Saturday, 20 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (179)

స్వామివారిట్లా ప్రసంగం కొనసాగించారు. అసలు ఈశ్వరునకు ప్రణవార్థం తెలియదా? లోకానికి చెప్పడం కోసం గురుశిష్య సంబంధం ఉండాలని హితోపదేశం చేయడం కోసం కొడుకు నుండే ఉపదేశం పొందినట్లు కనబడ్డాడు. దానిని విని సుబ్రహ్మణ్యుడు కూడా గణపతి నుండే ఉపదేశాన్ని పొందాడు. తండ్రే శిష్యుడైనపుడు, అతడు కుమారునకు ఉపదేశం ఇస్తాడా? ఇక తల్లి కూడా భర్తలో సగమైనపుడు ఆమె కూడా ఈయదు. అందువల్ల అన్నగారైన గణపతి నుండే ఉపదేశం పొందాడు. ఇతని సన్న్యసానికి గణపతి పరోక్ష కారకుడయ్యాడని లోగడ వివరించాను. కానీ తిన్నగా కుమారస్వామికే గురవవడం వల్ల కుమార గురువనే పదం వహించాడు.


వివాహే: వల్లితో వివాహం చేయించాడు కదా! మనమా కథ విన్నాం.


ఇట్లా తమ్ముని వివాహానికి, సన్న్యాసానికి ప్రధాన సూత్రధారి అయ్యాడు చిన్నపుడు ఇతనిలో వైరాగ్య భావం కల్గించాడు. పెద్దయిన తరువాత గృహస్థు చేసాడు. చిన్నతనంలోనే అవ్వైయార్ ని ముసలిదానిగా మార్చాడు. వివాహం కావలసిన వయస్సులో ముసలిరూపా! ఇట్లా ఎన్నో లీలలు.


ప్రవేశే: పవిత్ర మూర్తియైన కుమారస్వామిని ప్రపంచంలోనికి అడుగుబెట్టునట్లు చేసాడు. విఘ్నేశ్వరుడు శూర పద్ముణ్ణి చంపగలిగియుండి చంపలేదు. ఆ ఫలం సోదరునికే దక్కాలని. అట్లా యుద్ధ ప్రవేశాన్ని సోదరునకు పరోక్షంగా అందించాడు.


No comments:

Post a Comment