ఎక్కడా జరగనివి, గణపతి విషయంలోనే జరిగే సంఘటనలను, శంకరులు తమ ప్రతిభతో పేర్కొన్నారు. మొదటగా కొండంత విఘ్నాలను గణపతి పిండి చేస్తాడని అంటూ అతడేనుగు ముఖం కలవాడైనా సింహం చేత పూజలందుకొంటున్నాడని వ్రాసేరు. మొట్టమొదటిగా పంచాస్య మంటే సింహమని భావిస్తాం. కానీ ఇక్కడ సింహం కాదు. పరమశివుడే. త్రిపురా సుర సంహార విషయంలో విఘ్నేశ్వరుణ్ణి శివుడు పూజించలేదా! అతని రథపుటిరుసు విరిగినపుడు పూజించాడని విన్నాం కదా.
ఐదు ముఖాలున్నవానికి సింహం వాహనంగా
అతడు పంచాస్య మాన్యుడే కాదు అతడే ఐదు ముఖాలున్న హేరంబ రూపంలో ఉంటాడు. అప్పుడు అతనికి ఐదు ఏనుగు ముఖాలు, పదిచేతులు, సింహం వాహనంగా ఉంటుంది. ఇక్కడ ఏనుగు సింహాన్ని చూసి భయపడడం లేదు. సింహం పైనే ఎక్కి స్వారీ చేస్తుంది. ఐదు ముఖాలు కలిగి తండ్రిని తలపింప చేస్తున్నాడు, సింహం వాహనంగా కలిగి తల్లిని గుర్తు చేస్తున్నాడు. అమ్మవారికి, సింహ వాహిని అని పేరుంది కదా. ఇక మహాగణపతి మూర్తికి పది చేతులున్నా ఐదు ముఖాలూ ఉండవు. సింహం, వాహనం గానూ ఉండదు. ఒక్క హేరంబ రూపంలోనే అట్టి రూపాన్ని చూడగలం. నాగ పట్టణంలో ఉన్న నీలాయతాక్షి ఆలయంలో ఇతడు రాగిరూప విగ్రహంగా ఉంటాడు. నాల్గు ముఖాలు నాల్గు దిక్కులను చూస్తూ ఉంటాయి. ఐదవ ముఖం కిరీటంగా ఉంటుంది. ఇట్లా ఐదు ఏనుగు ముఖాలతో కనువిందు చేస్తుంది ఆ మూర్తి.
No comments:
Post a Comment