Sunday, 8 December 2024

శ్రీ గరుడ పురాణము (324)

 


మహాభారతయుద్ధంలో అసురశక్తులు తొంబది శాతం నశించినా ఇంకను కొందరు దానవులు మిగిలిపోయారు. వారు శరవేగంతో అభివృద్ధి చెందడాన్ని గమనించి శ్రీమహా విష్ణువే బుద్ధుడై అవతరించి వారిని సమ్మోహితులను చేసి వారిలోని దానవత్వాన్ని రూపుమాపి ఉత్తమ మానవులనుగా తీర్చిదిద్దాడు.


అధర్మం ప్రస్తుతానికి అదుపులో వుంది. అది గాడి తప్పి విజృంభిస్తుంది. అపుడు శ్రీమహావిష్ణువు సంభల గ్రామంలో కల్కినామంతో అవతరిస్తాడు. అశ్వాన్నధిరోహించి జగమంతటా కలయదిరిగి ఎక్కడెక్కడి అధర్మపరులనూ వెదకి పట్టుకొని వధిస్తాడు.


రుద్రదేవా! అధర్మాన్ని అంతమొందించడానికీ, సత్త్వగుణ ప్రధాన దేవతల శక్తులను పెంచడానికీ, పుడమిపై పెచ్చరిల్లు అశాంతిని త్రుంచడానికి శ్రీమన్నారాయణుడేదో ఒక రూపంలో దిగి వస్తూనే ఉంటాడు. లోకుల ఆరోగ్య రక్షణ కోసం పాల సముద్రంలో అమృత భాండాన్ని పట్టుకొని ధన్వంతరిగా అవతరించిన ఆయనే విశ్వామిత్ర పుత్రుడైన సుశ్రుతుడను మహాత్మునికి ఆయుర్వేదాన్ని స్వయంగా ఉపదేశించాడు. (అధ్యాయం - 145)


ఆయుర్వేద ప్రకరణం


గరుడ పురాణంలోని ఆయుర్వేద ప్రకరణానికి గొప్ప ప్రసిద్ధి ఉంది. ఇందులోని మొదటి ఇరవై అధ్యాయాలలో నిదాన- స్థాన విషయాలు వర్ణింపబడ్డాయి రోగ కారణాలనూ లక్షణాలనూ బట్టి రోగనిర్ణయాన్ని చేయడాన్నే రోగ నిదానమంటారు. తరువాతి నలభై అధ్యాయాలలో రోగచికిత్స, ఔషధాలు - వాటి నిర్మాణ విధి చెప్పబడ్డాయి. అంతేగాక మందుకి తగిన అనుపానం, వాడవలసిన తీరు కూడా చేర్చబడ్డాయి. ఒకే రోగానికి అనేకములైన మందులు సూచించబడ్డాయి. కాని వీటిని సుయోగ్యుడైన వైద్యుని పర్యవేక్షణలోనే వాడాలి.


ఈ ప్రకరణంలో (పురాణంలో) అక్కడక్కడ గల ఖండితాలనూ, అస్పష్టతనూ ఆర్ష సంస్కృతికి చెందిన ఆయుర్వేద గ్రంథాలనాశ్రయించి సరిచేయడం జరిగింది.


రోగనిదానం


ధన్వంతరి సుశ్రుతునికి చెప్పిన శాస్త్రమిది.


ప్రాచీన కాలంలో ఆత్రేయాది మహామునులు రోగనిదానానికి సంబంధించి గొప్ప కృషి చేశారు. దానికి స్వయంకృషినీ ప్రతిభనూ జోడించి ధన్వంతరి ఇలా ఉపదేశించాడు.


"సుశ్రుతా! పాప, జ్వర, వ్యాధి, వికార, దుఃఖ, ఆమయ, యక్ష్మ, ఆతంక, గద, ఆబాధ - ఇవన్నీ పర్యాయవాచ్యములైన శబ్దములు.


రోగాన్ని తెలుసుకోవడానికి అయిదు ఉపాయాలుంటాయి. అవి నిదానం, పూర్వరూపం, రూపం, ఉపశయం, సంప్రాప్తి, నిమిత్తం, హేతువు, ఆయతనం, ప్రత్యయం, ఉత్థానం, కారణం - అనే వాటిని బట్టి రోగాన్ని పోల్చడమే రోగనిదానం. దోషవిశేషాలు తెలియకుండానే రోగాన్ని పోల్చగలిగితే దానిని పూర్వరూపమంటారు. ఇది సామాన్యమనీ, విశిష్టమనీ రెండు విధాలు. ఈ పూర్వరూపం పూర్తిగా వ్యక్తమైతే రూపం అనబడుతుంది. సంస్థాన, వ్యంజన, లింగ, లక్షణ, చిహ్న, ఆకృతి, ఇవి రూపానికి పర్యాయ వాచ్యములైన శబ్దాలు. హేతు-విపరీతం, వ్యాధి- విపరీతం, హేతు-వ్యాధి- ఉభయ- విపరీతం, హేతు విపరీతార్థకారి, వ్యాధి విపరీతార్థకారి, హేతు వ్యాధి ఉభయ విపరీత అర్థకారి ఔషధాలుంటాయి. ఇవి అన్న, విహారాలను సుఖదాయకంగా ఉపయోగపడేలా చేస్తాయి.


దీనిని సాత్మ్యమంటారు. ఉపశయమని కూడా అంటారు. దీనికి విపరీతం అనుపశయం. అనుపశయానికి మరోపేరు వ్యాధ్య సాత్మ్యము. దోషం శరీరంలో పైకి గాని ఇతర దిశల్లో గాని వ్యాపిస్తున్న పద్ధతి, దానివల్ల వచ్చేరోగం సంప్రాప్తి అనబడుతుంది. దానికి పర్యాయ పదాలు జాతి, ఆగతి.


సంప్రాప్తిలో సంఖ్య, వికల్పం, ప్రాధాన్యం, బలం, వ్యాధి కాల విశేషతలు ఆధారంగా విభిన్న విధాలు నిర్ణయింపబడివున్నాయి. ఈ శాస్త్రంలోనే జ్వరభేదాలు ఎనిమిది చెప్పబడ్డాయి. ఇది సంఖ్యాసంప్రాప్తి.


రోగోత్పత్తికి కారణభూతమైన దోషముల అంశాంశ కల్పన అంటే ఎక్కువ, తక్కువల వివేచన వికల్ప సంప్రాప్తి.

No comments:

Post a Comment