Wednesday, 22 October 2014

దీపావళి విశేషాలు

దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపమాలికలతో లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు కావడం చేత దీనికి దీపావళి అని పేరొచ్చింది. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం.


పురాణప్రాశస్త్యం - త్రేతాయుగంలో రావణాసురిడిని చంపిన శ్రీ రామచంద్రుడు ఆశ్వీయుజ అమావాస్య రోజునే అయోధ్యకు చేరుకున్నాడు. తమకు ప్రియాతిప్రియమైన రాముడు 14 ఏళ్ళ తర్వాత తిరిగి తమ వద్దకు వస్తున్నాడనే సంతోషంతో అయోధ్యలో పండుగ వాతావరణం ఏర్పడింది. ప్రజలు శ్రీ రాముడిని దీపాలు వెలిగించి ఆహ్వానించారట. అయోధ్య మొత్తం దీపకాంతులతో అలంకరించారని, చరిత్రలో జరిగిన ఈ సంఘటనకు గుర్తుగా దీపావళీ జరుపుకుంటారని ఒక కధనం.

ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడు నరకాసుర వధ చేసిన తర్వాత అనేకమందికి విముక్తి లభించింది, అనేకమంది స్త్రీల జీవితాల్లో వెలుగు వచ్చింది. నరకాసురవధకు సంతొషించిన ప్రజలు అమావాస్య రోజున దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి, ఆనందాన్ని వ్యక్తం చేసారు. అది కూడా ఈ రోజునే. నరకుడంటే అహకారం. అహకారం నశించినవారికి జీవితంలో చీకటి అనేదే ఉండదు. అహం నశించడం, జ్ఞానం కలగడం ఒకేసారి జరుగుతాయి. జ్ఞానం వ్యక్తిలో ఉన్న సంచితకర్మ ఫలాలను, పూర్వజన్మ వాసనలను నశింపజేస్తుంది. దానికి ప్రతీకగా అమావాస్య రాత్రి దీపాలు వెలిగిస్తారు.

ఆచరించవలసినవి -  ఈ రోజున తెల్లవారు జామున్నే(వెకువ జామున/సూర్యోదయానికి గంటన్నర ముందు)తలకి నువ్వుల నూనె పెట్టించుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల కొమ్మలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈరోజు చేసే అభ్యంగనస్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది.

దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీ పూజ చేయాలి. కాగా కొన్ని ప్రాంతాల్లో పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం లక్ష్మీ దేవిని పూజించే సంప్రదాయం ఉంది. దీపావళి రోజున లక్ష్మీ దేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా,మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళ వుంచిపోతుందని చెప్పబడింది. అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రంగా చేసి, లక్ష్మీదేవి రావాలని కోరుతూ ఇంటిని అలంకరించాలి.

ఇక సాయంకాలం ఇంటి ముంగిట, ఆలయాలు, మఠాల ముంగిట, గో శాలల్లోనూ దీపాలను వెలిగించాలి. చీకటిపడే సమయాంలో దీపదానం చేసి, మండుతున్న కట్టేల్ని త్రిప్పాలి. ఇలా త్రిప్పడం చేత పీడ పొతుందని చెప్తారు. నిజానికి దీపావళి కొంతవరకు పితృదేవతలకు సంబంధిచిన పండుగ.  దీపావళీ సాయంత్రం గొంగూర కాడల మీద దీవిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయి. తద్వారా పితృదేవతలు సంతసిస్తారు, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుంది.  తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి. ఆకులతో దొన్నెలు కుట్టి, దీపాలు వెలిగించి, నదుల్లోనూ, చెరువుల్లోనూ, సరోవరాల్లోనూ, బావుల్లోనూ వదలాలి. దీపావళీ అర్దరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, అలక్ష్మీని బయటకు పంపాలి.

నూతన వస్త్రాలు ధరించాలి. అన్నదానం చేయాలి. అర్ధరాత్రివేళ చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళతోనూ, డిండిమం అనే వాయిద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠాలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని శాస్త్రవచనం.
(ఇందులో కొంత భాగం  సేకరణ: శ్రీ శైలప్రభ,అక్టోబరు 2012,సప్తగిరి,అక్టోబరు 2011  )

దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి.

అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ఆకాశదీపం (దేవాలయాల్లో అయితే ధ్వజస్థంభానికి వెలిగిస్తారు, మనం ఇళ్ళ పైకప్పు మీద పెట్టాలి), నదుల్లోనూ, చెరువుల్లోనూ దీపాలను వదలాలి. ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. నువ్వుల నూనె దీపాలనే వెలిగించండి. మట్టి ప్రమిదలనే వాడండి. 

శాస్త్రీయ కారణం -  కొద్దిపాటి టపాసులు పేల్చడం వెనుక కూడా ఒక కారణం ఉంది. ఇప్పుడు భూమి నుంచి పుట్టే వివిధ రకములైన క్రిమికీటకాలు రోగాలను కలిస్తాయి. దీపావాళి నాటి రాత్రి కాల్చే మందుగుండు సామగ్రి నుంచి వెలువడే పొగ, వాసన ఈ కాలంలో వ్యాపించే దోమలను, క్రిములను హరింపజేస్తుంది. కానీ మరీ ఎక్కువగా కాలిస్తే, ఆ పొగ మనకూ హాని చేస్తుంది, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది. 

అందరికి దీపావాళి శుభాకాంక్షలు.

No comments:

Post a Comment