Sunday 19 January 2014

కఠోపనిషత్తు శాంతి మంత్రం

ఓం గం గణపతయే నమః

ఓం సహనావవతు | సహనౌ భునక్తు | సహవీర్యం కరవావహై | తేజస్వీనావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాంతిః శాంతిః శాంతిః

ఇది కఠోపనిషత్తు యొక్క శాంతి మంత్రం. గురు శిష్యులు ఇద్దరూ కలిసి విద్యారంభ సమయంలో చదివే మంత్రం ఈ దోషాలు, విఘ్నాలు లేకుండా విద్యాభ్యాసన పూర్తవ్వాలని చేసే ప్రార్ధన. చాలామంది సహనా+భవతు అని చదువుతారు, కానీ అది సహన+అవతు.

సహ నౌ = మన ఇద్దరినీ; అవతు = రక్షించుగాకా; సహనౌ = మన ఇద్దరినీ; భునక్తు = పోషించుగాకా: సహ - కలిసి: వీర్యం = ఊర్జాశక్తితో; కరవావహై = పరిశ్రమిద్దాంగాకా; అధీతం = స్వాధ్యాయం; నౌ = మనకు; తేజస్వి = తేజోవంతం; అస్తు = అగుగాకా; మా విద్విషావహై = ద్వేషించుకొనకుండా ఉందుముగాకా;

గురుశిష్యులైన మన ఇద్దరిని ఆ పరబ్రహ్మ రక్షించుగాకా! ఇద్దరినీ పోషించుగాకా! ఇద్దరమూ ఊర్జాశక్తితో పరిశ్రమిద్దాం గాకా! మన స్వాధ్యాయము (నేర్చుకునే విద్య) ఏకాగ్రమూ ఫలవంతమూ అగుగాకా! ఎన్నడు మనమిద్దరం పరస్పరం ద్వేషించుకొనకుండా ఉండెదము గాకా!

భారతీయ సంస్కృతిలో గురుశిష్యుల సంబంధముకు ప్రత్యేకస్థానం ఉంది. గురుశిష్యుల సంబంధం అంటే ఇద్దరూ వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంగా ఋషులు చూడలేదు. అది జ్ఞాన్ వ్యాప్తికి సంబంధించిన అంశం. ఈ పరంపర ద్వారా విద్య రక్షింపబడుతుంది. ఒక గురువు నుంచి శిష్యునకు, అతని నుంచి అతని శిష్యునకు జ్ఞానం పరంపరాగతంగా భోదించబడుతుంది. ఇద్దరి మధ్య విద్వేషం లేనప్పుడే, వారి సంబంధం చక్కగా ఉన్నప్పుడే ఈ జ్ఞానం లోకకల్యాణానికి దోహదపడుతుంది. అందుకే విద్యారభంలో గురుశిష్యులు చేసే ప్రార్ధన ఇది.

No comments:

Post a Comment