వక్రతుండుడు
ముఖాన్ని సూచించే పదాలలో తుండం ఒకటి. సాధారణంగా తుండం అంటే ముఖమని ఉన్నా పంది, ఏనుగులకు ముక్కును బట్టే వాటికి ప్రాధాన్యం. తుండమనగా ఆ రెండింటికే 'ముక్కు' అని చెప్పాలి. పంది యొక్క ముక్కుకు ప్రాధాన్యం ఏమిటి? గుఱ్ఱం మొదలగు జంతువుల ముక్కు క్రమంగా తగ్గుబాటుతో ముఖంవైపు సారించినపుడున్నట్లు ఉండగా, పంది ముక్కు వృద్ధి పొందుతూ ఉంటుంది. ఏనుగుకు ముక్కు ప్రేలాడుతూ ఉంటుంది. చెట్టుబోదెలా ఉండేదే తుండం. పక్షులకు ముక్కు పొడవుగా ఉండి పోను పోను కోసుగా ఉంటుంది. దీనినీ సంస్కృతంలో తుండం అంటారు.
శరీరంలో తలకెంత ప్రాధాన్యమో తలలో ముక్కునకు అంత ప్రాధాన్యం ఉంది. అది చేసే పనివల్లనే కాదు, దాని ఆకారానికి ప్రాధాన్యం ఉంది, ఒకని ముక్కును బట్టి అతని ఆకారం చెబుతాం. (గ్రద్ద ముక్కున్నవాడు మొదలైన వ్యవహారంలో ఉన్నాయి).
వక్రమనగా వంకర. ఎవడైనా తప్పుపని చేస్తే వాటిని వక్రుడని అంటాం. అంటే వాడిది వక్రగుణం, ఋజుప్రవర్తన ఉన్నవాడికి తిన్నని గీతలా మనః ప్రవృత్తి ఉంటుంది. ఇట్టి దానిని సంస్కృతంలో ఆర్జవమంటారు. తిన్నగా అని అర్థం. ఋజు = ఆర్జవం.
ఇక వక్రతుండం అనినపుడు చెడ్డ అనే అర్థంలో వాడం. కేవలం వంకరనే. ఇతని తుండం, వంకరగా తిరిగియుండుటవల్ల ఇతడు వక్రతుండుడు.
మరొక చిత్రం. ఏనుగు, మొత్తం తుండాన్ని కదపకుండా దాని అగ్రభాగాన్ని వంచగలదు, అటూ ఇటూ సాధారణంగా ఎడమవైపునకు త్రిప్పుతుంది. ఎప్పుడైనా కుడివైపునకు కూడా.
ముత్తుస్వామి దీక్షితులు వక్రతుండ మహాకాయ అని స్వామిని కీర్తించారు. దాని అగ్రభాగాన్ని కుడివైపునకు త్రిప్పినపుడు (వలంపురి) అతడు ప్రణవ స్వరూపునిగా కనబడతాడని లోగడ చెప్పాను.
వెన్నను దొంగిలించే కృష్ణుణ్ణి భావిస్తే మనలో చారగుణం పోతుంది. అతని రాసలీలలను స్మరిస్తే మనలో కామం పోతుంది. అట్లాగే వక్రతుండుని స్మరిస్తే మనలో వక్రలక్షణాలు పోతాయి. గణపతి గాయత్రిలో వక్రతుండ పదమే ఉంది. ఈ మంత్రం యొక్క లక్ష్యం మనలను సన్మార్గంలో పెట్టుమనే.
No comments:
Post a Comment