Thursday 25 September 2014

పూజ మాత్రం మానకండి

శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రం చాలా విశిష్టవంతమైనది. హిందూ సామ్రాజ్య స్థాపకుడు, ఛత్రపతి శివాజీకి తుల్జాభవాని ఖడ్గాన్ని ఈ ఖడ్గమాలా స్తోత్రం పఠించాకా ఇచ్చిందని చెప్తారు. ఖడ్గమాలా స్తోత్రం శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తుంది. ఈ నవరాత్రుల్లో దేవి ఆరాధన తప్పకుండా చేయాలి. కలశం పెట్టి ఆరాధన చేయలేని వారు, ఉద్యోగ రీత్యా, విద్యాకారణాల చేత ఇంటికి దూరంగా, హాస్టల్లో ఉండేవారు, కలశ స్థాపన చేసి నిష్ఠగా ఆరాధన చేయలేనివారు బాధపడవలసిన అవసరంలేదు. ఈ 9 రోజులు రెండు పూటల శ్రీ దేవి ఖడ్గమాల స్తోత్రం పఠించడం, కుదిరితే శ్రీ లలితా సహస్రనామావళి చదవడం, అమ్మవారికి సంబంధించిన కధలు వినడం అత్యంత శ్రేయోదాయకం.

మీరు పూజ చేయడానికి స్థలం లేదని బాధపడనవసరంలేదు, పూజ మానవలసిన పనేలేదు. ఉదయం స్నానం చేశాక, సాయంత్రం కాళ్ళూ, చేతులు కడుగుకుని, ఏ కుర్చిలోనో కూర్చుని అయినా సరే, కంప్యూటర్ ముందు కూర్చున్న సరే, అమ్మవారి ముందు కూర్చున్నామన్న భావనతో అమ్మవారికి సంబంధించిన ఏదో ఒక స్తోత్రాన్ని చదువుకోండి. ఏ ఒక్క శ్లోకం కూడా కంఠస్థంగా రాకపోతే, ఇంటర్‌నెట్‌లో చూసైన చదవండి. సనాతన ధర్మంలో మానసికపూజకు విశేషస్థానం ఉంది. మీ ముందు అమ్మవారి ఫోటో కూడా ఉండనవసరంలేదు. మే మనసులో అమ్మవారి రూపం ఉంటే చాలు. మీ మనసులో అమ్మవారికి కుంకుమపూజ చేస్తున్నట్లుగా భావన చేయవచ్చు, మనసులోనే నివేదన చేయచ్చు, హారతి ఇవ్వచ్చు. మానసికంగా చేసినా, భక్తితో చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. అమ్మ అనుగ్రహం కలుగుతుంది. పూజ మాత్రం మానకండి.

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.

ఓం శ్రీ మాత్రే నమః 

1 comment:

  1. సనాతన ధర్మంలో మానసికపూజకు విశేషస్థానం ఉంది.మానసికంగా చేసినా, భక్తితో చేస్తే తప్పక ఫలితం ఉంటుంది. అమ్మ అనుగ్రహంకలుగుతుంది. పూజ మాత్రం మానకండి

    ReplyDelete