Tuesday, 17 December 2024

శ్రీ గరుడ పురాణము (328)

 


రోగి నోటినుండి రక్త పిత్త మిశ్రితమైన ఉమ్మి పడుతుంటుంది. తట్టుకోలేనంత దాహం వేస్తుంటుంది. కోష్ట (పొట్ట) ప్రదేశాలన్నీ నల్లగా ఎఱ్ఱగా అయిపోతాయి. గుండ్రటి దద్దుర్లు పొట్టపై ఏర్పడతాయి. గుండెలో బాధ కలుగుతుంది. అన్ని ద్వారాల నుండీ అత్యధికం గానో, అత్యల్పంగానో విసర్జనాలు వస్తుంటాయి. ముఖంలో జిడ్డు, నీరసం, హీనస్వరం, తేజస్సు మందగించడం, ప్రలాపం పుట్టుకొస్తాయి. ఈ జ్వరం బయటపడకుండా లోపల్లోపలే శరీరంలో పెరుగుతుంటుంది. గొంతునుండి గురక, కంఠం నుండి అవ్యక్త శబ్దాలు, శరీరాన్ని కదపాలనే కోరిక నశించడం అనే లక్షణాలు కనిపిస్తే రోగవ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరిపోయిందని అర్థం. దానిని బలవీర్య - వినాశక అభిన్యాస సన్నిపాత జ్వరంగా వ్యవహరిస్తారు.


ఈ సన్నిపాత జ్వరం యొక్క వాయు వికారం వల్ల గొంతులో అడ్డు ఏర్పడి పిత్తం లోపలి భాగంలో నొప్పి పుట్టుకొచ్చి నాసికాదులు కారుతుంటాయి. కళ్ళు పచ్చబడతాయి. మూడు రకాల జ్వరమూ ఒకేసారి తగిలినపుడు శరీరంలోని అగ్నితత్త్వం నశించిపోవడం మొదలౌతుంది. అది పూర్తిగా నశిస్తే మాత్రం రోగం మానడం అసాధ్యం.


ఈ సన్నిపాత జ్వరానికి మరోరూపం కూడా ఉంటుంది. పిత్తం వేరైపోయినట్లుంటుంది. పొట్టలో మంట పుడుతుంది. జ్వరం రాకముందే ఒక విధమైన గాబరా వుంటుంది. వాత - పిత్త ప్రవృత్తులు శరీరంలో పెరుగుతుంటే ఈ జ్వరం కమ్ముతుంది. చలీ, వేడీ రెండూ వుంటాయి. వాటి నుండి రక్షింపబడడం మిక్కిలి కష్టం. శీత ప్రభావం వల్ల నోటినుండి కఫం వస్తుంటుంది. నోరు ఎండిపోతుంది. పిత్తం పనితగ్గడం వల్ల మూర్ఛ, మదం, దాహం ఏర్పడతాయి. బద్దకం, కదలలేనితనం వచ్చి పుల్లవాంతులవుతాయి.


ఆగంతు జ్వరలక్షణాలు: బాహిర కారణాల ద్వారా తగిలే ఈ తాత్కాలిక జ్వరం దెబ్బ తగలడం వల్ల కానీ, సంయోగం వల్ల కానీ, శాపం లేదా రక్తం తగలడం వల్ల గానీ చిల్లంగి దిష్టి వంటి ప్రయోగాల వల్ల గానీ వచ్చే జ్వరాన్ని ఆగంతు జ్వరం అంటారు. వీటిలో మొదటిది అభిఘాతజం అనబడుతుంది.


కాలిన గాయాల వల్ల గాని ఒళ్ళు చురికిపోవడం వల్ల గానీ వచ్చేది అభిఘాతజ జ్వరం. అత్యధిక శ్రమ వల్ల వచ్చే జ్వరంలో వాతం రక్తాన్ని పాడుచేస్తుంది. చర్మం పేలిపోయినట్లవుతుంది. ఒళ్ళు నొప్పులు వాపులు వుండి ఉష్ణత పెరుగుతుంది.


దుష్ట గ్రహపీడ, మత్తు పదార్థాలు, విషాలు, కోపం, భయం, దుఃఖం, ప్రేమ కూడా జ్వరాన్ని కలిగిస్తాయి. ఇది సామాన్య జ్వరంలాగే వుంటుంది కానీ తెరలు తెరలుగా వచ్చే నవ్వూ, ఏడుపూ దీని ఉదృతిని తెలియజేస్తాయి. మత్తుమందులనీ, పొగనీపీల్చడం వల్ల వచ్చే జ్వరానికి స్పృహతప్పుట. తలనొప్పి, వాంతులు, తుమ్ములు లక్షణాలు, విషం వల్ల వచ్చే జ్వరంలో తెలివి తప్పుట, విరేచనాలు, కనులు చీకట్లు కమ్ముట, చర్మం రంగు మారుట, మంట, తలతిరుగుట, కనిపిస్తాయి. కోపం వల్ల వచ్చే జ్వరంలో ప్రత్యేకంగా వణుకు, దడ, తలనొప్పి పుట్టుకొస్తాయి. క్రోధ జ్వరంలో లేదా భయ జ్వరంలోనైతే ఆగకుండా వెలువడే వాగుడు ప్రత్యేక లక్షణం. ప్రేమ, కామం వల్ల జ్వరం వచ్చినపుడు మత్తుగా వుంటుంది. ఏం తిన్నా రుచి తెలియదు, ఒళ్ళంతా మండుతున్నట్లుంటుంది. సిగ్గుగా వుంటుంది, నిద్రపట్టదు, బుఱ్ఱ సరిగా పనిచేయదు, ధైర్యం పోతుంది.

No comments:

Post a Comment