Thursday 23 October 2014

బలి పాడ్యమి

కార్తీకశుద్ధ పాడ్యమి, బలిపాడ్యమి

కార్తీక శుద్ధ పాడ్యమికే బలి పాడ్యమి అని పేరు. ఈ పాడ్యమి బలిచక్రవర్తికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు తెల్లవారుజామునే లేచి బలిచక్రవర్తిని పూజించాలి. బియ్యపు పిండితో బలిచక్రవర్తి బొమ్మను గీచి పూజ చేయవచ్చు. పూజ సమయంలో

బలిరాజ నమస్తుభ్యం
విరోచనసుత ప్రభో,
భవిష్యేంద్ర సురారాతే
పూజేయం ప్రతిగృహ్యతాం

అని ప్రార్ధించాలని, గోవర్ధనపూజ చేయాలని, ఆవులను అలంకరించి స్వేచ్చగా తిరగనివ్వాలని, శక్తి కొలది దానం చేయాలని చెప్తారు.

ఇది బలచక్రవర్తికి సంబంధించిన కధ. వామనుడైన విష్ణువుకు 'మాట తిరుగని మానధనుడైన బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని దానం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమన్నాడు.

అప్పుడు బలిచక్రవర్తి "దేవా! నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను. నాకోసం కోరడానికి ఏమి లేదు. లోకం కోసం ఒక వరం అర్ధిస్తున్నాను. ఇష్టమైతే అనుగ్రహించు. నేను దానమిచ్చిన భూమిని వామనుడివై అంతటా ఆక్రమించావు. కనుక నీ మూడు అడుగులకు సంకేతంగా - ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ద పాడ్యమి (3 రోజులు) - భూలోకంలో బలిచక్రవర్తి రాజ్యంగా ఉండాలి. నా రాజ్యంలో దీపదానం, దీప పూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీ దేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికి చీకటే ఉండాలి" అన్నాడు. విష్ణువు తధాస్తు అన్నాడు.

బలిచక్రావర్తి కార్తీకశుద్ధపాడ్యమి - తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు. అతనివెంట గదాధరుడైన భగవంతుడు మహావిష్ణువు వస్తాడు. ఇలా భక్తుడూ, భక్తరక్షకుడైన భవంతుడు - ఇద్దరు వస్తారు కనుక వీధులు శుభ్రంగా ఉండి, ప్రతి ఇంటి ముంగిట దీపాలూ, మామిడితోరణాలు, రంగురంగుల ముగ్గులూ ఉండటం చూసి, తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం, ఉత్సాహం, భోగభాగ్యాలతో హాయిగా ఉన్నరాని బలి సంతోషపడతాడు. భగవంతుడు ఆనందిస్తాడు. అందువల్ల దీపావళి మరుసటి రోజు 'బలి పాడ్యమి 'అయ్యింది. అంతేకాని జంతుబలులతో విందుచేసుకోవడం బలి పాడ్యమి కాదు.
         
సేకరణ: శ్రీ శైలప్రభ, అక్టోబరు 2012, సప్తగిరి, అక్టోబరు 2011

No comments:

Post a Comment