Friday 31 January 2014

హిందూ ధర్మం - 8

ధర్మం చేతనే ఈ విశ్వం నడుస్తున్నది. అనంత విశ్వంలో సూర్యుడు మధ్యలో ఎలా నిలబడ్డాడు అంటే అది అతని ధర్మం కనుక. సూర్యుడు తన చుట్టూ తాను తిరగడం తన ధర్మం. ఇతర గ్రహాలను తనలో ఉండే అయస్కాంత శక్తి ద్వారా ఆకర్షించి, వాటిని తన చుట్టు తిప్పుకోవడం సూర్యభగవానుడి ధర్మం కనుకనే సూర్యుడు తన అయస్కాంతశక్తితో అంతరిక్షంలోని గ్రహాలను ఆకర్షిస్తున్నాడని, ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్పక కొన్ని లక్షల ఏళ్ళకు పూర్వమే వేదం స్పష్టం చేసింది. దీన్ని వైజ్ఞానికంగానూ, వైశేషికంగానూ మనం దర్శించవచ్చు. కానీ వీటన్నిటి వెనుక సూక్ష్మంగా ధర్మం ఉంది. భూమి తన చుట్టు తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తన నిర్దేశిత కక్ష్యలో తిరగడం భూమి ధర్మం.

ఈ సృష్టి అనేక అణువుల సమూహం. సృష్ట్యాదిలో పరమాత్మ సంకల్పం వలన జీవుల కర్మఫలం తీరడం కొరకు అణువులన్నిటి మధ్య ఒక ఆకర్షణ ఏర్పడి, భూగోళంగా, ఇతర గ్రహ నక్షత్రాలుగా ఏర్పడ్డాయి. ఈ సృష్టి అంతమయ్యేవరకు అవి అలా కలిసి ఉండాలనేది సృష్టి ధర్మం. కనుక అట్లా కలిసి ఉన్నాయి, వాటిని ఒక శక్తి కలిపి ఉంచుతోంది. అట్లాగే సృష్టి  అంతమయ్యే సమయానికి ఈ అణువులన్నీ, వేటికవి విడిపోతాయి. ఎందుకంటే అది వాటి ధర్మం, పరమాత్మ వాటి ధర్మాన్ని అలా నిర్దేశించాడు కాబట్టి. వీటికి ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పిన కారణాలను మనవాళ్ళు వైశేషికదర్శనంలో వేలఏళ్ళ క్రితమే చెప్పారు.  కానీ సూక్ష్మంలోకి వెళ్తె, వీటిని నడిపిస్తున్నదని ధర్మమే అని గుర్తించారు.

అన్నిటిని కాల్చడం అగ్ని యొక్క ధర్మంగా పరమాత్మ నిర్దేశించాడు. అది తన ధర్మాన్ని అనుసరిస్తుంది. అన్ని ద్రవపదార్ధాలు ఉన్నా, నీరు మాత్రమే దాహం తీర్చగలదు. పెట్రోల్ బావులు వంద ఉన్నా, గుక్కేడు నీళ్ళు లేకపోతే మనిషి ప్రాణం పోతుంది. దాహం తీర్చడం నీటి యొక్క ధర్మంగా పరమాత్మ పేర్కొన్నాడు కనుక నీరు దాహం తీరుస్తోంది. అట్లాగే గాలి, భూమి కూడా. ప్రోటాన్, ఎలట్రాన్, న్యూట్రాన్‌లో ఉండే పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ తత్వాలు వాటి వాటి ధర్మాలు. వాటి మధ్య ఆకర్షణ ఏర్పడడం, విద్యుత్ అయస్కాంతక్షేత్రం ఏర్పడడం ఇవన్నీ, ధర్మాన్ని అనుసరించి జరుగుతున్నవే. ఈ విధంగా ధర్మం విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే ఈ విశ్వం నడవడానికి మూలమైన సూత్రాలే (basic principles) ధర్మం.

To be continued ............

No comments:

Post a Comment