ఇదే సమయంలో - హుండుడు అనే దానవుడి కూతురు ఇష్టసఖులతో కలిసి నందనవనంలో విహరిస్తూ చారణ దంపతుల సంభాషణ వింది. భూలోకంలో ఆయు మహారాజుకి విష్ణుతుల్య పరాక్రముడు పుత్రుడుగా జన్మించబోతున్నాడనీ అతడి చేతిలో హుండుడు మరణిస్తాడనీ అప్పుడు మన దేవలోకం మనకు స్వాధీనమవుతుందనీ అందాకా మనకు ఈ ఇడుములు తప్పవనీ చారణులు కలబోసుకుంటున్న కబుర్లను హుండ పుత్రిక విన్నది. పరుగుపరుగున వెళ్ళి తండ్రికి విన్నవించింది. అశోక సుందరి తనకిచ్చిన శాపాన్ని గుర్తుకు తెచ్చుకున్న హుండుడు తనకు పోగాలం దాపురించిందని గుర్తించి గడగడలాడాడు. ఇందుమతీ గర్భంలో ఎదుగుతున్న శిశువును ప్రసవానికి ముందే నాశనం చెయ్యాలని నిశ్చయించుకొని అదృశ్యరూపంలో ఇందుమతీ శయనాగారంలో ప్రవేశించాడు. అక్కడ దివ్య తేజోమయరూపాలు ఆమెకు కావలి ఉండటం గమనించాడు. ఆమె తేజస్సునీ వారి తేజస్సునీ తట్టుకోలేక ఇవతలకి వచ్చేశాడు. స్వప్నంలో ప్రవేశించి భీషణ రూపాలతో ఆమెను భయపెడితే గర్భస్రావం అవుతుందని ఆశించాడు. విష్ణు తేజో రక్షితను ఏ రకంగానూ భయపెట్టలేక ప్రసవం కాగానే పసిగుడ్డును తన్నుకుపోదామని ఆశగా ప్రతీక్షిస్తూ కూర్చున్నాడు.
ఒక సుముహూర్తాన స్వర్భాను తనయ ఇందుమతి మగబిడ్డను ప్రసవించింది. అతడి దివ్యతేజస్సుకి ఆశ్చర్యపోయిన ఇందుమతి ఇష్టసఖులు వీడు సూనుడు కాడు భానుడు అని తృళ్ళిపడ్డారు. సూతికాగృహం వెలుపల ఉన్న దాసదాసీ జనానికి ఈ శుభావార్త అందించడానికి వచ్చిన ఒక దాసీని ఆవహించి హుండుడు లోపలికి చొరబడ్డాడు. అనుకూల సమయంకోసం వేచివేచి ఒక అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న తరుణంలో కావలివారిని సమ్మోహపరచి హుండుడు ఆ శిశువును అపహరించుకుపోయాడు. తన రాజధాని కాంచనపురం చేరుకున్నాడు. భార్యను పిలిచాడు. ఈ శిశువు నా శత్రువు. వీణ్ని మన పాచకులకు ఇచ్చి వీడి మాంసం నాకు వండి వడ్డించమను - అన్నాడు. ఈ పసి గుడ్డేమిటి, నీకు శత్రువేమిటి, వీణ్ని చంపడమేమిటి, వండటమేమిటి, నువ్వు తినడమేమిటి - ఏమీ నాకు అర్ధం కావడం లేదని ఆ రాక్షసకాంత భర్తను నిలదీసి కారణం చెప్పమంది. అంతా వివరించాడు హుండుడు. కామోసనుకొని ఆమె సైరంధ్రి మేకలను పిలచి బిడ్డణ్ని చేతిలో పెట్టి ఆ పని అప్పగించింది. మేకల వెళ్ళి పాచకుడికి అప్పగించింది. వాడు కత్తితో బిడ్డను నరకపోతే కత్తి రెండు ముక్కలయ్యింది. బాలకుడు చిరునవ్వు చిందించాడు. మేకలకు విషయం అర్థమయ్యింది. ఈ శిశువు అసాధారణుడు. మనకు అవధ్యుడు, దివ్య లక్షణ సంపన్నుడు అంది. రాజలక్షణ సంపన్నుడైన ఈ పసిగుడ్డును భక్షించాలనుకుంటున్న మన నాయకుడు హుండుడు దానవాధముడు. ఈ శిశువును చంపడం ఎవరి తరమూ కాదు. కర్మ రక్షిస్తూంటే ఎవడు ఎవణ్ని ఏమి చేయగలడు? దేవుడైనా వచ్చి ప్రదక్షిణలు చేయవలసిందే. ఎన్ని ఆపదలైనా తప్పుకుంటాయి. బందిఖానాలైనా తెరుచుకుంటాయి. కాళ్ళూచేతులూ కట్టేసి నదిలోకి విసిరేసినా క్షేమంగా తిరిగి వస్తాడు.
No comments:
Post a Comment