Wednesday, 18 December 2024

శ్రీ గరుడ పురాణము (329)

 



గ్రహదోష జ్వరంలో సన్నిపాత లక్షణాలు కనిపిస్తాయి. అదనంగా వాయుసమస్య, జీర్ణసమస్య ఉంటాయి. శాప, రక్త జ్వరాల్లో అన్ని బాధలూ భరించలేనంతగా వస్తూ పోతుంటాయి. మంత్రోచ్చాటన జరుగుతున్నపుడల్లా రోగులు ఎగిరెగిరిపడుతుంటారు. శరీరం పగుళ్ళు వేస్తుంటుంది. మత్తు ఆవహిస్తుంది. ప్రతిభాగం మండుతున్నట్లుగా వుంటుంది. మూర్ఛవస్తుంది. ఉష్ణోగ్రత రోజు రోజుకీ పెరిగిపోతుంటుంది. 


జ్వరాలలో ఎనిమిది రకాలుంటాయి. ముందుగా శారీరక, మానసిక విధాలుగా వాటిని విభజించారు. అలాగే మంద, తీవ్ర, ఆంతర, బాహ్య, ప్రాకృత, వైకృత, కుదిరేవి, కుదరనివి, పక్వాలు, అపక్వాలు. వీటిలో మొదటివి శారీరకం. రెండోవి మానసికం.


కఫ, వాత, మిశ్రిత రోగాలలో చలి, వణుకు వుంటాయి. పిత్తలోపం వుంటే ఒళ్ళంతా మంటలు పుడుతున్న బాధ వుంటుంది. మూడిటి సన్నిపాతమూ వుంటే ఒక మారు చలీ ఒకమారు వేడీ బాధిస్తాయి. (ఈ వేడినే ఉడుకు అంటారు) ఈ జ్వరం లోజ్వరమైతే (ఆంతరమైతే) అన్ని బాధలు లోపలే వుండి మలబద్దకం కూడా పుట్టుకొస్తుంది. బాహిర జ్వరానికి ప్రత్యేక లక్షణం విరేచనాలు. ఈ జ్వరాలను కుదర్చవచ్చును.


ప్రాకృత, వాత, వర్షాకాల జ్వరాన్నీ, వైకృత వర్షకాల జ్వరాన్నీ కుదుర్చుట దాదాపు అసాధ్యం.


* (మరో వర్గీకరణ ప్రకారమైతే శారీర- మానస, సౌమ్య - తీక్ష, అంతర్- బహిరాశ్రయ, ప్రాకృత- వైకృత, సాధ్య- అధ్యాయ, సామ- నిరామయ జ్వరాలు పైన చెప్పిన వాటికి అదనంగా కనిపిస్తాయి.)


ఆకురాలు కాలంలో పిత్తదోషంవల్ల వచ్చేది ప్రాకృత జ్వరం, వాత, కఫ దోషం వల్ల వచ్చేది వైకృతం. కాలంలో కఫదోష జ్వరాన్ని ప్రాకృతమనీ ఇతరాలని వైకృతమనీ అంటారు. వైకృతరోగాలేవీ కుదిరేరోగాలు కావు (జ్వరాలు మాత్రం) వాత దోషం వల్ల వానల కాలంలో వచ్చే జ్వరానికి పిత్త, కఫాలు కూడా లోనవుతాయి. ఆకురాలు కాలంలో పాడయిన పిత్తం కఫాన్ని కలుపుకొని జ్వరాన్నేర్పాటు చేస్తుంది. ఈ జ్వరాలకు లంఖణం మంచి నిరోధక మార్గమే. వసంతంలో వన్నె చెడిన కఫం వాతంతో కలిసి తెచ్చే జ్వరాలుంటాయి. పిత్త దోషం కూడా కలుస్తుంది. బలంగా వున్న మనుష్యులు జ్వరాన్ని మందులనే ఆయుధాలతో జయిస్తారు కానీ జన్మతః బలహీనులను జ్వరం బలిగొంటుంది.


మలబద్దకం వల్ల వచ్చేదీ, మూడు దోషాలు కలిపి వుండేదీ ఆమజ్వరం. జఠరాగ్ని మందం, అతిమూత్రం, జీర్ణమండల వ్యవస్థ మందగించడం (ఆకలి నశించడం) దీని లక్షణాలు.


పచ్యమాన జ్వరలక్షణాలు ఉష్ణోగ్రతతో సహా దాహం, వాగుడు, పలవరింతలు అన్నీ తక్కువ కాలంలోనే పెరిగిపోవడం, ఊపిరి తీవ్రంగా వేగవంతమవుతుంది. తల తిరుగుతుంది. నీళ్ళ విరేచనాలవుతాయి. నొప్పులుంటాయి. జీర్ణకోశాన్ని ఖాళీగా వుంచితే ఆమ వ్యర్థాలు పోతాయి కాబట్టి ఈ జ్వరానికి వారం రోజుల ఉపవాసాన్ని (లంఖణాలని) గట్టిగా సూచించవచ్చును. జఠర రసాల్లో లోపాలను బట్టి అయిదు రకాల జ్వరాలను పోల్చవచ్చును.


సంతత, సతత, అన్యెద్యు, త్రిత్యక, చతుర్థక సప్తధాతువులలోనూ, మలమూత్ర కోశాలలోనూ, నాళాలలోనూ పేరుకుపోయిన జ్వరం ఏడు, పది లేదా పన్నెండు రోజుల్లో వాత, పిత్త, కఫ దోషాలతో బాటు తగ్గించబడవచ్చు. తగ్గుతుంది కూడా. తగ్గకపోతే మాత్రం ప్రాణాపాయమే. ఇలా అగ్నివేశుడన్నాడు. పదునాల్గు, తొమ్మిది, పదకొండు రోజులని హారితుడన్నాడు.


శుభ్రత, పరిశుభ్రత, అశుభ్రతల ప్రభావం కూడా దోషనివారణకు పట్టే కాలంపై ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఒళ్ళు బరువుకూడా. దోషం పూర్తిగా మందులు, ఆహారపు మార్పుల వల్ల, నశించాకనే జ్వరం కూడా తగ్గిపోతుంది. జ్వరం తగ్గుతున్న కొద్దీ బాధితుల మలమూత్ర విసర్జన ప్రక్రియలు మెరుగు పడుతుంటాయి. అలాగే ముఖంలో తేటదనం, మెరుపు, శరీరంలో చురుకుదనం కూడా పెరుగుతుంటాయి.

No comments:

Post a Comment