వికత దాగియుంది. మనమేదైనా తినాలని అనినపుడు రెండు మూడుసార్లు ఆలోచించి తరువాత స్వీకరిస్తాం. తిరస్కరించవలసి వస్తే ఒక్క మారే గెంటి వేస్తాం. ఇట్టి లక్షణాన్ని ద్విపం సూచిస్తుంది.


ఎవరో ఒకాయన ఒక చిత్రమైన విషయాన్ని వ్రాసాడు. తుండంలాంటి సాధనం ఎక్కడా లేదన్నాడు. చిన్న గుండుసూదిని తీయడం, దాని తోనే పెద్ద దుంగల్ని గ్రహించే సాధనం లేదన్నాడు. భగవత్ సృష్టిలో ఏనుగు తుండానికే అట్టి శక్తి ఉంది. అట్టివాడు గజముఖుడైన గణపతియని అతడు చిన్నవాటినీ, పెద్దవాటినీ నిర్వహించగలడని వ్రాసేడు.


ఈ భువనం అంతా ఎనిమిది గజాలచే మోయబడుతుందని, ఎనిమిది దిక్కులలో అవి యున్నాయని వాటిని అష్టదిగ్గజములని అంటారు. (విద్యుత్ శక్తి, విద్యుదయస్కాంత శక్తి, ఆకర్షణ శక్తి మొదలైనవాటిని దిగ్గజములుగా భావించండి) శారీరక బలంతోబాటు, బుద్ధి శక్తి కూడా కావాలి. పరిపాలనలో ఎనమండుగురు ముఖ్యులు. ఇక కొందరు రాజులు, అష్ట దిగ్గజములనే కవులను పోషించారు. కృష్ణ దేవరాయల కాలంలో అట్లా కవులు పిలువబడేవారు.