Sunday 26 October 2014

నాగుల చవితి విశేషాలు

కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి - విశేషాలు

మన దేశంలో ప్రాచీన కాలం నుండి నాగపూజ చేసే ఆచారం ఉంది. కార్తీక శుద్ధచవితిని నాగులచవితిగా జరుపుతారు. పూజించడం అంటే గౌరవించడం అని అర్ధం. వ్యవాసాయంలోనూ, జీవవైవిధ్య రక్షణలోనూ ప్రధానపాత్ర పోషిస్తూ భూమిపై సమతుల్యానికి, జీవనానికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడుతున్న సర్పజాతికి నీరాజనం పట్టి, గౌరవించడమే ఇక్కడ పూజించడం అని అర్ధం చేసుకోవాలి.

ఉదయమే తప్పకుండా తలంటుస్నానం చేయాలి. ఈ రోజు చేసే తలస్నానం కళ్ళు, చెవులకు సంబంధించిన సమస్త రోగాలను తొలగిస్తుంది.

నాగులచవితి రోజున ఉపవాసం ఉండి పాముపుట్టను పూజించాలి. పుట్టలో ఆవుపాలు పోయాలి. పుట్టను పూజించే అవకాశం లేనప్పుడు నాగవిగ్రహాన్ని పాలతో అభిషేకించాలి. సాధారణంగా ప్రతిచోట ఆలయాలలోనూ, రావి, వేప చెట్ల క్రిందా ఈ నాగవిగ్రహాలు / నాగబంధం ఉంటుంది.

ఒక విషయం గుర్తుంచుకోండి. పాములు సరీసృపాలు కనుక పాలు త్రాగవు. అలా అని అన్ని పాములు పాలు త్రాగవని కాదు, దేవతసర్పాలు మాత్రమే పాలు త్రాగుతాయి. మాములు పాములు పాలు త్రాగితే అరగక కక్కెస్తాయి, మరణిస్తాయి కూడా. దేవత సర్పాలు ఎక్కడపడితే అక్కడ ఉండవు. మనిషి కంటికి కనిపించవు, అంటే మానవ కదలికలను లేని మహారణ్యాలలో మాత్రమే ఉంటాయి. అందువల్ల పుట్టలో పాక్యేట్ల కొద్ది పాలు పోయకండి. నాగజాతిని తలుచుకుని నాగదేవతకు నైవేద్యంగా ఒకటి, రెండు చెంచాల పాలు మాత్రమే పుట్టలో పోసి మిగితావి ప్రసాదంగా స్వీకరించడం మంచిది. ఇక నాగదేవత పూజలో పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడవద్దు. పసుపు అంటే పాములకు అలర్జీ. పసుపు వాటి శరీరానికి అంటుకోవడం వలన కూడా అవి మరణీంచే అవకాశం ఉంటుంది. పండుగ పూట పాపం చేయకండి. పసుపుకుంకుమలను పుట్ట దగ్గర వాడకండి. ఇటువంటి మరికొన్ని విషయాలను నాగపంచమి సంధర్భంగా ప్రచురించడం జరిగింది. లింక్‌లో http://goo.gl/B7ljRm గమనించగలరు.   

నాగులచవితికి నువ్వులపిండి, చలిమిడి, వడపప్పు, చిమ్మిలి తప్పనిసరిగా నివేదనగా సమర్పించాలి. ఇవి గర్భదోషాలను తొలగిస్తాయి, ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.      

పుట్ట దగ్గర / నాగబంధం దగ్గర పూజించాకా, ఇంటి గడప దగ్గర కూడా పాలుపోయాలి. ప్రతి ఇంటి గుమ్మం దగ్గర నాగరాజు కొలువుండి ఇంటిని రక్షిస్తుంటాడు. కనుక ఇంటి గడప మీద పాలు పోయండి, కాసింత చిమ్మిలి, చలివిడి పెట్టండి, ఒక అరటిపండు ముక్క పెట్టండి. నాగులను పాలు పోసి పూజించాం కనుక ఈ రోజు తరిగిన కూరలు తినకూడదని పెద్దలు చెప్తారు. కనుక ఆహారం తీసుకునేవారు, కత్తితో కూరలు కోయకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి.

మరునాడు ఇంట్లో బంగారంతో కాని,వెండితో కాని,కొయ్యతో(చెక్క) కాని,మట్టితో కాని చేసిన నాగప్రతిమను పంచామృతాలతోనూ,జాజి,సంపెంగ లాంటి సువాసనగల పూలతోనూ పూజించాలి. ఈ నాగపూజ వలన సర్పదోషాలు నశిస్తాయి.  

No comments:

Post a Comment