Monday, 23 December 2024

శ్రీ గరుడ పురాణము (332)

 


రక్త, పిత్త, కాస, శ్వాస, హిక్కా, రాజయక్ష్మ రోగ నిదానాలు


రక్తపిత్త రోగంలో పిత్తం రక్తాన్ని కలుషితం చేస్తుంది. పిత్తం ఆందోళన చెందడానికి ప్రధానకారణం విపరీతమైన, బలమైన తిండి (ఉదా॥ కోద్రవ, ఉద్దాలకాది ధాన్యాలు) మిక్కిలి వేడి, పుల్లని, కారపు, ఘాటైన ఇతర చిక్కటి వాసనలు, రుచులుగల పదార్థాలను తినుట వల్ల పిత్తం పాడవుతుంది. ఈ రోగంలో శరీరం నుండి బయటికి వచ్చే ద్రవాలూ, రసాలూ ఎఱ్ఱగా రక్తపు వాసననే కలిగియుండడం వల్ల ఈ రోగానికి ఆయుర్వేదంలో రక్త పిత్త రోగమని పేరు పెట్టబడింది. ఈ ద్రవాలూ, రసాలూ, రక్త నాళాల్లోంచి, కాలేయం నుండీ, క్లోమం ద్వారాను స్రవిస్తాయి.


ఈ జ్వరం చేసే రక్త స్రావక దురాక్రమణ, చాలా లక్షణాల ద్వారా సూచించబడుతుంది. తల బరువు, ఆకలి లేకపోవడం, చల్లని వస్తువులు తినాలనిపించడం, దృష్టి పొగలు గ్రమ్మడం, పుల్లవాసనలతో వాంతులు, అసహ్యత, వెక్కుళ్ళు, ఊపిరందకపోవడం, తల తిరగడం, గ్లాని, ఎఱ్ఱరంగుని భరించ లేకపోవటం, జ్వరం తగ్గినపుడల్లా, నోటిలోంచి చేపల వాసన రావడం, కనులలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ ఛాయలు ఏర్పడడం, బయట కనిపించే రంగులలో తేడా తెలియకపోవడం, పిచ్చెక్కిపోయినట్లు కలలు రావడం ఈ లక్షణాలు.


తారుమారైన, కలుషితమైన రక్తం శరీరంపైకి ప్రవహించినపుడు ముక్కు, కన్ను, నోరు, చెవుల ద్వారానూ, క్రిందికి వచ్చినపుడు లింగ, యోని, గుదాల ద్వారానూ బయటికి వస్తుంది. శరీరమంతటా వున్న రోమకూపాల నుండి కూడా చిమ్ముతుంది.


ఈ రోగ చికిత్సలో రక్తాన్ని నిరోధించడం కంటే ప్రక్షాళన చేయడమే మంచిది. కఫం ఉన్నచోట ప్రక్షాళన చికిత్స ద్వారా మొత్తం శరీరమంతా స్వచ్ఛమై పోతుంది. వగరైన తియ్యనైన ఓషధుల ద్వారా కఫమును ఉత్పత్తి చేయవచ్చును. పులుపు, ఘాటు, వగరు గల మందులలో కఫాన్ని ఉత్పత్తి చేసే వాటిని కూడ వాడవచ్చును. రక్తస్రావం శరీరపు క్రింది భాగాలలో వుంటే రోగి పరిస్థితి ప్రమాదకరంగా వుంటే మంగకాయను వాడాలి. ముందు కొంచెంగా పిత్త పీడక ఔషధాన్ని కూడా వాడితే రోగికి బలం చేకూరుతుంది. అటువంటి రోగికి వగరుగా, తియ్యగా వుండే పదార్థాలను తినిపించడం అవసరం. అయితే పాడైపోయిన పిత్తంతో బాటు వాత, కఫ దోషాలు కూడా కలిసి వున్న రోగిని కాపాడడం అసాధ్యం. ఊర్ధ్వకాయంలో అత్యధిక రక్తస్రావం కలిగిన వారిని ప్రక్షాళించినా ప్రయోజన ముండదు. అసలు ప్రక్షాళనే జరుగదు.


రక్త పిత్త రోగుల్లో ప్రతిలోమ (పైకి) రక్తస్రావమున్న వారికి మంగకాయ (నక్స్వా మికా), ప్రక్షాళన మాత్రమే చికిత్స మార్గములు. అన్ని శారీరక ద్రవాలూ పాడయినపుడు మంగకాయ చికిత్స ఒక్కటే అనుసరింపబడాలి. సాధారణంగా ఈ రోగులకు తొలిరోజు నుండే తీవ్రస్థాయికి చెందిన బాధలు బయటపడుతుంటాయి. కాబట్టి రోగం కచ్చితంగా కుదురుతుందని మాత్రం చెప్పలేము.


కాస (దగ్గు) లోపల్లోపల వేగంగా వ్యాపించే రోగానికి సంకేతం. ఇది వాత, పిత్త, కఫ దోషాలతో బాటు శరీరంలోపల చేయబడిన గాయాల వల్ల లోనికి పోయిన ద్రవ్యాలవల్ల కూడా సోకుతుంది. వాత దోషం వల్ల తీవ్రంగానూ క్రమంగా ఇతరాలలో కాస్త తక్కువ గానూ దగ్గు కనిపిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే శరీరం పూర్తిగా వేగంగా పాడవుతుంది. ఈ రోగం సోకిందనడానికి గొంతు దురద, మంట, అన్నద్వేషం సంకేతాలు.

No comments:

Post a Comment