Showing posts with label వేదాంగాలు. Show all posts
Showing posts with label వేదాంగాలు. Show all posts

Sunday, 18 February 2018

హిందూ ధర్మం - 260 (జ్యోతిష్యం )



నవగ్రహాలకు పేర్లను పెట్టడాన్ని పరిశీలిస్తేనే, పురాతన భారతీయ నాగరికత వైభవం అర్దమవుతుంది.

సూర్యుడిని ఆదిత్యుడని అంటాము. ఆదిదేవ నమస్తుభ్యం అంటూ సూర్యాష్టకం ప్రారమంభమవుతుంది. సూర్యుడు లేనిదే ఈ విశ్వమే లేదన్నది మనకు తెలిసిన విషయమే.

కుజ గ్రహాన్ని భౌముడని అంటారు, అంటే భూమి పుత్రుడు అని అర్ధము. కుజ గ్రహం మీద కూడా భూమి మీద ఉన్నట్లే ఆక్సిజెన్, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రోజెన్ మొదలైన వాయువులు ఉంటాయి. కానీ వాటి గాఢత వేరు. అక్కడ కూడా 4 ఋతువులు ఉన్నాయి. అక్కడ కూడా భూమిని పోలిన కొన్ని భౌమశిలావిన్యాసాలు ఉన్నాయి.

గురువు అంటే పెద్దవాడు అని అర్దం. మన సౌరకుటుంబంలోని గ్రహాల్లో అతి పెద్ద గ్రహం కనుక దానికి గురు గ్రహం అని పేరు పెట్టారు. దాన్నే ఆంగ్లంలో జూపిటర్ అంటున్నారు. ఈ విషయం నేటి శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకుంటారు. 

శని - శని అనే పదానికి "శనైః శనైః చరః" అనే వ్యుత్పత్తి ఉంది. అంటే నెమ్మది, నెమ్మదిగా చరిచువాడు, తిరుగువాడు అని అర్ధం. మన సౌరకుటుంబంలో సూర్యుని ఒకసారి చుట్టు రావడానికి అత్యంత సమయం తీసుకునే గ్రహం శనిగ్రహం. సూర్యుడిని చుట్టి రావడానికి భూమి ఒక సంవత్సరం తీసుకుంటే, శని గ్రహం 29 1/2 సంవత్సరాలు తీసుకుంటుంది. అందుకే దానికి శనైశ్చరుడు అని పేరు. శనీశ్వరుడు కాదు. నెమ్మదిగా తిరిగేవాడు కనుక శనైశ్చరుడు.

రాహు, కేతువులు ఛాయా గ్రహాలు. వాటికి ప్రత్యక్షమైన భౌతిక ఉనికి లేకున్నా, గ్రహణ సమయంలో వాటిని చూస్తున్నాము. ఛాయ అంటే నీడ. వాటిని అంటారు. రాహువు ఉత్తర lunar node ఐతే, కేతువు lunar node.

జ్యోతిష్య శాస్త్రాన్ని తప్పు పట్టే నాస్తికులు వేసే మొదటి ప్రశ్న- సూర్యుడు నక్షత్రము, చంద్రుడు భూమికి ఉపగ్రహము. అయినా భారతీయ జ్యోతిష్య శాస్త్రం వాటిని నవగ్రహాల్లో చేర్చింది. ఇది ఎంత అసంబద్ధం, ఇది చాలు జ్యోతిష్యం మూఢ నమ్మకమని చెప్పడానికి అంటారు. గ్రహం అనే సంస్కృత పదానికి ఆంగ్లంలో ప్లానెట్ సమానర్ధం కాదు. గమనము కలిగినదాన్ని గ్రహము అన్నారు. అది కూడా ఆకాశంలో కదిలేవి అని. అంటే ఈ భూమి మీద నుంచి మనం చూసినప్పుడు, వాటి కదలికలను చూడగలగాలి. అలాంటి వాటిని గ్రహాలు అన్నారు. అందుకే భూమిని నవగ్రహాల్లో కలపలేదు.

ఇక్కడితో జ్యోతిష్యం అనే అంకం సమాప్తము.

ఇంకా ఉంది...

Sunday, 19 March 2017

హిందూ ధర్మం - 239 (జ్యోతిష్యం- 19) (కాలగణన - 3)




విష్ణుపురాణం కాలగణనం గురించి ఎంతో గొప్పగా వివరించింది.

2 అయనాలు = 1 మానవ సంవత్సరము లేదా దేవతలకు ఒక రోజు
4000+ 400+ 400 = 4800 దివ్య సంవత్సరాలు = 17,28,000 మానవ సంవత్సరాలు = 1 సత్యయుగం
3,000 + 300 + 300 = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు = 1 త్రేతా యుగం
2,000 + 200 + 200 = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు = 1 ద్వాపర యుగం
1,000 + 100 + 100 = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు = 1 కలి యుగం
4800 + 3600 + 2400 + 1200 దివ్య సంవత్సరములు = 12,000 దివ్య సంవత్సరములు = 1 మహాయుగం
17,28,000 + 12,96,000 + 8,64,000 + 4,32,000 మానవ సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు = 1 మహాయుగము

1000 మహయుగాలు = 1 కల్పము = బ్రహ్మదేవునకు 1 పగలు లేదా రాత్రి = 4,32,00,00,000 మానవ సంవత్సరములు = 4.32 బిలియన్ సంవత్సరములు
2000 మహాయుగాలు = 2 కల్పాలు = బ్రహ్మదేవునకు ఒక రోజు = 8,64,00,00,000 మానవ సమవత్సరములు = 8.64 బిలియన్ సంవత్సరములు
బ్రహ్మదేవునకు 1 మాసం = బ్రహ్మదేవునకు 30 రోజులు = 2,59,20,00,00,000 మానవ సంవత్సరాలు = 259.2 బిలియన్ మానవ సంవత్సరాలు
బ్రహ్మదేవునకు 1 సంవత్సరము = 30 రోజులు గల 12 మాసాలు = 3.1104 ట్రిలియన్ మానవ సంవత్సరములు
బ్రహ్మదేవునకు 50 ఏళ్ళు = 1 పరార్ధము
2 పరార్ధాలు = బ్రహ్మకు 100 ఏళ్ళు = బ్రహ్మ జీవితకాలం = 1 పర = 1 మహాకల్పం = 311.04 ట్రిలియన్ మానవ సంవత్సరములు
బ్రహ్మదేవుని 1 పగలు లేదా రాత్రిని 1000 భాగాలుగా విభజిస్తారు, వాటిని చరణాలు అంటారు.

4 చరణాలు = సత్య యుగము = 17,28,000 సంవత్సరములు
3 చరణాలు = త్రేతా యుగము = 12,96,000 సంవత్సరములు
2 చరణాలు = ద్వాపర యుగము = 8,64,000 సంవత్సరములు
1 చరణాలు = కలి యుగము = 4,32,000 సంవత్సరములు

ఇప్పుడు మనమున్నది ప్రస్తుతం ఉన్న బ్రహ్మగారి రెండవ పరార్ధంలో. అందుకే సంకల్పంలో అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే అని చదువుతారు. ఇప్పుడు ఆయన వయస్సు 51 సంవత్సరాలు.

To be continued ............

Sunday, 12 March 2017

హిందూ ధర్మం - 238 (జ్యోతిష్యం- 18) (కాలగణన - 2)



1 యామం- ఒక రోజులో 4 వ వంతు, 1/4 దినం≈ 3 గంటలు
1 యామం= 7½ ఘటిలు= 3¾ ముహూర్తాలు= 3 హోరలు
1 హోర= 1/24 రోజు
4 యామాలు= పగలు లేదా రాత్రి; సగం రోజు.
8 యామాలు = 1 అహోరాత్రము (పగలు+రాత్రి)
పక్షం = 15 రోజులు
శుక్ల పక్షం+ కృష్ణ పక్షం = ఒక చాంద్రమాన మాసం

పితృమానం

మానవులకు 15 రోజులు (1 పక్షం) = పితృదేవతలకు సగం రోజు
మానవుల 30 రోజుల కాలం = పితృదేవతలకు 1 రోజు
పితృదేవతల 30 రోజులు = పితృదేవతల 1 నెల = 30*30= 900 మానవదినములు
పితృదేవతలకు 12 నెలలు = 1 సంవత్సరం= 10,800 మానవదినములు
పితృదేవతల వయసు 100 సంవత్సరాలు (= పితృదేవతలకు 36,000 దినములు = 10,80,000 మానవ దినములు = 3000 మానవ సంవత్సరాలు)
దేవతలకు 1 రోజు = మానవులకు 1 సంవత్సరం
దేవతలకు 1 నెల/మాసం = దేవతల 30 రోజులు (మానవుల 30 ఏళ్ళ కాలం)
దేవతలకు 1 సంవత్సరం (దివ్య సంవత్సరం) = దేవతలకు 12 నెలల కాలం = 360 మానవ సంవత్సరములు
12,000 దివ్య సంవత్సరములు = దేవతల వయస్సు = 1 మహాయుగం

ఇక్కడ దేవతలంటే ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు ఇత్యాది దేవతలని అర్దం చేసుకోవాలి. శివ, విష్ణు, శక్తి మొదలైన వారు పరబ్రహ్మం యొక్క ప్రతిబింబాలు. పరబ్రహ్మం సనాతనము, ఎల్లప్పుడూ ఉంటుంది. మానవ జన్మ వలన కలిగిన సదవకాశాన్ని వినియోగించుకుని, శాస్త్రంలో చెప్పబడ్డ పుణ్యకర్మలను, తపస్సును ఆచరిచిన జీవులు, తమ పుణ్యకర్మ చేత స్వర్గం మొదలైన లోకాలను చేరుతారు. ఇంద్రుడు మొదలైన దేవతలుగా మారి తమ పుణ్య కర్మను అనుభవిస్తారు. భగవద్గీతలో చెప్పింటలు 'క్షీణే పుణ్యే మర్త్యలోకం విశ్మతి' అని, పుణ్యం క్షీణించగానే తిరిగి మానవ లోకంలో పుడతారు. గత జన్మలో చేసుకున్న పుణకర్మ వలన, వాసనల వలన ఉన్నతమైన సిరిసంపదలుకుటుంబంలో పుట్టి, తిరిగి ధర్మమార్గంలో నడుస్తారు.  

ఇంద్ర, వాయు, వరుణ మొదలైన దేవతలు మానవుల వంటి జీవులే. ఇంద్రాది నామాలను పదవులను సూచిస్తాయి. ఉదాహరణకు మన దేశానికి ప్రధాన మంత్రి పదవి ఉంది. ఆ పదవిలో కూర్చున్న వారు ఎవరైనా ప్రధానమంత్రి అవుతారు. అంతేకానీ ప్రధానమంత్రి అనేది జన్మతో వచ్చే పదవి కాదు. అలానే దేవలోకంలో కూడా. అయితే ఇక్కడే మనకూ, అన్యమతాలకు బేధం ఉంది. దేవ, యక్ష, కిన్నెర, కింపురుష మొదలైన ఊర్ధ్వలోకల జీవులు ఉన్నారని గుర్తించింది, వారికి కూడా ధర్మంలో స్థానం కల్పించింది కేవలం సనాతన ధర్మం మాత్రమే. ఆయా మతాలు స్వర్గం వరకే చెప్పగలిగాయి. కానీ సనాతన ధర్మం స్వర్గానికి భిన్నమైన లోకాలను సైతం చెప్పింది. అక్కడ ఇంద్రాది దేవతలు లేరు. పుణ్యకర్మను అనుభవించి, తిరిగి మర్త్యలోకంలో జన్మించడం లేదు. పునర్జన్మ సిద్దాంతానికి అవి వ్యతిరేకం. మనమున్న భూలోకంలో నిర్వహించబడే యజ్ఞయాగాది కర్మలు, ఇతర వైదిక కర్మలు కేవలం మానవుల మేలు కోసమే కాదు. ఇక్కడ జరపబడే కర్మలు అన్యలోక జీవులకు ఆహారాన్ని, శక్తిని ఇస్తాయి. ఇవి వారికి కూడా మేలు చేస్తాయి. అన్ని లోకాలను కాపాడతాయి. అందుకే హిందువులు, తమ ప్రార్థన చివరలో లోకాసమస్తాః సుఖినోభవంతు అంటారు. సమస్త లోకాలు సుఖంగా, క్షేమంగా ఉండాలని దాని అర్దం. ఇలా కోరేది కూడా సనాతన ధర్మమే. అన్యమతాల్లో తమ మతస్థులు బాగుండాలనే కోరుకుంటే, సనాతనధర్మం 'శతృబుద్ధిం వినాశాయ' - శతృవు కూడా బాగుండాలి, కానీ అతనిలోనున్న శతృత్వం నశించాలని కోరుకుంటుంది.

To be continued ..................

Source: https://en.wikipedia.org/wiki/Hindu_units_of_time

Sunday, 12 February 2017

హిందూ ధర్మం - 237 (జ్యోతిష్యం- 17 (కాలగణన))



ఇప్పుడు జ్యోతిష్యంలో మన ఋషులు కాలాన్ని ఎలా గణించారో, మామూలు వారు ఊహించని స్థాయిలో, 17 మైక్రో సెకన్ల నుంచి 311,040,000,000,000 ఏళ్ళ వరకు కాలాన్ని అతి సూక్ష్మంగా ఎలా గణించారో, ఆ వివరాలు చూద్దాం.

1 పరమాణువు- ఒక సెకన్‌లో 60,570 వ వంతు, 16.8 మైక్రోసెకను (1 మైక్రోసెకను= 1 సెకెనులో 10 లక్షల వంతు)
1 అణువు- 2 పరమాణువులు≈ 33.7 మైక్రోసెకను
1 త్రసరెణు- 3 అణువులు≈ 101 మైక్రోసెకను
తృటి- 3 త్రసరెణు≈ 1/3290 సెకన్లు; అనగా ఒక సెకనులో 3290 వ వంతు= 304 మైక్రోసెకను
1 వేధ= 100 త్రుటి≈ 47.4 మిల్లిసెకన్లు
1 లవం- 3 వేధలు≈ 0.14 సెకన్లు≈ 91 మిల్లిసెకన్లు
1 నిమేషం (కంటిరెప్ప కాలము)- 3 లవములు≈ 0.43 సెకన్లు (లెకలన్నీ దరిదాపుల్లో)
1 క్షణం- 3 నిమేషాలు≈ 1.28 సెకన్లు
1 కాష్టా- 5 క్షణాలు≈ 6.4 సెకన్లు
1 లఘు- 15 కాష్టాలు≈ 1.6 నిమిషాలు
1 దంఢ- 15 లఘువులు≈ 24 నిమిషాలు
1 ముహూర్తం- 2 దంఢలు≈ 48 నిమిషాలు
1 అహోరాత్రం- 30 ముహుర్తాలు≈ 24 గంటలు
మాసము- 30 అహోరాత్రాలు≈ 30 రోజులు
ఋతువు= 2 మాసాలు ≈ 2 నెలలు
అయనము= 3 ఋతువులు≈ 6 నెలలు
సంవత్సరము= 2 అయనాలు= దేవతలకు ఒక రోజు.
-----
1 త్రుటి= 29.6296 మైక్రోసెకన్లు
1 తత్పర= 2.96296 మిల్లిసెకన్లు
1 నిమెషం- 88.889 మిల్లిసెకన్లు
45 నిమెషాలు - 1 ప్రాణ= 4 సెకన్లు
6 ప్రాణాలు- 1 వినాడి- 24 సెకన్లు
60 వినాడి(లు)- 1 నాడి- 24 నిమిషాలు
60 నాడులు= 1 అహోరాత్రము
--------


ఆధునిక ప్రమాణాల ప్రకారం, 24 గంటలు అంటే ఒక పగలు, రాత్రి. మనం గమనించేది 1 నాడి లేదా దంఢం= 24 నిమిషాలు, 1 వినాడి= 24 సెకన్లు, 1 ఆసు/ ప్రాణం= 4 సెకన్లు ........ 1 తృటి= 1 సెకనులో 33,750 వంతు. అసలు ఇంత చిన్న కాలాన్ని మన ఋషులు లెక్కించడమే ఆశ్చర్యం కదూ.

సూర్య సిద్ధాతం కాలాన్నివాస్తవికంగాను, వ్యవహారికంగానూ చెప్పింది. Virtual భాగాన్ని మూర్తం అని, Practical భాగాన్ని అమూర్తం అని చెప్పింది. ప్రాణం (ఊపిరి) పీల్చుకునే కాలంతో మొదలయ్యేది సత్యమని, తృటితో మొదలయ్యేది నిత్యజీవితంలో అవసరంలేనిదని చెప్పింది. 1 ప్రాణం అంటే, ఆరోగ్యవంతమైన మనిషి 1 సారి ఊపిరి పీల్చి విడువడానికి పట్టే సమయం లేదా గురువక్షరం అనే 10 అక్షరాలను పలికే సమయం.

To be continued ..............

Source: http://www.sanskritimagazine.com/indian-religions/hinduism/concept-measurement-time-vedas/
https://en.wikipedia.org/wiki/Hindu_units_of_time
http://veda.wikidot.com/vedic-time-system

Sunday, 5 February 2017

హిందూ ధర్మం - 236 (గ్రీకు సాహిత్యంలో వైదిక ధర్మం)



గ్రీకు పండితుడు సెక్యులస్ అంటాడు, 'పోలిబ్రోత (పాటలిపుత్ర, ఈనాటి పాట్నా) నగరం శాండ్రకోటస్‌కు (చంద్రగుప్త మౌర్యునికి గ్రీకులు పెట్టిన పేరు) 138 తరాల ముందు హెర్కులస్ (శ్రీ కృష్ణుడు) స్థాపించాడు'. దీనిని అనుసరించి కృష్ణుడు క్రీస్తు పూర్వం 3300 కాలమానికి చెందినవాడని గ్రహించవచ్చు.

కృష్ణుడి జీవితంలో జరిగిన సంఘటనలనే గ్రీకులు తీసుకుని, తమకు అనుగుణంగా కధలు రాసుకున్నారు. అందులో కొన్ని;
కృష్ణుడు కాళీయ మర్దనం చేసి, కాళింగుడనే సర్పం యొక్క అహంకారాన్ని అణిచివేస్తాడు. దాన్ని చంపకుండా వదిలేసి, యమునను విడిచి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. అలగే హెర్కులస్ కూడా హైడ్రా అనే సర్పాన్ని చంపకుండా, దాని నెత్తి మీద పెద్ద బండరాయిని పెడతాడు.

కృష్ణుడు పక్షి రూపంలో వచ్చిన బకాసురిని చంపుతాడు. హెర్కులస్ కూడా రాకాసి పక్షులను మట్టుపెడతాడు.
కృష్ణుడు అరిష్టాసురుడనే ఎద్దును వధిస్తాడు, హెర్కులస్ క్రెటన్ అనే ఎద్దును వధిస్తాడు.
రాక్షసుడు కేశి అనే పేరుతో గుఱ్ఱం రూపంలో రాగా, దాన్ని మట్టు పెడతాడు కృష్ణ పరమాత్ముడు. హెర్కులస్ జీవితంలో కూడా ఈ ఘటన చూపిస్తారు.

కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని గోవులను, గోపాలకులను, వారి పరివారాలను రక్షిస్తాడు. దీన్నే గ్రీకులు హెర్కులస్ భూమిని మోసినట్లుగా చూపించారు.

దేవకీ దేవి 8 వ గర్భంలో జన్మించే పిల్లవాడు తనకు మృత్యువని, అతడి పట్ల శత్రుత్వం పెంచుకుంటాడు మేనమామ అయిన కంసుడు. కృష్ణుడిని చంపటానికి ఎంతో మంది రాక్షసులను పంపుతాడు. పిల్లలకు విషమున్న పాలిచ్చి చంపమని పూతనను పంపుతాడు. సరిగ్గా అటువంటిదే హెర్కులస్ జీవితంలో కూడా జరుగుతుంది. అతడి సవతి తల్లి హీరా, అతడిని చంపమని రెండు విష సర్పాలను పంపుతుంది.

ఇలా గ్రీకుల నోట సనాతన సంస్కృతికి చెందిన విషయాలు ఆ కాలంలోనే పశ్చిమాన వినిపించాయి. అయితే ఇవన్నీ చూపి, మనమే గ్రీకుల నుంచి అన్నీ కాపీ కొట్టామని, మనవన్నీ కల్పితాలని, మనకంటూ ఏదీ లేదని మన దేశపు కుహనా- మేధావులు, మతమార్పిడి వెధవులు చెప్తారు. కధలను కాపీ కొట్టామని వారు వాదించవచ్చు, కానీ కృష్ణుడు ఏలైన ద్వారక ఈ నాటికి భారతదేశంలో పశ్చిమాన ఉన్న గుజరాత తీరంలో, అరేబియా సాగర గర్భంలో ఉన్నది. దాని మీద పురావస్తు పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. దేశవిదేశాల్లో ఉన్న ఎందరో శాస్త్రవేత్తలు ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఆ ద్వారకను కూడా కాపీ కొట్టామంటారా ఈ మేధావులు? మనమే ఓ నగరం కట్టి సముద్రంలో ముంచేశామని చెప్పుకొస్తారా? మన దేశంలో పరీక్షిత్తు మహారాజు జరిపిన సర్పయాగానికి సంబంధించి దొరికిన ఆనవాళ్ళు, ఇతర రాజులు వేసిన తామ్ర శాసనాలు ఆకాశం నుంచు ఊడిపడ్డాయని చెప్తారా? (ఈ శాసనాల గురించి, ద్వారక గురించి ఇదే శీర్షికన 138 నుంచి వరుసగా 142 వరకు ప్రచురించడం జరిగింది. అది చూడగలరు.)

క్రీ.పూ. 190-188 మధ్య అగాతోక్లస్ ఆఫ్ఘనిస్థాన్ లో  అనే ప్రాంతాన్ని పాలించాడు. అతడు చతురస్ర, దీర్ఘ చతురస్రాకారంలో ఉండే కొన్ని బంగారు, వెండి, కంచు నాణేలను ముంద్రించాడు. వాటిపై శివ, విష్ణు, బలరామ, బుద్ధుడి ముద్రలు ఉన్నాయి. వీటి మీద బ్రాహ్మీ లిపిలో ఇవి రాజు అగాతోక్లయసకు చెందినవని ఉంది. 180 కాలానికి చెందిన డేటింగ్ లో నిర్ధారించబడిన చత్రురస్రాకార నాణేలు ఈ మధ్యే ఆఫ్ఘనిస్తాన్ తవ్వకాల్లో బయటపడ్డాయి. అందులో ఒకవైపు బలరాముడు, ఇంకో వైపు కృష్ణుడు ముద్రించబడి ఉన్నారు. దీన్ని బట్టి అంతకు పూర్వమే ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌లలో కృష్ణుడి ఆరాధన ఉండేదని తెలుస్తున్నది.

గ్రీకు రాయబారి హెలియోడొర్స్‌కు కృష్ణుడంటే చాలా ఇష్టమట. అందుకే ఆయన గరుడ ద్వజాలు పాతించాడు. అందులో తనకు కృష్ణుడంటే ఇష్టమని, తాను భగవతుడినని, సనాతన ధర్మాన్ని అవలంభిస్తున్నానని, భాగభద్రుడు ఆస్థానికి వచ్చానని శాసనం వేయించుకున్నాడు. అది క్రీ.పూ.113 కు చెందినది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉంది.

చంద్రగుప్త మౌర్యుడు ఆశోకుని తాత. ఆయన ఒక యుద్ధంలో గ్రీకు పాలకుడైన సెక్యులస్‌ను ఓడించాడు. ఆ తర్వాత సెక్యులస్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. దీనివలన భారతదేశం యొక్క ప్రభావం అతిదూరాన ఉన్న గ్రీకుపై కూడా బలంగా పడింది.

భారత్, గ్రీకు నుంచి ఏమీ తీసుకోలేదని, గ్రీకుకే జ్ఞానదానం చేసిందని చెప్పడానికి ఇలా చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు తారపడతాయి.

To be continued ........

Source: http://experiencehinduism.com/interesting-stories/heracles-derived-from-krishna

Sunday, 29 January 2017

హిందూ ధర్మం - 235 (గ్రీకు సాహిత్యంలో వైదిక ధర్మం)



మనకు, గ్రీకు నాగరికతకు మధ్య చక్కని సంబంధాలు ఉండేవి. గ్రీకులు మన నుంచి అనేకం తీసుకున్నారు. ముఖ్యంగా గ్రీకు కథలు సనాతన ధర్మ ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని రాసుకున్నవే. ట్రోజన్ వార్ అనేది స్కూల్ పాఠ్యపుస్తకాల్లో ఆంగ్లంలో ఉంది. ఆ ట్రాజన్ వార్ మహాభారతాన్ని ప్రేరణగా తీసుకుని గ్రీకులు రాసుకున్న కథ.

  • మహాభారతంలో పాండవులు 14 ఏళ్ళు వనవాసానికి వెళతారు. ట్రాజన్ యుద్ధం 14 ఏళ్ళు జరిగింది. మహాభారతం ప్రారంభంలో అర్జునుడు యుద్ధానికి సుముఖంగా ఉండడు. 
  • ట్రాజన్ యుద్ధంలో కూడా అకిల్లిస్, యుద్ధం చేయడానికి ఇష్టపడడు. అర్జునుడు, తన కుమారుడైన అభిమన్యుడి శవం మీద పడి రోదించి, ఆ తర్వాత రోజు జయధ్రథుడిని చంపుతానని శపధం చేస్తాడు. అచిల్లిస్ కూడా తన సోదరుడు పాట్రోకులస్ మృతికి రోదించి, మరుసటి రోజు హెక్టర్ ని చంపుతానని శపధం చేస్తాడు. 
  • ఘటోత్కచుడు, కౌరవుల సైన్యంపై రాత్రి సమయంలో దాడి చేసి, తీవ్రమైన వినాశనం కలిగిస్తాడు. అగ్నిని ఆయుధంగా వాడి, కౌరవ శిబిరాలను దగ్ధం చేస్తాడు. హెక్టర్ కూడా గ్రీకు సైన్య శిబిరలపై దాడి చేసి, వినాశనం కలిగిస్తాడు. అప్పుడు కూడా అగ్నినే ఆయుధంగా వాడతాడు. 
  • సంజయుడు యుద్ధాన్ని ధృతరాష్ట్రునకు చెప్తాడు. అలాగే ట్రాజన్ రాజుకు మంత్రి యుద్ధాన్ని వివరిస్తాడు. 
  • ధృతరాష్ట్రునకు 100 కుమారులు, ట్రాజన్ రాజుకు 68 పుత్రులు, 18 పుత్రికలు. 
  • అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కలిసి పాండవుల శిబిరం వద్దకు వెళ్ళగా, కృపాచార్య, కృతవర్మ, ద్వారాల వద్దనే ఉండిపోతారు. ఆశ్వత్థామ లోపలకు వెళ్ళి, ఉపపాండవులను చంపుతాడు. రక్తపాతం సృష్టిస్తాడు. అలాగే ట్రాజన్ నగరాన్ని గెలవటానికి ట్రాజన్ గుఱ్ఱం అన్నేది కుట్రపూరితమైన చర్య. అది కూడా ఎన్నో విఫల యత్నాల తర్వాత. చివరి రోజు రాత్రి దాని ద్వారా యుద్ధం చేస్తారు. (1)
క్రీ.పూ.300 వ చెందిన మెగస్థీనిస్, శ్రీ కృష్ణ కథలను గ్రీకుకు తీసుకువెళ్ళాడని, ఆయన్ను హెర్క్యులస్ అని పిలిచాడని, అలా కృష్ణుడు హెర్క్యులస్‌గా గ్రీకు సాహిత్యంలో చేరాడని చెప్తారు. మెగస్థీనిస్ భారతదేశమంతా పర్యటించి, అతను చూసినవి, విన్నవి 'ఇండికా' అనే తన గ్రంథంలో రాసుకున్నాడు. చంద్రగుప్త మౌర్యుని కొలువులో ఆయన ఇలా చెప్పుకున్నాడు, శౌరశేనోయి అనే భారతీయ తెగ ప్రత్యేకించి హెర్క్యులస్‌ని పూజించేది, మరియు వారికి రెండు నగరాలున్నాయి, మెథోర, క్లేసిబొర, నౌకయానానికి వీలుగా ఉన్న జొబరెస్ అనే నది.

గ్రీకులకు సంస్కృతం పలకడంలో అస్పష్టత కారణంగా తప్పుగా పేరలను పలికాడని అనేకమంది పండితులు పేర్కొన్నారు. ఎడ్విన్ ఫ్రాన్సిస్ బ్రయంట్ ఏమంటారంటే 'శౌరశేనోయి అనగా కృష్నునికి చెందిన యాదవ వంశపు శూరశేనులు, హెర్కులస్ అనేది హరే కృష్ణకు అపభ్రంశ పదం, మెథోర అనేది శ్రీ కృష్ణ జన్మస్థానమైన మధుర, క్లేసిబొర అనేది కృష్ణ పురం, జోబరెస్ అనేది యమునా నదికి అపభ్రంశం. (2)

To be continued .............



Sunday, 15 January 2017

హిందూ ధర్మం - 234 (జ్యోతిష్యం - 16)



వారి మీద మన ప్రభావం అధికంగా ఉండేది. మనకు వారానికి 7 రోజులు, వారు అదే తీసుకున్నారు. మనకు సంవత్సరానికి 12 నెలలు. కలియుగంలో అది చైత్రం నుంచి మొదలవుతుంది, ఫాల్గుణంతో ముగుస్తుంది. వారు కూడా 12 నెలల లెక్క తీసుకున్నారు. అందులో ఆ నెలలకు కాలక్రమంలో ఆగస్టస్ మొదలైన రాజులు పేర్లు పెట్టినప్పటికీ, సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు ఉన్న నెలల పేర్లకు అర్దం మాత్రం మారలేదు. ప్రస్తుత గ్రిగేరియన్ క్యాలెండర్‌కు పూర్వం, జూలియన్ క్యాలెండర్ ఉండేది, దానికి పూర్వం రోమన్ క్యాలెండర్ ఉండేది. వారు వీటికి ఏ ప్రాతిపదికన పేర్లు పెట్టారంటే సెప్టెంబరు అంటే 7 నెల (సప్త =సెప్టే) అని అర్దం. అక్టోబరు అంటే 8 వ నెల (అష్ట = అక్టో), నవంబరు 9 వ నెల (నవ = నవ), డిసెంబరు 10 వ నెల (దశ = డిసెం). ఇంతకీ ఇవి ఎవరికి? హిందువులకు. హిందువులకు చైత్రంతో సంవత్సరం ప్రారభమవుతుంది. అంటే మార్చి - ఏప్రిల్ మధ్య. అక్కడి నుంచి క్రమంగా లెక్కించుకుంటూ వస్తే, మనకు 7, 8, 9, 10 నెలలని మనము ఏది అంటూన్నామో, వారూ దాన్నే స్వీకరించారు. ఇంతకంటే ఋజువేమీ కావాలి? వారు మన దగ్గరి నుంచి జ్యోతిష్యం, కాలగణనం తీసుకున్నారని చెప్పడానికి.

మనము మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటాము. ఇప్పుడు సంక్రాంతి జనవరి నెల 14, 15 తేదీల్లో వస్తోంది. వివేకానంద స్వామి జన్మించింది మకర సంక్రాంతి రోజున, జనవరి 12, 1863 లో. అంటే అప్పట్లో సంక్రాంతి జనవరి 12. భూమి అయనగతి (Axial precession) కారణంగా sidereal zodiac అసలు స్థితిలో ప్రతి 72 ఏళ్ళకు 1 డిగ్రీ మార్పు వస్తుంది. అందువలన మకర సంక్రాంతి ప్రతి కొనేళ్ళకు (నిర్ణీత సమయానికి) ఒక రోజు ముందుకు జరుగుతుంది. దీనికి ఈనాడు శాస్త్రవేత్తలు చెప్పే శీతాకాల అయనాంతం (వింటర్ సొలిస్టిక్) కు సంబంధం ఉంది. ఇలా వెనక్కు లెక్కించుకుంటూ పోతే, చరిత్రలో ఒకానొక సమయంలో మకర సంక్రాంతి, వింటర్ సొలిస్టిక్ ఒకటే రోజున జరిగిన సందర్భం ఉంది.

The actual position of winter solstice in the sidereal zodiac changes gradually due to the Axial precession of the Earth, shifting westwards by approximately 1 degree in every 72 years. Hence, if Makara Sankranti at some point of time did mark the actual date of winter solstice, it would have been so around 300 CE, the heyday of Indian mathematics and astronomy

ఇది ముఖ్యంగా గ్రీకు సామ్రాజ్యం వర్దిల్లిన కాలంలో, అంతకు ముందు మహాభారత కాలంలో కూడా ఉండి ఉండవచ్చు. ఇలా లెక్కించుకుంటూ పోతే, పరాశర మహర్షి సమాజంలో మానవ దేహంతో సాధారణంగా తిరిగిన రోజుల్లో డిసెంబరు 25 న మకర సంక్రాంతి జరుపుకుందీ ప్రపంచం. మహాభారత యుద్ధం కేవలం సైనికులనే కాదు, మహర్షులను, వేద పండితులను, బ్రాహ్మణులను సైతం బలి తీసుకుందని, ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ధర్మ ప్రచారకులు లేక ధర్మ ప్రచారం సన్నగిల్లిందని అన్నారు మహర్షి దయానంద సరస్వతీ. తిరిగి భారతీయులు క్రీస్తు పూర్వం నాటికే గ్రీకులుతో వ్యాపర సంబంధాలు కలిగి ఉండి, అక్కడ కాలనీలు ఏర్పరుచుకోవడంతో మళ్ళీ అక్కడికి ధర్మ పవనాలు వీచాయి. అలా గ్రీకులు కూడా మన దేవతలనే తీసుకుని పూజించారు. భారతీయులు మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడిని పూజిస్తారు. దానినే గ్రీకులు స్వీకరించారు. అప్పుడు మకర సంక్రాంతి జరిగింది డిసెంబరు 25 న. వారు కూడా దాన్ని సెలవు దినంగా, పవిత్ర దినంగా భావించి సుర్యారాధన చేశారు. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం కుప్పకూలి రోమన్ సామ్రాజ్యం నిర్మితమైంది. వారు కూడా ఈ ఆచారాన్ని విడువలేదు. పైగా డిసెంబరు 17 నుంచి 25 వరకు సెలవు రోజు పాటించి, వారం పాటు పండుగ చేసుకున్నారు. ఆ తర్వాత క్రైస్తవం పుట్టింది. అది రోమన్, గ్రీకు నాగరికతలను, తనలో కొంత కలుపుకుని, కలుపుకోవడానికి విరుద్ధంగా ఉన్నవాటిని అవతల పారేసింది. గ్రీకు, రోమన్ నాగరికతలను పురావస్తు శాలలకు పరిమితం చేసింది. దీని గురించి రాజీవ్ మల్హోత్రా గారు అద్భుతంగా చెప్తారు. Digestion అనే concept ను సృష్టించి, దీన్ని విశదీకరించారు. అలాంటి సందర్భంలో రోమన్లు సూర్యుని కోసం నిర్వహించే పండుగలో Sun కు బదులుగా Son (As per Christian belief, Jesus is the son of God)ను తీసుకువచ్చింది. నిజానికి జీసెస్ పుట్టింది మార్చి, ఏప్రియల్ కాలంలో. ఆయన డిసెంబరు 25 న పుట్టినట్లు చరిత్రలో కానీ, బైబిల్ లో కానీ ఏ విధమైన ఆధారం లేదు. నిజానికి క్రిస్టమస్ పేగన్ల పండుగ. విగ్రహారాధన, చెట్లను, నదులను, జంతువులను పూజించడం బైబిల్ అంగీకరించదు. క్రిస్టమస్ ట్రీ అనేది కూడా స్థానికి జాతులు (హిందువులు!?) పూజించే వృక్షం. అక్కడి వారిని మతమార్పిడి చేసి, ఆ మతాన్ని నాశనం చేయడం కోసం, క్రైస్తవం, అక్కడి స్థానిక తెగల వారి ఆచారాలను కాపీ కొట్టింది. మా దగ్గర కూడా చెట్లను పూజిస్తారు, సరిగ్గా డిసెంబరు 25 నే మేము పండుగ చేసుకుంటాము అంటూ ............ ఇప్పుడు భారతదేశంలో వేంకటేశ్వర సుప్రభాతాన్ని పోలిన ఏసు సుప్రభాతం, ఆలయాన్ని పోలిన చర్చి నిర్మాణం, అందులో ధ్వజస్థంభం, సన్యాసులను పోలిన వస్త్రధారణ, క్రైస్తవులు కూడా ఏసు మాల ధారణ, వేదాలు, ఉపనిషత్తులు ఏసు ......... ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నట్లే అక్కడ చేశారు. వాళ్ళు మనలని కాపీ కొట్టడం కాదు, అనుకరించి, మీ దగ్గర ఉన్నవే మా దగ్గరా ఉన్నాయి, కనుక మారినా మీరేమీ నష్టపోరు అంటూ మార్చే ప్రయత్నం (మన ఆత్మ సిద్ధాతాన్ని అనుకరించలేరు, మూలాలను కాపీ చేస్తే క్రైస్తవమే అంతరిస్తుంది). ఇప్పుడు మనం అంటాం కదా, నదులన్నీ సముద్రంలోనే కలవాలి, మతాలన్నీ హిందూత్వంలోనే కలవాలి అని. బహుసా వాళ్ళు కూడా అప్పుడు అలా అనుకున్నారో లేదో కానీ ఇదే వ్యూహాన్ని క్రైస్తవులు అమలు పరిచి ఎన్నో మతాలను నాశనం చేశారు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి.

విషయంలోకి వస్తే, అలా గ్రీకు, రోమన్లు జరుపుకునే మకర సంక్రాంతి నేటి క్రిస్టమస్ అయ్యింది.

To be continued ...............

Sunday, 18 December 2016

హిందూ ధర్మం - 233 (జ్యోతిష్యం - 15)



ఆధునిక పరిశోధన కూడా ప్రకారం గ్రీస్, ఇతర నాగరికతలలాగే తనకంటే వైభవంగా విలసిల్లుతున్న నాగరికతల నుంచి జ్ఞానం తీసుకుని, తనలో కలుపుకుని, తన ఆలోచనలో భాగం చేసుకుందని స్పష్టం చేసింది. సోక్రటీస్‌కు ముందే గ్రీస్‌లో హిందువులు నివసించారని కొందరు పాశ్చాత్య చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గ్రీకులో సన్యాసానికి దగ్గరగా కొన్ని సంప్రదాయలుండటం గురించి Egypt మరియు Israel (1911) గ్రంధ రచయిత,  Professor Sir Flinders Patrie (1853-1942) అంటారు- క్రీ.పూ. 480 నాటికే పర్షియన్ సైన్యంలో ఎంతో పెద్ద సంఖ్యలో భారతీయ సేనలు ఉండటం, భారతదేశం మరియు గ్రీస్ మధ్య సంబంధాలు ఎంత వరకు వెళ్ళాయో చెప్తోంది. ఈజిప్ట్‌లోని Memphis అనే ప్రాంతంలో దొరికిన క్రీ.పూ. 5 వ శతాబ్దానికి చెందిన భారతీయుల modeled heads, భారతీయులు వర్తకం కోసం అక్కడ నివసించారని చెప్తున్నాయి. అందువల్ల నూతనమైన పాశ్చాత్య ఆధ్యాత్మికతకు భారతీయతే మూలమని ఎటువంటి కష్టం లేకుండా తేల్చవచ్చు.

సోక్రటీస్ శిష్యుడైన ప్లాటో, తన గురువు రచనలే కాక, కొన్ని తాను కూడా గ్రంధస్థం చేశాడు. అవన్నీ హిందూ సిద్ధాంతాలకు, ఉపనిషద్ బోధనలకు దగ్గరగా ఉంటాయి.  ప్లాటో కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మాడు. నిజానికి ఇది ప్లాటొ కంటే శతాద్బం ముందే జీవించిన పైధాగోరస్, భారతదేశంలో గంగా తీరంలో చదువుకున్న తర్వాత, అక్కడ ప్రతిపాదించాడని జెర్మన్ చరిత్రకారులు 17 వ శత్బాదంలోనే అభిప్రాయం వ్యక్తం చేశారు (ఈ విషయం ఇంతకుపూర్వ భాగాల్లో చెప్పుకోవడం జరిగింది). ఈ విధంగా ఈ రోజు పాశ్చాత్య ప్రపంచం తమ ఆలోచనకు మూలపురుషులుగా కొలుస్తున్న ముగ్గురి మీద సనాతనధర్మం యొక్క ప్రభావం ఉంది. కాకపోతే ఆ తర్వాతి వారు ఉపనిషత్తులను పరిశీలించని కారణంగా, వారి ఆలోచన వక్రమార్గం పట్టి ప్రపంచ నాగరికతల నాశనానికి దారి తీసింది. ఇది ఆ తర్వాత కూడా కొనసాగింది. క్రీ.పూ. 2 వ శత్బాదానికి చెందిన అఘతా క్లోస్ అనే గ్రీకు రాజు, శ్రీ కృష్ణుడు, బలరాముడి ముద్రలున్న వెండి నాణేలను ముద్రించాడు. ఇది అక్కడి పురావస్తుశాలలో చూడవచ్చు.

గ్రీకు రాయబారి, మెగస్తనీస్, భారతదేశ సౌభగ్యాన్ని గురించి వివరంగా రాసి పెట్టాడు. గ్రీకు పతనమైన రోమన్ సామ్రాజ్యం స్థాపించబడిన తర్వాత కూడా వాళ్ళకు, మనకు మధ్య వ్యాపారలావాదేవీలు, వాణిజ్యం ఏమాత్రం తగ్గలేదు. రోమన్లు, అప్పట్లో బ్రహ్మాండమైన నౌకాబల సంపన్న దేశంగా ఉన్న భారతదేశం నుంచి చేసుకునే దిగుమతుల నిమిత్తం, ఏడాదికి 5 కోట్ల సెస్టర్సులు (50,00,000 డాలర్లు) ఖర్చు పెట్టేవారని ప్లీనీ (క్రీ.శ. 1 వ శతాబ్ది) అంటాడు. ఆ తర్వాత అక్కడ క్రైస్తవ మతవ్యాప్తి పెరిగింది. క్రైస్తవంలో కూడా ఎన్నో ఆదర్శాలను సనాతన ధర్మం, బౌద్ధ మతాల నుంచి తీసుకున్నారని ఎందరో అభిప్రాయపడ్డారు. భారతదేశ సంపదల గురించి ప్రస్తావిస్తూ బైబిల్ ( II క్రానికల్స్ 9:21.10) అంటుంది, "తార్షీష్ ఓడలు, బంగారం, వెండి, దంతం, కోతులు, నెమళ్ళు మాత్రమే కాకుండా ఆల్గం (చందనం) చెట్ల కొయ్య, రత్నాలు కూడా సమృద్ధిగా, ఓఫిర్ (బొంబాయి తీరంలో ఉన్న సోపారా) నుంచి తెచ్చి సాలమన్ రాజుకు ఇచ్చాయని చెబుతోంది". ఆఖరికి పరమత 'దైవ' గ్రంధాల్లో కూడా హిందూదేశ వైభవం ప్రస్తావించబడింది. అంటే అప్పట్లో ఆ గ్రంధకర్తల మీద మన దేశ ప్రభావం ఎంతగా ఉండేదో గమనించవచ్చు.

To be continued .............

వివరాలకు క్రింది లింకులు పనికి వస్తాయి.
http://historydetox.com/pythagoras-plato-and-india/
http://www.hinduwisdom.info/India_and_Greece.htm
https://ramanan50.wordpress.com/2014/03/30/vedic-hinduism-in-germany-greece-russian-veda/

Sunday, 11 December 2016

హిందూ ధర్మం - 232 (జ్యోతిష్యం - 14)



మరి మనం గ్రీకుల నుంచి జ్యోతిష్యం స్వీకరించామా? వారు ఇక్కడి నుంచి తీసుకున్నారా? కలియుగం ప్రారంభంలో కొంతకాలం వరకు ప్రపంచమంతా సనాతన ధర్మమే వ్యాపించి ఉంది. మహాభారత యుద్ధం నాటికి వైభవోపేతంగా విలసిల్లింది. ఈ విషయం మీద మనం ఇదే శీర్షికన ప్రరురిచిన అనేక భాగాల్లో దానికి ఆధారాలు కూడా చూశాము. ఈ గ్రీకు, రోమన్ నాగరికతలు కూడా హిందూ ధర్మం నుంచి వేరుపడ్డవే. మహాభారత యుద్ధం తర్వాత యుగాంతం యొక్క ప్రభావం చేత ప్రపంచంలో అనేక మార్పులు సంభవించాయి. సరస్వతీ నది ఎండిపోయింది, అప్పుడు కొంతమంది ఈ భరతఖండం నుంచి పశ్చిమ దిశగా వెళ్ళారు. కొందరు ఈజిప్టులో స్థిరపడ్డారు. కొందరు ఇంగ్లాండ్, గ్రీకు దేశాల దిశగా మళ్ళారు. ఇంతకముందు యుగాల మాదిరిగా ఋషులు దేశపర్యటనలు చేసి ధర్మప్రచారం చేయలేదు, ఈ యుగప్రభావంగా. అలా అక్కడున్న సంస్కృతుల వారు సనాతనధర్మ మూల సూత్రాలకు దూరమయ్యారు. ఆస్ట్రేలియాలో కొన్ని స్థానిక తెగలున్నాయి. వారికి మనలా అగ్నిహోత్రం, యజ్ఞ ప్రక్రియ ఉంది. మంట రగిల్చి, దానిలో ఆకులు, కట్టెపుల్లలు వేస్తూ, హా!హా! అంటూ అరుస్తారు. వేదంలో చెప్పబడ్డ స్వాహా కారం కాలక్రమంలో అక్కడ అలామారింది, మూలగ్రంధాలతో సంబంధం తెగిపోయి. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంతేందుకు, గ్రీకులకు కూడా భారతదేశమే తమ గురువనే భావన బలంగా ఉండేది. క్రీ.పూ. 326 లో అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్రకు వచ్చాడు, కోటా వేంకటాచలం గారు నిర్ధారించిన చారిత్రిక ఆధారాల పరంగా, అలాగే గ్రీకు చరిత్ర ఆధారంగా.  

అలెగ్జాండర్ విశ్వమంతా జయించి వస్తానని తన గురువు అరిస్టాటిల్ వద్దకు వెళ్ళినప్పుడు నువ్వు ప్రపంచంలో ఏ దేశం మీదకైనా వెళ్ళు, కానీ భారతదేశం మాత్రం వెళ్ళకు, అక్కడికి వెళితే నీ ఆటలు సాగవు, నీ పనైపోతుంది అంటాడు. అయినా వినకుండా భారతదేశం మీదకు వస్తాడు, అది తెలుసుకున్న అరిస్టాటిల్, నువ్వెలాగో నా మాట వినకుండా భారతదేశం వెళ్ళావు, కనీసం అక్కడి నుంచి వచ్చేటప్పుడు నీతో పటు 5 వస్తువులు తీసుకురా!ఒకటి భారతదేశం మట్టి. ఎందరో ఋషులు, గురువులు, మహాపురుషులకు జన్మనిచ్చిన మట్టి అది. అక్కడ అనేకమంది ఆ మట్టిపై తిరిగారు. దాన్ని నీవు తీసుకువస్తే, నేను దాన్ని పవిత్రంగా భావించి పూజించుకుంటాను. అలగే గంగాజలం తీసుకురా. అది ఎప్పటికి పాడవ్వనిది, పవిత్రమైనది. మూడవది భగవద్గీత, నాలుగు భాగవతం తిసుకురా, ఐదవది, ముఖ్యమైనది, అక్కడి నుంచి ఒక గురువును తీసుకొనిరా. ఆయన్ను నేను గురువుగా చేసుకుంటాను అన్నాడు. అలెగ్జాండర్ మనదేశం మీద యుద్ధానికి రావడం, ఓడిపోవడం, ఇక్కడి బ్రాహ్మణులతో శాస్త్ర చర్చలు జరిపి, వాళ్ళ జ్ఞానానికి మెచ్చి, కొందరిని అక్కడికి తనతో పాటు తీసుకెళ్ళడం జరిగింది. దారిలో ఒక సాధువుకు చేసిన అపచారం కారణంగా, అతని శాపానికి గురై, ఆ శాపవశాత్తు తన మాతృభూమికి చేరకుండానే రోగం వచ్చి మరణించాడు గ్రీకువీరుడు. అలా అలెగ్జాండర్‌తో వెళ్ళిన బ్రాహ్మణ పండితులు గ్రీకువారికి జ్ఞానోదయం చేశారు. అంతేకాక అలెగ్జాండర్ భారతదేశం నుంచి పరాజయంతో తిరిగి వెళుతూ తనతో పాటు ఎన్నో ధార్మిక గ్రంధాలను తీసుకువెళ్ళాడు. అలా సనాతన జ్ఞానం గ్రీకు అంధకారాన్ని నశింపజేసింది.

ఈనాడు పాశ్చాత్య ప్రపంచం తన ఆలోచనా విధానానికి ముగ్గుర్ని మూల పురుషులుగా చెప్తుంది, ఒకరు సోక్రటిస్, రెండు ప్లాటో, మూడు అరిస్టాటిల్.   వాళ్ళే కాదు, మన దేశంలో అభ్యుదయవాదులుగా చెలామణి అవుతున్న కుహనా మేధావులు, నాస్తికులు కూడా వీరినే గురువులుగా భావిస్తారు. అరిస్టాటిల్ గురించి చెప్పుకున్నాం. మిగిలింది సోక్రటీసు, ప్లాటో. సోక్రటీస్‌కూ ఒక హిందు మునికి జరిగిన వాగ్వాదాన్ని గురించి 'యూసేబియస్'లో ఒక చోట ఇలా చెప్పడం జరిగింది. సోక్రటీస్ ఆ హిందూ మునిని అఘోర లేదా మార్కెట్ స్థలంలో కలుసుకున్నాడు. ఆ హిందూముని సోక్రటీస్ ను నీవేమీ చేస్తున్నావని, నీ తత్త్వం విషయ విస్తృతి ఏమిటని అడిగాడు. దానికి సోక్రటీస్ మానవ దృగ్విషయాల అనుశీలన అని జవాబిచ్చాడు, కాగా ఆ భారతీయుడు విరగబడి నవ్వాడు. దివ్య విషయాలను ఎరగనప్పుడు, మానవ దృగ్విషయాలను మనిషి ఎలా అనుశీలన చేయగలడని అంటాడు.

మనకు అర్దమయ్యేలా చెప్పుకోవాలంటే సోక్రటీసు 'నేను మనిషిని అర్దం చేసుకోవడం కొరకు మనుషుల్ని ప్రశ్నిస్తున్నాను' అంటాడు. అప్పుడా హిందూముని గట్టిగా నవ్వి, భగవంతుని/ ఆత్మను అర్దం చేసుకోకుండా మనిషిని ఎలా అర్దం చేసుకుంటారని అంటాడు. పాశ్చాత్య తత్త్వశాస్త్రాల్లో ప్రతిధ్వనించే గ్రీకు ఆదర్శం: 'మనిషి, నువ్వు స్వయంగా తెలుసుకో' (Man, Know thyself). హిందువు అనేది 'మనిషీ, నీ ఆత్మను తెలుసుకో' (Man, Know thy Self) అని. నేను ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నాను (I think, therefore I exist) అనేది పశ్చిమ దేశాల్లో బాగా కనిపిస్తుంది. అది డెకార్ట్ (Descartes) అన్న వాక్యం. కానీ అది తాత్త్వికంగా చెల్లదు. భారతీయుడంటాడు నేను ఉన్నాను, కనుక నేను ఆలోచిస్తున్నాను (I Exist, therefore I think). ఎందుకంటే తార్కిక వివేచన శక్తులు మానవుడి పరమ సత్యాన్ని వెల్లడించలేవు. మానవ మనస్సు, అది గుర్తించే పరిణామశీల ప్రపంచంలాగే శాశ్వత పరివర్తనలో ఉన్నది. అంతిమ నిర్ణయాలను అది అందించలేదు. బుద్ధి సంబంధమైన సంతృప్తి అత్యున్నత లక్ష్యం కాదు, దేవుడిని అన్వేషించేవాడే 'విద్య'ను నిజంగా ప్రేమించేవాడు. విద్య అంటే మార్పు చెందని సత్యం (Absolute Truth). తక్కినదంతా అవిద్య. అంటే సాపేక్ష జ్ఞానం (Relative Knowledge).

To be continued .................

Sunday, 4 December 2016

హిందూ ధర్మం - 231 (జ్యోతిష్యం - 13) (మనకూ, గ్రీకు, రోమన్లకు సారూప్యతలు)

మనం చూశాం కదా, మన సనాతన సంప్రదాయంలో వారాలకు నామాలను ఎలా నిర్ణయించారని. ఇప్పుడు ఒకసారి గ్రీకు, రోమన్ సంప్రదాయాలను పరికించి చూద్దాం. ఎందుకంటే ఈ రోజు మనం అనుసరిస్తున్న పాశ్చాత్య వారక్రమం కూడా మన జ్యోతిష్య శాస్త్ర లెక్కలతో సరిపోతున్నది. పైగా అది క్రైస్తవ సంప్రదాయానికి చెందినది కాదు, అసలు కొన్ని మతాలకు మనలా కాలగణన లేదు. ఈనాడు ప్రపంచం అనుసరిస్తున్న కాలగణనలో చాలా శాతం గ్రీకు, రోమన్ మూలాలు కలిగిందే. మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు? వారి మూలం ఎక్కడ ఉంది? వంటి అంశాలు పరిశీలిద్దాం.

పాశ్చాత్య క్యాలెండర్ మీద పరిశోధన చేసినవారి ప్రకారం వారాలకు రోమన్ దేవతల పేర్లను నిర్ణయించారు ఎందుకంటే ఇది రోమన్, గ్రీకు నాగరికతల నుంచి తీసుకున్న అంశం కనుక. దాన్ని జెర్మన్లు స్వీకరించి, అందులో కొన్ని అంశాలను మార్చి ఈ రోజు మనం పాటిస్తున్న ఆంగ్ల వారాల పేర్లు తీసుకువచ్చారు. ఒకసారి సారూప్యతలు (similarities) గమనించండి.

సన్‌డే అనే పదం dies solis అనే లాటిన్ పదం నుంచి వచ్చింది, దాని అర్దం సూర్యుని వారము అని. ఇది పేగన్లకు సెలవు దినము. (తమ మత ఆరాధన పద్ధతులకు, విశ్వాసాలకు భిన్నంగా ప్రకృతిని పూజించే సంప్రదాయం కలవారిని పేగన్‌ (Pagan) లుగా ముద్రవేసి, వారి మతం మార్చడమో లేదా పూర్తిగా ఆ నాగరికతను, జీవనవిధానాన్ని ఊచకోత కోసేవారు క్రైస్తవులు. అలా ప్రకృతిని ఆరాధించేవారిని పేగన్లు అనడం మొదలుపెట్టారు.) అలాగే ఇది వారి దేవునకు సంబంధించిన దినము.

మన్‌డే అనగా మూన్ (చంద్రునికి) కు చెందినది అని జెర్మన్ సంప్రదాయం చెప్తున్నది. ఇది dies lunae అనే లాటిన్ పదం అనువాదం. చంద్రుడిని దేవతగా పూజించే సంప్రదాయం అక్కడ కూడా ఉండేది.

Tuesday అనేది  Týr అనే దేవతకు సంబంధించినది. ఈయన యుద్ధానికి సంబంధించిన దేవత అని రోమన్ల విశ్వాసం. ఈయన గురించి జెర్మన్ పేగనిజంలో కూడా వర్ణన ఉంది. మనకు ఇది మంగళవారం. మంగళుడంటే కుజుడు, ఆయన భూమిపుత్రుడు కూడా కనుక భౌమవారమని పేరు వచ్చింది. మన జ్యోతిష్యంలో కూడా కుజుడిని యుద్ధానికి, తగువులకు, రక్తానికి కారకుడిగా చెప్తాము.

Wednesday అనేది Wodan (Odin) కు సంబంధించినది. లాంటిన్ లో దీన్ని dies Mercurii అన్నారు. ఈ దేవతను ఇంగ్లాండులో కూడా 17 శత్బాదం వరకు పూజించేవారు. వీరు సోల్స్ (Souls) కి మరణం తర్వాత మార్గదర్శనం చేస్తారని భావిస్తారు. బుద్ధికి సంబంధించిన  దేవతగా రోమన్ల విశ్వాసం. ఈయన కవితలు, సంగీతానికి సంబంధించిన దేవత. మన జ్యోతిష్యంలో ఇది బుధవారం. బుధుడు బాగుంటే విద్యలలో రాణిస్తారు. బుధుడి ధ్యానం చేత బుద్ధికి సంబంధించిన బాధలు తొలగుతాయని మనకు తెలిసిందే.

Thursday అనేది నోర్స్ దేవుడు Thor కు సంబంధించిన రోజట. లాంటిన్ లో దీన్ని dies Jovis అన్నారు. రోమన్లకు ముఖ్యమైన దేవుడు Jupiter, గురువుకు ప్రీతికరమైన రోజు. పురాతన రోమన్ల సంస్కృతిలో ఈయన దేవతలకు అధిపతి. మన జ్యోతిష్యంలో దేవ గురువు, బృహస్పతి.

Friday అనేది లాటిన్ పదం dies veneris అనువాదం. Venus అంటే శుక్రుడు. రోమన్లకు ఈయన ప్రేమ, అందం, శృంగారం, సంతానం, కోరికలకు చెందిన దేవత. మన జ్యోతిష్యంలో కూడా శుక్రుడిని పైన చెప్పుకున్న లక్షణాలకు అధిపతిగా చెప్తారు.

Saturday లో Saturn ఉంది. మూలాల్లోకి వెళ్ళకుండా చూసినా Saturn అంటే శని. మనకు శనివారమే వారికి Saturday. అయినా ఒకసారి పరిశీలిద్దాం. Saturday అనేది లాటిన్ పదం dies Saturni అనువాదం. రోమన్లకు ఈయన సృష్టి, ప్రళయం, సంపద, వ్యవసాయం, మోక్షానికి సంబంధించిన దేవత. మన జ్యోతిష్యంలో శని పూర్వ కర్మకు సూచిక. పుణ్య కర్మ ఉంటే ఆయన సంపదలను, సుఖాలను, అధికారాన్ని ఇస్తాడు, పాప కర్మ ఉంటే వాటిని నశింపజేస్తాడు.

To be continued ............

Source: https://en.wikipedia.org/wiki/Names_of_the_days_of_the_week
http://www.pantheon.org/miscellaneous/origin_days.html

Sunday, 27 November 2016

హిందూ ధర్మం - 230 (జ్యోతిష్యం - 12 (వారాలకు పేర్లు ఎలా నిర్ణయించారు?))

సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే కాలాన్ని అహస్సు అని, సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉండే కాలాన్ని రాత్రి అని అన్నారు ఋషులు. అహస్సు+రాత్రి కలిపితే, అహోరాత్రము, అంటే ఒక దినము (రోజు). అహర్నిశలు శ్రమిస్తున్నాడు అని అంటారు, అంటే పగలనల, రాత్రనక శ్రమిస్తున్నాడని అర్దం. అహర్నిశ అనేది కూడా రోజునే సూచిస్తుంది. ఆ అహోరాత్ర అనే పదంలో హోరా ను విడదీసింది మనవారే. ఒక రోజును తొలుత 24 హోరలుగా భాగించారు. లేదా ఒక రోజంటే 24 హోరలు అని అర్దం.

నిజానికి ఈ హోర పదం వైదిక జ్యోతిష్యంలో కనిపిస్తుంది. పరాశర మహర్షి హోరా శాస్త్రాన్ని రచించారు. అది బృహత్ పరాశర హోరా శాస్త్రంగా ప్రసిద్ధి. పరాశరుడు భగవాన్ వేదవ్యాస మహర్షి తండ్రిగారు. మహాభారత కాలానికి ముందువారు. అనగా క్రీ.పూ. 3000 ఏళ్ళ నాటికి ముందు నుంచి జీవించి ఉన్నవారు. వారి జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. వారి కంటే మునుపే లోమశ సూత్రాలు లేదా గర్గ హోరా మొదలైన గ్రంధాలు మనకు లభ్యమవుతున్నాయి. ఇంకా వెనక్కు వెళితే, భృగు మహర్షి రాసిన నాడి గ్రంధాలు, అగస్త్య మహర్షి రాసిన నాడీ గ్రంధాలు కనిపిస్తాయి. ఇంకా వెనక్కుడు వెళితే మనుస్మృతిలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలు లభ్యమవుతున్నాయి. గ్రహగతుల కాలం, మానవ జీవనానికి సంబంధం గురించి అందులో ప్రస్తావన ఉంది. దేవతలకు ఒక రోజు మానవలోకంలో 1 సంవత్సరానికి సమానం అని అందులో చెప్పబడింది. ఇది ఆనాటికే మనవద్ద ఉన్న శాస్త్రీయ దృష్టిని, సాంకేతికతను సూచిస్తోంది. ఈ హోరా అనే పదాన్ని యధాతధంగా లాటిన్ వారు స్వీకరించారు. ఈ హోరా అనే పదం నుంచి 'అవర్' (Hour) అనే పదం వచ్చింది. ఈ హోరా అనే పదం నుంచి కాలాన్ని అధ్యయనం చేసే శాస్త్రమైన హోరాలజీ (Horology) వచ్చింది.

ఈ హోరలను ఆధారంగా చేసుకునే వారాలకు నామాలను పెట్టడం జరిగింది. ఏ హోరలో సూర్యోదయం అవుతుందో, ఆ రోజుకు ఆ నామం పెట్టడం జరిగింది. ప్రతి హోరకు, కాలంలో దానికున్న లక్షణాలను అనుసరించి, ఒక గ్రహ నామం పెట్టడం జరిగింది. ఏ హోరపై ఏ గ్రహం ఆధిపత్యం కలిగి ఉంటుందనేది ఆ గ్రహం తన కక్ష్యలో రాశి చక్రం చూట్టు ఎంత వేగంతో తీరుగుతుందనే దాన్ని అనుసరించి ఎంతో ఖచ్చితంగా ఉంటుంది. శని అన్నిటికంటే తక్కువ వేగం కలిగినది కనుక అది మొదట వస్తుంది, ఆ తర్వాత గురువు, కుజ, సూర్య, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలు వస్తాయి.

ఆదివారంతో ప్రారంబిద్ధాం ఎందుకంటే సూర్యుడు ఈ భూమికి అత్యంత ముఖ్యమైన గ్రహం మరియు ఆత్మకారకుడు, జ్ఞానదాత. రోజులో 24 హోరలు ఉండగా, మొదటి హోర రవితో ప్రారంభమైనది కనుక దానికి రవి వారం అని పేరు, ఆయనే ఆదిత్యుడు, కనుక మనం ఆదివారం అంటున్నాం.  ఆదివారంలో సూర్యోదయానికి ఉండే హోరకు ఆధిపత్యం రవిది కాగా, తర్వాత శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఆ తర్వాత శని, గురువు, అంగారకుడు. ఇప్పటికి 7 హోరలు అయ్యాయి. మళ్ళీ 8 వ హోర రవిదే అవుతుంది. అ తర్వాత క్రమంగా 9 కి శుక్రుడు, 10 బుధుడు, 11 చంద్రుడు, 12 శని, 13 గురువు, 14 కుజుడు, 15 సుర్యుడు, 16 శుక్రుడు, 17 బుధుడు, 18 చంద్రుడు, 19 శని, 20 గురువు, 21 కుజుడు. ఇక్కడికి మూడు సార్లు ఈ వరుస క్రమం వచ్చింది. ఇప్పుడు 22వ హోరకు రవి, 23 శుక్రుడు, 24 బుధ హోర అయింది. 24 హోరలతో రోజు పూర్తవ్వగా, ఆ క్రమంలోనే తదుపరి హోర, 25 వ హోరకు చంద్ర హోర అవుతున్నది. అప్పుడే సూర్యోదయం అవుతోంది. అందువలన ఆ వారానికి ఇందువాసరమని, సోమవారమని పేరు. ఇందుడు, సోముడంటే చంద్రుడు. శివుడికే ఇందుకళాధరుడని, సోమశేఖరుడనే నామాలు ఉన్నాయి కదా. కుజుడు అంటే మంగళుడు, కుజ హోరతో మొదలైనవారం మంగళవారం, భౌమవారం, బుధహోరతో మొదలయ్యేది బుధవారం లేదా సౌమ్యవారం, గురు హోరతో ప్రారంభమయ్యేది గురువారం, శుక్రాధిపత్య హోర తో సూర్యోదయమైన వారం శుక్రవారం, సంస్కృతంలో భృగువారం, శనిహోరతో ప్రారంభమయ్యేది శ్థిరవారం, లేదా మందవారం, అదే మనం శనివారం అంటున్నాం. ఇలా ఈ చక్రం నిత్యం పరిభ్రమిస్తూనే ఉంటుంది. అలా మనకు వచ్చినవే ఈ 7 వారాలు. సప్తగ్రహాలకు సూచిక అవి. రాహూకేతువులు ఛాయా గ్రహాలు, జ్యోతిష్యంలో రాశి చక్రంలో వాటికి సొంతంగా ప్రత్యేక స్థానం ఉండదు. అందుకే ప్రతి రోజులో రాహువుకు ఆధిపత్యం ఉన్న కాలానికి రాహుకాలమని, కేతువు ఆధిపత్యం కలిగిన కాలాన్ని యమగండమని పిలుస్తున్నారు. ఏ హోరలే ఏ పని చేస్తే మంచిదనేది, ఏది చేయకూడదనేది కూడా జ్యోతిష్యం వివరించబడి ఉన్నది, కాని మనకు ఇప్పటికి అప్రస్తుతం.

To be continued .....................

ఈ రచనకు ఉపకరించిన వెబ్‌సైట్లు
http://www.hinduvedicastro.in/blog/how-the-west-stole-weekdays-from-india/
http://www.astrojyoti.com/horapage.htm

Sunday, 23 October 2016

హిందూ ధర్మం - 228 (జ్యోతిష్యం - 10)



తిధుల ప్రాముఖ్యత గురించి గత భాగంలో వివరించుకున్నాం. ఇప్పుడా తిధులకు, ఆయా సమయంలో ఆచరించే నైమిత్తికాలకు మధ్య శాస్త్రీయ సంబంధం చూద్దాం. ఒక్కో తిధి రోజు ఏకభుక్తం చేయాలని, ఫలానా తిధి నాడు ఉపవసించాలని మనకు ధర్మశాస్త్రంలో కనిపిస్తుంది. ఉదాహరణకు ఏకాదశినే తీసుకోండి. చంద్రుని గమనంలో, పూర్ణిమ నుంచి అమావాస్యకు, అమవాస్య నుంచి పూర్ణిమకు మధ్యలో 11 వ తిధి ఏకాదశి. ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరంగా ఉపవసించడం అందరికి తెలిసిందే.

ఆధునిక సైన్స్ ప్రకారం వాయు పీడనం (air pressure) అమావాస్య, పూర్ణిమల్లో తీవ్ర పరిమితుల్లో ఉంటుంది. దీనికి కారణం సూర్య, చంద్ర, భూ కక్ష్యల స్థానాలే. దీన్ని ప్రకృతిలో సముద్రం వద్ద గమనించవచ్చు. ఆ రెండు రోజుల్లో ఉధృతంగా ఉండే కెరటాలు, తర్వాత రోజు నుంచి మాములుగా ఉంటాయి. పీడినం తగ్గిందనడానికి సూచకంగా.

సైన్సు ప్రకారం, మనం తిన్న ఆహారం మెదడును చేరడానికి 3-4 రోజులు పడుతుంది. మనం ఏకాదశి రోజు ఉపవసించినా, అల్పాహారం తీసుకున్నా, ఆ ఆహారం అమవాస్య, పూర్ణిమ తిధులకు మెదడుకు చేరుతుంది. ఈ రెండు రోజుల్లో, భూమి పీడనం (pressure) అధిక స్థాయిలో ఉంటుంది, దాని కారణంగా అన్నిటి యందు సమతుల్యత లోపిస్తుంది, మానవుల ఆలోచనా విధానంలో కూడా.  మెడదకు పంపే ఆహారం కూడా చాలా తక్కువ ఉంటే, అధిక పీడనం కారణంగా మెడదు దారి తప్పి ప్రవర్తించే అవకాశం కూడా తగ్గిపోతుంది.

అలాగే చంద్రగతిలో వాతవరణ పీడనం ఏకాదశి తిధిన అత్యల్పంగా ఉంటుంది మిగితా తిధులతో పోల్చితే. అందువల్ల ఇది ఉపవసించి, ప్రేగులను శుభ్రం చేసుకోవటానికి చాలా మంచి సమయం. అదే ఆ తర్వాత రోజున పీడనం మళ్ళీ సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. కనుక ద్వాదశి రోజు ఉదయమే, సుర్యోదయం కాగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పారణ(భోజనం) చేసి ఉపవాస వ్రతాన్ని ముగించమని శాస్త్రం చెప్పింది. లేకుంటే కొత్త అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని. ఇలా ప్రతి శుక్ల పక్ష, కృష్ణ పక్ష ఏకాదశులకు ఉపవాసం చేయడం మన దేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇందులో ఎంతో శాస్త్రీయత కూడా ఉంది. చూడండి తిధులు, ఆ రోజు వాతావరణంలో ఏర్పడే మార్పులు, అవి శరీరం మీద చూపే ప్రభావాలను ఎంత చక్కగా గుర్తించో మన సనాతన ధర్మం. అలానే మన సంప్రదాయంలో ఎన్నో పండుగలకు, ఆ రోజుల్లో పాటించాల్సిన నియమాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఈ ఒక విషయంలోనే ఖగోళ, వాతావరణ, వైద్య, ఆధ్యాత్మిక శాస్త్రాల సమన్వయం, పరస్పర సంబంధం స్పష్టంగా కనిపిస్తోంది. శాస్త్రంలో ఒక చోట ఒక మాట చెబితే, దాని వివరణ వేరే శాస్త్రంలో ఉంటుంది. ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం వేరు కాదు. అన్నీ పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. ఆ సమన్వయం సనాతనం, అదే భారతీయం.

మనమొక విషయం గమనించాలి. ఏకాదశి రోజు ఉపవసించాలని చెప్పిన శాస్త్రమే కొందరికి మినహాయింపు ఇచ్చింది. బ్రహ్మచారులు, రోగులు లేదా ఔషధ సేవనం చేసేవారు, ముసలివారు, కాయకష్టం చేసేవారు, నిత్యం చెమట చిందించి పని చేసే రైతులు, కూలీలు ..... వీళ్ళు ఉపవాసాలు చేయవలసిన పనిలేదు. వారికి చేయకపోయిన దోషం ఉండదు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు, మారిన ఆహారపు అలవాట్ల ప్రకారం తరచుగా ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ముఖ్యంగా శాఖాహారులైతే, తరుచుగా ఉపవసించకూడదని చెప్తున్నారు ఆయుర్వేద నిపుణులు. మనం తినే బియ్యంలో బలం లేదు, పాలు కల్తీ, కూరలకు ఎరువులు వేసి పండిస్తున్నారు, పర్యావరణం అంతా కలుషితమైపోయింది. ఉపవాసం చేయమని చెప్పిన శాస్త్రమే బలమైన ఆహారం కూడా స్వీకరించమని చెప్పింది. ఏమి తినాలో, ఎలా పండించినవి, ఎలా వండుకుని తినాలో కూడా చెప్పింది. అవేమీ చేయకుండా తరుచూ ఉపవాసాలు చేయడం శ్రేయస్కరం కాదు.

To be continued ...................

Sunday, 9 October 2016

హిందూ ధర్మం - 227 (జ్యోతిష్యం - 9)

జ్యోతిష్యం నిత్యజీవితంలో భాగం. తిధులు నిత్యకృత్యాలకు ఎంతో అవసరం. అటువంటి తిధుల నిర్ణయంలోనే ఎంతో శాస్త్రీయత ఉంది. చంద్రుడి వృద్ధి, క్షీణతల అనుసరించి తిధి నిర్ణయం జరిగింది. చంద్రుడికి మొత్తం 16 కళలు ఉన్నాయని ఋషులు గుర్తించారు. అందులో పూర్ణిమ రోజు చంద్రబింబం పూర్తిగా కనిపిస్తే, అమావాస్య రోజు అసలు కనిపించదు. పూర్ణిమ అంటే పూర్ణంగ్ ఉన్న చంద్రుడు. అమావాస్య అన్న పదంలోనే ఎంతో శాస్త్రీయత దాగి ఉంది. అమా+వాస్య - అమా అంటే కలిసి, వాస్య అంటే వసించడం/ ఉండటం. చంద్రుడు, సూర్యుడు ఒకే రేఖ మీద ఉండటం వలన, సూర్యుని కాంతి కారణంగా చంద్రుడు కనిపించడు. అందువలన ఆ రోజు చంద్రదర్శనం ఉండదు. కాబట్టి దాన్ని అమావాస్య అన్నారు. అదే ఆధునిక సైన్స్ చూడండి. దాన్ని న్యూ మూన్ డే అన్నారు. అసలు ఆ రోజు చంద్రుడే లేడు, ఇంకా న్యూ మూన్ ఏంటీ? ఎంత అసంబద్ధంగా ఉంది ఇది. అయినా మన పిల్లలకు అదే చెప్పాలి మరి. ఎందుకంటే మనవి మూఢనమ్మకాలు, వారిది సైన్సు కదా!

అమావాస్య నుంచి మొదలుపెడితే, పూర్ణిమ వరకు చంద్రుడు వృద్ధి చెందుతాడు. వెలుతురును పంచుతాడు. కనుక దాన్ని శుక్ల పక్షం అన్నారు. పూర్ణిమ తర్వాత నుంచి అమావాస్య వరకు చంద్రుడు క్షీణిస్తూ, అమవాస్యకు అంధకారం ఉంటుంది. కనుక దాన్ని కృష్ణ పక్షం అన్నారు. కృష్ణ అంటే నలుపు వర్ణం, చీకటి. అయితే కృష్ణ పక్షమైనా, శుక్ల పక్షమైనా, అష్టమి తిధిలో చంద్రుడి కళ ఒకేలా ఉంటుంది. 16 లో సగం కనుక ఆ రోజును అష్టమి అన్నారు. దీనికి ప్రాముఖ్యం కూడా ఉంది. 16 కళల్లో నాలుగువంతును చవితి / చతుర్థి అన్నారు. క్షీణించిన చంద్రుడి చిన్న బింబం కనిపించే మొదటి రోజును మొదటి కళగా ప్రతిపదా అన్నారు, అదే పాడ్యమి. రెండవ రోజు ద్వితీయ, మనం విదియ అంటున్నాం, మూడు తృతీయ, నాలుగు చవితి, ఐదు పంచమి, ఆరు షష్ఠి, ఏడు సప్తమి, ఎనిమిది అష్టమి, తొమ్మిది నవమి, పది దశమి, పదకొండు ఏకాదశి, పెన్నుండు ద్వాదశి, పదమూడు త్రయోదశి, పదునాలుగు చతుర్దశి. ఈ రెండు పక్షాలని కలిపితే వచ్చేది మాసం (నెల). మాస అనే పదానికి అర్దం కూడా చంద్రుడే. పూర్ణిమలో పూర్ణ్+మా ఉంది, పూర్ణ్ అనగా సంపూర్ణం అని, మా అంటే చంద్రుడి అని అర్దం. ఇలా ఏ తిధి పేరు చూసినా, అది ఎంతో శాస్త్రీయంగానే ఉంటుంది. అది ఊరికే పెట్టిన పేరు కాదు. ఆ పేరు యొక్క అర్దం అంతరిక్షంలో ప్రత్యక్ష నేత్రాలకు కనిపిస్తూనే ఉంటుంది ఏనాటికైనా.

ఇక్కడ రెండు రకాల పద్ధతులను అవలంభిస్తారు. ఉత్తరభారతంలో పూర్ణిమ తరువాత వచ్చే పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 30 తిధులను మాసంగా పరిగణిస్తారు. దక్షిణ భారతంలో అమావాస్య తర్వాత వచ్చే శుక్ల ప్రతిపద నుంచి అమావాస్య వరకు మాసంగా గణిస్తారు. ఏది ఎలా చేసినా, పండుగులు, ఉత్సవాలు అన్నీ ఒకే రోజున చేసుకుంటాం. ఇది మన ధర్మంలో అంతర్లీనంగా ఉన్న ఐక్యతకు, సమన్వయానికి నిదర్శనం.

మన పండుగలన్నీ తిధులను అనుసరించే ఉంటాయి, ఒక్క సంక్రాంతులు తప్ప. అవి మాత్రమే సౌరమానం ఆధారంగా జరుపుకుంటాము. గ్రిగేరియన్ (ఆంగ్ల) క్యాలెండర్లలో డేట్‌లకు, హిందువులు పాటించే తిధులకు - నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలా డేట్‌లు పెద్ద అసంబద్ధం, అవి అలా ఏర్పడ్డయనాడానికి కాగితం మీద మనం రాసుకున్న గీతలు తప్ప, ఖగోళంలో వేరే ఏ ఇతర సాక్ష్యాలు ఉండవు. ఈ రోజు మనం నెలకు 30, 31 రోజులు అంటూ పాటిస్తున్నాము, రేపు ఇంకేవరో వచ్చి నెలకు 60 రోజులు పెట్టవచ్చు, ఇంకొకడు 90 అనచ్చు. అప్పుడు ఒక వ్యక్తి ఆశ్వీయుజ పూర్ణిమ నాడు జన్మించాడనుకుందాం. ఇప్పుడు అతను ఏదో డేట్ రోజు జరుపుకుంటే, అప్పుడు అతను ఇంకెప్పుడో జరుపుకోవలసి వస్తుంది. అతడు పుట్టిన రోజు జరుపుకున్న దానికి ఖగోళంలో ఏ విధమైన నిదర్శనం ఉండదు. అదే మన సంప్రదాయంలో చూసుకుంటే, ఎవరు ఎన్ని మార్చినా, చంద్రుడు అశ్విని నక్షత్రంలో పూర్ణిమ రోజున ఉదయించడం ఖగోళ సత్యం. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. అతను పుట్టిన సమయంలో ఉన్న గ్రహగతులు మొదలైనవే ప్రత్యేకమే కావచ్చు, కానీ అతను పుట్టిన తిధి మళ్ళీ కనిపించడం అన్నది యదార్ధం. మన పండుగలన్నీ అలా జరుపుకునేవే కదా. మన గణన ఎంత శాస్త్రీయంగా ఉందో ఆలోచించండి.

To be continued ...................

Sunday, 2 October 2016

హిందూ ధర్మం - 226 (జ్యోతిష్యం - 8)

కాలగణనలో భాగంగా ఋషులు మొత్తం 27 నక్షత్రాల గురించి చెప్పారు. నక్షత్రం అనే పదమే ఒక నిర్వచనం. మహాభారతం ప్రకారం నక్షత్రం అనగా కదలనిది అని నిర్వచనం ఉంది. ఒకే నక్షత్రంలో అనేక తారలు (stars) ఉండచ్చు, మండలాలు (constellations) కూడా ఉండచ్చు. ఉదాహరణకు కృత్తికా నక్షత్రంలో 6 తారలు ఉంటాయి, రోహిణి నక్షత్రంలో ఎద్దు తల ఆకారాన్ని సూచించే 5 తారాలు ఉంటాయి, మృగశిరా నక్షత్రం జింక తల ఆకారాన్ని సూచించే 3 తారల సమూహం. ఆ సమూహంలో ఉండే తారల్లో భ్రమణం ఉండచ్చు కానీ నక్షత్రాలు (మండలం) స్థిరంగా ఉంటాయి. అందువల్ల కాలగణనకు వాటిని ప్రాతిపదికగా తీసుకుంది వైదిక సంస్కృతి. ఒక్కో నక్షత్ర పరిధిని అంతరిక్షంలో 13 డిగ్రీల 20 నిమిషాలు ఉంటుంది. భూ భ్రమణం, సూర్యుని చుట్టు తిరిగే సమయంలో, చంద్రుడి కదలికలను ఆధారంగా చేసుకుని, చంద్రుడు ఆ నక్షత్ర మండలానికి దగ్గరగా జరుగుతున్నాడో చూసి, ఆ మాసానికి ఆ నక్షత్రం పేరు నిర్ణయించారు ఋషులు. అశ్విని నక్షత్రంలో పూర్ణిమ తిధిలో చంద్రుడు ఉదయించిన మాసానికి ఆశ్వీయుజ మాసమని, కృత్తికా నక్షత్రంలో పూర్ణిమ నాటి చంద్రోదయం అయిన మాసానికి కార్తీక మాసం అని, మృగశిరా నక్షత్రంలో పూర్ణిమ నాటి చంద్రోదయం అయిన మాసానికి మార్గశిర మాసమని పేరు. అలా ఒక్కో మాసానికి ఆ పేరు రావడనికి వెనుక ఆ నక్షత్రం ఉంటుంది. అలాగే ఈ నక్షత్ర మండలాలన్నిటిని ఒక సమూహంగా చూసినప్పుడు రాశులు ఏర్పరిచారు. 360 డిగ్రీల అంతరిక్షంలో ఒక్కో రాశి పరిధి 30 డిగ్రీలు. ఈ రాశులని, నక్షత్రాలని మాములు కంటితో కూడా చూడవచ్చు. కానీ కాలుష్యం కారణంగా నగరాల్లో ప్రజలకు అలాంటి అవకాశం లేదు. అంతరిక్షం, జ్యోతిష్యం మీద కొద్దిగా అవగాహన ఉంటే, మిరుముట్లు గొలిపే కాంతికి దూరంగా ఉండే ప్రదేశాల నుంచి వీటిని చూడవచ్చు. ఇక సంక్రమణం పేరుతో మనకు 12 సంక్రాంతులు ఉన్నాయి. సూర్యుడు ఒక్కో రాశిలో ప్రవేశంతో ఒక్కో సంక్రమణం వస్తుంది. సూర్యుడు ప్రవేశించడమేంటి అనే అనుమానం వస్తుంది. భూభ్రమణంలో కలిగే మార్పులను అనుసరించి, భూమి యొక్క అక్షాంశ, రేఖాంశలను బట్టి, భూమికి సూర్యునికి మధ్య ఉన్న దూరాన్ని అనుసరించి ఈ నిర్ణయం జరుగుతుంది. మనం భూమిపై నుంచి గమనిస్తాం కనుక, సూర్యుడు ప్రవేశించాడంటున్నాం. మనకు తెలిసి, అందరం పండుగగా జరుపుకునేది మకర సంక్రమణం. అదే మకర సంక్రాంతి. ఇలా సూర్యుని ఒక్కో రాశిలో ప్రవేశంతో 12 రాశులకుగానూ మనకు 12 నెలలు ఉన్నాయి.

360 డిగ్రీల చంద్రుని భ్రమణంలో ప్రతి 12 డిగ్రీల కదలికను ఒక తిధిగా పరిగణించింది జ్యోతిష్యం. శుక్లపక్ష, కృష్ణపక్ష తిధులతో కలిపి మొత్తం మనకు 30 తిధులు ఉన్నాయి. భూమి సూర్యుని చుట్టు తిరిగడానికి 365 రోజుల 6 గంటల .... సమయం పడుతుంది. కానీ చంద్రుడు భూమి చుట్టు ఒక సారి తిరగడానికి 27 రోజులే పడుతుంది. అనగా 12 నెలలకు గానూ 354 రోజులలో చంద్రుడు భూమి చుట్టూ తిరగడాన్ని పూర్తి చేస్తాడు. అంటే ఒక ఏడాదిలో సుమారు 11 రోజుల వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ వ్వత్యాసం వల్ల భూమి సూర్యుని చుట్టు 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు తిరుగుతున్నాడు. దాని వలన 19 సంవత్సరాలకు..... ఏడాదికి 12 మాసాల చొప్పున 238 మాసాలు రావలసి వుండగా 235 మాత్రమే వస్తున్నాయి. అనగా చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగుతున్నాడని అర్థం. ఆ లెక్కను సరి చేయడానికి, రెండు గణనల మధ్య సమన్వయాన్ని ఏర్పరచడానికి, ప్రతి ముప్పై రెండున్నర సౌరమాసాలకు ఒక చంద్రమాసం అధికంగా వస్తుంది. ఇలా మొట్టమొదట ఏర్పరించిన వారు వారు భారతీయఋషులు మాత్రమే. ఒక్కో రాశిలో ఒక నెలపాటు తిరగాల్సిన సూర్యుడు...... ఈ అధిక మాసంలో రెండు నెలల పాటు ఒకే రాశిలో ఉంటాడు. ఇందులో మొదటి నెలలో రవి సంక్రాంతి వుండదు. అప్పుడు దాన్నే అధిక మాసం అంటారు.

To be continued ............

Sunday, 25 September 2016

హిందూ ధర్మం - 225 (జ్యోతిష్యం - 7)

జ్యోతిష్యంలో భాగంగా ఋతువులు, కాలాల గురించి మన గ్రంధాల్లో చెప్పబడిన విషయాలు తెలుసుకుందాం.

వర్షాలు దక్షిణాయనంలో వస్తాయని ఋగ్వేదం 6-32-5 చెప్తోంది. దేవయానం అయిన ఉత్తరాయనం గురించి ఋగ్వేదం 10-18-1 లో సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించడం గురించి వివరించగా, 10-88-15 లో సూర్యుని దక్షిణ దిశ ప్రయాణమైన పితృయానం (దక్షిణాయనం) గురించి చెప్పబడింది. శునఃశీరుడు అంతరిక్షంలో సిద్ధమైన నీటిని కురిపించాలని ఋగ్వేదం 4-57-5 ప్రార్ధిస్తోంది. (ఇక్కడ అంతరిక్షం అంటే భూ ఉపరితలం నుంచి 8 కిలోమీటర్ల పైన ఉండే ప్రదేశం). శునఃశీరుడు అంటే మృగశిరా నక్షత్రం. దానినే ఈ రోజు శాస్త్రవేత్తలు కానిస్ మేజర్, కానిస్ మైనర్ అంటున్నారు. ఈ రోజుకీ పల్లెటూళ్ళలో రైతులకు జ్యోతిష్య శాస్త్రం మీద ఎంతో అవగాహన ఉంది. సూర్యుడు మృగాశిరా నక్షత్రం వద్దకు రాగానే, మృగాశిరా కార్తె మొదలుతో మన దేశంలో ఈ రోజుకీ వ్యవసాయం ప్రారంభిస్తారు. తరతరాల విజ్ఞానం, వారి పూర్వీకులు అందంచిన విజ్ఞానం అది.

మృగం అంటే జంతువు. జంతువు శిరస్సు వంటి ఆకారం కలిగిన తార సమూహం కనుక ఆ మండలానికి మృగశిరా నక్షత్రమని పేరు. శునఃశీరుడు అంటే కూడా జంతువు ముఖం కలిగినవాడని అర్దం. ఋగ్వేదం 1-101-13 లో ఋభువును నిద్రలేపిందేవరు అనే ప్రశ్న వస్తుంది. దానికి సూర్యుడు సమాధానం చెప్తూ, శునకం నిద్రలేపింది, ఎందుకంటే ఈరోజు సంవత్సరానికి అంతము అంటాడు. పైన చెప్పిన శునః అంటే శునకం - ఇది జంతువు. ఈయనే శునఃశీరుడు. ఋభువు అంటే మేఘాలు. అంటే పురాతన కాలంలో సూర్యుడు మృగశిరా నక్షత్రంలో ఉండగా వర్షాలు ప్రారంభమయ్యేవి. అది ప్రకృతి నియమం కూడా. ఇప్పుడు ఆధునిక మానవుడు కాలుష్యం పేరుతో భూమికి నిప్పు పెట్టి, భూతాపాన్ని పెంచడంతో ఋతువుల వ్యవస్థ అస్తవ్యస్తమై ఎప్పుడు వర్షాలు పడతాయో అర్దం కాని పరిస్థితి ఏర్పడింది. అయినా ఈ రోజు నైఋతి ఋతుపవనాలు మృగశిరా కార్తె సమయంలోనే రావడం ఇప్పటికీ గమనించవచ్చు. ఇది మనకు ఏమి స్పష్టం చేస్తోందంటే ఈ దేశంలో వాతావరణ శాస్త్రం కూడా జ్యోతిష్య శాస్త్రంలో అంతర్భాగమని.

అంతే కాక సూర్యునికి ఋతువులకు సంబంధం ఉందని చెప్పింది కూడా సనాతన ధర్మమే. ఋతువులు ఏర్పడి వాతావరణంలో మార్పు సంభవించడానికి, సూర్యుడు ఉదయించే స్థానానికి సంబంధం ఉందని ఋగ్వేదం 1-95-3 లో పేర్కొనబడినది. అదే ఋషులు చంద్రునికి ఋతువులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సూర్యుడు కారణంగానే ఈ విశ్వం నిలబడుతోంది, అలాగే జీవకోటి మనుగడ సాగిస్తోంది. కాలం ముందుకు వెళుతోంది. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుని ఆత్మ అన్నారు. వ్యక్తిగత జ్యోతిష్యంలో వ్యక్తి ఆత్మనూన్యతకు లోనవుతున్నా, తన మీద తనకే అనుమానం ఉన్నా, ఆత్మ విశ్వాసం లోపించినా, అప్పుడు సూర్య ధ్యానం, సూర్య నమస్కారాలు, ఆయనకు సంబంధిచిన దానాలు, జపాలు చేయమంటారు. అక్కడ కూడా సూర్యుడు ఆత్మకారకుడు. ఖగోళ అంశం, వ్యక్తులకు సంబంధిచిన అంశాల్లో ఎంత సమన్వయం నిగూఢంగా ఉందో చూడండి.

పద్మాకర్ విష్ణు వర్తక్ గారి రచనల నుంచి సేకరణ

To be continued .............

Sunday, 18 September 2016

హిందూ ధర్మం - 224 (జ్యోతిష్యం - 6)

భారతీయ జ్యోతిష్యవేత్తలలో చిరస్మరణీయుడు బ్రహ్మగుప్తుడు. ఈయన సా.శ.598-668 మధ్య జీవించారని చరిత్రకారులు చెప్తున్నారు. ఈయన గొప్ప గణితవేత్త, జ్యోతిష్యుడు (ఖగోళవేత్త). గణిత, ఖగోళ శాస్త్రలను చెందిన అనేక రచనలు చేసాడు. వాటిల్లో ప్రముఖమైనది బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం. కలియుగ ప్రపంచ చరిత్రలో సున్నాని ఒక సంఖ్యగా వాడిన మొట్టమొదటివాడు, బ్రహ్మగుప్తుడేనని పాశ్చాతులు చెప్తారు. సున్న గణించడానికి నియమాలని నిర్దేశించాడు. రెండు ఋణసంఖ్యల గుణకారం ధనాత్మకం అవుతుందని ఆధునిక గణితం చెప్పుకుంటున్న నియమం మొదటగా కనిపించేది, బ్రాహ్మస్ఫుటసిద్ధాంతంలోనే. తన శ్లోకాలను ఛందోబద్ధంగా రాయడం వలన, ఈ శ్లోకాలు పాడుకోడానికి కూడా అనువుగా ఉంటాయి.

బ్రహ్మగుప్తుడు సా.శ 598 సంవత్సరంలో, నేటి రాజస్తాన్్లోని భిన్మల్ పట్నంలో జన్మించాడు. భిన్మల్ యొక్క పూర్వనామం భిల్లమల. ఇది గూర్జరుల మూలస్థానం. ఇతని తండ్రి జిష్ణుగుప్తుడు. వ్యాఘ్రముఖుడనే రాజు ఆస్థానంలో ఉన్నాడు. ఉజ్జయినిలోని ఖగోళ వేధశాలకి అధిపతిగా పనిచేసిన కాలంలోనే నాలుగు రచనలు చేసాడు. క్రీ.శ 624లో చాదమేఖల, 628లో బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం, 665లో ఖండఖాద్యకం, 672లో దుర్ఖేమ్నన్యార్ద. బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం, వీటన్నింటిలోకి ప్రపంచప్రసిద్ధమైనది.

ఆర్యభట్టు రాసినఖగోళ శాస్త్రంలోని గణిత విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశోధించిన బ్రహ్మగుప్తుడు, శూన్యం అనగా సున్నాను, అనంతం అంటే ఇంఫినిటి మొదట కనిపెట్టాడు (మొదట అన్నప్పుడు ఆధునిక ప్రపంచంలోని పశ్చిమ దేశలవారి దృష్టి కోణం నుంచి చెప్పుకుంటున్నామని అర్దం చేసుకోవాలి. మన దేశంలో అప్పటికే శాస్త్రాలన్నీ అభివృద్ధి చెంది ఉన్నాయి, అన్యదేశాల్లో వారు ఆ సమయానికి అజ్ఞానంలో మునిగి ఉన్నారు. వారికి కలియుగ చరిత్రయే తెలియదు, ఇక పూర్వపు యుగాలు, కల్పాల చరిత్ర ఎలా తెలుస్తుంది. అందుకే వారి దృష్టికోణం సనాతనధర్మంలో చెప్పబడిన అనంతమైన కాలాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు చాలా చిన్నది, అత్యల్పం, అసలు పట్టించుకోవలసిన అవసరం కూడా లేదు). సున్నా వినియోగంలో ఉపయోగించే సూత్రాలను నిబద్దం చేసిన ఘనత ఈయనదే. భౌతికంగా ఇవి లేకపోయినా మానసికంగా వీటిని సృష్టించాడు. సున్నాకు ఏ సంఖ్యను కలిపినా, ఏ సంఖ్య నుండి సున్నాను తీసివేసినా ఏ మార్పు ఉండదు అని సూత్రీకరించాడు. సున్నాను ఏ సంఖ్యతో హెచ్చించినా సున్నాయే వస్తుందని, ఏదైనా ఒక సంఖ్యను సున్నాతో భాగిస్తే అనంతం వస్తుందని తెలిపాడు. దీనికి అతను పెట్టిన పేరు ఖహారం. ఈయన తరువాతి వాడైన భాస్కరాచార్యుడు ఖహారాన్ని ఒక శ్లోకంలో నిబద్దం చేశాడు . ఆ శ్లోకం ఇది. "వాదా దౌవియత్ ఖం ఖేన దాతే -ఖహారో భవేత్ ఖేన భక్తస్చ రాశిహ్".

అప్పటివరకు అందరు కష్టసాధ్యం అని భావించిన ax^2+1= y^2 అనే సమీకరణాన్ని సాధించింది బ్రహ్మగుప్తుడే. బ్రహ్మగుప్తుడు తన 30వ ఏట "బ్రహ్మ స్పుట సిద్ధాంతం" అనే గ్రంధాన్ని వ్రాశాడు. మొదటి సారి ఈయన కని పెట్టిన "దశాంశ పద్ధతి" కాలక్రమంగా అన్ని దేశాలకు వ్యాపించింది. ఈగ్రందం ప్రపంచ గణిత శాస్త్రానికే కొత్త ద్వారాలు తెరిచింది. పాశ్చాత్య దేశాల అంకెల కంటే బ్రహ్మ గుప్తుని అంకెల విధానం శాస్త్రీయంగా ఉందని ప్రపంచ గణిత మేధావులు మెచ్చుకొన్నారు. తన రెండవ పుస్తకం "కరణ ఖండ ఖడ్యక" లోను గణిత శాస్త్రానికే ప్రాధాన్యత నిచ్చాడు. అంకగణిత, బీజ గణిత మొదలైన విభాగాలపై ప్రాధమిక సిద్ధాంతాను ఇందులో చేర్చాడు .

బ్రహ్మ గుప్తుడు కనిపెట్టిన సున్నాను ఆరబిక్ భాషలో సిఫర్ అంటే, గ్రీకులో జిఫర్ అన్నారు........ అదే ఇంగ్లీష్ లో 'జీరో' అయింది. భాస్కరుడికి ముందే బ్రహ్మ స్పుట సిద్ధాంతం చాలా దేశాల్లో ప్రచారమైంది. సా.శ770లో ఉజ్జయినిలోని ప్రముఖ గణిత పండితుడు కంకభట్టును బాగ్దాద్ రాజు తన దర్బారుకు పిలిపించి ఆరబ్ పండితులకు భారతీయ అంకెల గణన పద్ధతిని నేర్పాడు. అలా సనాతన భారతీయ విజ్ఞానం మరల మరల ప్రపంచానికి జ్ఞానబొక్ష పెట్టింది. అప్పుడే బ్రహ్మస్పుటసిద్ధాంత గ్రంథం అరబిక్ భాషలోకి తర్జుమా అయింది. ఈ విధంగా ఏడవ శతాబ్దానికి పూర్వార్ధంలోనే భారతీయ అంకెలు, సంఖ్యామానం సిరియా, అరేబియా,ఈజిప్ట్, ఆ తర్వాత క్రమంగా పాశ్చాత్య దేశాలకు వ్యాపించింది. అరేబియా నుంచి వచ్చిన అంకెలు కనుక పాశ్చాత్యులు 'ఆరబిక్ అంకెలు' అన్నారు కానీ ఆరబ్బులు మాత్రం 'హిందూ అంకెల విధానం'(ఆల్ ఆర్కాన్ ఆల్ హింద్) గానే పిలుస్తారు. కానీ ఇప్పటికి మన దేశంలో పిల్లలకు వాటినిఒ అరబిక్ అంకెలుగానే పాఠశాలల్లో బోధిస్తున్నారు.

ప్రొఫెసర్ వాలెస్ అనే చారిత్రిక పరిశోధకుడు భారతీయుల గణిత, ఖగోళ విషయాలు చాలా నిర్దుష్టమైనవనీ, జ్యామితి సూత్రాల ఆధారంగాగా ఖగోళ రహస్యాలు సాధించారని, ఇదంతా క్రీ.పూ.3,000. సంవత్సరాలకు ముందే సాధించిన భారతీయ విజ్ఞానం అని మెచ్చుకొన్నాడు. జ్యామితి అనేది భారతదేశంలోనే పుట్టిందని, ఇది పాశ్చాత్య దేశాల వారి దృష్టి సోకని ఎంతో ముందు కాలంలోనే జన్మించిందని, ఎన్నో 'ఎలిమెంటరి ప్రపోజిషన్లు' భారత దేశం నుండే గ్రీసుకు వ్యాపించాయని, భారతీయ విజ్ఞులైన ప్రాచీన శాస్త్రజ్ఞులను ఆరాధనా భావంతో మెచ్చుకొన్నాడు వాలెస్.

బ్రహ్మగుప్తుని ప్రతిభను గుర్తించిన వ్యాఘ్రముఖ మహారాజు తన ఆస్థానానికి ఆహ్వానించి, సన్మానించి ఆస్థాన పండితునిగా గౌరవాన్నిచ్చాడు. అప్పటి వరకు నిత్య జీవనానికి కూడ ఇబ్బంది పడ్డ బ్రహ్మగుప్తునికి, ఆ తర్వాత పరిశోధన చేయడానికి అవకాశం లభించినట్టైంది. అంక గణితాన్ని, బీజ గణితాన్ని రెండు ప్రత్యేక విభాగాలుగా మొదటి సారిగా గుర్తించిన ఘనత కూడా ఈయనదే. ఈయన శిష్యుడు భాస్కరాచార్య గురువును సత్కరించి 'గణక చక్ర వర్తి చూడామణి' అనే బిరుదును ఇచ్చాడు.

ఈయన రాసిన బ్రహ్మస్పుటసిద్ధాంతంలో ఖగోళ శాస్త్ర ప్రస్తావన ఉంది. పంచాంగ గణనన, గ్రహగతులు, కూటములు, సూర్య, చంద్ర గ్రహణాల గణనను అందించారు. బ్రహ్మస్పుటసిద్ధాంతంలో చంద్రుడే సూర్యునికంటే భూమికి దగ్గరగా ఉన్నాడని, సూర్యకాంతిని గ్రహించే ప్రకాశిస్తున్నాడని, స్వయంగా చంద్రునకు కాంతి లేదని వివరించారు. చంద్రకళలలో తేడాకు కారణం సూర్య, చంద్రుల గతి, వారి మధ్య ఉన్న కోణమేనని, ఒకవేళ చంద్రుడు, సూర్యుడికంటే దూరంగా పైన ఉండి ఉంటే, చంద్రబింబంలో హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు.

To be continued ................

Sunday, 28 August 2016

హిందూ ధర్మం - 223 (జ్యోతిష్యం - 5)

ఈనాడు కుతుబ్ మినార్ గా పిలువబడుతున్న మేరు స్థంభం కట్టించింది వరాహమిహిరుడే.  అది తన జ్యోతిష్య (ఖగోళ) శాస్త్ర పరిశోధన కోసం కట్టించాడని చెప్తారు. ఇక్కడే ఉన్న సుమారు 2200 ఏళ్ళ క్రితం నాటిదైన లోహపు స్థంభం ఈనాటికి తుప్పపట్టలేదు, చెక్కుచెదరలేదు. దాన్ని 7 గ్రహాలకు సూచికగా, 7 అంతస్థులతో, 27 నక్షత్రాలకు సూచికగా 27 కిటికీలతో నిర్మించారట. 26 గజాల లోతు వరకు పునాది వేసి, 84 గజాల ఎత్తు వరకు నిర్మించారని, అయితే ఆ తర్వాత దాన్ని ఆంగ్లేయులు పదగొట్టి 76 అడుగులకు కుదించారని చెప్తారు. కుతుబుద్ధీన్ పాలన సమయానికి ధృవ స్థంభం/ మేరు స్థభం/ విష్ణు స్థంభం ఉంది. కానీ ఆ దుర్మార్గుడు దాని అద్భుత శిలాసంపదను, వైజ్ఞానికతను నాశనం చేసి, దానికి తన పేరు తగిలించుకుని, తన నిర్మాణంగా ప్రచారం చేసుకున్నాడు. మన ధౌర్భాగ్యం ఏమిటంటే కుతుబ్ మినార్ కుతుబుద్దీన్ జీవించిన సమయానికంటే ఎంతో పూర్వం నుంచి ఉందని, దాని మీదే ఆధారాలు ఉన్నా, అవి శాస్త్రీయమని తేలినా, ఇంకా నేటికి అది కుతుబ్ మినార్ గానే పిలువబడుతోంది.


గణితంలో త్రికోణమితి చెందిన సూత్రాలను కనుగొన్నారు. ఆర్యభట్టు రచనల్లో విడిచిన మిగిలిన సైన్ల పట్టికలను ఈయన పూర్తి చేశాడు.

ఈనాటి ఆధునికసమాజం చేపట్టిన గ్రహాంతర ప్రయాణాల్లో వెలుగు చూసిన అనేకానేక విషయాలను వరాహమిహిరుడు ఆనాడే చెప్పారు. తన పంచ సిద్దాంతికం అనే గ్రంధంలో బుధ, శుక్ర, అంగారక, శని, గురు గ్రహ వ్యాసాలను వివరించారు. అలాగే మనకు చెప్పబడ్డ నక్షత్రాలే కాక ఇతర తారల వివరణ కూడా ఆయన గ్రంధం అందిస్తుంది. ఆ గ్రంధంలో కాలం యొక్క వివిధ అంశాలు, దేవతలు, రాక్షసుల సంవత్సర కాలమానం, బ్రహ్మదేవుని పగలు, రాత్రి సమయం, సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఎంతకాలం గడిచింది మొదలైన ఎన్నో విషయాలను చర్చిస్తుంది.

సూర్యసిద్ధాంతం అనే గ్రంధంలో అంగారక గ్రహం యొక్క వ్యాసం చెప్పబడింది. అందులో 3,772 మైళ్ళని చెప్పగా, ఈ రోజు 4,218 మైళ్ళని చెప్తున్నారు. నాటికి, నేటికి 11% వ్యత్యాసం కనిపిస్తోంది. అలాగే అంగారక గ్రహం చుట్టుకొలత, అంగారక గ్రహం మీద ఏర్పడే సూర్య, చంద్ర గ్రహణ గణనలు, ఆ చంద్రుని రంగు, అందులో పదార్ధాల వివరణ ఉంది.

అలాగే వరాహమిహిరుడు అంగారక గ్రహం మీద నీరు ఉన్నదని చెప్పారు. ఆ గ్రంధంలో అంగారక గ్రహం యొక్క పూర్తి వివరణ ఉన్నది. అంగారకుని మీద నీరు, ఐరన్ ఉందని ఆయన చెప్పారు, ఈనాడు ఇస్రో, నాసా చేసిన పరిశోధనలు దీన్ని ధృవపరిచాయి.

సూర్యుడు ద్వారానే అన్ని గ్రహాలు ఏర్పడి, ఆయన కేంద్రంగా ఎలా పని చేస్తున్నాయన్నది చెప్పిన నేటి యుగంలో తొలి వ్యక్తి ఆయనే. అంటే భారతీయ జ్యోతిష్యం 1500 ఏళ్ళ పూర్వమే ఎంత ఉన్నత స్థాయికి చేరిందో అర్దం చేసుకోవచ్చు.

To be continued ..................

సేకరణ: http://www.mysteryofindia.com/2016/03/varahamihira-predicted-water-on-mars.html

Sunday, 21 August 2016

హిందూ ధర్మం - 222 (జ్యోతిష్యం - 4)

ఆర్యభట్టు తర్వాత భారతీయ జ్యోతిష్యం మీద ఎంతో పరిశ్రమ చేసిన వ్యక్తిగా వరాహమిహిరుడిని చెప్పవచ్చు. ఈయన జ్యోతిష్య, ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుడు. జ్యోతిష్య శాస్త్రం మీద అనేక ప్రామాణిక గ్రంధాలు రాసారు.

బృహత్ జాతక - గోళ శాస్త్రం మరియు జాతక గ్రంథం లో గల ఐదు ముఖ్య గ్రంథములలో ఒకటి.
లఘు జాతక - దీనిని స్వల్ప జాతక అని కూడా పిలుస్తారు.
సమస సంహిత - దీనిని "లఘు సంహిత" లేదా "స్వల్ప సంహిత" అని కూడా పిలుస్తారు.
బృహత్ యోగ యాత్ర - ఇది "మహా యాత్ర" లేదా " యక్షస్వమెధియ యాత్ర" అని పిలువబడుతుంది.
యోగ యాత్ర - ఇది "స్వల్ప యాత్ర" గా పిలువబడుతుంది.
టిక్కని యాత్ర
బృహత్ వివాహ పటాల్
లఘ వివాహ పటాల్ - ఇది స్వల్ప వివాహ పటాల్ గా పిలువబడుతోంది.'
లఘ్న వరాహి
కుతూహల మంజరి
వైవజ్ఞ వల్లభ

తన బృహద్ జాతకం మరియు బృహద్ సంహితల్లో భూగోళ శాస్త్రం, గ్రహకూటములు, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రాలకు సంబంధించి ఎన్నో విషయాలను కనుగొన్నారు. మొక్కలకు వచ్చే రోగాలకు అవసరమయ్యే వైద్యశాస్త్రాన్ని కూడా ప్రస్తావించారు. ఈనాటికి జ్యోతిష్య శాస్త్రంలో (ఖగోళ విభాగంలో), ఈయన రాసిన పాంచసిద్ధాంతం గొప్ప స్థానం కలిగి ఉంది. చంద్రుడు, గ్రహలు మొదలైనవాటికి స్వయం ప్రకాశం లేదని, అవి సూర్యుని కాంతి వలననే ప్రకాశమవంతంగా ఉన్నాయని అందులో ప్రస్తావించారు. తోకచుక్కలు, భూమిపై, మానవాళిపై వాటి ప్రభావాలను వివరించారు.

గోళాకారం కలిగిన భూమిపై వస్తువులు నిలిచి ఉండటానికి ఒక శక్తి ఉందని, అదే అంతరిక్షంలో గ్రహాలు, ఇతర పదార్ధాలను సైతం తమ స్థానాల్లో స్థిరంగా ఉంచుతోందని గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వివరించారు.


బృహ జ్ఞాతకము - జ్యోతిష ఫల విభాగానికి చెందిన బృహ జ్ఞాతకములో 26 అధ్యాయాలు, 417 శ్లోకాలు ఉన్నాయి. దీనినే హోరా శాస్త్రమని పిలిచాడు. ఇలాంటి రచనలకు సాధారణంగా వాడే ఛందస్సులు గాక వృత్తులలో విషయాలను అందంగా అందించాడు వరాహమిహిర్డు. దీనికి సహాయకారిగా సవాంశ గణీతం కూడా రచించాడు. ఈ రెండు గ్రంథాలు ఆధారంగా సరియైన జ్యోతిష ఫలితాలు వస్తాయని ప్రతీతి. నేటి వరకు గూడా ఈ శాస్త్రం ప్రచారంలో ఉంది.

బృహత్సంహిత - బృహత్సంహితలో గ్రహాల సంచారము, వాటి వలన భూమి మీద ప్రాణులకు కలుగేఫలాలు, నక్షత్ర మండల ఉదయాదుల వల్ల ఫలితాలు, మేఘాలు, గర్భధారణ, భూకంప ఉల్క పాతములు, ఇంద్ర ధనుస్సు, ప్రతి సూర్యుడు, పిడుగు పడటం వంటి అనేక సృష్టి వైచిత్రాలు, శకున ఫలములు, వాస్తు ప్రకరణము, భూమిలో రకాన్ని బట్టి ఎంత లోతున నీళ్ళు దొరుకుతుందనే విషయం, వృక్షాయర్వేదము, వజ్ర లేపనము, జంతువులు, మణుల పరీక్ష తిథి, గోచార ఫలితాలు వంటి అనేక విషయాలు విస్తారంగా తెలియ జేశాడు.

చంద్ర,సూర్య గ్రహణాలు రాహు,కేతువుల వల్ల కాదని భూమి మీద నీడ పడటం చేత చంద్ర గ్రహణం, చంద్రుని నీడ పడటం చేత సూర్య గ్రహణము కలుగుతున్నాయని పూర్వ ఋషులు చెప్పిన సత్యాన్ని వివరించాడు. తోకచుక్కలు వాని రకాలు గురించి తెలిపాడు.

అనేక సందర్భాలలో వరాహమిహిరుడు గర్గ,పరాశర, అసిత దేవతల, కశ్యప, భృగు, వసిష్ట, మను, మయ వంటి ప్రాచీన ఋషుల అభిప్రాయం ప్రకారము అని విడివిడిగా ప్రస్తావించటం, అంతే కాక ఇంకా ఎంతో మందిని అనుసరించి (అన్యాన్ బహున్) అని చెప్పడం వలన ఆయన పరిశీలనాత్మక దృష్టి, వినయ సంపత్తి ఆ రచనల్లో తెలియడమే కాక ఆ కాలములో అవన్ని లభించి ఉండేవని కూడా తెలుస్తోంది.

"దకార్గాళాధ్యాయం" లో ఎలాంటి స్థలాలలో నీరు ఎంతెంత లోతుల్లో దొరుకుతుందో వివరించాడు. మనుష్యుని శరీరంలోని రక్త నాడులలో రక్తము ప్రవహించినట్లు భూమిలో గల జల నాడులలో జల ప్రవాహాలు ఉంటాయని, వాటిని గుర్తించటానికి భూమిపై నున్న చెట్లు, పుట్టలు ఉపయోగపడతాయని నిరూపించాడు. అనంతర కాలంలో భారతీయ శాస్త్రవేత్తలు ఎవరు వీటి మీద పరిశోధన చేసి ప్రాచుర్యములోనికి తీసుకురాలేదు. ఈ అధ్యాయములోని విషయాలు అధారముగా ప్రస్తుతం వేగంగా పరిశోధనలు చేయటం జరుగుతోది. భూగర్భ లోహం కనుక్కునేందుకు వరాహమిహిరుని సిద్ధాంతాలు ఉపయోగిస్తున్నారు ఆధునిక శాస్త్రవేత్తలు. చెట్లు, ఆకులు పరిశీలించి వీటి అంచనాయే గాక, ఖనిజ సంపత్తిని అంచనా వేసే క్రొత్త శాస్త్రము ఈ అధ్యాయం ఆధారంగా ఉధ్బవించింది.

ప్రాధమికంగా గణిత శాస్త్రవేత్త అయిన వరాహమిహిరుడు ఖగోళ, జ్యోతిష, ద్రవస్థితి, భూగర్బ, ఆయుర్వేద వంటి అనేక శాస్త్రాలలో తన ప్రతిభ కనబరిచాడు. జ్యోతిష శాస్త్ర చంద్రుణ్ణీ పైకి తీస్తానంటూనే తన గ్రంథము స్థానాంతరం చెందటం వలనగాని, అనేకుల నోళ్ళలో సంచరించటం వలన గానీ, వ్రాయటంలో గాని లేక తానే గాని తప్పులు చేసి ఉండవచ్చని, విద్వాంసులు ఆ దోషాన్ని పరిహరించి పరిగ్రహించమని కోరటంలో ఎంతో గౌరవం పొందాడు. ఇందులో ఆయన వినయవిధేయతలు స్పష్టంగా కనిపిస్తాయి.

To be continued .........
ఈ రచనకు సహాయపడిన లంకెలు
https://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B9%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81
http://www.freepressjournal.in/mind-matters/varahamihira-the-ancient-astrologer-astronomer-and-mathematician/676984
http://www.sanskritimagazine.com/vedic_science/varahamihira/

Sunday, 14 August 2016

హిందూ ధర్మం - 221 (జ్యోతిష్యం - 3)

ఆర్యభట్టుని జ్యోతిష్య సిద్ధాంతాన్ని ఔదాయక సిద్ధాంతం అని అంటారు, ఎందుకంటే ఇది లంక దగ్గర సూర్యోదయాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది. భూమి తన అక్షంపై తన చుట్టూ తానే తిరుగుతుందని, నక్షత్రాలు తిరుగుతున్నట్టు కనిపించడం భూభ్రమణం వలన కలిగే సాపేక్ష చలనం అని చెప్పారు. ఇది ఆర్యభట్టీయం మొదటి అధ్యాయంలో వివరించారు. ఇందులో ఒక యుగంలో భూమి ఎన్ని సార్లు పరిభ్రమిస్తుందో చెప్పి, గోళ పాదంలో మరింత స్పష్టం చేశారు.

సూర్య, చంద్ర గ్రహణాలను శాస్త్రీయ పద్ధతిలో వివరించారు. చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని గోళ పాదం 37 శ్లోకంలో వివరించారు. 38 నుంచి 48 వరకు భూ ఛాయ పరిమాణం, విస్తృతిని వివరించి, గ్రహణం ఎంత సమయం పడుతుంది, ఎప్పుడు పడుతుందనేది వివరించారు. ఆ తర్వాతి జ్యోతిష్యులు దీన్ని ఇంకా అభివృద్ధి చేశారు. ఈయన గణన ప్రక్రియ ఎంత ఖచ్చితంగా ఉన్నదంటే 18 వ శత్బాదపు సైంటిస్టు Guillaume Le Gentil, భారతదేశంలో పాండిచ్చెరిని సందర్శించినప్పుడు, భారతీయ పద్ధతుల్లో 30 ఆగష్టు 1765 గ్రహణాన్ని గణించినప్పుడు అది 41 సెకన్లు తక్కువ ఉండగా, తన పట్టిక 68 సెకన్లు ఎక్కువ చూపిందని వివరించారు. ఈ విషయాన్ని అన్సారి.ఎస్.ఎం.ఆర్. గారు రాసిన ఆర్యభట్ట 1, హిస్ లైఫ్ అండ్ కాంట్రిబ్యూషన్స్ అనే పుస్తకంలో ప్రస్తావించారు.

ఆంగ్ల సమయ ప్రమాణాల ప్రకారం ఆర్యభట్టు స్థిర నక్షత్రాలను సూచిస్తూ (అనుసరించి) భూ భ్రమణం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకన్లు, ఆధునికులు చెప్పిన సంఖ్య 23:56:4.091. అలాగే భూమి తన కక్ష్యపై సూర్యుని ఒకసారి చుట్టి రావడానికి పట్టే స్మయం 365 రోజుల, 6 గంటల, 12 నిమిషాల, 30 సెకన్లు (365.25858 రోజులు). ఆధునికులు చెప్పిందానికి దీనికి 3 నిమిషాల 20 సెకన్లు వ్యత్యాసం ఉంది. ఆధునిక సంఖ్య (365.25636 రోజులు). ఈ విషయాన్ని ఆర్యభట్టీయం మరాఠీ అనువాదంలో మోహన్ ఆప్టే ప్రస్తావించారు. గత 200 సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని ఆధునికులు చెబితే, ఇదే విషయాన్ని ఆర్యభట్టు క్రీ.పూ. 6 వ శత్బాదంలో చెప్పారు.

ఆర్యభట్టు జ్యోతిష్య గణనలు ఎంతో ప్రభావితం చేశాయి. త్రికోణమితి పట్టికలతో పాటు, ఈ పట్టికలు కూడా అరబిక్ ప్రపంచంలో వాడుకలోకి వచ్చి, అరబిక్ ఖగోళ శాస్త్ర పట్టికలు ఏర్పరుచుకున్నారు (zij). ఇవే అటు తర్వాత లాటిన్‌లోకి అనువదించబడి 12వ శతాబ్దం నుంచి టొలెడో పట్టికలుగా (Tables of Toledo), అతి ఖచ్ఛితమైన ఖగోళ శాస్త్ర గణననలుగా ఐరోపాలో ఎన్నో శతాబ్దాలున్నాయి. (ఇదే కదా మన ధర్మం గొప్పతనం, ప్రపంచానికే కాలమానాన్ని గణించడం నేర్పిన జాతి మనది. హిందువైనందుకు గర్వించండి.)

ఆర్యభట్టు జ్యోతిష్య గణనల ఆధారంగా హిందువులు తమ నిత్య, నైమిత్తిక కృత్యాల కోసం పంచాంగాల్లో దాన్ని స్వీకరించి, ఇప్పటికీ కొనసాగిస్తుండగా, మన సనాతన హిందూ ధర్మ జ్యోతిష్య వేత్త అయిన ఆర్యభట్టుని జ్యోతిష్యశాస్త్రం ఆధారంగానే ఇస్లామిక్ ప్రపంచం జలాలి క్యాలెండర్లను( Jalali calendar) సా.శ.1073 లో రూపొందించుకున్నారు. దీన్ని ఒమర్ ఖయ్యం మొదలైన ఖగోళ శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. వీటిలోనే 1925 లో కొన్ని సవరణలు చేసి ఈనాటికి ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో జాతీయ క్యాలెండర్లుగా వాడుకుంటున్నారు. జలాలి క్యాలెండర్లలో తేదీలు సౌరమానాన్ని, ఆర్యభట్టు, ఆయనకు ముందు జ్యోతిష్యులు చెప్పిన సూర్య సిద్ధాంతం ఆధారంగా ఉంటాయి. ఈ క్యాలెండర్లలో తేదీలను గణించడం కష్టమైనా, గ్రిగేరియన్ క్యాలెండర్ కంటే ఇందులో దోషాలు చాలా తక్కువ.

To be continued ..............

Sunday, 7 August 2016

హిందూ ధర్మం - 220 (జ్యోతిష్యం - 2)

విశ్వగతిలోని అంతరార్ధాన్ని వేదసంస్కృతి అర్దం చేసుకుంది. విశ్వగమనానికి, ఋతువులు, కాలనుగుణంగా జరిగే పరిణామాలకు సంబంధాన్ని తెలుసుకుంది. అనుదులో భాగంగానే గ్రహగతులు, పగులు, రాత్రి గణన, ఋతువులను నిర్ణయించడాన్ని లోతుగా పరిశీలించింది. అందువల్లనే జ్యోతిష్యం (ఇక్కడ ఫలిత జ్యోతిష్యం గురించి ప్రస్తావించడం లేదు) గ్రహాలు, గ్రహకూటములు, నక్షత్ర కూటములు, ఉల్కలు, తోకచుక్కలు, భ్రమణాలు, కాంతిని వెలువరించే ఇతర వస్తువులను వివరించింది.

ఋగ్వేదానికున్న వేదాంగ జ్యోతిష్యాన్ని అందించిన మహానుభావుడు మహర్షి లగధాచార్యులు. ఇందులో 36 శ్లోకాలున్నాయి. అలాగే యజుర్వేదానికి, అధర్వణ వేదానికి కూడా జ్యోతిష్య శాస్త్రం ఉంది. యజుర్వేద జ్యోతిష్యానికి మూలపురుషుడు శోషాచార్యులు, ఆయన 34 పద్యాల్లో దాన్ని వివరించారు. అధర్వణవేద జ్యోతిష్యంలో 14 కాండలు, 102 శ్లోకాలున్నాయి. ఇది పితామహుడు, కశ్యపుడికి మధ్య జరిగిన సంవాదం రూపంలో ఉంది, పితామహుడు చెప్పగా, కశ్యపుడు విన్నాడు.

వేదంలో జ్యోతిష్యానికి బీజం పడగా, మహర్షుల వలన అది అనుకురించింది. అటు తర్వాత ఎందరో జ్యోతిష్యవేత్తలు ఎంతో పరిశోధించి దీన్ని గొప్ప శాస్త్రంగా రూపొందించారు. అందులో పరాశర మహర్షి గురించి గొప్పగా చెప్పుకోవాలి. వారు బృహత్ పరాశరం అనే గొప్ప జ్యోతిష్య గ్రంధాన్ని రాశారు. వీరి తర్వాత ఆర్యభట్టు. ఈయన క్రీ.పూ.6 వ శతాబ్దానికి చెందినవాడు. కలియుగం 337 వ సంవత్సరంలో తాను పుట్టానాని ఆయనే తన గ్రంధమైన ఆర్యభట్టీయంలో చెప్పుకున్నాడు. ఈయన జ్యోతిష్య (ఖగోళ) శాస్త్రానికి సంబంధించి ఎన్నో రచనలు చేశారు. ఈయన ఆర్యభట్టీయంలో గణితంతో పాటు జ్యోతిష్యం (ఖగోళం) కూడా ఉంది. ఈయన తన రచనల్లో గణితం, బీజగణితం, గోళాకార త్రికోణమితి, సరళ త్రికోణమితి మొదలైనవాటికి సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు. వాటిలో నిరంతర భిన్నాలు, వర్గ సమీకరణాలు, ఘాతక శ్రేణి కూడికలు, సైన్ల పట్టిక వంటి ఎన్నో విషయాలున్నాయి. ఈయన రాసిన ఆర్యసిద్ధాంతం అనే గ్రంధం లుప్తమవ్వగా, ఆయన జ్యోతిష్య సూత్రాలను వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యులు-1 మొదలైనవారు తమ రచనల ద్వారా తిరిగి ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఆయన రాసిన ఆర్యసిద్ధాంతం సూర్యసిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని వచ్చింది. అందులో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన అనేక పరికరాల ప్రస్తావన కూడా ఉంది. ఉదాహరణకు శంఖుయంత్రము, ఛాయా యంత్రము, ధనుర్ యంత్రము/ చక్ర యంత్రము, యస్తి యంత్రము, అవి కాక ధనుర్ యంత్రము, యస్తి యంత్రానికి సంబంధిచిన నీటి గడియారాల ప్రస్తావన వీటి యందు ఉంది.  ఆర్యభట్టు ద్వారా ప్రపంచానికి అందించబడిన ఎంతో విజ్ఞానాన్ని సా.శ.9 లో ప్రముఖ పండితుడు, ఆల్-బెరూని అరేబియన్ భాషలోకి అనువదించాడు. అలా హిందూ విజ్ఞానం అరబ్‌లోకి వెళ్ళి అక్కడివారి అజ్ఞానాన్ని తరిమే ప్రయత్నం చేసింది.

ఆర్యభట్టియంలో 108 శ్లోకాలున్న కారణం చేత దాన్ని ఆర్యశతాష్ట అనేవారు. అది ఛంధోబద్ధమైన శాస్త్రం కనుక దాన్ని అర్దం చేసుకోవడం, అనువదించడం సనాతనధర్మాన్ని, వేదవేదాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వారికే సులువుగా ఉంటుంది. 108 శ్లోకాలు, 13 పరిచయ శ్లోకాలున్న ఈ గ్రంధాన్ని 4 పాదాలుగా విభజించవచ్చు.

గీతికాపాదం - 13 శ్లోకాల ఈ పాదంలో కల్పం, మన్వంతరం, యుగం మొదలైన విశ్వానికి సంబంధించిన పెద్ద పెద్ద కాలాల వివరణ ఉంది. ఇందులో జ్యా (sine పట్టిక గురించి కూడా చెప్పబడింది. ఒక మహాయుగంలో గ్రహ భ్రమణాల వ్యవధి 43,20,000 సంవత్సరాలు.

గణితపాదం - 33 శ్లోకాల ఈ పాదంలో క్షేత్ర వ్యవహారం (క్షేత్రగణితం/ క్షేత్రమితి), బీజగణితం, రేఖాగణిత గమనాలు, శంఖు, ఛాయ, సాధారణ, వర్గ, ఏకకాలిక మరియు అనిర్దిష్ట సమీకరణాల (simple, quadratic, simultaneous, and indeterminate equations) వివరణ ఉంది.

కాలక్రియాపాదం - 25 శ్లోకాల ఈ పాదంలో కాల విభాగాలు, ఒకానొక రోజున గ్రహాల గతి, అధికమాసాన్ని గణించే పద్ధతి, క్షయ తిధులు మరియు వారాన్ని 7 రోజులుగా, 7 రోజులకు 7 పేర్లను ఇందులో వివరించారు.

గోళపాదం - 50 శ్లోకాల ఈ పాదంలో అంతరిక్ష సంబంధమైన గోళాలు (celestial sphere), ఖగోళ కక్ష్య యొక్క లక్షణాలు (features of the ecliptic), ఖగోల మధ్యరేఖ (celestial equator), node, భూగోళ ఆకారం, పగులురాత్రికి గల కారణాలు, దిగంతం (horizon)లో రాశిచక్రాల ఉదయము మొదలైనవి రేఖాగణిత, త్రికోణమితి అంశాలతో వివరించారు. వీటితో పాటు తనకు ముందు ఉన్న మహర్షులు, ఆచార్యులు, వారి రచనలు, తనపై వాటి ప్రభావాన్ని వివరించారు.

To be continued ................