Saturday, 28 December 2024

శ్రీ గరుడ పురాణము (335)

 



* హిక్కా (హిక్కా అంటే వెక్కిళ్ళు) ముందుగా 'గాలి అరటి' (ఊపిరాడక గట్టిగా ప్రయత్నించి నీరసం తెచ్చుకోవడం) తో సోకుతుంది. ఇందులో భక్ష్మోద్భవ, క్షుద్ర, యమలా, మహతీ, గంభీరా అనే రకాలున్నాయి. మొదటి రకం తొందర తొందరగా గట్టి, ఘాటు పదార్ధాలను ముందూ వెనకా చూసుకోకుండా మేసెయ్యడం వల్ల వస్తుంది. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి వాతం ఆందోళితంగా వున్నపుడు నోట్లోకి త్రోయబడే గట్టి తిండి ద్రవాలు దీనికి ఉత్పాదకాలు, వాయువు రెచ్చగొట్టబడగానే చిన్నచిన్న ధ్వనులు వస్తాయి. రోగి ఏ కాస్త కష్టించినా వాతం ప్రకోపించి క్షుద్ర హిక్కా వస్తుంది. బోరయెముక నుండి పుట్టే ఈ రోగంలో కొన్నాళ్ళు దాకా వ్యాప్తి, తీవ్రతా వుండవు. తరువాతి రకమైన యమలా జంటలలో కనిపిస్తుంది. అది కూడా తీవ్రంగా వుండదు. అయితే ఈ దశలో ముఖం వణుకుతుంటుంది. తల, మెడ తిరుగుతుంటాయి. ఇది ముదిరితే తెలివిలేని వాగుడు, వాంతులు, విరేచనాలు, కనుగ్రుడ్లు తిరుగుట, కళ్ళు తేలవేయుట, ఆవులింతలు ఇవన్నీ గోచరిస్తాయి. ఇవన్నీ ఎక్కువ కాలం పాటు వుంటే రోగం ముదురుతోందని గ్రహించాలి.


మహతీ వెక్కిళ్ళలో అన్నీ తీవ్రంగానే ఉంటాయి. కనుబొమ్మలు క్రిందికి జారిపోతాయి. కణతలు లోతుకిపోతాయి, కళ్ళు చెవులకి దగ్గరగా జరుగుతుంటాయి. ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోతుంది. మాటలో స్పష్టత పోతుంది. జ్ఞాపకశక్తి నశిస్తుంది. తెలివి తప్పిపోతుంది. సంధులన్నీ విడిపోతాయి. వెన్నెముక వంగిపోతుంది.


గంభీర అంటేనే తీవ్రత. ఇది నడుము, నాభిలలో మొదలవుతుంది. తీవ్రమైన నొప్పి, పెద్ద ధ్వనులు, పరమహింస, మిక్కిలి బలం (అంటే మందుకి లొంగకపోవడం) దీని లక్షణాలు. పెద్ద పెద్ద ఆవులింతలూ, అంగాల కుదుపూ వుంటాయి. జాగ్రత్తగా, ఓపిగ్గా చికిత్స చేస్తే దీన్ని రూపుమాపవచ్చు, హిక్కా, క్షయలు ప్రాణాంతకాలు, ఇతర (ఈ అధ్యాయంలో వున్న) రోగాలు కూడా బలహీనుల, త్రాగుబోతుల, అతి తిండిపోతుల, వృద్ధుల, అతి నీరస జీవుల, మలబద్ధక రోగుల విషయంలో ఒక రోజు నిర్లక్ష్యం చేసినా ప్రాణాంతకాలవుతాయి.


రాజయక్ష్మ, క్షయ రోగాలలో తొలి జబ్బు పాతరోజుల్లో నక్షత్రాలకీ, చంద్రునికీ, రాజులకీ, బ్రాహ్మణులకీ ఎక్కువగా సోకేది కాబట్టి దానికాపేరు పెట్టబడింది. దీనికే క్షయ అనీ రోగరాట్ అనీ శోష అనీ కూడా పేర్లున్నాయి. దీనికి కారణాలు 1) సాహసం అనగా తెగింపు, అతి వ్యాయామం, అతి బలం 2) వేగ సంరోధం అనగా మలమూత్రాలను బలవంతంగా అణచిపెట్టుట 3) శుభ్రజ స్నేహ సంక్షయం అంటే వీర్యాన్ని, శక్తినీ, బలాన్నీ వృథా చేయడం 4) అన్నపాన విధి త్యాగం అనగా ఒక నియమమూ, అదుపూ లేకుండా తినడం, త్రాగడం.


పైన చెప్పిన కారణాల వల్ల వాతం ప్రకోపిస్తుంది. పిత్తం చెదరిపోతుంది. అనవసరాలూ హానికరాలునైన పదార్థాలు గడ్డకట్టిపోయి కఫం ఉద్రేకానికి లోనై అది నాళాలలో పేరుకుపోతుంది. సంధులలో చేరుతుంది. కాలువలను అడ్డుతుంది. అపుడు ఈ రోగం కవాటాలను మూసిగాని, వాచేలా చేసి గాని నరాలను చెడగొడుతుంది. అప్పుడు గుండె దానిప్రక్క క్రింది భాగాల్లో తీవ్రమైన నొప్పి పుడుతుంది.


ఈ రోగ లక్షణాలు (వచ్చిందని సంకేతాలు) పడిశం, ఉష్ణోగ్రత పెరుగుదల, చొంగ కారుట, నోటిలో తీపి రుచి, శరీరం నున్నబడుట, తిండి సహించకపోవుట, నడవాలనే తీవ్రవాంఛ, తినాలనే గట్టి కోరిక, ఆ రెండూ చేయలేకపోవడం, స్వచ్ఛతలో అతివ్యగ్రత, ఎంత శుభ్రంగా వున్నదైనా అపరిశుభ్రంగా వుందని అరవడం, తన భోజనపాత్రలో తాగే వాటిలో లేని ఈగలను, తలవెంట్రుకలను గడ్డి పరకలను ఉన్నాయని అనుమానించి ఏరుతుండడం, వెక్కుళ్ళు, అశాంతి, వాంతులు, ఎంత రుచికరమైనవి పెట్టినాబాగు లేవనడం.


ఈ రోగిలో కొన్ని సందర్భాల్లో శరీరమంతటా కనులతో సహా తెల్లటి మెరుపు రంగు వచ్చి చేరుతుంది. నాలుక, బాహువు తీవ్రంగా నొప్పెడతాయి. స్త్రీ సుఖం కావాలని పిస్తుంది. మద్యమాంసాలూ కావాలనిపిస్తుంది. తీరా వాటిని చూస్తే చిరాకు కలుగుతుంది. విచిత్రమైన కలలు వస్తుంటాయి. నిర్మానుష్యగ్రామాలూ, ఎండిన చెరువులు, దొరువులు, చాలా కాంతివంతమైన తోకచుక్కలు, చెట్లతో సహా తగలబడిపోతున్న అడవులు, తనపైకి ఉరుకుతున్న ఊసరవెల్లులు, పాములు, కోతులు, పక్షులు- ఇలాటివన్నీ కలలోకి వస్తుంటాయి.

No comments:

Post a Comment