Monday 8 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (167)



శూర్పకర్ణుడు


అనగా చేటల వంటి చెవులు కలవాడు. ఇంతకుముందే గజకర్ణకుడని చెప్పడం వల్ల అట్టిదే శూర్ప కర్ణుడు చెప్పడంలో ఔచిత్యం ఉందా? ఉంది. 


గజకర్ణకుడని చెప్పినపుడు, పెద్ద చెవులుంటాయని, వాటి ద్వారా మన ప్రార్థనలను వింటాడని తెలుసుకున్నాం. మన ప్రార్థనలొక్కటే వింటాడా? మనం మాట్లాడేవన్నీ, అందునా వ్యర్థ ప్రసంగాలనూ వింటాడు. ఇక మన ప్రార్ధనలు కూడా వెఱ్ఱి మొఱ్ఱిగా ఉంటాయి. వ్యర్థమైన మన మాటలను చెవినొడ్డి ఎట్లా వినగలడు? అందువల్ల అతడన్నిటినీ వింటున్నా దేనిని మనస్సులో ఉంచుకోవాలో దానిని అట్టే పెట్టుకుని మిగిలిన వాటిని గెంటి వేస్తూ ఉంటాడు. అందువల్ల అతడు శూర్పకర్ణుడయ్యాడు, శూర్పమనగా చేట. చేట గింజల నుంచుకొని పొట్టును చెరిగి వేస్తుంది. అంటే చెత్తా చెదారాన్ని గెంటి వేస్తుందన్నమాట. 


ఇట్టి రూపం ఏమని సందేశమిస్తోంది! మిగతా జంతువులకు లేని పెద్ద పెద్ద చెవులు దీనికి ఉన్నాయి కనుక అన్నీ వినే శక్తి కలవాడు. అందువల్ల మనము సరియైన ప్రార్థనలే అతని ముందు చేయాలని హితోపదేశం చేస్తోంది. ఏది సరియైనదో కాదో ఆయన తూకం వేసి చూస్తాడు. సరియైన ప్రార్ధనకే ఐదులిస్తాడని భావించాలి. అందుకే ఈ నామం.


No comments:

Post a Comment