పరాత్పరుడు, పురుషోత్తముడూ, బ్రహ్మ స్వరూపుడూ, ఇంద్రియ జ్ఞానానికి అందనివాడూ, అహంకార దూషితాలకు దూరంగా వుండేవాడూ, సంసారహేతువుకు కేతువైనవాడూ - దత్తదేవుడికి నమస్కారం. పరిశుద్ధ బుద్ధికి, విశుద్ధ విజ్ఞాన ఘనుడికి, జగత్సాక్షికి, ద్విజుడికి దేవుడికి, దేవకారణుడికి, మునీశ్వరుడికి, యోగేశ్వరుడికి- ఆ అత్రి పుత్రుడుకి ప్రణామం. ప్రపన్నులకి పాపజలధి దాటించేవాడూ, అమర సుతుడులాంటి బిడ్డను ప్రసాదించినవాడూ, అమరపూజ్యుడూ, సిద్ధవంధ్యుడూ, శరణ్యుడూ, అయిన ఆ పురుషోత్తమునికి నేను ప్రసన్నురాలినై ఇదే ప్రణతి సమర్పిస్తున్నాను.
తేజశ్శాలియైన పుత్రుణ్ని ప్రసాదించిన ఆ దత్తదేవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ నిసుగును సంరక్షించుగాక. బ్రహ్మదేవుడు కూడా దత్తదేవుడి అనుగ్రహంతో అవతరించినవాడే. రుద్రుడు దత్త తేజస్సంభూతుడు. సకలదేవతలూ సేవకులు. ఆ శ్రీహరి సదా నన్ను రక్షించుగాక అని ఇందుమతి స్తుతించింది. పురుషాధ్యక్షా ! లక్ష్మీవల్లభా ! జగద్గురూ ! దత్తాత్రేయా ! సురేశానా ! భవ సంకటం నుంచి నన్ను ఉద్ధరించుదేవా ! నీ అనుగ్రహంతో సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్నాను. పాదపద్మాలే నాకు దిక్కు, ప్రభూ ! నేనింకేమీ కోరను - అని ఆయువు స్తుతించాడు.
ఇలా దంపతులిద్దరూ దత్తదేవుణ్ని స్తుతిస్తూ ఆర్చిస్తూ నరమాహత్యాన్ని తలుచుకుంటూ పుత్రాగమనాన్ని ప్రతీక్షిస్తూ కాలం గడుపుతున్నారు.
ఆశ్రమంలో వశిష్ఠులవారు ఒకనాడు నహుషుణ్ణి పిలిచి సమిత్కుశలూ కందమూల ఫలాలు తెమ్మని అడవిలోనికి పంపించారు. అన్నింటినీ సేకరించుకొని తిరిగివస్తున్న నహుషుడికి దేవదూతల సంభాషణ వినిపించింది. ఇతడే మహావీరుడు నహషుడు. ఆయు మహారాజు గారి ఏకైక సుతుడు, చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై తల్లి ఇందుమతికి ఎవలేని దుఃఖం కలిగించాడు. వశిష్ఠుడు అనుగ్రహంతో సకల విద్యాపారంగతుడు అయ్యాడు. ఇతణ్ని వలచి వివాహం చేసుకోదలచి శివకన్య అశోక సుందరి దుష్క రతపస్సు చేస్తోంది. ఆ పిచ్చి తల్లి తపస్సు ఎప్పటికి ఫలిస్తుందో? ఈ మాటలు విని నహషుడు చకచకా ఆశ్రమానికి వచ్చాడు. తెచ్చిన వస్తువులను ఎక్కడివక్కడ సర్థాడు. వసిష్ఠులకు నమస్కరించి చేరువలో కూర్చున్నాడు. తాను విన్న దేవదూతల సంభాషణ గురించి చెప్పాడు. మహర్షి సుకుమారంగా నవ్వి అతడి జన్మవృత్తాంతం అంతా ఎరిగించాడు. పుత్రా ! ఆనందపరచు - అని ఆజ్ఞాపించాడు. నహుషుడు మహర్షికి సాష్టాంగపడి దీవెనలందుకుని ధనుఃఖడ్గతూణీరాలను ధరించి హుండాసురుడిమీదకు బయలుదేరాడు దేవదుందుభులు మ్రోగాయి. అఖండ పుష్పవృష్టి కురిసింది.
పరిమళ భరిత శీతలవాయువులు అనుకూలదిశగా వీతెంచాయి. శుభశకునాలన్నీ కనిపించాయి. దేవేంద్రుడు స్వయంగా మాతలి సారధికమైన దివ్యరథాన్ని దివ్యాస్త్ర శస్త్రాలనూ అందించి పాండాసురుణ్ణి జయించమని ఆశీర్వదించి వెళ్ళారు. మునులు ఋషులూ సకల దేవమానవ జాతులవారూ జయోస్తు పలికారు. సహుషుడు ఇంద్ర రథం అథిరోహించాడు. సూర్యుడులా తళతళలాడాడు. వాయువేగ మనోవేగాలతో హుండరాజధాని మహోదరనగరం శివారుకు చేరుకున్నాడు.
అశోక సుందరి అభ్యర్థన మీద ఇష్టసఖి రంభ ఎదురు వచ్చి నహుషుణ్ని కలుసుకుంది. నహుషా ! శివకన్య అశోక సుందరికి నేను ప్రాణసఖిని రంభను. రూపగుణశీల సంపన్న మా అశోక సుందరి నీ కోసమే తపస్సు చేస్తోంది. హుండుడు ఆమెను అపహరించి తెచ్చి తన కారాగారగృహంలో బంధించాడు. తన కోరిక తీర్చమని నిర్భంధిస్తున్నాడు. అశోక సుందరి శపించింది. నహుషుడు వస్తాడు నిన్ను సంహరిస్తాడు - నన్ను వరిస్తాడు అని పలికింది. నీకోసం తపిస్తు నీ కోసం దుఃఖిస్తూ నీ కోసం కారాగార క్లేశాలు అనుభవిస్తున్న అశోక సుందరికి ఒక్కసారి కనువిందు చెయ్యి - అని అభ్యర్ధించింది. రంభా ! నాకు అన్ని విషయాలు తెలుసు. ముందుగా హుండుణ్ని సంహరించాలి. అటుపైన మీ దేవికి దర్శనం అనుగ్రహిస్తాను. ప్రాణ సమానవుగదా, వెళ్ళి ఈ మాట చెప్పి నా ప్రేయసిని ఊరడించు - అని పలికి నహుషుడు రంభను పంపించి వేశాడు.
No comments:
Post a Comment