Wednesday, 11 December 2024

శ్రీ గరుడ పురాణము (327)

 


కఫ-వాత జనిత జ్వరానికి ఉష్ణోగ్రత పెద్దగా వుండదు. తలనొప్పి, అరుచి(అంటే నాలుకకి ఏదైనా చేదుగా గానీ రుచి హీనంగా గాని తగలడం) సంధులలో నొప్పి, మాటి మాటికీ ఉమ్మి రావడం, ఊపిరి భారం కావడం, దగ్గు, ముఖం పాలిపోవటం, చలి, పగటిపూట కూడా కనులు చీకట్లు కమ్మడం, నిద్రపట్టకపోవడం ఇవన్నీ వుంటాయి.


బయట వేడిగా వున్నా చలివేస్తున్నట్లు అనిపించడం, ఒళ్ళు కొయ్యబారి నట్లుండడం, చెమట, దాహం, మంట, దగ్గు, శ్లేష్మ పిత్తాల జోరు, మూర్ఛ, అనాసక్తి, బద్దకం, నోరు చేదుగా అనిపించడం, ఇవన్నీ శ్లేష్మ పిత్త జన్యమైన జ్వరాన్ని సూచిస్తాయి.


వాత- పిత్త- శ్లేష్మ అన్ని లక్షణాలూ కనిపిస్తే సర్వజ (సన్నిపాత) జ్వరంగా భావించాలి. దానికైతే ఈ లక్షణాలన్నీ ఒక్కొక్క మారు ఒక్కొక్కటిగా బయల్పడుతుంటాయి. సన్నిపాతంలో చలి, పగటి మహానిద్ర, రాత్రి నిద్రలేమి గాని దినరాత్రులు మొత్తంగా నిద్ర గాని వుంటాయి. ఆ నిద్రలేమి సమయంలో రోగి పాటలు పాడతాడు. నాట్యం చేస్తాడు. లేదా హాస్యాలాడతాడు. అతని సామాన్య స్థితి పోలిక లేనంతగా మారిపోతుంది. కనులు మలినమవుతాయి. అశ్రువులను వర్షిస్తాయి. కనుల చివరలు ఎఱ్ఱబడతాయి. పూర్తిగా మూతబడవు. శరీరంలో పిక్కలు, పక్కలు, తల సంధులతో సహా ప్రతి ఎముకా నొప్పెడుతుంది. చిత్త భ్రమ కూడా ఉంటుంది. రెండు చెవుల నుండీ శబ్దాలు, హోరు వస్తుంటాయి. పోటు కూడా వుంటుంది. నాలిక కొంత ఎఱ్ఱగా, కొంత నల్లగా వుండి దురదేస్తుంటుంది. తడి ఆరిపోతూ పొడిగా వుంటుంది. ఎముకలు, సంధులు సడలిపోయినట్లుగా వుంటాయి. 

No comments:

Post a Comment