Monday 22 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (181)



సంగ్రామే: కుమారస్వామి యుద్ధరంగంలో అవక్ర పరాక్రమం చూపించాడు. దేవగణాలకు సేనాధిపతి అయ్యాడు. ఈ సంగ్రామానికి ముందు విఘ్నేశ్వరుకే పూజ చేసియుంటాడని ఊహించవచ్చు. ఎందుకంటే తండ్రి, త్రిపురాసుర సంహారానికి వెళ్ళేముందు, తల్లి భండాసుర సంహారానికి వెళ్ళేముందు ఇతడిని పూజించకపోవడం వల్ల వారికి ఆటంకాలెదురయ్యాయని పురాణాలలో చదివాం కదా! అందువల్ల జాగరూకతతో పూజ చేసియుంటాడని ఊహింపవచ్చు.


సర్వకార్యేషు: అన్నగారితో పోటీపడి భువన ప్రదక్షిణ సమయంలో విజయం సాధించలేకపోయాడు. ఇక సన్న్యాసియైన తరువాత అన్నగారికి నమస్కరించకపోవడం వల్ల జీవితాంతం సన్న్యాసిగా ఉండలేకపోయాడు. యుద్ధాలకు వెళ్ళే ముందు నమస్కరించి యుండవచ్చుగాని, వల్లి దగ్గరకు వెళ్ళేటపుడు మరిచియుంటాడు. అతనిని మోహపెట్టి ఎట్టి తిప్పులను పెట్టిందో చూసారా? అనేక ఆటంకాలు వచ్చాయి. అన్నగారికి నమస్కరించిన తరువాత వివాహ విషయంలో విజయం సాధించాడు. ఆపైన అన్ని విషయాలలోనూ పూజించి యుంటాడు గనుక ఇక అపజయం మాటయే అతని చరిత్రలో వినబడదు.


ఇట్లా నామాలు చదవడం వల్ల ఎట్టి ఫలాలు వస్తాయో అన్ని ఫలాలు స్కందునకు లభించాయని, స్కంద పూర్వనామంతో ఈ వివరణ పూర్తి అయింది.


No comments:

Post a Comment