Wednesday 1 October 2014

సరస్వతీ తత్వం

సరస్వతీ అనే పదంలోనే అమ్మవారి తత్వం దాగివుంది. సరః అంటే సారము, స్వ అంటే తన యొక్క అని అర్దం. తన యొక్క సారాన్ని/తత్వాన్ని సంపూర్ణంగా తెలిపేది సరస్వతి.

మనం ఆత్మ స్వరూపులం అయినా, మనల్ని మనం ఈ శరీరంగా భావించుకుంటాం. మనసుకు కలిగిన బాధలను మనవిగా భావించి బాధపడతాం. పూర్వజన్మ కర్మఫలాలను అనుభవించేది దేహము, దేహంలో ఉన్న మనస్సే కానీ, మనం కాదు. కానీ శరీరానికి కలిగిన కష్టనష్టాలకు, దుఃఖాలకు కృంగిపోతాం. అహంకారమమకారాలకు బానిసలమై, పరిమితి కలిగిన ఈ దేహాన్నే మనంగా ఊహించుకుంటూ జీవిస్తున్నాం.

కానీ నిజానికి మన తత్వం ఏమిటి? మనమేమిటి? అని ఆలోచిస్తే ఎప్పుడు మనలో 'నేను' అనే తలంపు ఒకటి మెదులుతుంటుంది. ఈ దేహం పుట్టినప్పటి నుంచి మరణించేవరకు ఆ తలంపు మనల్ని వీడదు. ఆ 'నేను' అనే తలంపు ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకునేందుకు ధ్యానంలో విచారాణ ప్రారంభిస్తే, అది ఆఖరున ఆత్మలో లయమవుతుందంటారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆత్మ మన సహజ స్థితి, నిత్యానంద స్థితి, ఆత్మయే మనం. ఈ శరీరంలో ఆత్మ ఉండడం కాదు, ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది, ఆ ఆత్మయే మనం. ఆత్మకు పరిమితి లేదు, ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, ఈ లోకంలో ఆత్మ తప్ప మరొకటిలేదు.

ఈ ఆత్మ తత్వమే సనాతన భారతీయ సంస్కృతిని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలిపింది. ప్రపంచంలో ఇతర మతాలు అశాశ్వతమైన ఈ శరీరం గురించి చెప్తే, మన ధర్మం సనాతనమైన ఆత్మ తత్వం గురించి ప్రపంచానికి చెప్పింది. మానవజన్మకు సార్ధకత/ నిర్యాణం/ మోక్షం లభించాలంటే ఆత్మ తత్వం అర్దమవ్వాలి. అటువంటి ఆత్మ తత్వం(మన తత్వం) గురించి మనకు సంపూర్ణంగా తెలియజేస్తుంది కనుక అమ్మను సరస్వతీ దేవిగా ఆరాధిస్తాం.

ఓం సరస్వత్యై నమః           

No comments:

Post a Comment