దీనికి ద్విపం అని పేరు. అనగా రెండు సార్లు త్రాగుట, రెండుసార్లు తినుట అని మామూలుగా అర్థం. ద్విపం ఎట్లా అయింది? ముందుగా తుండంతో నీటిని గాని ఆహారాన్ని గాని తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది. మిగతా జంతువులు నోటితోనే ఆహారాన్ని స్వీకరిస్తాయి. మనిషి మాదిరిగా ఏనుగు ఆహారాన్ని స్వీకరిస్తుంది. ఘనమైన దానిని విడువాలంటే నోటి ద్వారానే విడుస్తుంది. అందువల్ల ఇది ద్విపం. నీరైతే తుండం ద్వారా విడిచిపెడుతుంది. జలయంత్రం నుండి నీరు చిమ్మినట్లుగా ఉంటుంది. ఇందులో ఒక తాత్త్వికత దాగియుంది. మనమేదైనా తినాలని అనినపుడు రెండు మూడుసార్లు ఆలోచించి తరువాత స్వీకరిస్తాం. తిరస్కరించవలసి వస్తే ఒక్క మారే గెంటి వేస్తాం. ఇట్టి లక్షణాన్ని ద్విపం సూచిస్తుంది.
ఎవరో ఒకాయన ఒక చిత్రమైన విషయాన్ని వ్రాసాడు. తుండంలాంటి సాధనం ఎక్కడా లేదన్నాడు. చిన్న గుండుసూదిని తీయడం, దాని తోనే పెద్ద దుంగల్ని గ్రహించే సాధనం లేదన్నాడు. భగవత్ సృష్టిలో ఏనుగు తుండానికే అట్టి శక్తి ఉంది. అట్టివాడు గజముఖుడైన గణపతియని అతడు చిన్నవాటినీ, పెద్దవాటినీ నిర్వహించగలడని వ్రాసేడు.
ఈ భువనం అంతా ఎనిమిది గజాలచే మోయబడుతుందని, ఎనిమిది దిక్కులలో అవి యున్నాయని వాటిని అష్టదిగ్గజములని అంటారు. (విద్యుత్ శక్తి, విద్యుదయస్కాంత శక్తి, ఆకర్షణ శక్తి మొదలైనవాటిని దిగ్గజములుగా భావించండి) శారీరక బలంతోబాటు, బుద్ధి శక్తి కూడా కావాలి. పరిపాలనలో ఎనమండుగురు ముఖ్యులు. ఇక కొందరు రాజులు, అష్ట దిగ్గజములనే కవులను పోషించారు. కృష్ణ దేవరాయల కాలంలో అట్లా కవులు పిలువబడేవారు.
No comments:
Post a Comment