ఈ అయిదు రకాల చతుర్దక విపర్యయ జ్వరాలనూ వాటి దశలు పెరిగేకొద్దీ తగ్గించడం కష్టమవుతూ వుంటుంది. ప్రలేపక రకానికి చెందిన జ్వరానికి లక్షణాలు స్పృహ తప్పుట, పలవరింతలు, చలి, వేడి తగ్గిపోవడం, అంగాలన్నీ బరువెక్కడం, శరీర మంతటా కఫం ఒక పొరలాగా ఏర్పడినట్లు భయం కలగడం.
అంగ బలాశక (అంగాలబలాన్ని తినివేయు) జ్వరంలో ఉష్ణోగ్రత పడిపోవడం, ఒళ్ళంతా గరుకుగా కొయ్యబారినట్టుండడం, నడక కష్టం కావడం, అంగాలు తిమ్మిరెక్కడం, నిరంతరం కఫం బయటికి వస్తుండడం జరుగుతాయి. ఈ సమయంలో శరీరం నుండి స్రవించే ద్రవం చింతపండు ముక్కల రంగులో వుంటే దానిని హారిద్రక జ్వరమంటారు. ఈ పసుపు పచ్చ జ్వరం ప్రాణాంతకమే.
రాత్రిజ్వర లేదా పౌర్వరాత్రిక జ్వరంలో మూడు రకాల దోషాలుంటాయి. రోగి బలహీనుడైపోతాడు. ఇది రాత్రి మాత్రమే కాస్తుంటుంది. పగటివేళ ఇది కనబడకనే పోవడానికి కారణం కఫంలో తేమపోగా వాతం పొడిగా అయిపోవడం. కఫమూ, పిత్తమూ రోగి మొండెంలో చెడినపుడు శరీరంలో పైభాగాలన్ని వెచ్చగా, వేడిగా తగులుతుండగా బొడ్డు కింద అన్ని భాగాలూ మంచు ముద్దల్లా తగుల్తాయి.
శరీర ద్రవాల్లో రసాల్లో, రక్తనాళాల్లో వున్న జ్వరాన్ని చికిత్స ద్వారా తరిమేయవచ్చును. కొవ్వులో మాంసంలో చేరిన జ్వరాన్ని మాన్పవచ్చు. ఎముకల్లో మూలుగలో దూరిన జ్వరం తగ్గదు. (అస్థిగతరోగం) ఇందులో అపస్మారకం, కోపదారి తనం ప్రధాన లక్షణాలు.
జ్వరం తగ్గినట్లు ఎలా తెలుస్తుందంటే రోగికి శరీరం తేలికైనట్లుంటుంది. అలసట తీరుతుంది. ఉష్ణోగ్రత వుండదు. కనులు తేటగా వుంటాయి. చిన్న చిన్న చెమరింపులుండి వెంటనే ఆరిపోతుంటాయి. నోరు ఎగుడు దిగుడుగా వున్నట్లనిపిస్తుంది. ఏదైనా తినాలని పిస్తుంది. మనసు ప్రశాంతంగా వుంటుంది. తుమ్ములు వస్తాయి. తుమ్మినపుడల్లా హాయిగా వుంటుంది. బుఱ్ఱ గోక్కోవాలనిపిస్తుంటుంది.
(అధ్యాయం -147)
No comments:
Post a Comment