కుమారస్వామి జననం - అన్నగారి పాత్ర
విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు కుమార స్వామి కథను చెప్పాడు. వాల్మీకి రామాయణంలో ఈ కథను చెప్పేటప్పుడు కుమార సంభవమని అన్నాడు. కాళిదాసు ఈ మాటలను గ్రహించి ఆ పేరుతో కావ్యమే వ్రాసేడు.
పుట్టుకలో ప్రత్యేకత ఏమిటి? ఎవరైనా పుట్టిన తరువాత, పెరిగినప్పుడు, విద్యాభ్యాసం తరువాత కీర్తిని గడిస్తారు. ఇక కుమార సంభవానికి ముందే దేవసేనాధిపత్యం అనే బాధ్యత తారసపడింది. దానిని నిర్వహించడానికి కుమారస్వామి పుట్టి తీరాలి. పుట్టుకతోనే దేవగణాలకు సైన్యాధిపతి కావలసి వచ్చింది. అసురుల చేతిలో దేవతలు నానా ఇబ్బందులూ పడుతూ ఉండగా పోగొట్టేవాడెపుడు అవతరిస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు.
శూరపద్ముడు, తారకా సురుడు మొదలైనవారు శివునినుండి, తమను సంహరించడానికి శివునితో సమానుడైన వాడే అర్హుడని నియమం పెట్టారు. ఇక శివునకు సాటి ఎవరు? శివునకు సాటి శివుడే కదా! అయితే వరాన్ని ఇచ్చినవాడే చంపుతాడా? అందువల్ల తెలివిగా శివుడెట్లాగూ చంపలేడని, ఇక శత్రుబాధ ఉండదని దేవతలను హింసించడం మొదలు పెట్టారు.
దేవతలొక మార్గాన్ని అన్వేషించారు. వేదం, ఆత్మావైపుత్ర నామాసి అని చెప్పింది. తండ్రియే పుత్రునిగా పుడుతున్నాడని అర్థం. అందువల్ల పరమేశ్వరుణ్ణి సంతానం కనవలసిందని, అతడు మా నాయకుడవుతాడని తపస్సు చేసారు. అదే సమయంలో శివుడు, దక్షిణామూర్తి రూపంలో ఉండి తపస్సు చేస్తున్నాడు. అమ్మవారు, స్వామికి పరిచర్య రూపంలో తపస్సు చేస్తూ ఉంది. ఇట్టి పవిత్ర వాతావరణంలో కుమారుడు పుట్టాడు.
పిల్లవానిగా ఉన్నపుడు ఆరు రోజులు కొన్ని లీలలను ప్రదర్శించాడు. ఇతనికి, ఆరు సంఖ్యకూ దగ్గర సంబంధం ఉంది. ఇతనికి ఆరు ముఖాలు. ఇతని మంత్రంలోనూ ఆరు అక్షరాలే. పుట్టిన రోజు కూడా షష్టియే. ఇతనికి పాలనిచ్చినవారు ఆర్గురే. వారే కృత్తికలు. అతని పేరు కుమారుడవడం వల్ల ఆరు రోజులతని లీలలు. తరువాత సైన్యాధిపత్యం వహించాడు. అసురులను చంపాడు. దేవతలను రక్షించాడు.
No comments:
Post a Comment