Tuesday, 24 December 2024

శ్రీ గరుడ పురాణము (333)

 


వాతదోషం వల్ల వచ్చే దగ్గు రుగ్మతలో గొంతు నోరులు బీటలు వేసినట్లవుతాయి. చెవి పొరలు పొడిదేరిపోతాయి. శరీరం లోపల వుండే వాయువులు పైకెగసి ఛాతీలోకి దూసుకుపోయి కంఠనాళమును ఒత్తుతుంటాయి. అన్ని అంగాలలోకి ఆ వాయువు దూరడంతో ఒళ్ళంతా బూరటిల్లినట్టుంటుంది. కనుగ్రుడ్డు పైకి ఉబికి వచ్చినట్లుంటాయి. గొంతులోంచి ఇనుప రేకులను విరిచిన ధ్వని వస్తుంది. ఛాతీ, పక్కలు, తల, తొడలు నొప్పెడతాయి. ఉద్రేకము, మూర్ఛ వస్తాయి. రోగి మాట్లాడలేక పోతుంటాడు. పొడిదగ్గు బాధిస్తుంది. దగ్గినపుడు శరీరమంతా విపరీతంగా నొప్పి పుడుతుంది. ఆ దగ్గు ధ్వని పెద్దదిగా వుంటుంది. ఒళ్ళంతా గగుర్పాటులకు లోనవుతుంది. అతి కష్టం మీద ఎంతో కొంత పొడి కఫాన్ని ఉమ్మితే కాస్త తేలికగా అనిపిస్తుంది.


పిత్త ద్రవ ప్రకోపం వల్ల వచ్చే దగ్గుకి ఈ లక్షణాలుంటాయి. కళ్ళు పచ్చబడతాయి. నోరు చేదుగా వుంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. తల తిప్పుతుంది. వాంతిలో రక్తం పడుతుంది. దాహం వుంటుంది, గొంతు పెగలదు. చూపు మబ్బేసినట్లుంటుంది, మత్తు ఆవరిస్తుంది, దగ్గినపుడు గొంతుపై అగ్నివృత్తాలు కనిపించి, పోతుంటాయి. కఫదోషం వల్ల వచ్చే ఛాతినొప్పి, తలనొప్పి, తిమ్మిరి, గుండె బరువు వుంటాయి. గొంతునిరంతరం కఫం ముద్దలతో గరగరమంటూనే వుంటుంది. ముక్కు దిబ్బడ, వాంతి వస్తున్నట్లుండడం, తిండి అంటే చిరాకు, ఒళ్ళు గగుర్పాటు కలుగుతాయి.


పోరాటాలలో వ్యాయామాలలో అజాగ్రత్తగా, శక్తికి మించి పాల్గొంటే ఛాతి లోపలి భాగంలో గాయాలై వాత, పిత్త,కఫాలు మూడూ ప్రకోపిస్తాయి. కఫం రక్తంతో కలసి ముడులు కడుతుంది. అది పసుపు పచ్చ లేదా మలిన రంగులో వుంటుంది. రోగి దగ్గుతూ కఫాన్ని ఉమ్ముతున్నపుడు ఛాతీ విరిగిపోతుందేమో అన్నంత బాధ కలుగుతుంది. శరీరమంతా సూదులతో పొడుస్తున్నట్లుంటుంది. తరువాత బల్లెంతో పొడుస్తున్నట్లుంటుంది. మోచేతుల, మోకాళ్ళ (సంధుల) నొప్పులు, జ్వరపు వేడితో బాటు పెరుగుతుంటాయి. దాహం, ఊపిరాడక ఆయాసపడుతుండడం, గొంతు క్షీణించడం, వణుకు, పావురం వలె గుడగుడ ధ్వనులు, ఉమ్మినా వాంతి చేసుకున్నా బోలెడు కఫం రావడం, జ్వరం కాస్త ముదిరితే మూత్రంలో రక్తం పోవడం, వెన్నునొప్పి ఇవన్నీ వుంటాయి. ఇవన్నీ క్షతకాస లక్షణాలు. ఈ దశలో వాతం ప్రకోపించి శరీర ధాతువులన్నీ తీవ్రంగా దెబ్బతింటే రాజయక్ష్మ జ్వరం ప్రవేశిస్తుంది.


అప్పుడు రోగి దగ్గినపుడు పడే కఫం ఆకుపచ్చగా, పసుపుపచ్చగా, ఎఱ్ఱని చారలతో నిండి బహిర్భూమి సందర్భంలోని దుర్వాసన వేస్తుంటుంది. చీము కూడా పడుతుంటుంది. నిద్ర పోవడానికి ఎంత ప్రయత్నించినా నొప్పి వల్ల కుదరదు. గుండెను ఎవరో మూకుడులో పెట్టి వేయిస్తున్నట్లుంటుంది. అకస్మాత్తుగా వేడిగా ఒకమారు చల్లటిదొక మారు తినాలని పిస్తుంది. ఎంత తిన్నా చాలదనిపిస్తుంది. నీరసం ఎక్కువవుతుంది.


ఉన్నట్టుంటి ముఖం కాంతివంతంగా, గాజువలె నున్నగా అవుతుంది. కనులలో మెరుపు కనబడుతుంది. అయినా రోగబాధలన్నీ పెరుగుతుంటాయి. బలహీనులను ఈ జ్వరం పూర్తిగా వంచివేస్తుంది. బలవంతులలో గాయాల వల్ల వచ్చిన దగ్గు అయితే చికిత్స ప్రారంభ దశలో వుండగానే తగ్గిపోతుంది. జాగ్రత్తగా చికిత్స చేస్తే వృద్దులను కూడా తొలిదశలలోనైతే రోగవిముక్తులను చేయవచ్చు. దగ్గు, మందాగ్ని, క్షయ, కడుపులో తిప్పు, వాంతి మున్నగు రోగలక్షణాలు కనబడగానే నిర్లక్ష్యం చేయకుండా చికిత్సకుని సంప్రదించాలి. లేకుంటే అవి చాలా వేగం ముదిరి పోతాయి.


శ్వాసనిరోధక రోగం దగ్గు బాగా ముదిరితే వస్తుంది. శరీరంలోని ద్రవాలను ఉద్రిక్తపఱచడం వల్ల కూడా ఇది రావచ్చు. ఆమాతిసారం (చీము విరేచనం) వమనం, పచ్చకామెర్లు, ధూళి అసహ్యత, పొగ, గాలి తెరలలో చిక్కుకొనుట, మంచు కరిగిన నీరు, విషతుల్యరసాలు, సంధులపై హింస్రకదాడులు కూడా శ్వాస నిరోధక జ్వరాలను కలిగిస్తాయి. ఇందులో క్షుద్రక, తమక, ఛిన్న, మహా, ఊర్ధ్వ అని ఐదు రకాలున్నాయి. కఫం పేరుకుపోవడం వల్ల గాలికి అడ్డంకి ఏర్పడుతుంది. శరీరంలో నిరంతరం పరిభ్రమించే వాయువులు ఒకచోట నిరోధింపబడితే చుట్టూ తిరుగుతూ మెత్తటి ప్రధాన కణజాలాలపై నాళాలపై గుండెపై, బలమైన ఒత్తిడిని కలుగజేసి ఆయా భాగాలను పాడు చేస్తాయి. నడుము లోపలి అంగాలను కూడా ప్రభావితం చేస్తాయి.

No comments:

Post a Comment