కఫ- ప్రకోపదానం: తీపిరసాలు, ఆమ్లాలు, లవణాలు, స్నిగ్ధ, గురు, అభిష్యంది, శీతల భోజనాల వల్లనూ, ఎక్కువకాలం కూర్చొనుట, నిద్రపోవుట, సుఖపడుట, అజీర్ణం, పగటినిద్ర, బలకారక పదార్థాలను అతిగా తినుట, కష్టపడకపోవుట మొదలగు కారణాల వల్ల అన్నం అరిగే ప్రారంభకాలంలోనూ, రాత్రి పగలు ప్రారంభ కాలాల్లోనూ కఫం ప్రకోపిస్తుంది. దీన్నే శ్లేష్మమని కూడా అంటారు.
త్రిదోష సామాన్య సంప్రాప్తి : ఈ మూడు ప్రకోపాల మిశ్రిత స్వభావంతో సన్నిపాతం పుట్టుకొస్తుంది. సంకీర్ణ భోజనం, అజీర్ణం కలిగించే భోజనం, విషమ, విరుద్ధ భోజనం (మొత్తం మీద వంటికి పడని తిండి) మద్యపానం, పచ్చిముల్లంగి, ఎండినకూరలు, గానుగపిండి, మృత్యువత్సరమని పేరుగాంచిన పేలపిండి, మాంసం, చేపలు ఇవన్నీ సన్నిపాతాన్ని తెచ్చే ఆహారాలే. దూషితాన్నమూ, గ్రహప్రభావమూ కూడా ఈ వికారాన్ని తెచ్చిపెడతాయి. ఇంకా చాలా చాలా కారణాలే వున్నాయి. రసవాహినుల ద్వారా శరీరం లోపలకి చేరుకొని రోగాలను కలిగించే పదార్థాలుకూడా ఉన్నాయి. (అధ్యాయం-146)
జ్వర నిదానం
జ్వరాలలో చాలా రకాలే వున్నాయి. కొన్నిటి పేర్లు ఇలా వుంటాయి. ఇవి శివుని కంటిమంట నుండి పుట్టినవని అంటారు. రోగపతి, పాప్మ, మృత్యురాజ, అశన, అంతక, ఓజోఽశన, మోహమయ, సంతాపాత్మ, సంతాప, అపచారజ జ్వరాలు ఎక్కువగా బాధిస్తాయి.
ఏనుగు కొచ్చే జ్వరాన్ని పాకలమనీ, గుఱ్ఱానికొచ్చేదాన్ని అభితాపమనీ, కుక్కకైతే అలర్కమనీ అంటారు. మేఘాలకీ, నీటికీ, మందులకీ, నేలకీ కూడా జ్వరాలొస్తాయి. వాటి పేర్లు క్రమంగా ఇంద్రమదం, నీలిక, జ్యోతి, ఊషర.
కఫజ్వర లక్షణాలు : గుండెగాబరా, వాంతి, దగ్గు, చలి, వాపు, కఫం ద్వారా వచ్చే జ్వరలక్షణాలు. తరువాత ఒళ్ళు నొప్పులు వుంటాయి. చికిత్స ఆలస్యమైనా సరైన మందు పడకపోయినా ఈ బాధలు రోజురోజుకీ పెరిగిపోతుంటాయి. ఏ సమయంలో ఏ లక్షణం ఎక్కువవుతోందో చూసి మందువెయ్యాలి. ఉపశయ (ఎక్కువ కావడం) అనుపశయ (కాకపోవడం) ములను బట్టి రోగాలే మారుతుంటాయి. అనగా మందు, విహారం, అన్నం, దేశకాలాదులలో మార్పు ఒక మనిషికి సుఖాన్ని కలిగిస్తే అది ఉపశయం. వీటిలో నేదైనా ఒక వ్యక్తి సుఖాన్ని హరిస్తే లేదా హాని కలిగిస్తే అది అనుపశయం.
అరుచి, అజీర్ణం, స్తంభనం, బద్దకం, గుండెలో మంట, విపాకం, నిద్ర వస్తున్నట్లుండడం, చొంగ కారడం, గుండె బరువెక్కడం, ఆకలి వేయకపోవడం, ముఖం బిరుసుగా తగలడం, ఒళ్ళు పాలిపోవడం, ఒళ్ళు బరువెక్కడం, మూత్రం మాటి మాటికీ రావడం, శరీరకాంతి తగ్గడం, ఇవన్నీ ఆమ (కఫంలో ఒక) జ్వర లక్షణాలు.
ఆకలి మందగించడం, ఒళ్ళు తేలిపోతున్నట్లుండడం, సామాన్య జ్వరలక్షణాలు. జ్వరంలో వాత, పిత్త, కఫ రోగాల మూడు లక్షణాలు కనిపిస్తే దానిని పరిపక్వ అష్టాహ మంటారు. రెండింటి లక్షణాలుంటే ద్వంద్వజమంటారు.
వాత- పిత్త- జ్వరలక్షణాలు: తలనొప్పి, మూర్ఛ, వాంతులు, ఒళ్ళు వేడెక్కడం, మోహం, గొంతు బలహీనంగా వుండడం, ముఖం డోక్కుపోవడం, అరుచి, ఒంట్లో ప్రతి భాగంలో విరగదీసినంత నొప్పి, అనిద్ర, చిత్తభ్రమ, రోమాంచం, చలి- ఇవన్నీ వాత, పిత్త జ్వరం తగిలిన శరీరంలో కనిపించే లక్షణాలు.
No comments:
Post a Comment