Thursday 18 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (177)



సోదరుని సన్న్యాసంలో ఇతని పాత్ర


స్కందుని కథలో ఒక సందర్భంలో ఆతడు సన్న్యాసం తీసుకున్నట్లుంది. చిత్రమేమిటంటే, వివాహానికి ముందే స్వీకరించడం. సన్న్యాసియైనపుడు ఇతడు దండాయుధపాణి, పళని క్షేత్రం గురంచి వినని వారుండరు. అది సుబ్రహ్మణ్య స్వామి యొక్క పవిత్ర స్థలం. దండాయుధమనగా శత్రువులను దండించే దండం కాదు సుమా! వట్టి దండమే. మేము ధరించే దండమే. అది వెదురు కఱ్ఱయే. సైన్యాధిపతికి దండాయుధం ఉంటుంది. లలితాంబ, దండిని. దండాయుధపాణి యైన స్వామి, పళని కొండలపై శాంతికి చిహ్నమైన దండాన్ని పట్టుకొని యుంటాడు. ఇక్కడి దండం, మనస్సును నిగ్రహించాడనే దానికి గుర్తుగా ఉంటుంది. మనస్సును నియమించడమే ఒక గొప్ప యుద్ధం వంటిది కదా! అట్టి దండాన్ని మనస్సును నియమించడానికి వాడుతున్నాం. కాని అతనికి దండం, ఒక అలంకార వస్తువు. అట్టి మూర్తి, మనవంటి వారికి గుణపాఠంగా ఉంటుంది.


ఇట్టి సన్న్యాసరూపం, ఇక ఏ దేవతకూ ఉండదు. చిన్నవయసులో తల గొరిగించుకొని, కాషాయ బట్టలు కట్టుకొని దండాన్ని ధరిస్తూ ఏ అవతార మూర్తియైనా ఉంటుందా? అందంలో, శక్తిలో, అధికారంలో ఇతణ్ణి మించినవారెవరైనా ఉన్నారా? దేవసేనాధిపతిగా ఉన్నాడు. పుట్టిన ఆరు రోజులకే అన్నిటినీ త్యాగం చేసి శాంతి స్వరూపుడై యున్నాడు. ఇట్లా మారడానికి ఎవరు కారణం? విఘ్నేశ్వరుడే. ఇతనికి ఇతని అన్నగారికి జరిగిన పందెంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేస్తే భువనాలన్నీ చుట్టిన ఫలం వస్తుందని తల్లిదండ్రులకే ప్రదక్షిణం చేసి పండును వినాయకుడు పొందాడు. ఆ అపజయం వల్ల విరక్తి కలిగి సన్న్యాస రూపం ఎత్తిన వాడు కుమారస్వామి. జ్ఞాన రూపునిగా శాంతి రూపునిగా తీర్చి దిద్దినవాడు వినాయకుడే కదా!

No comments:

Post a Comment