Sunday, 29 December 2024

శ్రీ గరుడ పురాణము (336)

 


గోళ్ళూ, ఎముకలూ, జుట్టూ అసహజమైన వేగంతో పెరిగిపోతుంటాయి.


శ్వాసకోశానికి సంబంధించి ఈ రోగరాజంలో పదకొండు రుగ్మతలు బయట పడతాయి. పడిశము, శ్వాసకృచ్ఛము, దగ్గు, గొంతు నీరసించుట, తలనొప్పి, అన్నద్వేషం, ఎగవూపిరి, అంగముల్లో అతి నీరసం (చీపురుపుల్లల వలె అయిపోవుట) వాంతులు, జ్వరం, ఛాతీనొప్పి ఇవి వచ్చిన తరువాత గొంతులో భరించలేని బాధ, ఉమ్ములో చీము, నెత్తురు, అంగాలు నొక్కుకుపోతున్న బాధ కలుగుతాయి.


వాత ప్రకోపంవల్ల తల, కణతలు అంగాలు నొప్పెడతాయి. అన్నీ ఒత్తిడికి లోనౌతాయి. గొంతు నొక్కుకుపోతున్నట్లుంటుంది. పిత్త ప్రకోపం వల్ల భుజాలలో మంట, అరికాళ్ళలో, చేతుల్లో మంట, నులుగడుపు, నెత్తుటి వాంతులు, మలంలో దారుణ దుర్వాసన, నోటి దగ్గర దుర్వాసన, జ్వరం, పేలాపన వస్తాయి. కఫం ప్రకోపిస్తే అరుచి, వాంతులు, సగం శరీరం బరువెక్కిన భీతి కలుగుతాయి.


నోటినుండి చొంగకారుట, జలుబు, అజీర్ణం, శ్వాసకృచ్ఛం, గొంతు బొంగురు కూడా కఫం వల్లనే వస్తాయి. జీర్ణకోశం సరిగా పనిచేయకపోవడం వల్ల మామూలుగా స్రవించే ద్రవాలు పెరిగి కఫం రసాలు అతిగా ఊరి నిలవైపోయి నిల్చిపోయి అన్ని నాళాలపై పూతలాగేర్పడి వాటి ద్వారాలను మూసేస్తాయి. అప్పుడు శరీరంలో ధాతునిర్మాణం ఆగిపోయి మొత్తం అంతటా మంటలు చెలరేగుతున్నట్లుండి మతి చెదరిపోతుంది. మరికొన్ని దారుణ బాధలు కూడా వుంటాయి. క్షయరోగి తీసుకునే ఆహారం హానికర ఆమ్లాలతో తడిసిపోయి ఇతర ద్రవాలతో కలిసి ఎందుకూ పనికిరాకుండా పోతుంది. అతనికి బలం చేకూరదు. రసాలేవీ అతని శరీరంలో రక్తాన్నుత్పత్తి చేయవు. దాంతో రోగి క్షీణించి పోయి కాళ్ళూ చేతులూ చీపురుపుల్లల్లాగా అయిపోతాయి. ఈ చీపురుపుల్ల లక్షణం కనిపించే లోపల ఎన్ని రుగ్మతలు బయటపడినా మందుల ద్వారా చికిత్స ద్వారా రోగాన్ని కుదర్చవచ్చు.


దేహంలో జఠరాదిరసాలు పాడైతే కొవ్వు చేరక మనిషి నీరసించిపోతాడు. గొంతు బొంగురు వచ్చి గొంతు బలహీనమై బొంగురువోయి వణుకుతుంది.


వాత ప్రకోపంలో శరీర కాంతినాశనమగుట, నునుపు పోవుట, వెచ్చదనం మాయమగుట జరిగి గొంతుభాగం బార్లీగింజ రూపంలో రంగులోకి వచ్చేస్తుంది. కఫ ప్రకోపానికి ఈ జబ్బులో ఒక వింతైన గురక, గొంతులో నిరంతరం జిగటగా చీము కదులుతుండడం సూచనలు. పిత్త ప్రకోపం వున్న క్షయ రోగికి గొంతు, తాలువు మండుతున్నట్లుంటాయి. కఫలక్షణాలైన తలతిప్పు, కనులముందు చీకటి తెరలు కూడా కనిపించవచ్చు.


ఏది యేమైనా కాలుసేతులు చీపురు పుల్లలవలె కాక ముందైతే చికిత్స చేయవచ్చు.


(అధ్యాయాలు 148-152)

No comments:

Post a Comment