Saturday, 2 September 2023

శ్రీదత్త పురాణము (275)

 


అశాశ్వతమైన ఈ శరీరంమీద ధీమంతులెవ్వరూ అట్టే నమ్మకం పెట్టుకోరు. నిత్యం సన్నిహితో మృత్యుః అన్నారు. సంపదలా అత్యంత చంచలాలు. ఆసన్నమరణోదేహః అంచేత ఎవ్వరికీ ఏ దర్పమూ పనికిరాదు. ఏ సంయోగానికైనా ముగింపు వియోగమే. అంతా క్షణభంగురం. ఇది ఎరిగి అందరూ అన్నివేళలా హరిభజన చెయ్యాలి. మహాయోగులకూ మహాతపస్వులకూ ధుర్లభమైన వైకుంఠ నివాసం విష్ణుమూర్తిని భక్తితో స్మరించిన వారికి అర్చించిన వారికి, అనాయాసంగా లభిస్తుంది. సందేహంలేదు. సర్వతీర్ధ సంసేవనం సర్వయజ్ఞ నిర్వహణం సాంగోపాంగ వేదాధ్యయనం- ఇవన్నీ నారాయాణార్చనలో పదహారవ కళకు సాటిరావు. అటువంటి విష్ణుభక్తి లేకపోయాక వేదశాస్త్రాలు అభ్యసించి ఏం లాభం ? తీర్థయాత్రలు చేసి ఏమి ప్రయోజనం ? తపస్సులెందుకూ ? యజ్ఞాలెందుకు ?


నైమిశేయులారా ! శౌనకాది మహామునులారా! నారదుడు సవత్కుమారుడికి దత్తాత్రేయ ధర్మకీర్తి సంవాదరూపంగా చెప్పిన ప్రాయశ్చిత్తవిధులు సంక్షేపంగా మీ చెవిని వేశాను. ఇంకా అనేక ధర్మాలూ సదాచారాలూ దత్తదేవుడు ధర్మకీర్తికి బోధించాడు. అతని నుంచి వాటిని విన్న గాలవుడు ధన్యుడు.


భజంతి యే విష్ణు మనంతమూర్తిమ్ నిరీహమోంకార గతం వరేణ్యమ్ ! 

వేదాంత వేద్యం భవరోగవైద్యమ్ చేయాంతి సర్వేపద మచ్యుతస్య !! అనాదిమాత్మాననువంతశక్తేమ్ ఆధారభూతం జగతాంపరేశమ్ ! 

జ్యోతిస్స్వరూపం పరమచ్యుతాఖ్యమ్ సంపూజ్యతే యాంతి పదం పవిత్రమ్ !!


శ్రీదత్త పురాణము (246)

 


పరాత్పరుడు, పురుషోత్తముడూ, బ్రహ్మ స్వరూపుడూ, ఇంద్రియ జ్ఞానానికి అందనివాడూ, అహంకార దూషితాలకు దూరంగా వుండేవాడూ, సంసారహేతువుకు కేతువైనవాడూ - దత్తదేవుడికి నమస్కారం. పరిశుద్ధ బుద్ధికి, విశుద్ధ విజ్ఞాన ఘనుడికి, జగత్సాక్షికి, ద్విజుడికి దేవుడికి, దేవకారణుడికి, మునీశ్వరుడికి, యోగేశ్వరుడికి- ఆ అత్రి పుత్రుడుకి ప్రణామం. ప్రపన్నులకి పాపజలధి దాటించేవాడూ, అమర సుతుడులాంటి బిడ్డను ప్రసాదించినవాడూ, అమరపూజ్యుడూ, సిద్ధవంధ్యుడూ, శరణ్యుడూ, అయిన ఆ పురుషోత్తమునికి నేను ప్రసన్నురాలినై ఇదే ప్రణతి సమర్పిస్తున్నాను.


తేజశ్శాలియైన పుత్రుణ్ని ప్రసాదించిన ఆ దత్తదేవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ నిసుగును సంరక్షించుగాక. బ్రహ్మదేవుడు కూడా దత్తదేవుడి అనుగ్రహంతో అవతరించినవాడే. రుద్రుడు దత్త తేజస్సంభూతుడు. సకలదేవతలూ సేవకులు. ఆ శ్రీహరి సదా నన్ను రక్షించుగాక అని ఇందుమతి స్తుతించింది. పురుషాధ్యక్షా ! లక్ష్మీవల్లభా ! జగద్గురూ ! దత్తాత్రేయా ! సురేశానా ! భవ సంకటం నుంచి నన్ను ఉద్ధరించుదేవా ! నీ అనుగ్రహంతో సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్నాను. పాదపద్మాలే నాకు దిక్కు, ప్రభూ ! నేనింకేమీ కోరను - అని ఆయువు స్తుతించాడు.


ఇలా దంపతులిద్దరూ దత్తదేవుణ్ని స్తుతిస్తూ ఆర్చిస్తూ నరమాహత్యాన్ని తలుచుకుంటూ పుత్రాగమనాన్ని ప్రతీక్షిస్తూ కాలం గడుపుతున్నారు. 

ఆశ్రమంలో వశిష్ఠులవారు ఒకనాడు నహుషుణ్ణి పిలిచి సమిత్కుశలూ కందమూల ఫలాలు తెమ్మని అడవిలోనికి పంపించారు. అన్నింటినీ సేకరించుకొని తిరిగివస్తున్న నహుషుడికి దేవదూతల సంభాషణ వినిపించింది. ఇతడే మహావీరుడు నహషుడు. ఆయు మహారాజు గారి ఏకైక సుతుడు, చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై తల్లి ఇందుమతికి ఎవలేని దుఃఖం కలిగించాడు. వశిష్ఠుడు అనుగ్రహంతో సకల విద్యాపారంగతుడు అయ్యాడు. ఇతణ్ని వలచి వివాహం చేసుకోదలచి శివకన్య అశోక సుందరి దుష్క రతపస్సు చేస్తోంది. ఆ పిచ్చి తల్లి తపస్సు ఎప్పటికి ఫలిస్తుందో? ఈ మాటలు విని నహషుడు చకచకా ఆశ్రమానికి వచ్చాడు. తెచ్చిన వస్తువులను ఎక్కడివక్కడ సర్థాడు. వసిష్ఠులకు నమస్కరించి చేరువలో కూర్చున్నాడు. తాను విన్న దేవదూతల సంభాషణ గురించి చెప్పాడు. మహర్షి సుకుమారంగా నవ్వి అతడి జన్మవృత్తాంతం అంతా ఎరిగించాడు. పుత్రా ! ఆనందపరచు - అని ఆజ్ఞాపించాడు. నహుషుడు మహర్షికి సాష్టాంగపడి దీవెనలందుకుని ధనుఃఖడ్గతూణీరాలను ధరించి హుండాసురుడిమీదకు బయలుదేరాడు దేవదుందుభులు మ్రోగాయి. అఖండ పుష్పవృష్టి కురిసింది.


పరిమళ భరిత శీతలవాయువులు అనుకూలదిశగా వీతెంచాయి. శుభశకునాలన్నీ కనిపించాయి. దేవేంద్రుడు స్వయంగా మాతలి సారధికమైన దివ్యరథాన్ని దివ్యాస్త్ర శస్త్రాలనూ అందించి పాండాసురుణ్ణి జయించమని ఆశీర్వదించి వెళ్ళారు. మునులు ఋషులూ సకల దేవమానవ జాతులవారూ జయోస్తు పలికారు. సహుషుడు ఇంద్ర రథం అథిరోహించాడు. సూర్యుడులా తళతళలాడాడు. వాయువేగ మనోవేగాలతో హుండరాజధాని మహోదరనగరం శివారుకు చేరుకున్నాడు.


అశోక సుందరి అభ్యర్థన మీద ఇష్టసఖి రంభ ఎదురు వచ్చి నహుషుణ్ని కలుసుకుంది. నహుషా ! శివకన్య అశోక సుందరికి నేను ప్రాణసఖిని రంభను. రూపగుణశీల సంపన్న మా అశోక సుందరి నీ కోసమే తపస్సు చేస్తోంది. హుండుడు ఆమెను అపహరించి తెచ్చి తన కారాగారగృహంలో బంధించాడు. తన కోరిక తీర్చమని నిర్భంధిస్తున్నాడు. అశోక సుందరి శపించింది. నహుషుడు వస్తాడు నిన్ను సంహరిస్తాడు - నన్ను వరిస్తాడు అని పలికింది. నీకోసం తపిస్తు నీ కోసం దుఃఖిస్తూ నీ కోసం కారాగార క్లేశాలు అనుభవిస్తున్న అశోక సుందరికి ఒక్కసారి కనువిందు చెయ్యి - అని అభ్యర్ధించింది. రంభా ! నాకు అన్ని విషయాలు తెలుసు. ముందుగా హుండుణ్ని సంహరించాలి. అటుపైన మీ దేవికి దర్శనం అనుగ్రహిస్తాను. ప్రాణ సమానవుగదా, వెళ్ళి ఈ మాట చెప్పి నా ప్రేయసిని ఊరడించు - అని పలికి నహుషుడు రంభను పంపించి వేశాడు.


Friday, 1 September 2023

శ్రీదత్త పురాణము (245)

 

అందరి ముఖాలలోను అదే దిగులు. ఇందుమతి దుఃఖానికి అంతే లేదు. వంశోద్ధారకుణ్ని ఇచ్చినట్టే ఇచ్చి దేవుడు ఇలా మాయం చేశాడేమిటి ? దివ్య స్వప్నం పగటికలేనా ? అని ఆవిడ ఆక్రోషం. దత్తాత్రేయుడిచ్చిన వరం ఇలా అయ్యిందేమిటి ? అని ఆయువు విస్తుపోతున్నాడు. తపస్సులు నిష్ఫలాలు, దాన ధర్మాలు నిష్ఫలాలు, వరాలూ ఇంతేనా ? దేవుడే మోసం చేశాడా ? - మధనపడుతూ లోపలలోపల కుమిలిపోతున్నాడు మహారాజు.


సరిగ్గా అదే సమయానికి దేవుడు పంపినట్టు నారదమహర్షి వచ్చాడు. అర్ఘ్యపాద్యాలూ అతిథి మర్యాదలూ అయ్యాయి. కుశల ప్రశ్నల సందర్భంగా మహారాజు తన దుఃఖాన్ని వెళ్ళబోసుకున్నాడు. మహారాజా ! చింతించకు, నీ వంశోద్ధారకుడు క్షేమంగా ఉన్నాడు. తిరిగి వస్తాడు. అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సకల విద్యాప్రవీణుడై మహావీరుడై రణరంగంలో హుండాసురుణ్ని సంహరించి ధర్మపత్నీ సమేతుడై మీ దగ్గరకి వస్తాడు. కొడుకునీ కోడల్నీ ఆశీర్వదిద్దురుగాని, సార్వభౌముడై భూగోళాన్ని చిరకాలం పరిపాలిస్తాడు. అటుపైన ఇంద్రపదవి అధిష్టిస్తాడు. దత్తదేవుడిచ్చిన వరం వృధాకాదు. ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించి ఆ దేవర్షి వీడ్కోలు తీసుకున్నాడు. రాజదంపతులు కుదుటపడ్డారు. సుదీర్ఘ నిరీక్షణకు సిద్ధమయ్యారు. దుఃఖతీవ్రతలో దత్తాత్రేయుణ్ని అతడిచ్చిన వరాన్నీ శంకించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మరింత భక్తిప్రపత్తులతో నిత్యమూ ఆ స్వామిని స్తుతించారు.


ఇందుమతీ కృతదత్తస్తవం


1. నమః పరస్మై పురుషాయవేధసే 

షడింద్రియ జ్ఞాన విదూరవర్త్మనే । 

పరాత్మనేఽహంకృతి దూషితాత్మనాం 

గుణాత్మనాం సంసృతి హేతుకేతవే ॥


2. నమోఽస్తు తస్మై పరిశుధ్ధ బుద్ధయే 

విశుద్ధ విజ్ఞాన ఘనాయ సాక్షిణే। 

ద్విజాయ దేవాయ చదేవహేతవే 

మునీశ్వరాయాత్రి సుతాయ యోగినే ॥


3. వృజిన జలధిపారం ప్రాపయేద్యః ప్రపన్నాన్ 

సుత మమర సుతాభం యోఽదదద్దత్తదేవః | 

తదహ మమర పూజ్యం సిద్ధవంద్యం శరణ్యం 

పురుష మృషభమాద్యం త్వాం ప్రపన్నాస్మి భూయః


4. యోయేఽదత్సుతం దివ్యం విభుతేజోపబృంహితం । 

సపాతు సర్వదా పుత్రం సర్వదేశే చ యద్ధతిః |


5. యస్సప్రసాదజో బ్రహ్మా రుద్రస్తే జస్సముద్భవః ॥ 

కింకరాశ్చ సురాయన్య సమాంపాతు సదాహరి:


6. నమస్తేపురుషాధ్యక్ష మైకాధ్యక్ష జగద్గురో 

దత్తాత్రేయసురేశాన పాహిమాం భవసంకటాత్ ॥


7. త్వత్ప్రసాదేవ దేవేశ సర్వం సాఖ్య మవాప్తవాన్ 

గతింమేదేహి పాదాచే వాన్యమిచ్చామ్యహంప్రభో ॥


Thursday, 31 August 2023

శ్రీదత్త పురాణము (244)

 


అంచేత మనం ఈ బిడ్డని ఎక్కడైనా దూరంగా వదిలేసి వద్దామని ఇద్దరూ కూడబలుక్కొని ఆ అర్ధరాత్రి శిశువుని తీసుకువెళ్ళి వశిష్ఠుడి ఆశ్రమ ద్వారంలో పరుండబెట్టి, తిరిగి వస్తూ ఒక బుజ్జిలేడి కూనను సంహరించి తెచ్చి, ఆ మాంసం వండి, పసిబిడ్డ మాంసమని హుండుడుకి వడ్డించారు. అది భక్షించి హుండుడు నిశ్చింతగా నిద్రపోయాడు.


తెల్లవారింది, వశిష్ఠుడు లేచాడు. గుమ్మంలో చందమామలా ఉన్న శిశువును చూశాడు. దివ్యలక్షణాలను గమనించాడు. ఈ బిడ్డను ఎవరు ఇక్కడ ఉంచి వెళ్ళారోనని ఆరా తీశాడు. ఆశ్రమ వాసులంతా మాకు తెలీదంటే మాకు తెలీదు అన్నారు. కొందరు పరిశీలనగా చూసి, ఆయు మహారాజుగారి పుత్రుడిలా ఉన్నాడు. ఈ తేజస్సూ ఈ కాంతీ కలిగిన సుతుడు వారికి జన్మించాడని విన్నాము - అన్నారు. వసిష్ఠుడు దివ్యదృష్టి సారించాడు. అంతా అర్థమయ్యింది. ఆ శిశువును తానే స్వయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది.

దేవదుందుభులు మ్రోగాయి. అప్సరసలు నృత్యం చేశారు. కిన్నెరులు గానం చేశారు. ఋషులు వేదమంత్రాలు పఠించారు. ఆ వరదత్తుని వైపు ప్రసన్నంగా చూశాడు వశిష్ఠుడు. నరాధిపా ! నీ వంశం బాలభావధూషితం కాలేదు కాబట్టి నువ్వు నహుష నామంతో విఖ్యాతికెక్కుతావు, దేవ పూజ్యత దక్కుతుంది- అని నామకరణం చేసి దీవించాడు.


వసిష్ఠుడే జాతక కర్మాదులన్నీ చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు. వేదవేదాంగాలూ నేర్పాడు. ధనుర్వేదం రహస్యాలతో సహా నేర్పాడు. వేదాంతం ధర్మశాస్త్రం రాజనీతి ఒకటేమిటి సమస్త విద్యలూ నేర్పాడు. నహుషుడు సర్వవిద్యావేత్త సకల కళాపారీణుడూ అయ్యాడు.


అక్కడ రాజంతఃపురంలో ఇందుమతికి మెలుకువ వచ్చింది. పక్కలో బిడ్డ కనిపించలేదు. వెదికింది, సఖులను అడిగింది. దాసీజనాన్ని ప్రశ్నించింది. అందరూ అప్పుడే నిద్రలేచారు. మాకు తెలీదంటే మాకు తెలీదన్నారు. క్షణంలో ఆ వార్త రాజప్రసాదం అంతటా వ్యాపించి రాజధానిలో వీధివీధికీ ప్రయాణించింది. ఆయు మహారాజు అంతటా గాలింపు చర్యలు జరిపించాడు. ప్రయోజనం కనిపించలేదు. కావలివారిని శిక్షించాడు. అంతఃపురంలోకి ప్రవేశించి పట్టమహిషి పొత్తిలిలో నిద్రిస్తున్న నెలల పిల్లాడిని ఎవరు అపహరించారు ? ఎలా అపహరించగలిగారు? ఎవరిని ఎలా నిర్బంధించి ప్రశ్నించినా వీటికి సమాధానం దొరకలేదు. రాజధాని అంతటా విషాదమేఘాలు అలుముకున్నాయి.


Wednesday, 30 August 2023

శ్రీదత్త పురాణము (243)

 


ఇదే సమయంలో - హుండుడు అనే దానవుడి కూతురు ఇష్టసఖులతో కలిసి నందనవనంలో విహరిస్తూ చారణ దంపతుల సంభాషణ వింది. భూలోకంలో ఆయు మహారాజుకి విష్ణుతుల్య పరాక్రముడు పుత్రుడుగా జన్మించబోతున్నాడనీ అతడి చేతిలో హుండుడు మరణిస్తాడనీ అప్పుడు మన దేవలోకం మనకు స్వాధీనమవుతుందనీ అందాకా మనకు ఈ ఇడుములు తప్పవనీ చారణులు కలబోసుకుంటున్న కబుర్లను హుండ పుత్రిక విన్నది. పరుగుపరుగున వెళ్ళి తండ్రికి విన్నవించింది. అశోక సుందరి తనకిచ్చిన శాపాన్ని గుర్తుకు తెచ్చుకున్న హుండుడు తనకు పోగాలం దాపురించిందని గుర్తించి గడగడలాడాడు. ఇందుమతీ గర్భంలో ఎదుగుతున్న శిశువును ప్రసవానికి ముందే నాశనం చెయ్యాలని నిశ్చయించుకొని అదృశ్యరూపంలో ఇందుమతీ శయనాగారంలో ప్రవేశించాడు. అక్కడ దివ్య తేజోమయరూపాలు ఆమెకు కావలి ఉండటం గమనించాడు. ఆమె తేజస్సునీ వారి తేజస్సునీ తట్టుకోలేక ఇవతలకి వచ్చేశాడు. స్వప్నంలో ప్రవేశించి భీషణ రూపాలతో ఆమెను భయపెడితే గర్భస్రావం అవుతుందని ఆశించాడు. విష్ణు తేజో రక్షితను ఏ రకంగానూ భయపెట్టలేక ప్రసవం కాగానే పసిగుడ్డును తన్నుకుపోదామని ఆశగా ప్రతీక్షిస్తూ కూర్చున్నాడు.


ఒక సుముహూర్తాన స్వర్భాను తనయ ఇందుమతి మగబిడ్డను ప్రసవించింది. అతడి దివ్యతేజస్సుకి ఆశ్చర్యపోయిన ఇందుమతి ఇష్టసఖులు వీడు సూనుడు కాడు భానుడు అని తృళ్ళిపడ్డారు. సూతికాగృహం వెలుపల ఉన్న దాసదాసీ జనానికి ఈ శుభావార్త అందించడానికి వచ్చిన ఒక దాసీని ఆవహించి హుండుడు లోపలికి చొరబడ్డాడు. అనుకూల సమయంకోసం వేచివేచి ఒక అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న తరుణంలో కావలివారిని సమ్మోహపరచి హుండుడు ఆ శిశువును అపహరించుకుపోయాడు. తన రాజధాని కాంచనపురం చేరుకున్నాడు. భార్యను పిలిచాడు. ఈ శిశువు నా శత్రువు. వీణ్ని మన పాచకులకు ఇచ్చి వీడి మాంసం నాకు వండి వడ్డించమను - అన్నాడు. ఈ పసి గుడ్డేమిటి, నీకు శత్రువేమిటి, వీణ్ని చంపడమేమిటి, వండటమేమిటి, నువ్వు తినడమేమిటి - ఏమీ నాకు అర్ధం కావడం లేదని ఆ రాక్షసకాంత భర్తను నిలదీసి కారణం చెప్పమంది. అంతా వివరించాడు హుండుడు. కామోసనుకొని ఆమె సైరంధ్రి మేకలను పిలచి బిడ్డణ్ని చేతిలో పెట్టి ఆ పని అప్పగించింది. మేకల వెళ్ళి పాచకుడికి అప్పగించింది. వాడు కత్తితో బిడ్డను నరకపోతే కత్తి రెండు ముక్కలయ్యింది. బాలకుడు చిరునవ్వు చిందించాడు. మేకలకు విషయం అర్థమయ్యింది. ఈ శిశువు అసాధారణుడు. మనకు అవధ్యుడు, దివ్య లక్షణ సంపన్నుడు అంది. రాజలక్షణ సంపన్నుడైన ఈ పసిగుడ్డును భక్షించాలనుకుంటున్న మన నాయకుడు హుండుడు దానవాధముడు. ఈ శిశువును చంపడం ఎవరి తరమూ కాదు. కర్మ రక్షిస్తూంటే ఎవడు ఎవణ్ని ఏమి చేయగలడు? దేవుడైనా వచ్చి ప్రదక్షిణలు చేయవలసిందే. ఎన్ని ఆపదలైనా తప్పుకుంటాయి. బందిఖానాలైనా తెరుచుకుంటాయి. కాళ్ళూచేతులూ కట్టేసి నదిలోకి విసిరేసినా క్షేమంగా తిరిగి వస్తాడు.


Tuesday, 29 August 2023

శ్రీదత్త పురాణము (242)

 


ఉన్నట్టుండి ఒకనాడు దత్తాత్రేయుడు కటాక్షించాడు. అదే తొలిసారి పలకడం. అదిగో ఆ కపాలంతో తీసుకురా. మాంసభోజనం కూడా కావాలి అన్నాడు. ఆయువు త్వరత్వరగా వెళ్ళి మద్యం తెచ్చి ఇచ్చాడు. స్వచ్ఛమైన మాంసాన్ని రుచిగా వండి స్వహస్తాలతో అందించాడు. ఇలా ఎన్నో పరీక్షలయ్యాక అతడి నిశ్చలభక్తికీ గురుశుశ్రూషకూ సంబరపడి ఆయు భూపతీ! ఏం కావాలో వరం కోరుకో ఇస్తానన్నాడు. దత్తయోగీంద్రా! గుణ సంపన్నుడూ సర్వజ్ఞుడు దేవవీర్యుడు దేవదానవ గంధర్వ కిన్నెర రాక్షస క్షత్రియాదులకు అజేయుడూ దేవబ్రాహ్మణ భక్తి తత్పరుడూ ప్రజాపాలన దక్షుడూ యజ్ఞ నిర్వాహకుడూ దానశీలుడూ శరణాగత తత్పరుడూ మహాత్యాగి వేద శాస్త్ర పారంగతుడూ ధనుర్వేద నిపుణుడూ అనాహతమతిమంతుడూ సుందరాకారుడూ - ఇంకా ఇటువంటి సద్గుణాలన్నీ కలిగి మా వంశాన్ని నిలబెట్టే సత్పుత్రుణ్ని వరంగా ప్రసాదించు అని ఆయువు కోరుకున్నాడు. దత్తస్వామి తథాస్తు అన్నాడు. వైష్ణవాంశతో - పుడతాడనీ సార్వ భౌముడవుతాడనీ ఇంద్రతుల్య పరాక్రముడవుతాడనీ ఆశీర్వదించి, ఒక పండు చేతికందించి ఇది తీసుకువెళ్ళి నీ ధర్మపత్నికి ఇచ్చి భుజించమను. నీ కిచ్చిన వరం ఫలిస్తుంది - అని చెప్పి అదృశ్యమయ్యాడు. 


ఆయు మహారాజు ఆనందంగా రాజధానికి తిరిగి వచ్చి తన ధర్మపత్ని స్వర్భానుతనయ పట్టమహిషి ఇందుమతికి జరిగిన వృత్తాంతమంతా చెప్పి దత్తదేవుడిచ్చిన దివ్య ఫలాన్ని భక్తితో కన్నులకద్దుకుని ప్రసాదంగా స్వీకరించమని అందించాడు. ఆమె అలాగే చేసింది. నెల తిరిగేసరికి గర్భం ధరించింది. నెలలు నిండుతున్నాయి. ఒకనాటి రాత్రి ఇందుమతికి ఒక కలవచ్చింది. ఆ కలలో ఒక దివ్య పురుషుడు కనిపించాడు. సూర్య సన్నిధుడు, సముజ్జ్వలత్సర్వాంగుడు, శ్వేతవస్త్ర సుశోభితుడూ, శ్వేత పుష్పమాలికాలంకృతుడు, దివ్యాభరణ దివ్యానులేపిన విరాజితుడు. చతుర్భుజుడు, శంఖ చక్రగదాఖడ్గధారి. హారకంకణకేయూరనూపురాలంకృతుడు. చంద్రబింబంలాంటి ఛత్రచ్ఛాయలో నిలబడ్డాడు. చంద్రబింబంల్లాంటి మకరకుండలాలు చెక్కిళ్ళుపై వెన్నెలలు కుమ్మరిస్తున్నాయి. ఇలా ఉన్న ఆ దివ్యపురుషుడు ఇందుమతిని చెంతకు పిలిచి రత్నకాంచన పట్టికాలంకృతమైన శంఖంతో క్షీరాభిషేకం చేశాడు. ఆటుపైని ఆమె మెడలో ముక్తాఫలాన్ని ధరింపజేసి చేతికి ఒక శ్వేతపద్మం అందించి అదృశ్యుడయ్యాడు. 


ఇందుమతికి మెలకువ వచ్చింది. భర్తను లేపి స్వప్న వృత్తాంతం అంతా చెప్పింది. అంతలోకి తెల్లవారింది. మహారాజు ఉదయాన్నే శౌనక మహర్షిని ఆహ్వానించి ఈ స్వప్నం గురించి చెప్పి ఫలమేమిటో చెప్పండి అని అడిగాడు. వరమిచ్చిన దత్తాత్రేయుడే ఇవ్వాళ మహారాణికి కలలో దర్శనమిచ్చారని క్షీరస్నాన పద్మదానాలను బట్టి వైష్ణవాంశ సంయుతుడు పుత్రుడుగా అవతరించనున్నాడనీ ముక్తాఫలం గర్భరక్షకమయ్యుంటుందనీ స్వప్నాన్ని విశ్లేషించి చెప్పి సోమవంశోద్ధారకుడు మీకు కలగబోతున్నాడని ఆశీర్వదించి వెళ్ళాడు. ఆ మహార్షి రాజదంపతులు సంబరపడి దత్తాత్రేయుణ్ని ధ్యానిస్తూ ప్రసవానికి వేచి ఉన్నారు.


Monday, 28 August 2023

శ్రీదత్త పురాణము (241)

 


దేవదేవా ! జనార్ధనా ! శంఖ చక్ర గదాధరా ! నువ్వు ఈ భూలోకంలో చాలా అవతారాలు ధరించావు. అన్నీ విఖ్యాతిపొందాయి. కానీ దత్తాత్రేయావతారం వాటిలోకెల్లా విఖ్యాతమైనదీ ప్రత్యేకమైనదీను. ఆ అవతారంలో ఎందరెందరో రాజులను సంకట పరిస్థితులనుంచి ఉద్ధరించావు. అలా నీతో ఉద్ధరింపబడిన ఒక రాజు కథ నీ ముఖతః వినాలని నా కోరిక. ఇంతకుమించి నేను వేరే కోరే వరాలు ఏమీలేవు. నన్ను అనుగ్రహించు.


నహుష వృత్తాంతం


తుంగపుత్రా ! వేన తపస్వీ ! ఆయువు అని ఒక సార్వభౌముడున్నాడు. సత్యధర్మ పరాయణుడు. తపో యశో బలాలతో ఇంద్ర సమానుడు. దానధర్మాలతో యజ్ఞయాగాలతో నియమ నిష్ఠలతో పుణ్యకార్యాలతో పవిత్రంగా ఏకచ్ఛత్రంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. చంద్రవంశానికే విభూషణంగా భూలోకంలో కీర్తిప్రతిష్ఠలు గడించాడు. అయితే ఎంతకాలానికీ ఆ దంపతులకు సంతానం కలుగలేదు. ఆయువు ఎంతగానో దిగులు చెందాడు. దత్తయోగీంద్రుడి మహిమ విని ఒక మంచిరోజున హుటాహుటిన బయలుదేరాడు. చెంగట దత్తాశ్రమం చేరుకున్నాడు. అల్లంత దూరంలో దత్తాత్రేయుడు కనిపించాడు. సర్వాలంకార విభూషితుడై మదిరానందలోలుడై అంకపీఠంలో అతిలోక సౌందర్యవతిని బుజ్జగిస్తూ తరుణీ బృందపరివేష్టితుడై కనిపించాడు. అక్కడ అందరూ సురాపానం చేస్తున్నారు. ఆడుతున్నారు. పాడుతున్నారు. దత్తదేవుడి మెడలో పుష్పహారాలూ ముక్తామాలికలూ ఫరిడవిస్తున్నాయి. తనువంతా చందనంతో పరిమళిస్తోంది. సువర్ణ యజ్ఞోపవీతం తళతళా మెరిసిపోతోంది. ఆయువు నదురూ బెదురూ లేకుండా పరుగుపరుగున వెళ్ళి దత్తాత్రేయుడి పాదాలమీద సాష్టాంగపడ్డాడు. యోగీంద్రుడు గుర్తించాడు. అయినా పరీక్ష కోసం పరాభవించాలని ఆయువును కాలితో నెట్టాడు. ధృడసంకల్పంతో వచ్చిన ఆ మహారాజు దాన్ని లెక్కచెయ్యలేదు. దత్తదేవుడి పాదాలు వీడలేదు. దత్తాత్రేయుడు మౌనంగా అక్కడి నుండి నిష్క్రమించాడు. ఆయువు ఆశ్రమంలోనే ఉండి క్రమక్రమంగా స్వామి పరివారంలో సభ్యుడై సన్నిహితుడై నూరేళ్ళు సేవలు చేశాడు. మనసుపెట్టి భక్తితో సకలపరిచర్యలూ చేశాడు. నిత్యము స్తుతించాడు.


అత్రిసంభవా ! మహాభాగా ! గోవింద ! పురుషోత్తమా ! బ్రాహ్మణ రూపంలో అవతరించిన గరుడధ్వజా ! దేవదేవేశ ! పరమేశా ! నమోనమః ! శరణాగతవత్సలా ! నిన్నే శరణువేడాను. హృషీకేశా ! నువ్వు కల్పించిన మాయను నువ్వే ఉద్దరించు. నువ్వు విశ్వప్రదాతవు, విశ్వనాయకుడవు. మధుసూదనా! నువ్వు జగన్నాధుడవని ఎరుగుదును. గోవిందా ! విశ్వరూపా ! నన్ను కటాక్షించు. నన్ను రక్షించు. నమోనమః