Thursday, 19 December 2024

శ్రీ గరుడ పురాణము (330)

 


శరీరగత ద్రవాల విషమత సాధారణంగా సతత జ్వరానికి కారణమవుతుంది. ఇది మొదట్లో వచ్చిపోతుంటుంది. పోయింది కదాని ఆలసిస్తే పీకపట్టుకుంది. రాత్రిళ్ళు ఎక్కువగా బాధపెడుతుంది. అన్యెద్యు జ్వరం సంధ్య (పగటికీ, రాత్రికీ మధ్య) లో ఎక్కువ ఉగ్రమవుతుంది. ఇందుల మాంస పుష్టిగల శారీరక ప్రదేశాలు ప్రభావితమవుతాయి. తలనొప్పి ఎక్కువగా వుంటే ఇది పిత్తవాత దోషమనీ (త్రిక) వెన్నునొప్పిగా వుంటే అది కఫ, పిత్త, దోష జనితమనీ గ్రహించాలి. వాత, కఫ దోష జనితమైన జ్వరంలో వీపంతా నొప్పెడుతుంది. ఈ జ్వరం ఒకరోజు మధ్యలో పూర్తిగా ఆగిపోతుంది. మరల ఒకరోజు తరువాత మొదలవుతుంది.


చతుర్థక జ్వరానికి కొవ్వు, మూలుగ, ఎముకలు గురవుతాయి. మూలుగకు మాత్రమే అంటే దోషం రోజులో రెండు మార్లు విజృంభిస్తుంది. కఫ దోషముంటే మోకాళ్ళు నొప్పెడుతాయి. తొడనొప్పి వుంటుంది. వాత దోషముంటే తల నొప్పి కూడా వుంటుంది. ఈ చతుర్దక విపర్యయజ్వరం సరైన మందుపడితే నాలుగవ రోజు కల్లా తగ్గుముఖం పడుతుంది. ద్రవాలు ఊరడంలో తేడా గలవారు వారం పాటు లంఖణాలు చెయ్యాలి. అయితే ఈ జ్వరదోషాలు మెదడులోనికి ప్రవేశిస్తే మాత్రం దానిని ఆపడం అసాధ్యం.


జ్వరం దోషప్రవేశానికి సంకేతం - రోగం శరీర ద్రవాలతో కలిసి నెమ్మదిగా ప్రవహిస్తూ రక్తనాళాలను కలుషితం చేసి వ్యాపిస్తుంది. మందు ప్రవేశించని మనిషి బలహీనుడవుతున్న కొద్దీ రోగం తీవ్రతరమై విషపు స్థాయిని చేరుకొంటుంది. కాబట్టి జ్వరం కనబడినా 'అదే పోతుందిలే' అనుకొని ఒక లంఖణం చేసేసి ఊరుకోకూడదు.


విషమ, సతత జ్వరాలు దేహ రసాలలోకి ప్రవేశించి ఆగగానే కొన్ని లక్షణాలు బయటపడతాయి. అవి సముద్ర ప్రయాణం తొలిసారి చేసే వారికి వచ్చే రుగ్మతలను పోలివుంటాయి. తరువాత ఒళ్ళు బరువు, నిస్త్రాణ, కాలుసేతులను పొడుస్తున్నట్టుగా నొప్పులు, ఆవులింతలు, అరుచి, వాంతి వస్తున్నట్లుండడం, శ్వాసలో శ్రమ. జ్వరం రక్తంలో చేరితే మరిన్ని లక్షణాలు బయటపడతాయి. అవి ఉమ్మితే రక్తం పడడం, తీవ్ర పిపాస, చర్మంపై వేడి పగుళ్ళు, ఎఱ్ఱమచ్చలు, మంట, తల తిరుగుడు, మత్తు, అతి పలవరింతలు.


జ్వరం మాంసంలోనే వుంటే దాహం, అలసట, అపనమ్మకం, లోపలంతా మండు తున్నట్టుండడం, కళ్ళు తిరగడం, చీకట్లు కమ్మడం, దుర్వాసన, అంగాలలో వణకు కనిపిస్తాయి. జ్వరం కొవ్వులోనికి చేరినపుడు చెమట, అతిపిపాస, వాంతులు, పుల్లవాసన, చిరాకు వుంటాయి. ఇక జ్వరము ఎముకలలోనికి దూరినపుడు కనిపించే లక్షణాలు తెలివితప్పడం, పలవరింతలు, అలసట, అరుచి, ఆకలి బాగా మందగించుట, ఎముకలలో నొప్పి, జ్వరం వీర్యంలోనికి ప్రవేశిస్తే చీకట్లు కమ్ముతాయి. సంధులు వీడిపోతున్న ట్లవుతాయి. లింగం మొద్దుబారిపోతుంది. వీర్యం కారితే మరణమే సంభవిస్తుంది. 


*రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర అనేవి సప్తధాతువులు

No comments:

Post a Comment