Friday, 5 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (164)



దేవతలకు ఎన్నో ఆహార పదార్థాలను నివేదిస్తాం. వాటిని ప్రత్యక్షంగా తింటారా? వాసన చూస్తారట. మానవులే వండిన ఆహారాన్ని తింటారు. విఘ్నేశ్వరునకు రెండుసార్లు ఉడికిన మోదకాలంటే మక్కువ. ముందు బియ్యపు పిండిని ఉడక పెడతాం. అందు పూర్ణం పెట్టి మరల ఉడకపెడతాం. ఇంకా పవిత్రత కోసం వాటిని నేతిలో కూడా వేయిస్తారు. గణపతి హోమంలో వాటినే హోమం చేస్తారు. అతడు మోదకహస్తుడు. అంటే తీపిగానున్న మోదకాలను చేతిలో ఉంచుకొనే స్వామి ఇతడొక్కడే. కృష్ణుని చేతిలో వెన్నముద్ద యుంటుంది. వెన్నకుండను ఆలింగనం చేసుకున్నట్లుగా బొమ్మలుంటాయి. అయితే వెన్నను ఉడకబెట్టరు కదా! తేనెగాని, పిండిని గాని సుబ్రహ్మణ్యునకు అర్పిస్తాం. అవీ ఉడక బెట్టినవి కావు. అన్నపూర్ణేశ్వరికి చేతిలో పాయసముంటుంది. అది ఆమె కోసం కాకుండా మనకీయడానికే అన్నట్లుంటుంది. ఒక్క గణపతి మాత్రమే వండినవి తింటాడు, వండినవి ఇస్తాడు.


అందువల్ల తనలో దేవాంశ, భూతాంశ, మానవ లక్షణాలను వినాయకుడు ప్రకటిస్తున్నాడు. కేవలం దేవతగా కేవలం మానవునిగా కేవలం భూతంగా ఉన్నాడా? అన్నీ కలబోసిన మూర్తిగా ఉన్నాడు.


అయితే ఏనుగు ఆకారంలోనే ఎందుకుండాలని ప్రశ్న. దానికి మిగిలిన జంతువులకంటె గొప్ప గుణాలున్నాయి కనుక. మరొక్క విషయం. ఏనుగు తలనే ఎందుకు ధరించాడు? పరమాత్మ తానన్నిటికీ మూలమని సూచించడానికి, అట్టి రూపాన్ని అందరూ భజించాలని తెలుపడానికి అట్టిరూపాన్ని ఎంచుకున్నాడు. అసలు సృష్టికి మూలం ఏమిటి? అన్నిటికీ మూలం ప్రణవం. అన్ని జంతువులలోనూ దేనికీ లేని ప్రత్యేకత ఏనుగు ముఖానికి ఉంది. దాని ముఖం, కుడివైపున తిరిగిన తుండం, ప్రణవాకారంగానే ఉంటాయి. అందువల్ల గజానన రూపంలో సాక్షాత్కరించాడు.


No comments:

Post a Comment